16
1 ✽తరువాత కోరహు, దాతాను, అబీరాము, ఓను కొంతమంది మనుషులను పోగు చేసి మోషేకు ఎదురుగా నిలబడ్డారు. (కోరహు ఇసహారు కొడుకు, లేవీకి మునిమనుమడు, కహాతుకు మనుమడు. దాతాను, అబీరాములు రూబేను గోత్రికుడైన ఏలీయాబు కొడుకులు. ఓను రూబేను గోత్రికుడైన ఫేలెతు కొడుకు). 2 ఇస్రాయేల్ ప్రజలలో రెండు వందల యాభైమంది మనుషులు వాళ్ల పక్షం వహించారు. ఆ మనుషులు సంఘంలో నాయకులు, సమాజంలో ఎన్నికైనవారు, పేరు పొందినవారు. 3 ✽వాళ్ళంతా మోషే అహరోనులకు విరోధంగా పోగయి వారితో, “మీరిక చాలించండి. సమాజంలో ఉన్నవాళ్ళంతా పవిత్రులే. యెహోవా వాళ్ళందరిమధ్య ఉన్నాడు. యెహోవా సమాజం మీద మిమ్మల్ని మీరు హెచ్చించుకోవడం దేనికి?” అన్నారు.“రేపు పొద్దున యెహోవా తనవాడెవడో పవిత్రుడెవడో తెలియజేస్తాడు. అలాంటివాణ్ణి తన సన్నిధానంలోకి రానిస్తాడు. తాను ఎన్నుకొన్నవాణ్ణి తనదగ్గరికి చేర్చుకొంటాడు. 6 మీరిలా చెయ్యాలి: కోరహూ, నీవూ నీ బృందమంతా ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పు ఉంచి, రేపు యెహోవా సముఖంలో వాటిమీద ధూపద్రవ్యం వెయ్యాలి. 7 అప్పుడు యెహోవా ఏ వ్యక్తిని ఎన్నుకొంటాడో అతడే పవిత్రుడు. లేవీ కుమారులారా! మీరిక చాలించండి.”
8 మోషే కోరహుతో ఇంకా అన్నాడు, “లేవీ కొడుకులారా, వినండి. 9 ✽ఇస్రాయేల్‌ప్రజల దేవుడు మిమ్ములను ఇస్రాయేల్ సమాజంలోనుంచి వేరుపరచాడు. తనదగ్గరికి మిమ్ములను చేర్చుకోవడానికీ మీరు యెహోవా యొక్క నివాసం సేవ చేయడానికీ సమాజంకోసం సేవకులై వారి ఎదుట నిలబడడానికీ మిమ్ములను ప్రత్యేకించాడు. మీ దృష్టిలో ఇది అల్ప విషయమేనా? 10 ఆయన నిన్నూ నీతోపాటు నీ లేవీ గోత్రంవారందరినీ చేర్చుకొన్నాడు గదా! ఇప్పుడు మీరు యాజి పదవిని కోరుతున్నారు. 11 అందుచేతే గదా, నీవూ నీ బృందంవాళ్ళంతా యెహోవాకు విరోధంగా గుమికూడారు. అయితే మీరు అహరోనుమీద సణుగుతున్నారెందుకు? అతడెవరు?”
12 ✽అప్పుడు మోషే ఏలీయాబు కొడుకులైన దాతాను అబీరాములను పిలువనంపించాడు. గానీ వాళ్ళు 13 “మేము రాము. ఈ ఎడారిలో చంపడానికి మమ్మల్ని పాలు తేనెలు నదులైపారుతున్న దేశంలోనుంచి తీసుకువచ్చావు. అది చాలదా? నువ్వు ప్రభువులాగా మామీద పెత్తనం చెలాయించాలా? 14 ✽అంతే గాక, పాలుతేనెలు నదులైపారుతున్న దేశంలోకి నీవు మమ్మల్ని తీసుకురాలేదు. పొలాలూ ద్రాక్షతోటలూ మా వశం చేయలేదు. ఇలాంటివాళ్ళ కండ్లు మూయడానికి ప్రయత్నం చేస్తున్నావా? మేము రాము” అని జవాబిచ్చారు.
15 మోషేకు చాలా కోపం వచ్చింది. అతడు యెహోవాతో “వాళ్ళు అర్పించేదానిని లక్ష్యపెట్టకు. ఒక్క గాడిదనైనా వాళ్ళదగ్గర నేను తీసుకోలేదు. వాళ్ళలో ఎవరికీ హాని చేయలేదు” అన్నాడు.
16 మోషే కోరహుతో ఇలా అన్నాడు: “రేపు నీవూ నీ బృందమంతా యెహోవా సముఖంలో నిలబడాలి. అహరోను కూడా అక్కడ ఉంటాడు. 17 మీలో ప్రతి ఒక్కడూ తన ధూపార్తి చేతపట్టుకొని దానిమీద ధూపద్రవ్యం వేయాలి. ఆ రెండు వందల యాభైమంది తమ తమ ధూపార్తులను యెహోవా సన్నిధానంలోకి తేవాలి. నీవూ అహరోనూ కూడా ధూపార్తులను తేవాలి.”
18 అందుచేత వాళ్ళలో ప్రతి ఒక్కరూ తన ధూపార్తి చేతపట్టుకొని దానిలో నిప్పు ఉంచి దానిమీద ధూపద్రవ్యం వేసి సన్నిధిగుడారం ద్వారందగ్గర మోషే అహరోనులతోపాటు నిలబడ్డారు. 19 అంతేగాక, మోషే అహరోనులకు విరోధంగా కోరహు సన్నిధిగుడారం ద్వారందగ్గరకు సమాజమంతటినీ పోగు చేశాడు. అప్పుడు యెహోవా మహిమాప్రకాశం సమాజమంతటికీ కానవచ్చింది.
20 యెహోవా మోషే అహరోనులతో, 21 ✝“మీరు ఈ సమావేశంలో నుంచి వేరుపడండి. తక్షణమే నేను వాళ్లను నాశనం చేస్తాను” అన్నాడు.
22 వారు సాగిలపడి, “దేవా! మానవులందరి ఆత్మలకు దేవా✽! ఒక్క మనిషి మాత్రమే పాపం✽ చేస్తే నీవు సమాజమంతటిమీదా కోపపడతావా?” అన్నారు.
23 అందుకు యెహోవా మోషేతో, 24 “కోరహు, దాతాను అబీరాములు ఉంటున్న డేరాల పరిసరాల నుంచి తొలగిపోండి అని నీవు సమాజంతో చెప్పు” అన్నాడు.
25 అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల దగ్గరికి వెళ్ళాడు. ఇస్రాయేల్ ప్రజల పెద్దలు అతని వెంట వెళ్ళారు. 26 ✝మోషే సమాజంతో “ఈ దుర్మార్గులు చేసిన అన్ని పాపాల కారణంగా మీరు నశించకుండేలా వాళ్ల డేరాల దగ్గరనుంచి తొలగిపోండి, వాళ్ల ఆస్తిపాస్తులలో దేనినీ ముట్టకండి” అన్నాడు.
27 గనుక కోరహు దాతాను అబీరాముల డేరాల చుట్టుపట్లనుంచి వారు కదిలారు. అప్పుడు దాతాను అబీరాములు వాళ్ళ భార్యలతో కొడుకులతో చిన్నవారితోకూడా వారి డేరాల ద్వారాలలో నిలబడ్డారు. 28 ✽అప్పుడు మోషే ఇలా అన్నాడు:
“నేను ఈ క్రియలన్నీ చేయాలని యెహోవా నన్ను పంపించాడు. నా అంతట నేనే అవి చేయడం లేదు. ఇది మీరు తెలుసుకొంటారు – 29 ఎలాగంటే, వీళ్ళు సహజంగా చనిపోతే, మనుషులందరికీ పట్టే మామూలు గతి వీళ్ళకు పడితే యెహోవా నన్ను పంపలేదన్నమాట. 30 గాని యెహోవా గొప్ప అద్భుతం చేస్తాడనుకోండి; వీళ్ళు ప్రాణంతోనే మృత్యులోకంలో కూలేట్టు భూమి దాని నోరు తెరచి వీళ్ళనూ వీళ్ళకు చెందేదాన్నంతా మింగివేస్తుందనుకోండి. అలాంటప్పుడు వీళ్ళు యెహోవాను తిరస్కరించారని మీరు తెలుసుకొంటారు.”
31 అతడు ఈ మాటలన్నీ చెప్పీ చెప్పడంతోనే ఆ మనుషులక్రింద నేల చీలిపోయింది. 32 ✽భూమి దాని నోరు తెరచి వాళ్లనూ వాళ్ళ కుటుంబాలనూ కోరహు మనుషులందరినీ వాళ్ళ ఆస్తిపాస్తులనూ అంతా మింగివేసింది. 33 వాళ్ళూ వాళ్ళకు చెందిన అంతటితోపాటు ప్రాణంతోనే మృత్యులోకంలో కూలిపోయారు. అప్పుడు భూమి మూసుకుపోయింది. వాళ్ళు సమాజంలో లేకుండా నశించారు. 34 వాళ్ళు పెట్టిన బొబ్బలు విని వాళ్ళ చుట్టూరా ఉన్న ఇస్రాయేల్‌వారంతా పారిపొయ్యారు. భూమి తమను కూడా మింగివేస్తుందేమో అనుకొన్నారు. 35 ✝ఆలోగా యెహోవా సన్నిధానంనుంచి మంటలు బయలు దేరాయి; ధూపం అర్పిస్తున్న ఆ రెండు వందల యాభైమందిని కాల్చివేశాయి.
36 ✽అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 37 “యాజి అయిన అహరోను కొడుకు ఎలియాజరు ఆ బూడిదలోనుంచి ఆ ధూపార్తులను ఎత్తాలని నీవు అతడితో చెప్పు. వాటిలో ఉన్న నిప్పుకణాలను నీవు దూరంగా పారెయ్యాలి. ఆ ధూపార్తులు పవిత్రంగా ఉన్నాయి. 38 పాపం చేసి తమను మరణానికి గురి చేసుకొన్న ఆ మనుషులు ధూపార్తులను తీసుకొని బలిపీఠానికి కప్పుగా రేకులుగా సాగగొట్టాలి. యెహోవా సన్నిధానంలోకి వారు ఆ ధూపార్తులను తెచ్చారు, గనుక అవి పవిత్రంగా ఉన్నాయి. అవి ఇస్రాయేల్ ప్రజలకు సూచనగా ఉంటాయి.”
39 యెహోవా మోషేచేత తనతో పలికించినట్టు ఎలియాజరుయాజి దహనం అయిపోయినవాళ్ళ కంచు ధూపార్తులను తీసి బలిపీఠానికి కప్పుగా రేకులుగా సాగగొట్టించాడు. 40 అహరోను వంశంలో ఉండని సామాన్యుడెవ్వడూ యెహోవా సన్నిధానంలో ధూపం అర్పించడానికి సమీపించకూడదనీ కోరహుకూ వాడి బృందం వాళ్ళకూ పట్టిన గతి అలాంటివాడికి పట్టకూడదనీ యెహోవా ఉద్దేశం. అందుకే ఇస్రాయేల్ ప్రజలకు స్మృతి చిహ్నంగా ఆ ధూపార్తులతో రేకులు చేశారు.
41 ✽అయితే మరుసటి రోజే ఇస్రాయేల్ ప్రజల సమాజమంతా మోషే అహరోనులకు విరోధంగా సణుగుతూ “యెహోవాప్రజల్ని మీరు చంపేశారు” అన్నారు.
42 మోషే అహరోనులకు విరోధంగా సమాజం సమావేశమైన తరువాత వారు సన్నిధిగుడారం వైపు చూశారు. యెహోవా మేఘం ఆ గుడారాన్ని కమ్మింది, ఆయన మహిమాప్రకాశం కానవచ్చింది. 43 మోషే అహరోనులు సన్నిధిగుడారం ఎదుటికి వెళ్ళారు.
44 అక్కడ యెహోవా మోషేతో “మీరు సమాజం మధ్యనుంచి తొలగిపోండి. 45 అప్పుడు నేను వాళ్ళను తక్షణమే నాశనం చేస్తాను” అన్నాడు. అందుకు వారు సాష్టాంగపడ్డారు.
46 ✽మోషే అహరోనుతో ఇలా అన్నాడు: “యెహోవా సన్నిధానంనుంచి కోపాగ్ని బయలుదేరింది, విపత్తు ఆరంభమైంది, గనుక నీ ధూపార్తి తీసుకొని బలిపీఠంమీది నిప్పుకణాలతో నింపి ధూపం వేసి త్వరగా సమాజందగ్గరికి వెళ్ళి వారి అపరాధాన్ని కప్పివెయ్యి”.
47 మోషే చెప్పినట్టే అహరోను వాటిని చేతపట్టుకొని సమాజం మధ్యకు పరుగెత్తాడు. అంతకుముందే విపత్తు ప్రజలలో ఆరంభమైంది. అతడు ధూపం వేసి వారి అపరాధాన్ని కప్పివేశాడు. 48 చచ్చినవారికీ బ్రతికినవారికీ మధ్య అతడు నిలబడ్డాడు. విపత్తు ఆగిపోయింది. 49 కోరహు తిరుగుబాటువల్ల చనిపోయినవాళ్ళు కాకుండా, ఆ విపత్తువల్ల చనిపోయినవాళ్ళు పద్నాలుగు వేల ఏడు వందలమంది. 50 విపత్తు ఆగిన తరువాత అహరోను సన్నిధిగుడారం ద్వారందగ్గర ఉన్న మోషే దగ్గరికి తిరిగి వెళ్ళాడు.