2
1 ✽యెహోవా మోషే అహరోనులతో ఇంకా అన్నాడు, 2 “ఇస్రాయేల్‌ప్రజలలో ఒక్కొక్కరూ వారి వారి పూర్వీకుల కుటుంబాల టెక్కేల దగ్గర, వారి వారి ధ్వజాల క్రింద డేరాలు వేసుకోవాలి. వారు సన్నిధిగుడారానికి కొంత దూరంలో దాని చుట్టూరా దిగాలి. 3 పొద్దు పొడిచే తూర్పుదిక్కున యూదా శిబిర ధ్వజం ఉన్నవారు వారి వారి సేన ప్రకారం దిగాలి. యూదా గోత్రికులకు నాయకుడు అమ్మీనాదాబు కొడుకైన నయస్సోను. 4 అతడి సేనలో నమోదైనవారు డెబ్భై నాలుగు వేల ఆరు వందలమంది. 5 యూదా గోత్రానికి దగ్గర ఇశ్శాకారు గోత్రం దిగాలి. ఇశ్శాకారు గోత్రికులకు నాయకుడు సూయారు కొడుకైన నెతనేల్. 6 అతడి సేనలో నమోదైనవారు యాభై నాలుగు వేల నాలుగు వందల మంది. 7 జెబూలూను గోత్రికులకు నాయకుడు హేలోను కొడుకైన ఏలీయాబు. 8 అతడి సేనలో నమోదైనవారి సంఖ్య యాభైయేడు వేల నాలుగు వందలు. 9 యూదా శిబిరంలో నమోదైనవారి సంఖ్య, వారి సేనల ప్రకారం మొత్తం లక్ష ఎనభైయారు వేల నాలుగు వందలు. ప్రయాణంలో వారు ముందుగా బయలుదేరి వెళ్ళాలి.10 “రూబేను శిబిర ధ్వజం ఉన్నవారు వారి వారి సేనల ప్రకారం దక్షిణ దిక్కున ఉండాలి. రూబేను గోత్రికులకు నాయకుడు షెదేయూర్ కొడుకు ఎలీసూరు. 11 అతడి సేనలో నమోదైనవారి సంఖ్య నలభై ఆరు వేల అయిదు వందలు. 12 రూబేను గోత్రానికి దగ్గర షిమ్యోను గోత్రం దిగాలి. షిమ్యోను గోత్రికులకు నాయకుడు సూరీషదాయి కొడుకు షెలుమీయేల్. 13 అతడి సేనలో నమోదైనవారి సంఖ్య యాభైతొమ్మిది వేల మూడు వందలు. 14 గాదు గోత్రికులకు నాయకుడు రగూయేల్ కొడుకు ఏలియాపాను. 15 అతడి సేనలో నమోదైనవారి సంఖ్య నలభై అయిదువేల ఆరు వందల యాభై. 16 రూబేను శిబిరంలో నమోదైనవారి సంఖ్య వారి సేనల ప్రకారం మొత్తం లక్ష యాభై ఒక్క వేల నాలుగు వందల యాభై. వారు రెండో గుంపుగా బయలుదేరి వెళ్ళాలి.
17 “లేవీ శిబిరం సన్నిధి గుడారంతో ఇతర శిబిరాల మధ్య బయలుదేరి వెళ్ళాలి. వారు ఏ విధంగా దిగుతారో ఆ విధంగా వారి వారి ధ్వజాల ప్రకారం ఒక్కొక్కరూ వారి వారి వరుసలో బయలుదేరి వెళ్ళాలి.
18 “ఎఫ్రాయిం శిబిర ధ్వజం ఉన్నవారు వారి వారి సేనల ప్రకారం పడమటి దిక్కున ఉండాలి. ఎఫ్రాయిం గోత్రికులకు నాయకుడు అమీహూదు కొడుకు ఎలీషామా. 19 అతడి సేనలో నమోదైన వారి సంఖ్య నలభై వేల అయిదు వందలు. 20 ఎఫ్రాయిం గోత్రానికి దగ్గర మనష్షే గోత్రం ఉండాలి. మనష్షే గోత్రికులకు నాయకుడు పెదాసూరు కొడుకు గమలీయేల్. 21 అతడి సేనలో నమోదైనవారి సంఖ్య ముప్ఫయి రెండు వేల రెండు వందలు. 22 బెన్యామీను గోత్రికులకు నాయకుడు గిద్యోనీ కొడుకు అబీదాను. 23 అతడి సేవలో నమోదైనవారి సంఖ్య ముప్ఫయి అయిదు వేల నాలుగు వందలు. 24 ఎఫ్రాయిం శిబిరంలో నమోదైనవారి సంఖ్య, వారి సేనల ప్రకారం మొత్తం లక్ష ఎనిమిది వేల ఒక వంద. వారు మూడో గుంపుగా బయలుదేరి వెళ్ళాలి.
25 “దాను శిబిర ధ్వజం ఉన్నవారు వారి సేనల ప్రకారం ఉత్తర దిక్కున ఉండాలి. దాను గోత్రికులకు నాయకుడు అమీషదాయి కొడుకు అహీయెజెరు. 26 అతడి సేనలో నమోదైనవారి సంఖ్య అరవై రెండు వేల ఏడు వందలు. 27 దాను గోత్రానికి దగ్గర ఆషేరు గోత్రం దిగాలి. ఆషేరు గోత్రికులకు నాయకుడు ఒక్రాను కొడుకు పగీయేల్. 28 అతడి సేనలో నమోదైనవారి సంఖ్య నలభై ఒక వేయి అయిదు వందలు. 29 నఫ్తాలి గోత్రికులకు నాయకుడు ఏనాను కొడుకు అహీర. 30 అతడి సేనలో నమోదైనవారి సంఖ్య యాభై మూడు వేల నాలుగు వందలు. 31 దాను శిబిరంలో నమోదైనవారి సంఖ్య మొత్తం లక్ష యాభై ఏడు వేల ఆరు వందలు. వారు వారి ధ్వజాల ప్రకారం చివరి గుంపుగా బయలుదేరి వెళ్ళాలి.”
32 వీరు వారి వారి పూర్వీకుల వంశాల ప్రకారం ఇస్రాయేల్ ప్రజలలో నమోదైనవారు. వారి వారి సేనల ప్రకారం వారి వారి శిబిరాలలో నమోదైనవారి సంఖ్య మొత్తం ఆరు లక్షల మూడు వేల అయిదు వందల యాభై. 33 ✝అయితే యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం లేవీ గోత్రికులు ఇస్రాయేల్ ప్రజలలో తమ పేర్లు నమోదు చేయించుకోలేదు.
34 ఆ విధంగా, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టెల్లా ఇస్రాయేల్ ప్రజలు చేశారు. వారి వారి వంశాలు, పూర్వీకుల కుటుంబాల ప్రకారం ఒక్కొక్కరూ వారి వారి ధ్వజాల దగ్గర డేరాలు వేసేవారు, బయలుదేరి వెళ్ళేవారు.