6
1 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, “నీవు ఇస్రాయేల్‌ప్రజలతో ఈ విధంగా చెప్పు: 2 ✽ఒక వ్యక్తి నాజీర్‌ను అవుతానని ప్రత్యేకమైన మొక్కుబడి చేస్తాడనుకోండి. పురుషుడు గానీ స్త్రీ గానీ ఎవరైనా యెహోవాకు నాజీర్‌గా తనను ప్రతిష్ఠించుకొంటే ఆ వ్యక్తి ద్రాక్షమద్యం, ప్రతివిధమైన మద్యం మానాలి. 3 ✽పులియబెట్టి చేసిన రసమూ ద్రాక్షరసమూ ద్రాక్షపళ్ళతో చేసిన ఏ పానీయమూ ఆ వ్యక్తి త్రాగకూడదు. ద్రాక్షపండ్లు పచ్చివి గానీ ఎండినవి గానీ తినకూడదు. 4 అతడు నాజీర్‌గా ఉన్న రోజులన్నీ పచ్చి కాయలూ పై తోలూ – ద్రాక్షచెట్టునుంచి వచ్చేదేదీ తినకూడదు. 5 ✽నాజీర్ మొక్కుబడి చెల్లే రోజులన్నీ మంగలకత్తి అతడి తలమీద వేయకూడదు. అతడు యెహోవాకు తనను ప్రతిష్ఠించుకొన్న కాలం ముగిసేవరకు అతడు ప్రత్యేకమైనవాడై ఉండి తన తల వెంట్రుకలను పెరగనివ్వాలి. 6 ✽తనను దేవునికి ప్రతిష్ఠించుకొన్న సంగతికి ఆ చిహ్నం అతడి తలమీద ఉంటుంది, గనుక యెహోవాకు ప్రతిష్ఠించుకొన్న కాలమంతట్లో అతడు ఏ శవాన్నీ సమీపించకూడదు. 7 ✽అతడి తండ్రి గానీ తల్లి గానీ తోడబుట్టినవాడు గానీ తోడబుట్టినది గానీ చనిపోయినా, చనిపోయిన ఆ వ్యక్తిని బట్టి తనను అశుద్ధం చేసుకోకూడదు. 8 అతడు నాజీర్‌గా ఉన్న రోజులన్నీ యెహోవాకు ప్రత్యేకమైనవాడు.9 ✽“ఒకవేళ ఎవరైనా అతడిదగ్గర అకస్మాత్తుగా చనిపోవడంవల్ల అతడి ప్రతిష్ఠితమైన తలవెంట్రుకలు అశుద్ధం అవుతాయి అనుకోండి. ఆ పక్షంలో ఏడు రోజుల తరువాత తాను శుద్ధం అయ్యే రోజున తన తల గొరిగించుకోవాలి. 10 ఎనిమిదో రోజు అతడు రెండు గువ్వలను గానీ రెండు పావురం పిల్లలను గానీ సన్నిధిగుడారం ద్వారం దగ్గరికి యాజిదగ్గరికి తేవాలి. 11 యాజి వాటిలో ఒకదానిని పాపాలకోసమైన బలిగా రెండోదానిని హోమంగా అర్పిస్తాడు. పీనుగును తాకడంవల్ల ఆ వ్యక్తి చేసిన తప్పిదాన్ని యాజి అలా కప్పివేస్తాడు. ఆరోజే అతడి తలను మళ్ళీ ప్రతిష్ఠించాలి. 12 అప్పుడు ఆ వ్యక్తి అపరాధబలిగా ఏడాది మగ గొర్రెపిల్లను తేవాలి. నాజీర్‌గా ఉండే కాలం మళ్ళీ యెహోవాకు ప్రతిష్ఠించాలి. అతడి ప్రతిష్ఠితమైన తల వెంట్రుకలు అశుద్ధమైపోయాయి, గనుక మునుపటి మొక్కుబడి రోజులు లెక్కలోకి రావు.
13 ✽ “ఆ వ్యక్తి నాజీరై ప్రత్యేకంగా ఉన్న రోజులు ముగిసిన తరువాత అతణ్ణి గురించిన ఉపదేశం ఇది: అతడు తన అర్పణ సన్నిధిగుడారం ద్వారం దగ్గరికి తీసుకురావాలి. 14 అతడు యెహోవాకు అర్పించవలసినవి – హోమంగా లోపం లేని ఏడాది మగ గొర్రెపిల్ల, పాపాలకోసమైన బలిగా లోపం లేని ఏడాది ఆడ గొర్రెపిల్ల, శాంతిబలిగా లోపం లేని పొట్టేలు, 15 పొంగజేసేదేదీ లేకుండా, నూనె కలిపిన మెత్తని గోధుమపిండితో చేసిన వంటలతోను నూనె పూసిన అప్పడాలతోను నిండివున్న గంప, వాటి నైవేద్యమూ, పానార్పణమూ. 16 యాజి వాటిని యెహోవా సన్నిధానంలోకి తేవాలి; పాపాలకోసమైన అతడి బలినీ, హోమాన్నీ సమర్పించాలి. 17 ఆ గంపెడు పొంగని వంటలతోపాటు ఆ పొట్టేలును యెహోవాకు శాంతిబలిగా సమర్పించాలి. అతడి నైవేద్యాన్నీ పానార్పణనూ కూడా సమర్పించాలి. 18 ✽అప్పుడా నాజీర్ సన్నిధిగుడారం ద్వారందగ్గర తన ప్రతిష్ఠితమైన తలవెంట్రుకలు గొరిగించుకొని, వాటిని తీసుకొని శాంతిబలిక్రింద ఉన్న నిప్పులో వేయాలి. 19 నాజీర్ తన ప్రతిష్ఠితమైన తలవెంట్రుకలు గొరిగించుకొన్నాక యాజి ఇలా చెయ్యాలి: ఆ పొట్టేలును వండిన తరువాత దాని జబ్బను, ఆ గంపలోనుంచి పొంగని ఒక వంటనూ ఒక అప్పడాన్నీ తీసుకొని నాజీర్ చేతులమీద వాటిని ఉంచాలి. 20 అప్పుడు యాజి వాటిని కదలిక అర్పణగా యెహోవా సన్నిధానంలో అటూ ఇటూ కదల్చాలి. అది కదలిక బోరతో ప్రతిష్ఠితమైన తొడతోపాటు ప్రత్యేకంగా యాజికి చెందుతుంది. ఆ తరువాత నాజీర్ ద్రాక్షరసం తాగవచ్చు.
21 “మొక్కుబడి చేసుకొన్న నాజీర్‌ను గురించిన ఉపదేశం ఇదే. నాజీర్ కావడంచేత అతడు యెహోవాకు సమర్పించవలసినవి ఇవే. దానికంటే ఎక్కువ అర్పించగలిగితే అర్పించవచ్చు. అయితే నాజీర్‌ను గురించిన ఈ ఉపదేశం ప్రకారం అతడు తన మొక్కుబడి నెరవేర్చాలి.” 22 ✽యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 23 “నీవు అహరోనుతోను అతడి కొడుకులతోను ఈ విధంగా చెప్పు: మీరు ఇస్రాయేల్ ప్రజలను ఇలా దీవించాలి.
24 ‘యెహోవా మిమ్ములను దీవించి
కాపాడుతాడు గాక!
25 యెహోవా మీకు తన ముఖకాంతి ప్రకాశించేలా
చేసి మిమ్ములను దయ చూస్తాడు గాక!
26 యెహోవా తన ముఖం మీవైపు తిప్పుకొని
మీకు శాంతి ప్రసాదిస్తాడు గాక!
27 “ఈ విధంగా వారు ఇస్రాయేల్ ప్రజల మీద నా పేరు పలకాలి. నేను ఆ ప్రజలను దీవిస్తాను.”