4
1 యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నాడు: 2,3 “లేవీగోత్రికులలోని కహాతువారిలో ముప్ఫయి ఏళ్ళు మొదలుకొని యాభై ఏళ్ళ వరకు వయసు ఉండి, సన్నిధిగుడారం విషయమైన సేవలో చేరే మగవారి జనాభా లెక్కలు వ్రాయించాలి. వారి వారి వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం వ్రాయించాలి. 4 అతి పవిత్రమైన వాటి విషయంలో సన్నిధిగుడారంలో కహాతువారు చెయ్యవలసిన సేవ ఇదే– 5 ✝ప్రజలు ప్రయాణం అయినప్పుడు అహరోనూ అతడి కొడుకులూ గుడారంలోకి వచ్చి, అడ్డతెర దించి, దానితో శాసనాలపెట్టెను కప్పాలి. 6 దానిమీద గండుచేప చర్మంతో చేసిన కప్పు వేసి, దానిమీద నీలిబట్టను పరచి, ఆ పెట్టె మోత కర్రలను వాటి ఉంగరాలలో దూర్చాలి. 7 ✝సన్నిధి బల్లమీద నీలిబట్టను పరచి, దానిమీద దాని గిన్నెలనూ పెనాలనూ పాత్రలనూ పానార్పణల కోసం కలశాలనూ ఉంచాలి. ఎల్లప్పుడూ ఉంచవలసిన రొట్టెలు దానిమీద ఉండాలి. 8 వాటిమీద ఎర్రని బట్టను పరచి, దానిమీద గండు చేప చర్మంతో చేసిన కప్పు వేసి, దాని మోత కర్రలను వాటి ఉంగరాలలో దూర్చాలి. 9 ✝అప్పుడు నీలిబట్టను తీసుకొని సప్తదీపస్తంభాన్నీ దాని దీపాలనూ దాని కత్తెరనూ దాని కత్తెర చిప్పలనూ దాని సేవలో ఉపయోగించే అన్ని నూనె పాత్రలనూ కప్పాలి. 10 దానిని, దాని సామానంతా గండుచేప చర్మంతో చేసిన కప్పులో పెట్టి, మోత కర్రమీద ఉంచాలి. 11 బంగారు వేదికమీద నీలిబట్ట పరచి, దానిమీద గండుచేప చర్మంతో చేసిన కప్పు వేసి, దాని మోత కర్రలను వాటి ఉంగరాలలో దూర్చాలి. 12 పవిత్ర గుడారంలో తాము ఉపయోగించే పాత్రలన్నీ వారు తీసుకొని నీలిబట్టలో ఉంచి, గండుచేప చర్మంతో కప్పి, వాటిని మోత కర్రమీద ఉంచాలి. 13 ✝బలిపీఠం మీదనుంచి బూడిద తీసివేసి, బలిపీఠంమీద ఊదా బట్టను కప్పాలి. 14 అప్పుడు దాని సేవలో తాము ఉపయోగించే సామానంతా – నిప్పు తెచ్చే పాత్రలూ ముళ్ళూ పారలూ పళ్ళేలూ – దానిమీద పెట్టి గండుచేప చర్మంతో చేసిన కప్పు దానిమీద పరచాలి. దాని మోత కర్రలను వాటి ఉంగరాలలో దూర్చాలి.15 ✝“ప్రజలు ప్రయాణమయినప్పుడు అహరోనూ అతని కొడుకులూ పవిత్రమైనవాటిని, పవిత్రమైన సామానంతటినీ అలా కప్పడం ముగించాక, కహాతువారు వాటిని మోయడానికి రావాలి. అయితే వారు చావకుండేలా పవిత్రమైనవాటిని తాకకూడదు. సన్నిధిగుడారంలో ఉండేవే కహాతువారు మోయవలసినవి. 16 ✝అహరోనుయాజి కొడుకు ఎలియాజరు వీటిని గురించి బాధ్యత వహించాలి – దీపాలకోసం నూనె, పరిమళ ధూపద్రవ్యం, నిత్యమైన నైవేద్యం, అభిషేక తైలం, దైవ నివాసమంతటి విషయం, అది పవిత్రస్థలం కానివ్వండి, దాని సామాను కానివ్వండి– దానిలో ఉన్నవాటన్నిటి విషయం అతడు బాధ్యత వహించాలి.”
17 యెహోవా మోషే అహరోనులతో ఇంకా అన్నాడు, 18 “కహాతు కుటుంబాలు లేవీగోత్రంలో లేకుండా పోవడానికి మీరు కారకులు కాకండి. 19 వారు అతి పవిత్రమైనవాటిని సమీపించేటప్పుడు వారు చావకుండా బ్రతికి ఉండేలా మీరు వారి విషయం ఇలా చెయ్యాలి – అహరోను, అతడి కొడుకులు పవిత్ర స్థలంలోకి వచ్చి, కహాతువారు ప్రతి ఒక్కరికీ పనినీ బరువునూ నియమించాలి, 20 ✝అయితే కహాతువారు చావకుండేలా పవిత్ర స్థలాన్ని ఒక్క క్షణమైనా చూడడానికి లోపలికి రాకూడదు.”
21 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 22,23 “గెర్షోను వారిలో ముప్ఫయి ఏళ్ళు మొదలుకొని యాభై ఏళ్ళవరకు వయసు ఉండి, సన్నిధిగుడారం విషయమైన సేవలో చేరే మగవారి జనాభా లెక్కలు నీవు వ్రాయించాలి. వారి వారి వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం వ్రాయించాలి. 24 గెర్షోను కుటుంబాలవారు చేయవలసిన సేవ, మోయవలసిన బరువులు ఇవే – 25 ✝వారు దైవనివాసం తెరలనూ సన్నిధిగుడారాన్నీ దాని కప్పునూ దానిమీద గండుచేప చర్మంతో చేసిన పైకప్పునూ సన్నిధిగుడారంయొక్క ద్వారం తెరనూ 26 ✝దైవనివాసానికి, బలిపీఠానికి చుట్టూరా ఉండే ఆవరణం తెరలనూ దాని ద్వారం తెరనూ వాటి తాళ్ళనూ వాటి సేవలో ఉపయోగించే సామానంతా వారు మోయాలి. ఆ పని గురించి చేయవలసినదంతా వారు చెయ్యాలి. 27 అహరోను, అతడి కొడుకులు చెప్పిన మాట విని, గెర్షోనువారు పనిచెయ్యాలి; వారి మాట ప్రకారమే గెర్షోనువారు బాధ్యత వహించి బరువులు మోయాలి, చేయవలసిన పని అంతా చెయ్యాలి. వారు మోసే బరువులను నీవు వారికి నియమించాలి. 28 సన్నిధిగుడారం విషయంలో గెర్షోనువారి పని అదే. వారు బాధ్యత వహించి యాజి అయిన అహరోను కొడుకు ఈతామారు చేతిక్రింద ఉండాలి.
29,30 “మెరారివారిలో ముప్ఫయి ఏళ్ళు మొదలుకొని యాభై ఏళ్ళ వరకు వయసు ఉండి, సన్నిధిగుడారం విషయమైన సేవలో చేరే మగవారందరినీ నమోదు చేయించాలి. వారి వారి వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం నమోదు చేయించాలి. 31 వారు బాధ్యత వహించి సన్నిధిగుడారం విషయం చేయవలసిన పని ఇది – వారు దైవనివాసం పలకలనూ దాని అడ్డకర్రలనూ స్తంభాలనూ 32 దిమ్మలనూ గుడారం చుట్టూరా ఉండే ఆవరణ స్తంభాలనూ వాటి దిమ్మలను మేకులనూ త్రాళ్ళనూ వాటి సామానంతా, వాటి పనికి చెందే వాటన్నిటినీ మోయాలి. పేర్ల వరుస ప్రకారం ఒక్కొక్కరు మోయవలసిన బరువులను నీవు నియమించాలి. 33 మెరారి కుటుంబాలవారు సన్నిధిగుడారం విషయం చేయవలసిన పని అంతా ఇదే. యాజి అయిన అహరోను కొడుకు ఈతామారు చేతిక్రింద వారు పని చెయ్యాలి”.
34,35 కహాతువారిలో ముప్ఫయి ఏళ్ళు మొదలుకొని యాభై ఏళ్ళవరకు వయసు ఉండి, సన్నిధి గుడారానికి చెందిన సేవలో చేరే మగవారందరినీ మోషే అహరోనులూ సమాజ నాయకులూ నమోదు చేయించారు. వారి వారి వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం వారిని నమోదు చేయించారు. 36 వారి వారి వంశాల ప్రకారం వారిలో నమోదైన వారి సంఖ్య రెండు వేల ఏడు వందల యాభై. 37 కహాతు వంశస్థులలో నమోదై సన్నిధిగుడారానికి చెందిన సేవలో చేరినవారి సంఖ్య అదే. యెహోవా మోషేతో ఇప్పించిన ఆజ్ఞప్రకారం మోషే అహరోనులు వారిని నమోదు చేయించారు.
38 గెర్షోనువారిని కూడా వారి వారి వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం నమోదు చేయించారు. 39 వారిలో ముప్ఫై ఏళ్ళు మొదలుకొని యాభై ఏళ్ళవరకు వయసు ఉండి, సన్నిధిగుడారానికి చెందే సేవలో చేరి, 40 నమోదైన వారి సంఖ్య రెండు వేల ఆరు వందల ముప్ఫయి. వారి వారి వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం నమోదయ్యారు. 41 గెర్షోను వంశస్థులలో నమోదైనవారై సన్నిధిగుడారానికి చెందే సేవలో చేరిన వారి సంఖ్య అదే. యెహోవా మోషేచేత ఇప్పించిన ఆజ్ఞప్రకారం మోషే అహరోనులు వారిని నమోదు చేయించారు.
42 మెరారివారిని కూడా వారి వారి వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం నమోదు చేయించారు. 43 వారిలో ముప్ఫయి ఏళ్ళు మొదలుకొని యాభై ఏళ్ళవరకు వయసు ఉండి, సన్నిధిగుడారానికి చెందే సేవలో చేరి, 44 నమోదైనవారి సంఖ్య మూడు వేల రెండు వందలు. వారి వారి వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం నమోదయ్యారు. 45 మెరారి వంశస్థులలో నమోదైనవారి సంఖ్య అదే. యెహోవా మోషేద్వారా ఇచ్చిన ఆజ్ఞప్రకారం మోషే అహరోనులు వారిని నమోదు చేయించారు.
46-48 లేవీగోత్రికులలో ముప్ఫయి ఏళ్ళు మొదలుకొని యాభై ఏళ్ళవరకు వయసు ఉండి, నమోదైనవారి సంఖ్య ఎనిమిది వేల అయిదు వందల ఎనభై. తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం వారిని మోషే అహరోనులూ ఇస్రాయేల్‌ప్రజల నాయకులూ లెక్కించారు. వారు సన్నిధిగుడారానికి చెందే సేవలో, బరువులను మోసేపనిలో చేరినవారు. 49 యెహోవా ఇచ్చిన ఆజ్ఞప్రకారం మోషేచేత వారు నమోదయ్యారు. వారిలో ప్రతి ఒక్కరూ చేయవలసిన సేవ, మోయవలసిన బరువు ప్రకారం నమోదయ్యారు. యెహోవా మోషేకిచ్చిన ఆజ్ఞప్రకారమే ఇదంతా జరిగింది.