9
1 ఈజిప్ట్‌దేశం నుంచి ఇస్రాయేల్ ప్రజ వచ్చిన తరువాత రెండో సంవత్సరం మొదటి నెల యెహోవా సీనాయి ఎడారిలో మోషేతో ఇలా అన్నాడు: 2 ✝“ఇస్రాయేల్ ప్రజలు పస్కా పండుగను దాని నియామక కాలంలో ఆచరించాలి. 3 ఈ నెల పద్నాలుగో రోజున సాయంకాల సమయంలో దాని నియామక కాలంలో దాని చట్టం, నిర్ణయం ప్రకారం దానిని ఆచరించాలి.”4 అందుచేత “పస్కా పండుగ ఆచరించండి” అని మోషే ఇస్రాయేల్‌ప్రజతో చెప్పాడు. 5 వారు మొదటి నెల పద్నాలుగో రోజున సాయంకాలం సీనాయి ఎడారిలో పస్కా పండుగ ఆచరించారు. యెహోవా మోషేకిచ్చిన ఆజ్ఞ ప్రకారమే ఇస్రాయేల్‌ప్రజలు అంతా చేశారు. 6 ✝అయితే కొంతమంది చనిపోయినవాడి శవాన్ని తాకడం వల్ల అశుద్ధంగా ఉండి ఆ రోజున పస్కాపండుగ ఆచరించలేకపోయారు. గనుక ఆ రోజు వారు మోషే అహరోనుల దగ్గరికి వచ్చి మోషేతో, 7 “చనిపోయినవాడి శవాన్ని తాకడం వల్ల అశుద్ధంగా ఉన్నాం. అయినా మేము యెహోవా అర్పణ దాని నియామక కాలంలో తక్కిన ఇస్రాయేల్‌ప్రజలతో ఎందుకు అర్పించకూడదు? ఈ ఆటంకం ఎందుకు ఉండాలి?” అన్నారు.
8 ✽అందుకు మోషే “ఇక్కడే ఉండండి. మీ విషయం యెహోవా ఏం చెప్తాడో నేను తెలుసుకొంటాను” అన్నాడు.
9 యెహోవా మోషేతో చెప్పినది ఇదే: 10 “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఇలా చెప్పు – మీలో గానీ మీ సంతానంలో గానీ ఎవరైనా శవాన్ని ముట్టడం వల్ల అశుద్ధంగా ఉన్నా, దూర ప్రయాణం మీద ఉన్నా ఆ వ్యక్తి పస్కాపండుగ ఆచరించవచ్చు. 11 ✽అయితే అలాంటివారు రెండో నెల పద్నాలుగో రోజున సాయంకాల సమయంలో దానిని ఆచరించాలి. వారు పస్కాబలిని పొంగని రొట్టెతో చేదుకూర మొక్కలతో తినాలి. 12 వారు మరుసటి ఉదయం వరకు దానిలో కొంచెమైనా మిగలనివ్వకూడదు, దాని ఎముకలలో దేన్నీ విరగ్గొట్టకూడదు. పస్కాపండుగను గురించిన ప్రతి చట్టం అనుసరించి దాన్ని ఆచరించాలి. 13 ✽ఎవరైనా ప్రయాణం చేయకుండా, శుద్ధంగా ఉండి, పస్కాపండుగ ఆచరించకపోతే, ఆ వ్యక్తిని ప్రజలలో లేకుండా చేయాలి. ఆ వ్యక్తి యెహోవా అర్పణ నియామక కాలంలో అర్పించలేదు, గనుక తన అపరాధం తానే భరించాలి.
14 ✝“మీ మధ్య కాపురమున్న విదేశీయుడు యెహోవా పస్కాపండుగ ఆచరించాలనుకొంటే ఆ వ్యక్తి కూడా పస్కా చట్టం, నిర్ణయం ప్రకారం దానిని ఆచరించాలి. విదేశస్తుడు కానివ్వండి, స్వదేశస్తుడు కానివ్వండి, మీ కందరికీ ఒకటే చట్టం ఉండాలి”.
15 ✝దైవనివాసాన్ని నిలబెట్టిన రోజున శాసనాల గుడారమైన దైవనివాసాన్ని దేవుని మేఘం కమ్మింది. సాయంకాలం నుంచి ఉదయం వరకు దైవనివాసం మీద మంటల్లాంటి ప్రకాశం ఉంది. 16 ఎల్లప్పుడూ అలాగే జరిగింది. దైవ నివాసాన్ని మేఘం కమ్మింది. రాత్రివేళ ఆ మేఘం మంటల్లాంటి ప్రకాశంలాగా ఉంది. 17 ✝ఆ మేఘం గుడారం మీద నుండి పైకెక్కినప్పుడెల్లా ఇస్రాయేల్‌ప్రజలు ప్రయాణం కట్టేవారు; మేఘం నిలిచి నప్పుడెల్లా నిలిచిన స్థలంలోనే వారు దిగేవారు. 18 ఇస్రాయేల్‌ప్రజలు యెహోవా మాట ప్రకారమే ప్రయాణాలు చేసేవారు, డేరాలు వేసుకొనేవారు. మేఘం దైవనివాసం మీద నిలిచే రోజులన్నీ వారు ఆగేవారు. 19 మేఘం చాలా రోజులు దైవనివాసం మీద నిలిస్తే ఇస్రాయేల్‌ప్రజలు యెహోవా ఇచ్చిన ఆదేశం పాటించి ప్రయాణం చేసేవారు కారు. 20 మేఘం కొన్ని రోజులు దైవనివాసం మీద నిలిస్తే వారూ నిలిచారు. యెహోవా మాట ప్రకారమే వారు నిలిచేవారు, ప్రయాణం చేసేవారు. 21 మేఘం సాయంకాలం నుంచి ఉదయం వరకు మాత్రమే నిలిస్తే ఉదయం మేఘం పైకెక్కినప్పుడు వారు ప్రయాణం చేశారు. పగలైనా రాత్రి అయినా మేఘం పైకెక్కినప్పుడెల్లా వారు ప్రయాణం చేసేవారు. 22 మేఘం రెండు రోజులు గానీ నెల గానీ సంవత్సరం గానీ ఉండిపోయి దైవనివాసం మీద నిలిస్తే ఇస్రాయేల్ ప్రజలు పయనించకుండా ఉండిపోయేవారు. మేఘం పైకెక్కినప్పుడు మాత్రమే వారు ప్రయాణం చేసేవారు. 23 యెహోవా మాట ప్రకారమే వారు ఉండిపోయేవారు, ప్రయాణం చేసేవారు. మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞననుసరించి యెహోవా ఆదేశం పాటించేవారు.