15
1 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 2 “నీవు ఇస్రాయేల్‌ ప్రజలతో ఈ విధంగా చెప్పు – నేను మీకిచ్చే దేశంలో, మీరు నివసించబోయే ఆ దేశంలో ప్రవేశించిన తరువాత మీరు అర్పణలు అర్పించేటప్పుడు ఈ నియమాలు అనుసరించాలి:
3 “అది మొక్కుబడి విషయమైన హోమం కానివ్వండి, బలి కానివ్వండి, స్వేచ్ఛార్పణ కానివ్వండి, నియామక కాలాలలో యెహోవాకు పరిమళ అర్పణగా పశువులలో నుంచీ గొర్రె మేకలలోనుంచీ మీరు అర్పించేది కానివ్వండి, 4 యెహోవాకు అర్పణ చేసేవాడు ఒక లీటర్ నూనెతో కలిపిన ఒక కిలోగ్రాం గోధుమ పిండిని కూడా నైవేద్యంగా తేవాలి. 5 అంతే గాక, ఒక్కొక్క గొర్రెపిల్లతో పాటు పానార్పణంగా ఒక లీటర్ ద్రాక్షరసం తేవాలి. అది హోమంమీద గానీ బలిమీద గానీ పోయడానికే. 6 ఆ బలి పొట్టేలైతే లీటరున్నర నూనెతో కలిపిన రెండు కిలోగ్రాముల గోధుమ పిండిని నైవేద్యంగా సిద్ధం చేయాలి. 7 యెహోవాకు పరిమళంగా ఉన్న పానార్పణంగా లీటరున్నర ద్రాక్షరసం కూడా తేవాలి. 8 మొక్కుబడి చెల్లించడానికి, లేకపోతే, యెహోవాకు శాంతిబలిగా ఉండడానికి హోమంగా గానీ బలిగా గానీ ఒక కోడెను తీసుకువస్తే, 9 ఆ కోడెతోపాటు నైవేద్యంగా రెండు లీటర్ల నూనెతో కలిపిన మూడు కిలోల గోధుమపిండి తేవాలి. రెండు లీటర్ల ద్రాక్షరసం పానార్పణంగా తేవాలి. 10 అది యెహోవాకు పరిమళ హోమంగా ఉంటుంది.
11 “అర్పణగా తెచ్చే ప్రతి కోడె, పొట్టేలూ, మగ గొర్రెపిల్లా, మగ మేకపిల్ల విషయంలో మీరు ఆ విధంగానే చెయ్యాలి. 12 మీరు తెచ్చిన వాటి లెక్క ప్రకారం ప్రతిదాని విషయంలో అలా చెయ్యాలి. 13 స్వదేశస్తులలో ఎవరైన యెహోవాకు పరిమళ హోమం తెస్తే ఆ విధంగా చేయాలి. 14 మీమధ్య నివసించే విదేశస్తులు గానీ తరతరాలనుంచి మీమధ్య ఉన్న వారిలో ఎవరైన గానీ యెహోవాకు పరిమళ హోమం అర్పించదలిస్తే మీరు చేసినట్టే వారూ చెయ్యాలి. 15 సమాజంలో మీకూ మీ మధ్య నివసించే విదేశీయుడికీ ఒక్కటే చట్టం. యెహోవా సన్నిధానంలో మీరున్నట్టే విదేశీయులూ ఉంటారు. 16 మీకూ మీమధ్య నివసించే విదేశీయులకూ ఒక్కటే ఉపదేశం, ఒక్కటే నిర్ణయం ఉండాలి.”
17 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 18 “నీవు ఇస్రాయేల్‌ప్రజలతో ఈ విధంగా చెప్పు: నేను మిమ్ములను తీసుకుపోతున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత, 19 ఆ దేశం ఆహారం తిన్నప్పుడు దానిలో ఒక భాగం ప్రత్యేకమైన కానుకగా యెహోవాకు అర్పించాలి. 20 మీ మొదటి పిండి ముద్దలోనుంచి ఒక రొట్టెను అర్పించాలన్నమాట. మీ కళ్ళంలోని ధాన్యంలోనుంచి కొంత అర్పించినట్టే దానిని అర్పించాలి. 21 మీ తరతరాలకు మీ మొదటి పిండి ముద్దలోనుంచి ఒక భాగం యెహోవాకు అర్పించాలి.
22 “యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో దేనినైనా పొరపాటున మీరు మీరితే, 23 యెహోవా ఆజ్ఞలు ఇవ్వడం మొదలు పెట్టిన రోజునుంచి మీకూ తరువాతి తరాలకూ యెహోవా మోషేమూలంగా ఇచ్చిన ఆజ్ఞలన్నిటిలో దేనినైనా మీరు పొరపాటున మీరితే, 24 తెలియకుండానే పొరపాటున సమాజమంతా అలా ఆజ్ఞ మీరితే సమాజమంతా యెహోవాకు పరిమళ హోమంగా ఒక కోడెదూడను అర్పించాలి. ధర్మనిర్ణయం ప్రకారం ఆ హోమంతోపాటు దానికి సంబంధించిన నైవేద్యమూ పానార్పణమూ అర్పించాలి. పాపాలకోసమైన బలిగా ఒక మేకపోతును కూడా అర్పించాలి. 25 యాజి ఇస్రాయేల్‌ప్రజల సమాజమంతటికోసం ప్రాయశ్చిత్తం చేసి వారికి క్షమాపణ దొరికేలా చేస్తాడు. వాళ్ళు తప్పిదం పొరపాటున చేశారు గదా! వారి పొరపాటుకోసం యెహోవాకు హోమంగా, ఆయన సన్నిధానంలో అర్పించడానికి పాపాలకోసమైన బలిగా వారి అర్పణలను తీసుకువచ్చేటప్పుడు, 26 ఇస్రాయేల్ ప్రజల సమాజమంతటికీ క్షమాపణ దొరుకుతుంది. వారిమధ్య కాపురమున్న విదేశీయులకు కూడా క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే ప్రజలందరూ తెలియకుండానే ఆ పొరపాటు చెయ్యడం జరిగింది.
27 “ఒక వ్యక్తి పొరపాటున తప్పిదం చేస్తే, అతడు పాపాలకోసమైన బలిగా ఏడాది ఆడ మేకను అర్పించాలి. 28 పొరపాటున తప్పిదం చేసిన ఆ వ్యక్తికోసం యాజి యెహోవా సన్నిధానంలో ఆ వ్యక్తి తప్పిదాన్ని కప్పివేయాలి. యెహోవా అతణ్ణి క్షమిస్తాడు. 29 ఇస్రాయేల్ ప్రజలలో జన్మించినవారు గానీ వారిమధ్య కాపురమున్న విదేశీయులు గానీ ఎవరైనా పొరపాటున తప్పిదం చేస్తే వారికి అదే చట్టం వర్తిస్తుంది. 30 అయితే ఎవరైనా స్వదేశస్తుడు కానివ్వండి విదేశస్తుడు కానివ్వండి – గర్వించి బుద్ధిపూర్వకంగా తప్పిదం చేస్తే, ఆ వ్యక్తి యెహోవానే దూషిస్తున్నాడు, గనుక వాణ్ణి తన ప్రజలలో లేకుండా చేయాలి. 31 వాడు యెహోవా మాట తృణీకరించి ఆయన ఆజ్ఞను మీరినందుచేత వాడు తప్పక లేకుండా పోవాలి. వాడి అపరాధం వాడిమీద ఉంటుంది.”
32 ఇస్రాయేల్‌ప్రజలు ఎడారిలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతిరోజున కట్టెలు ఏరడం చూశారు. 33 వాడు కట్టెలు సేకరించడం చూచినవారు మోషే అహరోనుల దగ్గరికీ సమాజమంతటి దగ్గరికీ వాణ్ణి తీసుకువచ్చారు. 34 వాడికి ఏం చెయ్యాలో అది స్పష్టం కాలేదు గనుక వాణ్ణి కావలిలో ఉంచారు.
35 అప్పుడు యెహోవా మోషేతో, “ఆ మనిషి మరణశిక్ష పొందాలి. సర్వసమాజం శిబిరం వెలుపల రాళ్ళు రువ్వి వాణ్ణి చంపాలి” అన్నాడు. 36 అందుచేత యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞప్రకారం, సమాజమంతా శిబిరం వెలుపలికి వాణ్ణి తీసుకు పోయి రాళ్ళు రువ్వి చంపారు.
37 తరువాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 38 “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు: వారు తరతరాలకు తమ బట్టల అంచులకు కుచ్చులు వేసుకొని, ఆ కుచ్చులమీద నీలిదారం తగిలించాలి. 39 ఇందులో నా ఉద్దేశమేమిటంటే, మీరు ఆ కుచ్చులను చూచి యెహోవా ఆజ్ఞలన్నీ జ్ఞాపకం చేసుకొని వాటి ప్రకారం ప్రవర్తించాలి. మునుపు మీరు మీ హృదయంలోని ఆశలనూ నేత్రాశలనూ అనుసరించి వేశ్యలలాగా తిరుగాడేవారు. ఇప్పుడు అలా ప్రవర్తించకూడదు. 40 ఆ కుచ్చులను చూచి నా ఆజ్ఞలన్నీ జ్ఞాపకం చేసుకొని వాటి ప్రకారం ప్రవర్తిస్తూ, మీ దేవునికి పవిత్రులుగా ఉండాలి. 41 నేను యెహోవాను, మీ దేవుణ్ణి, మీకు దేవుడిగా ఉండడానికి మిమ్ములను ఈజిప్ట్‌దేశంనుంచి తీసుకువచ్చినవాణ్ణి. మీ దేవుడైన యెహోవాను నేనే.”