11
1 ✽ ఇస్రాయేల్ ప్రజలు తమ కష్టాల విషయం యెహోవా సముఖంలో సణిగారు. అది విన్నప్పుడు యెహోవా కోపాగ్ని రగులుకొంది. యెహోవా సన్నిధానంనుంచి మంటలు బయలుదేరి వారి మధ్య మండుతూ ఉన్నాయి, వారి శిబిరంలో ఒక కొనను కాల్చివేస్తూ ఉన్నాయి. 2 ✽ప్రజలు మోషేకు మొరపెట్టారు. మోషే యెహోవాను వేడుకొన్నప్పుడు మంటలు చల్లారిపోయాయి. 3 యెహోవా పంపిన అగ్ని తమ మధ్య రగులుకొన్నందుకు ఆ చోటికి తబేరా అనే పేరు పెట్టారు.4 ✽ప్రజలలో ఉన్న అల్లరిమూకకు పేరాశ చెలరేగింది. ఇస్రాయేల్‌వారు కూడా ఏడుస్తూ “మాకెవరు మాంసం పెడతారు? 5 ఈజిప్ట్‌లో ఉచితంగా దొరికిన చేపలు తిన్నాం. దోసకాయలూ కర్బూజ పండ్లూ ఉల్లిపాయలూ ఇంకా వేరే కూర మొక్కలూ వెల్లుల్లిపాయలూ తిన్నాం. మాకు బాగా జ్ఞాపకం ఉంది. 6 ఇప్పుడైతే మేము నీరసించిపోతున్నాం. తినడానికి ఈ మన్నా మాత్రమే కనిపిస్తున్నది. ఇంకేం లేదు” అన్నారు. 7 (మన్నా ధనియాలలాగా ఉండేది. చూపుకు గుగ్గిలం లాంటిది. 8 ప్రజలు తిరుగుతూ దానిని సేకరించారు. తిరగటిలో విసిరి, లేక రోట్లో దంచి కుండలో ఉడకబెట్టిన తరువాత దానితో రొట్టెలు చేశారు. దాని రుచి నూనెతో కలిపిన అప్పడాల రుచిలాంటిది. 9 రాత్రివేళ శిబిరంలో మంచు కురిసినప్పుడు మన్నా దాని వెంటనే పడేది).
10 ✽ ప్రజలంతా తమ కుటుంబాలతోపాటు తమ తమ డేరాల ద్వారాలదగ్గర ఏడుస్తూ ఉండడం మోషేకు వినిపించింది. యెహోవా కోపాగ్ని తీవ్రంగా రగులుకొంది. గనుక మోషే నొచ్చుకొన్నాడు. 11 అందుచేత మోషే యెహోవాతో ఇలా అన్నాడు:
“నీవు నీ సేవకుడైన నాపట్ల కఠోరంగా వ్యవహరించావెందుకు? నన్ను దయ చూడకుండా ఈ ప్రజలందరి భారం నామీద పెట్టావెందుకు? 12 నేను ఈ ప్రజల తల్లినా? వారిని కన్నది నేనా? నీవు నాతో అంటున్నావు గదా– ‘పాలిచ్చే దాది చంటిబిడ్డను ఎత్తుకొన్నట్టు వీరిని ఎత్తుకో. నేను వారి పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి వీరిని నీ రొమ్మున తీసుకుపో’. 13 ఈ ప్రజలంతా నన్ను చూచి ఏడుస్తూ, ‘తినడానికి మాకు మాంసం ఇవ్వు’ అంటున్నారు. వారికి ఇవ్వడానికి మాంసం నాకెక్కడిది? 14 నేను ఒక్కణ్ణే. ఈ ప్రజలందరినీ భరించలేను. ఈ భారం నా శక్తికి మించినది. 15 ✽నీవు ఈ విధంగా నాపట్ల వ్యవహరించదలిస్తే నన్ను చంపెయ్యి. నన్ను దయ చూస్తే నేను నా దురవస్థను చూడకుండేలా నన్ను చంపి తీరాలి.”
16 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఇస్రాయేల్ ప్రజల పెద్దలలోనుంచి డెబ్భైమందిని నా దగ్గరికి సమకూర్చు. వారు ప్రజల పెద్దలనీ నాయకులనీ నీకు తెలిసినవారై ఉండాలి. వారిని సన్నిధిగుడారం దగ్గరికి తోడుకురా. అక్కడ వారు నీతో కూడా నిలబడాలి. 17 నేను దిగివచ్చి అక్కడ నీతో మాట్లాడుతాను. ఆ పెద్దలను నీమీద ఉన్న ఆత్మలో పాలిభాగస్తులను చేస్తాను. ప్రజల భారం నీవొక్కడివే మోయకుండా దానిని వారు నీతో కూడా భరిస్తారు. 18 నీవు ప్రజలతో ఈ విధంగా చెప్పు: మిమ్ములను మీరు రేపటికి పవిత్రం చేసుకోండి. అప్పుడు మీరు మాంసం తింటారు. యెహోవా సన్నిధానంలో మీరు ఏడుస్తూ ‘మాకెవరు మాంసం పెడతారు? ఈజిప్ట్‌లో మా పరిస్థితులు బాగున్నాయి✽’ అన్నారు. యెహోవా మీకు మాంసమిస్తాడు. మీరు దాన్ని తింటారు. 19 ఒకే రోజు కాదు, రెండు రోజులు కాదు, ఐదు రోజులు కాదు, పది రోజులు కాదు, ఇరవై రోజులు కాదు – 20 పూర్తిగా నెల రోజులు మాంసం తింటారు. అది మీ ముక్కుపుటాల్లోనుంచి వచ్చేవరకూ, మీకు వెగటు✽ అనిపించేవరకూ మాంసం తింటారు. ఎందుకని? మీ మధ్య ఉన్న యెహోవాను మీరు నిరాకరించి ఆయన సన్నిధానంలో ఏడ్చి, ‘ఈజిప్ట్‌నుంచి ఎందుకు వచ్చేశాం’ అని చెప్పుకొన్నారు గనుక.”
21 అందుకు మోషే ఇలా అన్నాడు: “నా చుట్టూరా ఉన్న పాదచారులే ఆరు లక్షలమంది. అయినా వారు నెల రోజులు తినడానికి మాంసం వారికిస్తానన్నావేం! 22 వారికి చాలినన్ని గొర్రెలనూ మేకలనూ పశువులనూ ఎలా వధించగలం? సముద్రంలోని చేపలన్నీ పట్టినా వారికి చాలుతాయా?”
23 ✽యెహోవా మోషేకిచ్చిన జవాబు ఇది: “యెహోవా బాహుబలానికి పరిమితి ఉందా? నా మాట నీపట్ల నెరవేరుతుందో లేదో ఇప్పుడే చూస్తావు”.
24 మోషే బయటికి వెళ్ళి యెహోవా మాటలు ప్రజలకు తెలియజేశాడు. ప్రజల పెద్దలలోనుంచి డెబ్భైమందిని సమకూర్చి దేవుని గుడారం చుట్టూరా నిలబెట్టాడు. 25 అప్పుడు యెహోవా తన మేఘంలో దిగివచ్చి మోషేతో మాట్లాడాడు. మోషే మీద ఉన్న ఆత్మలో ఆ పెద్దలను పాలిభాగస్తులను చేశాడు. ఆ ఆత్మ✽ వారిమీద నిలిచినప్పుడు వారు దేవుని మూలంగా పలికారు✽ గాని తరువాత వారలా పలకలేదు. 26 ఆ పెద్దలలో ఇద్దరు శిబిరంలో ఉండిపోయారు. వారి పేర్లు ఎల్దాదు, మేదాదు. వారు కూడా పెద్దల జాబితాలో నమోదైనవారే గాని దేవుని గుడారందగ్గరికి వారు వెళ్ళలేదు. ఆత్మ వారిమీద కూడా నిలిచినప్పుడు వారు శిబిరంలోనే దేవునిమూలంగా పలికారు. 27 ఒక యువకుడు మోషేదగ్గరికి పరుగెత్తి వచ్చి, “ఎల్దాదు, మేదాదు శిబిరంలో దేవునిమూలంగా పలుకుతున్నారు” అని చెప్పాడు. 28 ✽నూను కొడుకు యెహోషువ చిన్నతనంనుంచీ మోషేకు పరిచర్య చేసేవాడు.
అతడు “మోషే, స్వామీ, వారిని అలా చేయవద్దను” అన్నాడు.
29 ✽అందుకు మోషే “నాకోసం నీకు రోషం వచ్చిందా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలైతే, యెహోవా తన ఆత్మను వారందరిమీదా ఉంచితే ఎంత బాగుండేది!” అన్నాడు. 30 అప్పుడు మోషే, ఇస్రాయేల్ ప్రజల పెద్దలు శిబిరంలోకి వెళ్ళారు.
31 ✽యెహోవా సన్నిధానంనుంచి గాలి బయలుదేరి సముద్రంవైపునుంచి పూరేడుపిట్టలను రప్పించి శిబిరం చుట్టూరా వాటిని పడవేసింది. శిబిరానికి ఇరువైపుల, రోజు ప్రయాణమంత దూరం వరకు, భూమిమీద రెండు మూరల ఎత్తుగా అవి కూలాయి. 32 ప్రజలు లేచి ఆ రోజంతా ఆ రాత్రంతా మరుసటి రోజంతా ఆ పూరేడు పిట్టలను సేకరిస్తూ ఉన్నారు. తక్కువ సేకరించినవాడు సహితం నూరు తూముల పిట్లనుసేకరించాడు. తరువాత వారు తమ కోసం శిబిరం చుట్టూరా వాటిని పరిచారు. 33 ✽ అయితే ఆ మాంసం ఇంకా వారి పళ్ళ సందులలో ఉండగానే, అది నమిలేముందే, యెహోవా కోపాగ్ని ప్రజలమీద రగులుకొంది. యెహోవా వారిమధ్యకు భయంకరమైన అంటురోగాన్ని పంపి వారిని బాధించాడు. 34 ✽పేరాశకు లోనైనవారి శవాలను ప్రజలు అక్కడ పాతిపెట్టారు. అందుకే ఆ స్థలానికి కిబ్రోత్‌హత్తావా✽ అనే పేరు వచ్చింది. 35 ప్రజలు కిబ్రోత్‌హత్తావానుంచి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో ఉండిపోయారు.