17
1 ✽ యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 2 “నీవు ఇస్రాయేల్‌ప్రజలతో మాట్లాడి, వారి పూర్వీకుల వంశాల ప్రకారం వారిదగ్గర పన్నెండు చేతికర్రలను తీసుకో. ప్రతి గోత్రనాయకుడి దగ్గర ఒక కర్రను తీసుకోవాలన్నమాట. ఎవడి కర్రమీద వాడి పేరు వ్రాయి. 3 లేవీ కర్రమీద అహరోను పేరు వ్రాయి. పూర్వీకుల వంశాల నాయకులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్ర ఉండాలి. 4 నీవు ఆ కర్రలను తీసుకుపోయి సన్నిధిగుడారంలో నేను మిమ్ములను కలుసుకొనేశాసనాల పెట్టె ఎదుట వాటిని ఉంచాలి. 5 అప్పుడు నేను ఎవణ్ణి ఎన్నుకొంటానో అతడి కర్ర చిగురిస్తుంది. మీకు విరోధంగా సణుగుతూ ఉన్న ఇస్రాయేల్ ప్రజల సణుగులు నాకు వినిపించకుండా చేస్తాను.”6 మోషే ఇస్రాయేల్‌ప్రజలతో మాట్లాడినప్పుడు వారి నాయకులలో ఒక్కొక్కరు ఒక్కొక్క కర్ర అతడికిచ్చారు. వారి పూర్వీకుల వంశాలప్రకారం మొత్తం పన్నెండు కర్రలిచ్చారు. అహరోను కర్ర వారి కర్రలతోకూడా ఉంది. 7 మోషే ఆ కర్రలను శాసనాల గుడారంలో యెహోవా ఎదుట ఉంచాడు.
8 మరుసటి రోజు మోషే శాసనాల గుడారంలోకి వెళ్ళి చూశాడు. చిగురించిన కర్ర లేవీ వంశానికి చెందిన అహరోను కర్రే. అంతేగాక, అది మొగ్గలు వేసి పూలు పూసి బాదంపండ్లు కాసి ఉంది. 9 యెహోవా సన్నిధానంలోనుంచి మోషే ఆ కర్రలన్నీ ఇస్రాయేల్ ప్రజలదగ్గరికి తీసుకువచ్చాడు. వారు వాటిని చూచి ఒక్కొక్కరు ఎవరి కర్రను వారు తీసుకొన్నారు.
10 అప్పుడు యెహోవా మోషేతో అన్నాడు, “అహరోను కర్రను శాసనాల ఎదుట మళ్ళీ పెట్టు. తిరగబడ్డ వారి విషయం అది సూచకంగా ఉండేలా దాన్ని అక్కడ ఉంచాలి. వారు చావకుండేలా నాకు విరోధంగా ఉన్న వారి సణుగులను ఈ విధంగా మాన్పించాలి.”
11 మోషే అలా చేశాడు. యెహోవా ఆజ్ఞ ప్రకారమే మోషే చేశాడు. 12 ✽తరువాత ఇస్రాయేల్ ప్రజలు మోషేతో అన్నారు, “ఇదుగో గతించిపోయాం! గతించిపోయాం! మేమంతా గతించిపోయాం! 13 యెహోవా నివాసం దగ్గరికి ఎవడైనా వస్తే అతడు చస్తాడు. మేమందరమూ చచ్చిపోవాలా?”