3
1 యెహోవా సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడిన కాలంలో అహరోను మోషేల వంశవృక్షాలు ఇవి: 2 అహరోను కొడుకుల పేర్లు నాదాబు (మొదట పుట్టినవాడు), అబీహు, ఎలియాజరు, ఈతామారు. 3 యాజులుగా అభిషేకం పొందిన అహరోను కొడుకుల పేర్లు అవే. అతడు వారిని యాజులుగా ప్రతిష్ఠించాడు. 4 నాదాబు, అబీహు సీనాయి ఎడారిలో యెహోవా సన్నిధానంలో నిషిద్ధమైన నిప్పు అర్పించినందుకు వారు యెహోవా సన్నిధానంలో చచ్చారు. వారికి సంతానం కలుగలేదు. తరువాత ఎలియాజరు, ఈతామారు వారి తండ్రి అహరోను ఎదుట యాజులుగా సేవ చేసేవారు.
5 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 6 “లేవీగోత్రికులను తీసుకువచ్చి అహరోను ఎదుట నిలబెట్టు. వారు అతడికి పరిచారకులుగా ఉండాలి. 7 వారు సన్నిధిగుడారం ఎదుట దైవనివాసానికి సంబంధించిన సేవ పూనుకొని అహరోనుకోసం సమాజమంతటికీ సేవ చేస్తారు. 8 వారు దైవ నివాసానికి సంబంధించిన సేవ పూనుకొని ఇస్రాయేల్ ప్రజల కోసం సన్నిధిగుడారం సామానంతా కాపాడాలి. 9 నీవు లేవీగోత్రికులను అహరోనుకూ అతడి కొడుకులకూ నియమించాలి. వారు ఇస్రాయేల్ ప్రజలలోనుంచి అహరోనుకు నియమితమైనవారు. 10 నీవు అహరోనుకూ అతడి కొడుకులకూ యాజి పదవి అప్పగించాలి. వారే దాన్ని నిర్వహించాలి. దాన్ని చేయడానికి ఇంకెవరైనా సమీపిస్తే అతడు మరణశిక్షకు గురికావాలి.”
11 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు: 12 “ఈజిప్ట్ దేశస్థులలో మొదట పుట్టినవారినందరినీ నేను నాశనం చేసిన రోజున ఇస్రాయేల్‌ప్రజలలో మొదట పుట్టినవారందరినీ, వారి పశువులలో మొదట పుట్టినవాటన్నిటినీ నా కోసం ప్రతిష్ఠ చేసుకొన్నాను. వారు నావారు, అవి నావి. నేను యెహోవాను. 13 ఇప్పుడు నేను ఇస్రాయేల్ ప్రజలలో మొదట పుట్టినవారందరికి బదులుగా లేవీ గోత్రికులను ఎన్నుకొంటున్నాను. లేవీగోత్రికులు నావారు.”
14 సీనాయి ఎడారిలో యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 15 “లేవీగోత్రికులను వారి వారి పూర్వీకుల కుటుంబాల, వంశాల ప్రకారం నమోదు చేయించు. ఒక నెల మొదలుకొని పై వయసు గల మగవారందరినీ నమోదు చేయించు.”
16 యెహోవా ఇచ్చిన ఆ ఆజ్ఞ ప్రకారమే మోషే వారిని నమోదు చేయించాడు. 17 లేవీ కొడుకుల పేర్లు ఇవి: గెర్షోను, కహాతు, మెరారి. 18 గెర్షోనువారి వంశకర్తల పేర్లు లిబ్నీ, షిమీ. 19 కహాతు వారి వంశకర్తల పేర్లు అమ్రాం, ఇసహారు, హెబ్రోను, ఉజ్జీయేల్. 20 మెరారివారి వంశకర్తల పేర్లు మాహలి, మూషి. వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం ఇవి లేవీ గోత్రికుల వంశాలు.
21 గెర్షోను వంశస్థులు లిబ్నీవారు, షిమీవారు. గెర్షోను వంశంవారు వీరే. 22 వారిలో ఒక నెల మొదలుకొని పై వయసు ఉండి నమోదైన మగవారందరి సంఖ్య ఏడు వేల అయిదు వందలు. 23 గెర్షోనువారి కుటుంబాలు దైవనివాసం వెనుక, అంటే పడమటి దిక్కున మకాం చేయవలసినవారు. 24 గెర్షోనువారికి నాయకుడు లాయేల్ కొడుకు ఎబయాసాఫ్. 25 వారు సన్నిధిగుడారంలో వీటికోసం బాధ్యత వహించ వలసినవారు – దైవనివాసం, దాని పైకప్పు, సన్నిధిగుడారం ద్వారానికి ఉన్న తెర, 26 ఆవరణ అడ్డతెరలు, దైవనివాసానికి బలిపీఠానికి చుట్టూరా ఉన్న ఆవరణద్వారం తెర, దాని త్రాళ్ళన్నీ.
27 కహాతు వంశస్థులు అమ్రాంవారు, ఇసహారువారు, హెబ్రోనువారు, ఉజ్జీయేల్‌వారు. కహాతు వంశంవారు వీరే. 28 వారిలో ఒక నెల మొదలుకొని పై వయసు ఉండి నమోదైనవారి సంఖ్య ఎనిమిది వేల ఆరు వందలు. వారు పవిత్ర స్థలంలోని వస్తువుల కోసం బాధ్యత వహించేవారు. 29 కహాతు కుటుంబాలు దైవనివాసం ప్రక్కన దక్షిణదిక్కుగా మకాం చేయవలసినవారు. 30 కహాతువారి నాయకుడు ఉజ్జీయేల్ కొడుకు ఎలీషాపాను. 31 వారు బాధ్యత వహించవలసినవి ఏవంటే పెట్టె, బల్ల, సప్తదీపస్తంభం, వేదికలు, యాజులు సేవలో వినియోగించే పవిత్ర స్థల పాత్రలు, అడ్డతెర, దాని సేవకోసమైన సామానంతా. 32 అహరోనుయాజి కొడుకు ఎలియాజరు లేవీవారి నాయకులకు నాయకుడు. పవిత్ర స్థలం విషయం బాధ్యత వహించేవారిమీద అతడు పైవిచారణకర్త.
33 మెరారి వంశస్థులు మాహలివారు, మూషివారు. మెరారి వంశంవారు వీరే. 34 వారిలో ఒక నెల మొదలుకొని పై వయసు ఉండి నమోదైన మగవారందరి సంఖ్య ఆరు వేల రెండు వందలు. 35 మెరారివారి నాయకుడు అబీహాయిల్ కొడుకు సూరీయేల్. వారు దైవనివాసం దగ్గర ఉత్తరదిక్కున మకాం చేయవలసినవారు. 36 మెరారివారు బాధ్యత వహించవలసినవి ఏవంటే దైవనివాసం పలకలు, దాని అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు, దానికి చెందిన అలాంటి సామానంతా, 37 దాని చుట్టూరా ఉన్న ఆవరణ స్తంభాలు, వాటి దిమ్మలు, వాటి మేకులు, వాటి త్రాళ్ళు.
38 దైవనివాసం ఎదుట, తూర్పుదిక్కున, సన్నిధిగుడారం ముందుగా, పొద్దు పొడిచే దిక్కున మకాం చేయవలసినవారు మోషే, అహరోను, అహరోను కొడుకులు. వీరు పవిత్ర స్థలం విషయం ఇస్రాయేల్‌ప్రజలకోసం బాధ్యత వహించవలసినవారు. ఇంకెవడైనా పవిత్ర స్థలాన్ని సమీపిస్తే ఆ వ్యక్తి మరణశిక్ష పొందాలి.
39 యెహోవా మాట ప్రకారం మోషే అహరోనులు వారి వారి వంశాల ప్రకారం నమోదు చేయించిన లేవీగోత్రికుల సంఖ్య – అంటే ఒక నెల మొదలుకొని పైవయసు ఉన్న మగవారందరి సంఖ్య ఇరవై రెండు వేలు.
40 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఇస్రాయేల్ ప్రజలలో ఒక నెల మొదలుకొని పై వయసు ఉండి, మొదట పుట్టిన మగవారందరి పేర్లు నమోదు చేయించు. వారి సంఖ్యను వ్రాయించు. 41 ఇస్రాయేల్ ప్రజలలో మొదట పుట్టిన మగవారందరికి బదులుగా నీవు నాకోసం లేవీ గోత్రికులను ఎన్నుకోవాలి. పశువులలో మొదట పుట్టినవాటికి బదులుగా లేవీ వారి పశువులను ఎన్నుకోవాలి. నేను యెహోవాను”.
42 యెహోవా ఇచ్చిన ఆజ్ఞప్రకారం మోషే ఇస్రాయేల్ ప్రజలలో మొదట పుట్టిన వారందరినీ నమోదు చేయించాడు. 43 వారిలో నమోదైన వారి సంఖ్య – అంటే, ఒక నెల మొదలుకొని పై వయసు ఉండి, మొదట పుట్టిన మగవారందరి సంఖ్య ఇరవై రెండు వేల రెండు వందల డెబ్భైమూడు.
44 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 45 “ఇస్రాయేల్‌ప్రజలలో మొదట పుట్టినవారందరికి బదులుగా లేవీగోత్రికులను, వారి పశువులకు బదులుగా లేవీగోత్రికుల పశువులను ఎన్నుకో. లేవీగోత్రికులు నా వారై ఉంటారు. నేను యెహోవాను. 46 ఇస్రాయేల్ ప్రజలలో మొదట పుట్టినవారిలో లేవీవారికంటే రెండు వందల డెబ్భై ముగ్గురు ఎక్కువయ్యారు. వెల ఇచ్చి ఆ ఎక్కువైనవారిని విడిపించాలి. 47 ఒక్కొక్కరికి అయిదేసి తులాల వెండి నీవు తీసుకోవాలి. అది పవిత్రస్థానం తులం ప్రకారం ఉండాలి. ఆ తులం ముప్ఫయి చిన్నాలు. 48 వారిలో ఎక్కువైనవారి విడుదలకోసం జమ చేసిన డబ్బు, అహరోనుకూ అతడి కొడుకులకూ ఇవ్వాలి.”
49 కనుక లేవీవారు విడిపించినవారికంటే ఆ ఎక్కువైనవారి విడుదల డబ్బును మోషే వసూలు చేశాడు. 50 పవిత్రస్థానం తులం ప్రకారం వేయి మూడు వందల అరవై ఐదు తులాలు ఇస్రాయేల్ ప్రజలలో మొదట పుట్టిన వారి దగ్గర తీసుకొన్నాడు. 51 యెహోవా మోషేకిచ్చిన ఆజ్ఞప్రకారం, యెహోవా చెప్పినట్టే, అతడు అహరోనుకూ అతడి కొడుకులకూ ఆ విడుదల డబ్బును ఇచ్చాడు.