5
1 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 2 “చర్మంలో అంటువ్యాధి✽ ఉన్న ప్రతి వ్యక్తినీ, స్రావం✽ ఉన్న ప్రతి వ్యక్తినీ శవ స్పర్శ✽వల్ల అశుద్ధంగా ఉన్న ప్రతి వ్యక్తినీ శిబిరం నుంచి పంపివేయాలని ఇశ్రాయేల్‌ప్రజలకు ఆజ్ఞాపించు. 3 నేను వారి శిబిరంమధ్య నివాసం చేస్తున్నాను. వారు తమ శిబిరాన్ని అశుద్ధం చేయకుండేలా అలాంటి మగవారిని గానీ ఆడవారిని గానీ పంపివేయాలి. వారిని శిబిరం వెలుపలికి పంపివేయాలి.”4 ఇస్రాయేల్‌ప్రజలు అలా చేశారు. శిబిరం వెలుపలికి అలాంటి వారిని పంపివేశారు. యెహోవా మోషేకిచ్చిన మాట ప్రకారమే వారు చేశారు.
5 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 6 ✽“నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు: పురుషుడు గానీ స్త్రీ గానీ యెహోవాకు ద్రోహి అయి మనుషులు చేసే పాపాలలో ఏదైనా చేసి అపరాధి అయినప్పుడు, 7 ✽తాను చేసిన పాపం ఆ వ్యక్తి ఒప్పుకోవాలి. అంతేగాక, తన అపరాధంవల్ల కలిగిన నష్టానికి చెల్లు పూర్తిగా చేయాలి. ఆ వ్యక్తి ఎవరి విషయం అపరాధి అయ్యాడో వారికి ఆ చెల్లులో అయిదో భాగాన్ని కూడా ఇవ్వాలి. 8 ✽ఆ అపరాధ నష్టాన్ని తీసుకోవడానికి ఆ మనిషికి రక్తసంబంధి లేకపోవచ్చు. అలాంటప్పుడు ఆ నష్టానికి చేయవలసిన చెల్లు యెహోవాకు చెందుతుంది. అది యాజికి చెందుతుంది. అపరాధి అయిన వ్యక్తి పాపాన్ని కప్పివేసే ప్రాయశ్చిత్తబలి పొట్టేలు కూడా యాజిదవుతుంది. 9 ✝ఇస్రాయేల్‌ప్రజలు యాజికి తెచ్చే ప్రతిష్ఠతమైనవాటిలో ప్రతిదీ యాజిదవుతుంది. 10 ఎవరైనా ఏమైనా యాజికిస్తే అది యాజిదవుతుంది.”
11 ✽యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 12 “నీవు ఇస్రాయేల్‌ప్రజలతో ఈ విధంగా చెప్పు: ఒకడి భార్య తప్పుదారి పట్టి అతడికి ద్రోహం చేసి ఇంకో మనిషితో శయనిస్తుందనుకోండి. 13 ఆమె అలా అశుద్ధం కావడం రహస్యంగా జరిగింది. భర్తకు ఆ సంగతి తెలియదనుకోండి. సాక్షులెవరూ లేరు, ఆమె పట్టుబడలేదు. 14 అశుద్ధంగా ఉన్న తన భార్య విషయం అతడికి ప్రత్యర్థిని గురించిన రోషం కలుగుతుందనుకోండి. ఆమె అలా అశుద్ధం కాకపోయినా అతడికి ప్రత్యర్థిని గురించిన రోషం కలుగుతుందనుకోండి. 15 ఆ పక్షంలో ఆ మనిషి తన భార్యను యాజిదగ్గరికి తీసుకురావాలి. ఆమెకోసం తూమెడు యవలపిండిలో పదోభాగం కూడా తేవాలి. అతడు ఆ పిండిమీద నూనె పోయకూడదు, సాంబ్రాణి వేయకూడదు. ఎందుకంటే అది ప్రత్యర్థిని గురించిన రోషాన్ని సూచించే నైవేద్యం, స్మృతి చిహ్నంగా ఉన్న నైవేద్యం, తప్పిదాన్ని జ్ఞప్తి చేసే నైవేద్యం.
16 “అప్పుడు యాజి ఆమెను ముందుకు తీసుకువచ్చి యెహోవా సన్నిధానంలో నిలబెట్టాలి. 17 అప్పుడు యాజి మట్టికుండలో పవిత్ర జలం పోసి, దైవనివాసంలో నేలనుంచి మట్టి కొంత తీసుకొని ఆ నీళ్ళలో వేయాలి. 18 యాజి ఆ స్త్రీని యెహోవా సన్నిధానంలో నిలబెట్టిన తరువాత ఆమె తల ముసుగు తీసివేయాలి, ప్రత్యర్థిని గురించిన రోషాన్ని సూచించే నైవేద్యం, స్మృతి చిహ్నంగా ఉన్న ఆ నైవేద్యం ఆమె చేతుల్లో ఉంచాలి. శాపాన్ని కలిగించే ఆ చేదు నీళ్ళు యాజి చేతిలో ఉండాలి. 19 అప్పుడు యాజి ఆ స్త్రీ చేత శపథం చేయించి ఆమెతో ఇలా అనాలి – ‘నీవు నీ భర్త ఆధీనంలో ఉన్నప్పుడు మరో పురుషుడు నీతో శయనించకపోతే, నీవు తప్పుదారి పట్టి అశుద్ధ కార్యం చేయకపోతే, శాపాన్ని కలిగించే ఈ చేదు నీళ్ళ ప్రభావంనుంచి విడుదల పొందు. 20 కానీ, నీ భర్త ఆధీనంలో ఉన్నప్పుడు నీవు తప్పుదారి పట్టి అశుద్ధమైతే నీ భర్త గాక మరో పురుషుడు నీతో శయనించివుంటే, 21 నీ తొడలు ముడుచుకుపోయేలా, నీ కడుపు ఉబ్బిపోయేలా యెహోవా చేస్తాడు గాక! అలా నిన్ను నీ ప్రజల్లో శాపానికీ శపథానికీ గురి చేస్తాడు గాక! 22 శాపాన్ని కలిగించే ఈ నీళ్ళు నీ కడుపులోకి పోయి నీ కడుపు ఉబ్బిపోయేలా, నీ తొడలు ముడుచుకుపోయేలా చేస్తాయి.’ యాజి అలా చెప్పి ఆ స్త్రీ చేత శపథ ప్రమాణం చేయించాక ఆ స్త్రీ ‘అలాగే’ అని చెప్పాలి.
23 “అప్పుడు యాజి ఆ శపథాలు పత్రంమీద వ్రాసి పత్రం ఆ నీళ్ళలో ముంచి ఆ వ్రాత కడిగివేయాలి. 24 శాపాన్ని కలిగించే ఆ చేదు నీళ్ళను ఆ స్త్రీ త్రాగేలా చేయాలి. శాపాన్ని కలిగించే ఆ నీళ్ళు ఆమెలోకి పోయి చేదు పుట్టిస్తాయి. 25 తరువాత యాజి ఆ స్త్రీ చేతినుంచి ప్రత్యర్థిని గురించిన రోషాన్ని సూచించే ఆ నైవేద్యాన్ని తీసుకొని దానిని యెహోవా సన్నిధానంలో అటూ ఇటూ కదిలించి బలిపీఠం దగ్గరికి తేవాలి. 26 అక్కడ యాజి ఆ నైవేద్యంలోనుంచి స్మృతి చిహ్నంగా పిడికెడు తీసి బలిపీఠంమీద దాన్ని కాల్చివేయాలి. ఆ తరువాత ఆ స్త్రీ ఆ నీళ్ళు తాగేలా చేయాలి. 27 అతడు ఆమెకు ఆ నీళ్ళు తాగించాక ఈ రెంటిలో ఏదో ఒకటి జరుగుతుంది – ఒకవేళ ఆమె తన భర్తకు ద్రోహం చేసి అశుద్ధమైతే శాపాన్ని కలిగించే ఆ నీళ్ళు ఆమెలోకి చేరి చేదవుతాయి. దానివల్ల ఆమె కడుపు ఉబ్బిపోతుంది, ఆమె తొడలు ముడుచుకుపోతాయి. ఆ స్త్రీ తన ప్రజల మధ్య శాపానికి గురి అవుతుంది. 28 ఆ స్త్రీ అశుద్ధం కాకుండా శుచిగా ఉంటే ఆమెకు ఏ హానీ కలగదు. ఆమెకు సంతాన ప్రాప్తి జరుగుతుంది.
29 “ప్రత్యర్థిని గురించిన రోషం విషయమైన చట్టమిదే. స్త్రీ తన భర్త ఆధీనంలో ఉన్నప్పుడు తప్పుదారి పట్టి అశుద్ధమైతే, 30 ఆ మనిషికి తన భార్యను చూచి ప్రత్యర్థిని గురించిన రోషం కలిగితే అతడు ఆమెను యెహోవా సన్నిధానంలో నిలబెట్టాలి. యాజి ఆమెపట్ల ఈ చట్టం ప్రకారమే చెయ్యాలి. 31 అప్పుడా భర్త నిర్దోషిగా ఉంటాడు. ఆ భార్య తన దోషశిక్ష భరించాలి.”