10
1 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు: 2 “నీవు సాగగొట్టిన వెండితో రెండు బూరలు చేయించు. సమాజాన్ని సమకూర్చడానికి సేనలు బయలుదేరేలా చేయడానికీ వాటిని వినియోగించాలి. 3 రెండు బూరల ధ్వని వినిపించే టప్పుడు సమాజమంతా సన్నిధిగుడారం ద్వారం ఎదుట నీ దగ్గర సమకూడాలి. 4 ఒకే బూర ఊదితే నాయకులు – ఇస్రాయేల్ గోత్రాల అధిపతులు – మాత్రమే నీ దగ్గర సమకూడాలి. 5 ఆపద సూచకంగా బూర పదే పదే గట్టిగా ఊదితే తూర్పు దిక్కున దిగిన శిబిరాలవారు బయలుదేరాలి. 6 రెండోసారి కూడా అలా ఊదితే దక్షిణ దిక్కున దిగిన శిబిరాలవారు బయలు దేరాలి. వారి ప్రయాణాల కోసం అలా ఊదాలి. 7 సమాజాన్ని సమకూర్చడానికి బూర ఊదాలి గాని అలా పదే పదే ఊదకూడదు. 8 ఆ బూరలు ఊదవలసినది అహరోను కొడుకులైన యాజులు. మీ తరతరాలకు ఇది ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం. 9 మీ దేశంలో మీ పై బడే శత్రువులతో యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఆ బూరలు పదేపదే గట్టిగా ఊదాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ విషయం ఆలోచన చేస్తాడు, మీ శత్రువుల బారినుంచి మిమ్ములను రక్షిస్తాడు. 10 మహోత్సవకాలాలలో, నియామక కాలాలలో, నెలల ఆరంభంలో మీరు హోమాలూ శాంతిబలులూ సమర్పించేటప్పుడు ఆ బూరలు ఊదాలి. అప్పుడవి మీ దేవుని సన్నిధానంలో మీ కోసం స్మృతిచిహ్నంగా ఉంటాయి. నేను యెహోవాను, మీ దేవుణ్ణి”.
11 రెండో సంవత్సరం రెండో నెల ఇరవైయో రోజున మేఘాన్ని శాసనాల దైవనివాసం మీదనుంచి పైకెత్తడం జరిగింది. 12 అప్పుడు ఇస్రాయేల్ ప్రజలు సీనాయి ఎడారి నుండి ప్రయాణాలు చేయసాగారు. తరువాత మేఘం పారాన్ ఎడారిలో నిలిచింది. 13 మోషే ద్వారా యెహోవా ఇచ్చిన మాట ప్రకారం వారు ఆ మొదటి ప్రయాణం చేశారు. 14 ముందు తరలివెళ్ళిన వారు యూదా శిబిర ధ్వజమున్నవారు. వారి సేనల ప్రకారం వారు బయలుదేరారు. ఆ సేనానాయకుడు అమ్మీనాదాబు కొడుకైన నయస్సోను. 15 ఇశ్శాకారు గోత్ర సేనకు నాయకుడు సూయార్ కొడుకైన నెతనేల్. 16 జెబూలూను గోత్ర సేనకు నాయకుడు హేలోను కొడుకైన ఏలీయాబ్. 17 దైవనివాసాన్ని తీసివేసిన తరువాత గెర్షోను వంశస్థులూ మెరారి వంశస్థులూ దానిని మోస్తూ ప్రయాణంలో సాగిపోయారు. 18 రూబేను శిబిర ధ్వజమున్న వారు వారి సేనల ప్రకారం తరలివెళ్ళారు. వాటికి నాయకుడు షెదేయూర్ కొడుకు ఏలీసూర్. 19 షిమ్యోను గోత్ర సేనకు నాయకుడు సూరీషదాయి కొడుకైన షెలుమీయేల్. 20 గాదు గోత్ర సేనకు నాయకుడు దెయువేల్ కొడుకైన ఎలీయాసాఫ్. 21 తరువాత కహాతు వంశస్థులు పవిత్ర వస్తువులను మోస్తూ తరలివెళ్ళారు. దిగేచోటికి వారు చేరేలోగా దైవనివాసాన్ని నిలబెట్టడం జరిగింది. 22 ఎఫ్రాయిం శిబిర ధ్వజమున్న వారు వారి సేనల ప్రకారం తరలివెళ్లారు. వాటికి నాయకుడు అమీహూదు కొడుకైన ఎలీషామా. 23 మనష్షే గోత్ర సేన నాయకుడు పెదాసూర్ కొడుకైన గమాలీయేల్. 24 బెన్యామీను గోత్ర సేనకు నాయకుడు గిద్యోనీ కొడుకైన అబీదాను. 25 దాను శిబిర ధ్వజమున్నవారు తరలివెళ్ళారు. శిబిరాలన్నిటిలో ఆ శిబిరమే చివరిగా తరలివెళ్ళింది. ఆ సేనలకు నాయకుడు అమీషదాయి కొడుకైన అహీయెజెరు. 26 ఆషేరుగోత్ర సేనకు నాయకుడు ఒక్రాను కొడుకైన పగీయేల్. 27 నఫ్తాలిగోత్ర సేనకు నాయకుడు ఏనాను కొడుకైన అహీరా. 28 ఇస్రాయేల్ ప్రజలు ప్రయాణాలలో సాగిపోయినప్పుడు ఈ వరుస ప్రకారం వారి వారి సేనల ప్రకారం తరలివెళ్ళేవారు.
29 మోషే తన మామ కొడుకుతో (అతడి పేరు హోబాబ్‌; అతడు మిద్యాను దేశస్తుడైన రగూయేల్ కొడుకు), “యెహోవా మాకిస్తానని చెప్పిన స్థలానికి మేము పయనిస్తున్నాం. మాతోకూడా రండి. మేము మీకు మేలు చేస్తాం. ఇస్రాయేల్ ప్రజలకు తాను చేయబోయే మేలు విషయం యెహోవా వాగ్దానం చేశాడు” అన్నాడు.
30 అందుకు హోబాబ్ “నేను రాను. నా దేశానికి నా చుట్టాల దగ్గరికి వెళ్తాను” అన్నాడు.
31 మోషే అన్నాడు: “మమ్ములను విడవకండి. ఈ ఎడారిలో మేము దిగవలసిన స్థలాలు మీకు బాగా తెలుసు. మీరు మాకు కళ్ళలాగా ఉంటారు. 32 మీరు మాతోకూడా వస్తే, యెహోవా మాకు చేసే ఉపకారాలలో మేము మిమ్ములను భాగస్వాములను చేస్తాం.”
33 యెహోవా పర్వతంనుంచి వారు మూడు రోజుల ప్రయాణం చేశారు. వారికి విశ్రాంతి స్థలం చూడడానికి ఆ మూడు రోజుల ప్రయాణంలో యెహోవా ఒడంబడికపెట్టె వారికి ముందుగా సాగిపోయింది. 34 వారు దిగిన స్థలంనుంచి సాగినప్పుడు పగటివేళ యెహోవా మేఘం వారికి పైగా ఉంది. 35 ఆ పెట్టె బయలుదేరినప్పుడెల్లా మోషే ఇలా అనేవాడు:
“యెహోవా! లే! నీ శత్రువులు చెదరిపోతారు గాక!
నిన్ను ద్వేషించేవాళ్ళు నీ ముందునుంచి
పారిపోతారు గాక!”
 
36 పెట్టె నిలిస్తే అతడు ఇలా అనేవాడు:
“యెహోవా! వేలాదివేల ఇస్రాయేల్
ప్రజల మధ్యకు మళ్ళీ రా!”