8
1 యెహోవా మోషేతో 2 ✝“నీవు అహరోనుతో ఈ విధంగా చెప్పు – నీవు దీపాలను వెలిగించేటప్పుడు ఆ ఏడు దీపాల వెలుగు సప్తదీపస్తంభానికి ముందు పడేలా వాటిని వెలిగించాలి” అన్నాడు. అహరోను అలాగే చేశాడు. 3 యెహోవా మోషేకిచ్చిన ఆదేశం ప్రకారం ఆ దీపాల వెలుగు సప్తదీపస్తంభానికి ముందు పడేలా వాటిని ఉంచాడు. 4 ఆ దీపస్తంభం, దాని అడుగునుంచి పుష్పాలవరకు సాగగొట్టిన బంగారంతో చేసినది. అదంతా బంగారమే. యెహోవా తనకు చూపించిన నమూనా✽ ప్రకారమే మోషే ఆ దీపస్తంభాన్ని చేయించాడు.5 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు: 6 ✽“నీవు ఇస్రాయేల్ ప్రజలలో నుంచి లేవీగోత్రికులను ప్రత్యేకించి వారిని శుద్ధి చెయ్యి. 7 ✽వారిని శుద్ధి చేయడానికి నీవు వారికి ఈ విధంగా చేయాలి – పాపశుద్ధిని సూచించే నీళ్ళు వారిమీద చిలకరించు. అప్పుడు వారు మంగలకత్తితో తమ ఒళ్ళంతా గొరిగించుకొని బట్టలు ఉతుక్కొని శుద్ధి చేసుకోవాలి. 8 ✽తరువాత వారు కోడెదూడనూ దానికి సంబంధించిన నైవేద్యాన్నీ – నూనెతో కలిపిన గోధుమపిండి – తేవాలి. నీవు పాపాలకోసమైన బలిగా మరో కోడెదూడను తీసుకురావాలి. 9 ✽ 10 ✽ నీవు యెహోవా సముఖంలో లేవీవారిని నిలబెట్టిన తరువాత వారి మీద ఇస్రాయేల్‌ప్రజలు చేతులు ఉంచాలి. 11 ఇస్రాయేల్‌ప్రజ అర్పించిన కదలిక అర్పణగా యెహోవా సన్నిధానంలో అహరోను లేవీవారిని అటూ ఇటూ కదలిస్తాడు. అప్పటినుంచి వారు యెహోవా సేవ చేస్తారు. 12 లేవీ గోత్రికులు ఆ కోడెల మీద చేతులుంచిన తరువాత నీవు వారి పాపాలను కప్పివేయడానికి ఆ కోడెదూడలలో ఒక దాన్ని పాపాలకోసమైన బలిగా, రెండోదాన్ని హోమంగా యెహోవాకు సమర్పించాలి. 13 నీవు లేవీగోత్రికులను అహరోను ఎదుటా అతడి కొడుకుల ఎదుటా నిలబెట్టి కదలిక అర్పణగా యెహోవా సన్నిధానంలో అటూ ఇటూ కదలించాలి. 14 ✽ ఈ విధంగా నీవు ఇస్రాయేల్‌ప్రజలలో నుంచి లేవీ గోత్రికులను ప్రత్యేకించాలి. లేవీ గోత్రికులు నావారవుతారు.
15 “నీవు లేవీగోత్రికులను శుద్ధి చేసి కదలిక అర్పణగా యెహోవా సముఖంలో అటూ ఇటూ కదలించిన తరువాత వారు సన్నిధిగుడారం సేవ చేయడానికి లోపలికి వెళ్ళవచ్చు. 16 ఇస్రాయేల్ ప్రజల్లో వారు నాకు పూర్తిగా ప్రతిష్ఠ చేయబడ్డవారు. తొలిచూలులకు బదులు, అంటే, ఇస్రాయేల్‌ప్రజలలో మొదట పుట్టినవారందరికీ బదులు – వారిని నేను తీసుకొన్నాను. 17 ఎందుకంటే, ఇస్రాయేల్‌ప్రజల మధ్య మొదట పుట్టిన వారంతా నా వారు, మొదట పుట్టిన పశువులన్నీ నావి. ఈజిప్ట్ దేశంలో మొదట పుట్టిన వారినందరినీ మొదట పుట్టిన వాటన్నిటినీ నాశనం చేసిన రోజున వారినీ వాటినీ నా కోసం ప్రతిష్ఠించు కొన్నాను. 18 ఇస్రాయేల్ ప్రజలలో మొదట పుట్టినవారందరికీ బదులు లేవీ గోత్రికులను తీసుకొన్నాను. 19 ✽ఇస్రాయేల్‌ప్రజలు పవిత్ర గుడారాన్ని సమీపించడంవల్ల వారి మధ్య ఏ విపత్తూ✽ సంభవించకూడదు, గనుక సన్నిధిగుడారంలో వారికోసం సేవ చేయడానికీ వారి పాపాలను కప్పివేయడానికీ లేవీగోత్రికులు నియమించబడ్డవారు. ఇస్రాయేల్‌ప్రజలలో వారిని నేను అహరోనుకూ అతడి కొడుకులకూ ఇచ్చాను.”
20 మోషే, అహరోను, ఇస్రాయేల్‌ప్రజల సర్వసమాజం లేవీ గోత్రికుల పట్ల అలాగే జరిగించారు. లేవీ గోత్రికుల గురించి యెహోవా మోషేకిచ్చిన అన్ని ఆజ్ఞల ప్రకారమే వారిపట్ల ఇస్రాయేల్ ప్రజలు జరిగించారు. 21 లేవీగోత్రికులు తమను శుద్ధి చేసుకొని తమ బట్టలు ఉతుక్కొన్నారు. అహరోను వారిని యెహోవా సన్నిధానంలో కదలిక అర్పణగా అటూ ఇటూ కదలించాడు. వారిని శుద్ధి చేయడానికి అహరోను వారికోసం ప్రాయశ్చిత్తం చేశాడు. 22 ఆ తరువాత లేవీ గోత్రికులు అహరోను ఎదుటా అతడి కొడుకుల ఎదుటా సన్నిధిగుడారంలో సేవ చేయడానికి లోపలికి వెళ్ళారు. యెహోవా లేవీగోత్రికులను గురించి మోషేకిచ్చిన ఆదేశం ప్రకారం వారిపట్ల జరిగించారు.
23 ✽యెహోవా మోషేతో ఇంకా అన్నాడు: 24 “ఇది లేవీ గోత్రికులను గురించిన సంగతి – ఇరవై అయిదేళ్ళు మొదలుకొని పై వయసు ఉన్నవారు సన్నిధిగుడారంలో సేవ చేయడానికి రావాలి. 25 అయితే యాభై ఏళ్ళ వయసు వచ్చినప్పుడు వారు ఆ పని మానుకోవాలి. అప్పటి నుంచి సేవ నిర్వహించరాదు. 26 సన్నిధిగుడారంలో బాధ్యత వహించిన తమ గోత్రంవారికి తోడ్పడవచ్చు గాని, సేవ చేయకూడదు లేవీ గోత్రికుల బాధ్యతల విషయం నీవు వారికి ఇలా నియమించాలి.”