14
1 ✽అప్పుడు సమాజమంతా బిగ్గరగా గోల చేశారు. ఆ రాత్రంతా ప్రజలు ఏడ్చారు. 2 ✝ఇస్రాయేల్‌వారంతా మోషేమీదా అహరోనుమీదా సణుక్కొన్నారు. ఆ సమాజమంతా వారితో చెప్పినది ఏమిటంటే, “అయ్యో, మేము ఈజిప్ట్‌లో చనిపోయివుంటే ఎంత బాగుండేది! ఈ ఎడారిలో చనిపోయివుంటే ఎంత బావుండును! 3 ✽మేము కత్తిపాలై పడేలా యెహోవా మమ్మల్ని ఈ దేశానికి ఎందుకు తీసుకువచ్చాడు? మా భార్యలూ పిల్లలూ కొల్లపోతారు. ఈజిప్ట్‌కు తిరిగి వెళ్ళడం మాకు మేలు కాదా?” 4 ✽వారు ఒకరితో ఒకరు, “మనకోసం ఒక నాయకుణ్ణి నియమించుకొని ఈజిప్ట్‌కు తిరిగి వెళదాం, పదండి” అని చెప్పుకొన్నారు.5 అప్పుడు మోషే అహరోనులు ఇస్రాయేల్‌ప్రజల సర్వ సమాజ సమావేశం ఎదుట సాష్టాంగపడ్డారు.✽ 6 ✽ఆ దేశంలో సంచరించి చూచినవారిలో నూను కొడుకు యెహోషువ, యెఫున్నె కొడుకు కాలేబు తమ బట్టలు చించుకొని ఇస్రాయేల్‌ప్రజల సర్వ సమాజంతో ఇలా అన్నారు:
7 “మేము సంచరించి చూచిన దేశం చాలా మంచి దేశం. 8 మనమంటే యెహోవాకు ఆనందం ఉంటే ఆయన మనల్ని ఆ దేశంలోకి తీసుకువెళ్లి దానిని మనకిస్తాడు. అది పాలుతేనెలు నదులై పారుతున్న దేశం. 9 అయితే మీరు యెహోవా మీద తిరగబడకూడడు. ఆ దేశప్రజలకు భయపడకూడదు. వాళ్ళు మనకు ఆహారమవుతారు. వారి సంరక్షణం వారిదగ్గరనుంచి తొలగిపోయింది. యెహోవా మనతో ఉన్నాడు. వారికి భయపడకండి.”
10 అయితే సమాజమంతా “వాళ్ళను రాళ్ళు రువ్వి✽ చంపుదాం” అన్నారు. అప్పుడు యెహోవా మహిమా✽ప్రకాశం సన్నిధిగుడారం మీద ఇస్రాయేల్ ప్రజలందరికీ కానవచ్చింది.
11 ✽యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఎంత కాలమని ఈ ప్రజలు నన్ను తిరస్కరిస్తారు? నేను వారిమధ్య చేసిన అద్భుతమైన సూచనలన్నీ వారు చూచి కూడా ఎంతకాలంవరకు నన్ను నమ్మకుండా ఉంటారు? 12 ✝నేను వారిమీదికి విపత్తు రప్పించి వారిని రూపుమాపుతాను, వారికంటే బలంగల గొప్ప ప్రజను నీవల్ల పుట్టిస్తాను.” 13 ✝మోషే యెహోవాతో ఇలా అన్నాడు: “నీవు ఈ ప్రజలను ఈజిప్ట్‌వాళ్ళలోనుంచి నీ బలంచేత రప్పించావు. నీవు వారిని రూపుమాపితే వాళ్ళు ఈ దేశవాసులతో ఆ సంగతి చెప్తారు. 14 యెహోవా, నీవు ఈ ప్రజలమధ్యలో ఉన్నావని ఈ దేశవాసులు విన్నారు. యెహోవా, నీవు వారికి సాక్షాత్తుగా కనబడతావనీ నీ మేఘం వారికి పైగా నిలిచి ఉంటుందనీ నీవు పగటివేళ మేఘస్తంభంలో ఉండి రాత్రివేళ అగ్ని స్తంభంలో ఉండి వారి ముందర సాగిపోతావనీ వాళ్ళు విన్నారు. 15 ఒకవేళ నీవు ఒకే దెబ్బతో ఈ ప్రజలను చంపితే నీ పేరుప్రతిష్ఠలను గురించి విన్న ఇతర జాతులవాళ్ళు – 16 ‘యెహోవా ఈ దేశాన్ని వాళ్ళకిస్తానని మాట ఇచ్చాడు గాని వాళ్ళను ఈ దేశంలో చేర్చలేకపోయాడు. అందుచేతే ఆయన వాళ్లను ఎడారిలో వధించాడు’ అంటారు. 17 ✝నీవు ఇలా అన్నావు గదా ‘యెహోవా త్వరగా కోపగించేవాడు గాక, అత్యంత కృపగలవాడు. 18 పాపాలనూ అతిక్రమాలనూ క్షమించేవాడు. అయితే దోషులను శిక్షించకుండా ఉండేవాడు గాక, మూడు నాలుగు తరాలకు తండ్రుల పాపఫలితం వారి సంతానంమీదికి రప్పించేవాడు.’ నీవు చెప్పిన ఆ మాట ప్రకారమే నా ప్రభువైన నీ బలప్రభావాలను కనుపరచమని వేడుకొంటున్నాను. 19 ✝నీ మహా అనుగ్రహం ప్రకారం ఈ ప్రజల అపరాధాన్ని క్షమించమని నా ప్రార్థన. ఈజిప్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు క్షమించినట్టే వారిని క్షమించు.”
20 ✽అందుకు యెహోవా ఇలా అన్నాడు: “నీ మనవి ప్రకారమే వారిని క్షమించాను. 21 ✝అయినా లోకమంతా యెహోవా మహిమతో ఎంత నిశ్చయంగా నిండి ఉంటుందో అంత నిశ్చయంగా నా జీవంమీద శపథం చేసి చెపుతున్నాను, 22 ✽వారు ఏ మాత్రమూ ఆ దేశాన్ని చూడరు, దేశంలో ప్రవేశించరు. వారు నా మహిమనూ ఈజిప్ట్‌లో, ఎడారిలో నేను చేసిన అద్భుతమైన సూచనలనూ చూశారు గాని నన్ను పది సార్లు పరీక్షించారు, నా మాట వినకుండా ఉన్నారు. 23 గనుక నేను వారి పూర్వీకులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశాన్ని వారు చూడనే చూడరు. నన్ను తిరస్కరించినవారిలో ఎవ్వడూ చూడడు. 24 ✝అయితే నా సేవకుడైన కాలేబును అతడు వెళ్ళి చూచిన ఆ దేశంలో ప్రవేశపెడతాను. ఎందుకంటే, అతడు మంచి మనస్సు కలిగి నన్ను పూర్తిగా అనుసరించాడు. అతడి సంతానం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొంటారు. 25 ✽అమాలేకువాళ్ళూ కనానువాళ్ళూ ఆ లోయలో నివాసం చేస్తున్నారు. రేపు మీరు వెనుకకు తిరిగి, ఎర్రసముద్రం దిక్కుగా ఉన్న ఎడారికి ప్రయాణం చేయండి.”
26 యెహోవా మోషే అహరోనులతో అన్నాడు, 27 “నామీద సణుగుతున్న ఈ చెడ్డ సమాజాన్ని నేనెంతకాలమని సహించాలి? ఇస్రాయేల్‌ప్రజలు నామీద చేస్తున్న ఫిర్యాదులు విన్నాను. 28 వారితో ఈ విధంగా చెప్పు: యెహోవా వాక్కు ఇదే – నా జీవంమీద శపథం చేసి చెపుతున్నాను, మీరు నా సన్నిధానంలో చెప్పినట్టు నేను తప్పకుండా మీపట్ల జరిగిస్తాను. 29 మీ శవాలు ఎడారిలోనే కూలుతాయి. ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, జనాభా లెక్కలలో నమోదై నామీద సణిగిన మీ అందరి గతి అంతే. 30 మిమ్ములను నివసింపజేస్తానని నేను వాగ్దానం చేసిన దేశంలో యెఫున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ మాత్రమే ప్రవేశిస్తారు. మీలో ఇంకెవ్వరూ ప్రవేశించరు. ఇది ఖాయం. 31 మీ సంతానాన్ని కూడా ఆ దేశంలో చేరుస్తాను. వారు కొల్లపోతారని మీరు చెప్పారు గదా! మీరు వద్దన్న దేశాన్ని వారు పొందుతారు. 32 కానీ మీ శవాలు ఈ ఎడారిలో కూలుతాయి. 33 మీ సంతతివారు ఈ ఎడారిలో నలభై ఏళ్ళు తిరుగాడుతూ ఉంటారు. మీ శవాలు ఎడారిలో రాలిపోయేదాకా, మీరు వేశ్యలలాగా ప్రవర్తించినందుకు వారు బాధలు అనుభవిస్తారు. 34 ఆ దేశాన్ని నలభై రోజులు సంచరించి చూశారు. రోజుకు ఒక సంవత్సరం ప్రకారం మొత్తం నలభై సంవత్సరాలు మీరు మీ అపరాధాలు భరిస్తారు. మీమీద నాకు వ్యతిరేకభావం ఉన్నట్టు మీరు తెలుసుకొంటారు. 35 నేను యెహోవాను. నేను ఈ మాట చెప్పాను. నాకు విరోధంగా సమకూడిన ఈ చెడ్డ సమాజమంతటికీ ఈ మాటప్రకారం చేసితీరుతాను. ఈ ఎడారిలో వారు అంతరించిపోతారు. ఇక్కడే చస్తారు.”
36 ✽ఆ దేశాన్ని చూడడానికి మోషే పంపించినవారు తిరిగి వచ్చి ఆ దేశం విషయం చెడ్డ సమాచారం చెప్పి సమాజమంతా మోషేమీద సణుక్కొనేలా చేసినందుచేత, 37 ఆ దేశం విషయం చెడ్డ సమాచారం చెప్పిన ఆ మనుషులు యెహోవా సన్నిధానంలో విపత్తుచేత చనిపోయారు. 38 ఆ దేశాన్ని చూడడానికి వెళ్ళినవారిలో నూను కొడుకు యెహోషువ, యెఫున్నె కొడుకు కాలేబు మాత్రమే బ్రతికారు.
39 యెహోవా చెప్పిన మాటలు ఇస్రాయేల్ ప్రజలందరికీ మోషే తెలియజేసినప్పుడు వారు చాలా దుఃఖించారు. 40 ✽మరుసటి రోజు తెల్లవారుతుండగానే వారు లేచి అక్కడి కొండ శిఖరానికెక్కి “మేము తప్పిదం చేశాం, నిజమే. అయితే ఇప్పుడు యెహోవా చెప్పిన స్థలానికి వెళ్దాం” అన్నారు.
41 అందుకు మోషే ఇలా అన్నాడు: “ఇలా ఎందుకు? మీరు యెహోవా మాట మీరుతున్నారు. ఇలా చేసి లాభం లేదు. 42 యెహోవా మీమధ్య లేడు, గనుక మీ శత్రువుల ఎదుట ఓడిపోతారు. అక్కడికి వెళ్లకండి. 43 అక్కడ అమాలేకు జాతివాళ్ళు, కనానువాళ్ళు మీకు ఎదురుగా ఉంటారు. మీరు ఖడ్గం చేత కూలుతారు. మీరు యెహోవాను అనుసరించడం మానుకొన్నారు గనుక యెహోవా మీకు తోడుగా ఉండడు.”
44 ✽అతడిలా చెప్పినా వారు గర్వించి ఆ కొండసీమలకు వెళ్ళారు. అయితే యెహోవా ఒడంబడికపెట్టె శిబిరంలోనుంచి పోలేదు. మోషే కూడా వెళ్ళలేదు. 45 ✽అప్పుడు, ఆ కొండసీమలలో నివసించే అమాలేకువాళ్ళూ కనానువాళ్ళూ బయలుదేరి ఇస్రాయేల్ వారిని హోర్మావరకు తరిమి ఓడించారు.