13
1  యెహోవా మోషేతో, 2 “నేను ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చే కనాను దేశాన్ని సంచరించి చూడడానికి నీవు మనుషులను పంపు. వారి పూర్వీకుల గోత్రాలనుంచి, ఒక్కొక్క గోత్రంనుంచి ఒక్కొక్క ప్రముఖుణ్ణి పంపాలి” అన్నాడు. 3 యెహోవా ఇచ్చిన ఆజ్ఞప్రకారమే మోషే పారాను ఎడారినుంచి వారిని పంపాడు. వారిలో ఒక్కొక్కరూ ఇస్రాయేల్ ప్రజలలో ప్రముఖులు. 4 వారి పేర్లు ఇవి: రూబేనుగోత్రంలో జక్కూర్ కొడుకు షమ్మూయ, 5 షిమ్యోనుగోత్రంలో హోరీ కొడుకు షాపాతు, 6 యూదాగోత్రంలో యెఫున్నె కొడుకు కాలేబు, 7 ఇశ్శాకారుగోత్రంలో యోసేపు కొడుకు ఇగాలు, 8 ఎఫ్రాయింగోత్రంలో నూను కొడుకు హోషేయ, 9 బెన్యామీనుగోత్రంలో రాఫు కొడుకు పల్తీ, 10 జెబూలూనుగోత్రంలో సోరి కొడుకు గదీయేల్, 11 యోసేపుగోత్రంలో, అంటే మనష్షే గోత్రంలో సూసీ కొడుకు గదీ, 12 దానుగోత్రంలో గెమలి కొడుకు అమ్మీయేల్, 13 ఆషేరుగోత్రంలో మిఖాయేల్ కొడుకు సెతూర్, 14 నఫ్తాలిగోత్రంలో వాపెసీ కొడుకు నహబీ, 15 గాదుగోత్రంలో మాకీ కొడుకు గెయూవేల్.
16 ఆ దేశాన్ని చూడడానికి మోషే పంపించిన మనుషుల పేర్లు అవి. అయితే నూను కొడుకు హోషేయకు యెహోషువ అనే పేరు పెట్టాడు మోషే.
17 కనానుదేశాన్ని సంచరించి చూడడానికి మోషే వారిని పంపిస్తూ ఇలా అన్నాడు: “మీరు ఆ దేశంలో దక్షిణ దిక్కున ప్రవేశించండి. తరువాత కొండసీమలకు వెళ్ళండి. 18 ఆ దేశం ఎలాంటిదో చూడండి. అక్కడి ప్రజలకు బలం ఉందో లేదో, వారి సంఖ్య అధికమో కాదో, 19 వారు కాపురమున్న దేశం మంచిదో చెడ్డదో, వారు ఉంటున్న పట్టణాలు ప్రాకారాలు గలవో కావో, 20 ఆ దేశం సారవంతమో కాదో, దానిలో చెట్లున్నాయో లేవో కనిపెట్టండి. ఆ దేశం పండ్లలో కొన్ని తీసుకురండి.” (అది మొదటి ద్రాక్షపండ్ల కాలం.)
21 వారు వెళ్ళి సీన్ ఎడారినుంచి హమాతు కనుమదగ్గర ఉన్న రెహాబువరకు ఆ దేశాన్ని చూశారు. 22 దక్షిణ దిక్కున ప్రవేశించి హెబ్రోనుకు వచ్చారు. హెబ్రోనులో అహీమాన్, షేషయి, తల్మయి జాతులవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనాకు వంశస్థులు. హెబ్రోను ఈజిప్ట్‌లో ఉన్న సోయన్ కంటే ఏడేళ్ళు ముందుగా కట్టిన పట్టణం.
23 ఆ ప్రముఖులు ఎష్కోల్ లోయలోకి వెళ్ళి అక్కడ ఒకే గెల ఉన్న ద్రాక్షచెట్టు కొమ్మను నరికారు. దానిని కర్రతో ఇద్దరు మోశారు. వారు కొన్ని దానిమ్మ పళ్ళూ కొన్ని అంజూర పళ్ళూ కూడా తీసుకువచ్చారు. 24 ఇస్రాయేల్‌వారు అక్కడ ద్రాక్షగెల నరికినందుకే ఆ స్థలానికి ఎష్కోల్ లోయ అని పేరు.
25 వారు నలభై రోజులు ఆ దేశాన్ని సంచరించి చూచి తిరిగి వచ్చారు. 26 మోషే, అహరోను, ఇస్రాయేల్ సర్వ సమాజం పారాను ఎడారిలో కాదేషులో ఉన్నారు. ఆ ప్రముఖులు వారిదగ్గరికి చేరి మోషే అహరోనులకూ సర్వ సమాజానికీ సమాచారం తెలియజేశారు, ఆ దేశం పళ్ళను వారికి చూపెట్టారు. 27  వారు మోషేతో చెప్పిన సంగతి ఇది:
“నీవు మమ్మల్ని పంపిన దేశానికి చేరుకున్నాం. అది పాలు తేనెలు నదులై పారుతున్న దేశమే. ఇదిగో ఆ దేశం పళ్ళు ఇవి. 28 అయితే ఆ దేశవాసులు బలిష్ఠులు. వాళ్ళ పట్టణాలు చాలా పెద్దవి. వాటికి ప్రాకారాలున్నాయి. అంతేగాక, అక్కడ అనాకు వాళ్ళను చూశాం. 29 అమాలేకువాళ్ళు దక్షిణ ప్రాంతంలో ఉంటున్నారు. హిత్తి, యోబూసి, అమోరీ జాతులవారు కొండసీమల్లో కాపురముంటున్నారు. కనానువాళ్ళు సముద్రందగ్గర, యొర్దాను నది ఒడ్డున కాపురముంటున్నారు.”
30 కాలేబు మోషే ఎదుట ప్రజలను శాంతపరచి “మనం తప్పకుండా వెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి. నిస్సందేహంగా దానిని జయించగలం” అన్నాడు.
31 కాని అతడితోపాటు వెళ్లిన ఆ మనుషులు “ఆ ప్రజలు మనకంటే బలాఢ్యులు. మనం వాళ్ళమీదికి వెళ్ళలేము” అన్నారు.
32 అంతేగాక తాము చూచిన ఆ దేశాన్ని గురించి చెడ్డ సమాచారం ఇస్రాయేల్ ప్రజలకు చెప్తూ ఇలా అన్నారు:
“మేము సంచరించి చూచిన ఆ దేశం తన నివాసులను దిగమింగేస్తుంది. ఆ దేశంలో మాకు కనిపించిన వాళ్ళంతా బ్రహ్మాండమైనవాళ్ళు. 33 అక్కడ నెఫీలిజాతివాళ్ళను చూశాం (నెఫీలివాళ్ళు అనాకు వంశస్థులు). వాళ్ళను చూస్తే మా దృష్టిలో మేము మిడతలంత చిన్నగా ఉన్నాం, వాళ్ళ దృష్టికి కూడా అంతే.”