7
1 మోషే దైవనివాసాన్ని నిలబెట్టడం ముగించిన రోజు అతడు దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించాడు. గుడారానికి చెందిన సామానంతా బలిపీఠాన్నీ దాని పాత్రలన్నిటినీ కూడా అభిషేకించి ప్రతిష్ఠించాడు. 2 ఆ రోజున ఇస్రాయేల్ ప్రజల నాయకులు అర్పణలు తెచ్చారు. వారు తమ తమ పూర్వీకుల కుటుంబాలలో ప్రధానులు, గోత్ర ప్రముఖులు, నమోదైన వారిమీద అధిపతులు. 3 వారు తమ తమ అర్పణలు యెహోవా సన్నిధానానికి తీసుకువచ్చారు. వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండినీ, ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క ఎద్దును, మొత్తం ఆరు గూడు బండ్లనూ పన్నెండు ఎద్దులనూ దైవనివాసం ఎదుటికి తీసుకువచ్చారు.
4 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 5 “నీవు వారిదగ్గర ఈ వస్తువులు తీసుకో. అవి సన్నిధిగుడారానికి చెందే సేవకోసం ఉంటాయి. వాటిని లేవీగోత్రికులకు ఇవ్వాలి, వారిలో ఒక్కొక్కడి సేవ ప్రకారం ప్రతివాడికీ ఇవ్వాలి.”
6 మోషే ఆ బండ్లనూ ఎడ్లనూ తీసుకొని లేవీగోత్రికులకు ఇచ్చాడు. 7 అతడు రెండు బండ్లనూ నాలుగు ఎడ్లనూ వారి వారి సేవప్రకారం గెర్షోను వంశంవారికి ఇచ్చాడు. 8 యాజి అయిన అహరోను కొడుకు ఈతామారు చేతి కింద సేవ చేసే మెరారి వంశంవారికి, వారి వారి సేవప్రకారం, అతడు నాలుగు బండ్లనూ ఎనిమిది ఎద్దులనూ ఇచ్చాడు. 9 కహాతు వంశంవారికి మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే, పవిత్ర వస్తువులు తమ భుజాలమీద మోయడమే వారి సేవ. 10 మోషే బలిపీఠాన్ని అభిషేకించిన రోజునే ఆ నాయకులు బలిపీఠం ప్రతిష్ఠకోసం తమ తమ అర్పణలు దాని ఎదుటికి తెచ్చారు. 11 అంతకుముందు యెహోవా మోషేతో, “బలిపీఠాన్ని ప్రతిష్ఠించడానికి నాయకులలో ఒక్కొక్కరు ఒక్కోరోజున తన తన అర్పణలు అర్పించాలి” అన్నాడు.
12 మొదటి రోజున అర్పణ తెచ్చినవాడు అమ్మీనాదాబు కొడుకూ యూదా గోత్రికుడూ అయిన నయస్సోను. 13 అతడు అర్పణగా తెచ్చినవి – వెండి గిన్నె (పవిత్ర స్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూట ముప్ఫయి తులాల బరువుగలది), వెండి పాత్ర (దాని బరువు డెబ్భై తులాలు), నైవేద్యంగా ఆ గిన్నె ఆ పాత్రనిండా నూనెతో కలిపిన గోధుమ పిండి, 14 ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువుగలది), 15 హోమంగా కోడె దూడా పొట్టేలు ఏడాది మగ గొర్రెపిల్లా, 16 పాపాలకోసమైన బలిగా మేకపోతు, 17 శాంతి బలిగా రెండు ఎద్దులూ అయిదు గొర్రెపోతులూ అయిదు మేకపోతులూ అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలూ. ఇది అమ్మీనాదాబు కొడుకు నయస్సోను అర్పణ.
18 రెండో రోజున అర్పణ తెచ్చినవాడు నూయారు కొడుకూ ఇశ్శాకారు గోత్రికులకు నాయకుడూ అయిన నెతనేల్. 19 అతడు అర్పణగా తెచ్చినది వెండి గిన్నె (పవిత్ర స్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూట ముప్ఫయి తులాల బరువు గలది), వెండి పాత్ర (దాని బరువు డెబ్భైతులాలు), నైవేద్యంగా ఆ గిన్నె ఆ పాత్ర నిండా నూనెతో కలిపిన గోధుమ పిండి, 20 ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువుగలది), 21 హోమంగా కోడెదూడా పొట్టేలూ ఏడాది మగ గొర్రెపిల్లా, 22 పాపాల కోసమైన బలిగా మేకపోతు, 23 శాంతిబలిగా రెండు ఎడ్లూ అయిదు గొర్రె పోతులూ అయిదు మేకపోతులూ అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలూ. ఇది సూయారు కొడుకు నెతనేల్ అర్పణ.
24 మూడో రోజున తన అర్పణ తెచ్చినవాడు హేలోను కొడుకూ జెబూలూను గోత్రికులకు నాయకుడూ అయిన ఏలీయాబు. 25 అతడు అర్పణగా తెచ్చినవి వెండి గిన్నె (పవిత్ర స్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూట ముప్ఫయి తులాల బరువు గలది), వెండి పాత్ర (దాని బరువు డెబ్భై తులాలు), నైవేద్యంగా ఆ గిన్నె, ఆ పాత్రనిండా నూనెతో కలిపిన గోధుమ పిండి, 26 ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువు గలది), 27 హోమంగా కోడె దూడా పొట్టేలూ ఏడాది మగ గొర్రెపిల్లా, 28 పాపాలకోసమైన బలిగా మేకపోతు, 29 శాంతి బలిగా రెండు ఎడ్లూ అయిదు గొర్రెపోతులూ అయిదు మేకపోతులూ అయిదు ఏడాది మగ గొర్రె పిల్లలూ. ఇది హేలోను కొడుకు ఏలీయాబు అర్పణ.
30 నాలుగో రోజున అర్పణ తెచ్చినవాడు షేదేయూర్ కొడుకూ రూబేను గోత్రికులకు నాయకుడూ అయిన ఏలీసూర్. 31 అతడు అర్పణగా తెచ్చినవి – వెండి గిన్నె (పవిత్ర స్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూట ముప్ఫయి తులాల బరువుగలది), వెండి పాత్ర (దాని బరువు డెబ్భై తులాలు), నైవేద్యంగా ఆ గిన్నె, ఆ పాత్రనిండా నూనెతో కలిపిన గోధుమపిండి, 32 ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువుగలది), 33 హోమంగా కోడెదూడా పొట్టేలూ ఏడాది మగ గొర్రెపిల్లా, 34 పాపాలకోసమైన బలిగా మేకపోతు, 35 శాంతిబలిగా రెండు ఎడ్లూ అయిదు గొర్రెపోతులూ అయిదు మేకపోతులూ అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలూ. ఇది షేదేయూర్ కొడుకు ఏలీసూర్ అర్పణ.
36 అయిదో రోజున అర్పణ తెచ్చినవాడు సూరీషద్దాయి కొడుకూ షిమ్యోను గోత్రికులకు నాయకుడూ అయిన షెలుమీయేల్. 37 అతడు అర్పణగా తెచ్చినవి వెండి గిన్నె (పవిత్ర స్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూట ముప్ఫయి తులాల బరువుగలది), వెండి పాత్ర (దాని బరువు డెబ్భై తులాలు), నైవేద్యంగా ఆ గిన్నె, ఆ పాత్రనిండా నూనెతో కలిపిన గోధుమపిండి, 38 ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువు గలది), 39 హోమంగా కోడెదూడా పొట్టేలూ ఏడాది మగ గొర్రెపిల్లా, 40 పాపాలకోసమైన బలిగా మేకపోతు, 41 శాంతిబలిగా రెండు ఎడ్లూ అయిదు గొర్రెపోతులూ అయిదు మేకపోతులూ అయిదు ఏడాది మగగొర్రెపిల్లలూ. ఇది సూరీషద్దాయి కొడుకు షెలుమీయేల్ అర్పణ.
42 ఆరో రోజున అర్పణ తెచ్చినవాడు దెయూవేల్ కొడుకూ గాదు గోత్రికులకు నాయకుడూ అయిన ఎలీయాసాఫ్. 43 అతడు అర్పణగా తెచ్చినవి – వెండి గిన్నె (పవిత్రస్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూటముప్ఫయి తులాల బరువుగలది), వెండి పాత్ర (దాని బరువు డెబ్భై తులాలు), నైవేద్యంగా ఆ గిన్నె ఆ పాత్రనిండా నూనెతో కలిపిన గోధుమపిండి, 44 ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువుగలది), 45 హోమంగా కోడెదూడా పొట్టేలూ ఏడాది మగగొర్రెపిల్లా, 46 పాపాలకోసమైన బలిగా మేకపోతు, 47 శాంతిబలిగా రెండు ఎడ్లూ అయిదు గొర్రెపోతులూ అయిదు మేకపోతులూ అయిదు ఏడాది మగగొర్రెపిల్లలూ. ఇది దెయూవేల్ కొడుకు ఎలీయాసాఫ్ అర్పణ.
48 ఏడో రోజు అర్పణ తెచ్చినవాడు అమీహూదు కొడుకూ ఎఫ్రాయిం గోత్రికులకు నాయకుడూ అయిన ఎలీషామా. 49 అతడు అర్పణగా తెచ్చినవి – వెండిగిన్నె (పవిత్రస్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూట ముప్ఫయి తులాల బరువుగలది), వెండి పాత్ర (దాని బరువు డెబ్భై తులాలు), నైవేద్యంగా ఆ గిన్నె, ఆ పాత్రనిండా నూనెతో కలిపిన గోధుమ పిండి, 50 ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువుగలది), 51 హోమంగా కోడెదూడా పొట్టేలూ ఏడాది మగ గొర్రెపిల్లా, 52 పాపాలకోసమైన బలిగా మేకపోతు, 53 శాంతిబలిగా రెండు ఎడ్లూ అయిదు గొర్రెపోతులూ అయిదు మేక పోతులూ అయిదు ఏడాది మగగొర్రెపిల్లలూ. ఇది అమీహూదు కొడుకు ఎలీషామా అర్పణ.
54 ఎనిమిదో రోజున అర్పణ తెచ్చినవాడు పెదాసూర్ కొడుకూ మనష్షే గోత్రికులకు నాయకుడూ అయిన గమాలియేల్. 55 అతడు అర్పణగా తెచ్చినవి – వెండి గిన్నె (పవిత్రస్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూటముప్ఫయి తులాల బరువుగలది), వెండి పాత్ర (దాని బరువు డెబ్భై తులాలు), నైవేద్యంగా ఆ గిన్నె, ఆ పాత్రనిండా నూనెతో కలిపిన గోధుమపిండి, 56 ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువుగలది), 57 హోమంగా కోడెదూడా పొట్టేలూ ఏడాది మగగొర్రెపిల్లా, 58 పాపాలకోసమైన బలిగా మేకపోతు, 59 శాంతిబలిగా రెండు ఎడ్లూ అయిదు పొట్టేళ్ళూ అయిదు మేకపోతులూ అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలూ. ఇది పెదాసూర్ కొడుకు గమాలియేల్ అర్పణ.
60 తొమ్మిదో రోజున అర్పణ తెచ్చినవాడు గిద్యోనీ కొడుకూ బెన్యామీను గోత్రికులకు నాయకుడూ అయిన అబీదాను. 61 అతడు అర్పణగా తెచ్చినవి – వెండి గిన్నె (పవిత్రస్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూట ముప్ఫయి తులాల బరువు గలది). వెండి పాత్ర (దాని బరువు డెబ్భై తులాలు), నైవేద్యంగా ఆ గిన్నె, ఆ పాత్రనిండా నూనెతో కలిపిన గోధుమపిండి, 62 ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువుగలది), 63 హోమంగా కోడెదూడా పొట్టేలూ ఏడాది మగ గొర్రెపిల్లా, 64 పాపాలకోసమైన బలిగా మేకపోతు, 65 శాంతిబలిగా రెండు ఎడ్లూ అయిదు పొట్టేళ్ళు అయిదు మేకపోతులూ అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలూ. ఇది గిద్యోనీ కొడుకు అబీదాను అర్పణ.
66 పదో రోజున అర్పణ తెచ్చినవాడు అమీషదాయి కొడుకూ దాను గోత్రికులకు నాయకుడూ అయిన అహీయెజెరు. 67 అతడు అర్పణగా తెచ్చినవి – వెండి గిన్నె (పవిత్ర స్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూట ముప్ఫయి తులాల బరువు గలది), వెండి పాత్ర (దాని బరువు డెబ్భై తులాలు), నైవేద్యంగా ఆ గిన్నె, ఆ పాత్ర నిండా నూనెతో కలిపిన గోధుమ పిండి, 68 ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువు గలది), 69 హోమంగా కోడెదూడా పొట్టేలూ ఏడాది మగ గొర్రెపిల్లా, 70 పాపాల కోసమైన బలిగా మేకపోతు, 71 శాంతిబలిగా రెండు ఎడ్లూ అయిదు గొర్రెపోతులూ అయిదు మేకపోతులూ అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలూ. ఇది అమీషదాయి కొడుకు అహీయెజెరు అర్పణ.
72 పదకొండో రోజున అర్పణ తెచ్చినవాడు ఒక్రాను కొడుకూ ఆషేరు గోత్రికులకు నాయకుడూ అయిన పగీయేల్. 73 అతడు అర్పణగా తెచ్చినవి – వెండిగిన్నె (పవిత్ర స్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూట ముప్ఫయి తులాల బరువు గలది), వెండి పాత్ర (దాని బరువు డెబ్భై తులాలు), నైవేద్యంగా ఆ గిన్నె, ఆ పాత్రనిండా నూనెతో కలిపిన గోధుమ పిండి, 74 ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువు గలది), 75 హోమంగా కోడెదూడా పొట్టేలూ ఏడాది మగ గొర్రెపిల్లా, 76 పాపాలకోసమైన బలిగా మేకపోతు, 77 శాంతిబలిగా రెండు ఎడ్లూ అయిదు గొర్రెపోతులూ అయిదు మేక పోతులూ అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలూ. ఇది ఒక్రాను కొడుకు పగీయేల్ అర్పణ.
78 పన్నెండో రోజున అర్పణ తెచ్చినవాడు ఏనాను కొడుకూ నఫ్తాలి గోత్రికులకు నాయకుడూ అయిన అహీరా. 79 అతడు అర్పణగా తెచ్చినవి – వెండి గిన్నె (పవిత్ర స్థానం తులం ప్రకారం ఆ గిన్నె నూట ముప్ఫయి తులాల బరువుగలది), వెండి పాత్ర (దాని బరువు డెబ్భై తులాలు), నైవేద్యంగా ఆ గిన్నె ఆ పాత్రనిండా నూనెతో కలిపిన గోధుమ పిండి, 80 ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనం (అది పది తులాల బరువు గలది), 81 హోమంగా కోడెదూడా పొట్టేలూ ఏడాది మగ గొర్రెపిల్లా, 82 పాపాలకోసమైన బలిగా మేకపోతు, 83 శాంతిబలిగా రెండు ఎడ్లూ అయిదు పొట్టేళ్ళూ అయిదు మేకపోతులూ అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలూ. ఇవి ఏనాను కొడుకు అహీర అర్పణ.
84 బలిపీఠాన్ని అభిషేకించిన కాలంలో ఇస్రాయేల్ ప్రజల నాయకులు అర్పించిన బలిపీఠ ప్రతిష్ఠ అర్పణలు ఇవి – పన్నెండు వెండి గిన్నెలూ పన్నెండు వెండి పాత్రలూ పన్నెండు బంగారు పెనాలూ. 85 ప్రతి వెండి గిన్నె నూట ముప్ఫయి తులాలది. ప్రతి పాత్ర డెబ్భై తులాలది. ఆ గిన్నెల, పాత్రల వెండి అంతా, పవిత్ర స్థానం తులం ప్రకారం, రెండు వేల నాలుగు వందల తులాలు. 86 ధూపద్రవ్యంతో నిండిన బంగారు పెనాలు పన్నెండు. పవిత్ర స్థానం తులం ప్రకారం ఒక్కొక్కటి పది తులాలది. పెనాల బంగారమంతా నూట ఇరవై తులాలు. 87 హోమబలి కోడెలన్నీ పన్నెండు, పొట్టేళ్ళు పన్నెండు, ఏడాది మగ గొర్రెపిల్లలు పన్నెండు, వాటికి సంబంధించిన నైవేద్యాలు పన్నెండు. పాపం కోసమైన బలి మేకపోతులు పన్నెండు. 88 శాంతిబలి ఎడ్లు ఇరవై నాలుగు, గొర్రెపోతులు అరవై, మేకపోతులు అరవై, ఏడాది మగ గొర్రెపిల్లలు అరవై. బలిపీఠాన్ని అభిషేకించాక బలిపీఠ ప్రతిష్ఠ అర్పణ ఇదే.
89 మోషే యెహోవాతో మాట్లాడడానికి సన్నిధిగుడారంలోకి వెళ్ళినప్పుడల్లా శాసనాల పెట్టెమీద ఉన్న ప్రాయశ్చిత్తస్థానం మీదనుంచి, ఆ రెండు కెరూబుల రూపాల మధ్యనుంచి, యెహోవా స్వరం అతనికి వినిపించేది. అప్పుడు యెహోవా అతడితో మాట్లాడేవాడు.