సంఖ్యాకాండం (ఎడారి ప్రయాణాలు)
1
1 ఇస్రాయేల్‌ప్రజలు ఈజిప్ట్‌దేశంనుంచి వచ్చిన రెండో సంవత్సరం రెండో నెల మొదటి తేది, సీనాయి ఎడారిలో సన్నిధిగుడారం✽లో, యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 2 ✽“ఇస్రాయేల్ సర్వసమాజ జనాభా లెక్కలు వారి వారి వంశాల ప్రకారం, వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం, నీవూ అహరోనూ వ్రాయించాలి. 3 ఇస్రాయేల్ ప్రజలలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి యుద్ధానికి వెళ్ళతగ్గ మగవారందరి పేర్లు, వారి వారి సేనల ప్రకారం నమోదు చేయాలి. 4 మీరు అలా చేసేటప్పుడు ఒక్కొక్క గోత్రంలో తన పూర్వీకుల కుటుంబంలో, ఒక్కొక్క నాయకుడు మీతోకూడా ఉండాలి. 5 మీకు తోడ్పడవలసిన ఆ మనుషుల పేర్లు ఇవి: రూబేను గోత్రంలో షెదేయూర్ కొడుకు ఏలీసూర్; 6 షిమ్యోను గోత్రంలో సూరీషద్దయి కొడుకు షెలుమీయేల్; 7 యూదా గోత్రంలో అమ్మీనాదాబు కొడుకు నయస్సోను; 8 ఇశ్శాకారు గోత్రంలో సుయారు కొడుకు నెతనేల్; 9 జెబులూను గోత్రంలో హేలోను కొడుకు ఏలీయాబు; 10 యోసేపు సంతానంలో, అంటే ఎఫ్రాయిం గోత్రంలో అమీహూదు కొడుకు ఎలీషామా, మనష్షే గోత్రంలో పెదాసూరు కొడుకు గమలీయేల్; 11 బెన్యామీను గోత్రంలో గిద్యోనీ కొడుకు అబీదాను; 12 దాను గోత్రంలో అమీషద్దాయి కొడుకు అహీయెజరు; 13 ఆషేరు గోత్రంలో ఒక్రాను కొడుకు పగీయేల్; 14 గాదు గోత్రంలో దెయూవేల్ కొడుకు ఎలాసాఫ్; 15 నఫ్తాలి గోత్రంలో ఏనాను కొడుకు అహీరా.16 వీరు సమాజంలో పేరు పొందినవారు, వారి వారి పూర్వీకుల గోత్రాలలో ప్రధానులు, ఇస్రాయేల్ వంశాలకు పెద్దలు. 17 ఆ పేర్లున్నవారిని మోషే అహరోనులు పిలిచి, రెండో నెల మొదటి తేది సర్వసమాజాన్ని సమకూర్చారు. 18 ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయస్సు ఉన్నవారు వారి వారి వంశాల ప్రకారం, వారి వారి వంశాలనూ పూర్వీకుల కుటుంబాలనూ పేర్లనూ సంఖ్యనూ తెలియజేశారు. 19 యెహోవా అతడికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే సీనాయి ఎడారిలో మోషే వారిని లెక్కించాడు.
20 ఇస్రాయేల్‌కు పెద్ద కొడుకు రూబేను సంతానంలో ఇరవై ఏళ్లు మొదలుకొని పై వయసు ఉండి యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు. 21 రూబేను గోత్రంలో అలాంటివారి సంఖ్య నలభై ఆరు వేల అయిదు వందలు.
22 షిమ్యోను సంతానంలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు. 23 షిమ్యోను గోత్రంలో అలాంటి వారి సంఖ్య యాభై తొమ్మిది వేల మూడు వందలు.
24 గాదు సంతానంలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు. 25 గాదు గోత్రంలో అలాంటి వారి సంఖ్య నలభై అయిదు వేల ఆరు వందల యాభై.
26 యూదా సంతానంలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు. 27 యూదా గోత్రంలో అలాంటివారి సంఖ్య డెభ్భైనాలుగు వేల ఆరు వందలు.
28 ఇశ్శాకారు సంతానంలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు. 29 ఇశ్శాకారు గోత్రంలో అలాంటివారి సంఖ్య యాభైనాలుగు వేల నాలుగు వందలు.
30 జెబూలూను సంతానంలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు. 31 జెబులూను గోత్రంలో అలాంటి వారి సంఖ్య యాభై ఏడు వేల నాలుగు వందలు.
32 యోసేపు సంతానంలో, అంటే ఎఫ్రాయిం సంతానంలో, ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు. 33 ఎఫ్రాయిం గోత్రంలో అలాంటి వారి సంఖ్య నలభై వేల అయిదు వందలు.
34 మనష్షే సంతానంలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు. 35 మనష్షే గోత్రంలో అలాంటి వారి సంఖ్య ముప్ఫయి రెండువేల రెండు వందలు.
36 బెన్యామీను సంతానంలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు. 37 బెన్యామీను గోత్రంలో అలాంటివారి సంఖ్య ముఫ్పై అయిదు వేల నాలుగు వందలు.
38 దాను సంతానంలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు. 39 దాను గోత్రంలో అలాంటివారి సంఖ్య అరవై రెండు వేల ఏడు వందలు.
40 ఆషేరు సంతానంలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళతగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు. 41 ఆషేరు గోత్రంలో అలాంటివారి సంఖ్య నలభై ఒక్క వేల అయిదు వందలు.
42 నఫ్తాలి సంతానంలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళ తగ్గ పురుషులు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు. 43 నఫ్తాలి గోత్రంలో అలాంటి వారి సంఖ్య యాభై మూడు వేల నాలుగు వందలు.
44 వీరు నమోదైనవారు. నమోదు చేసినది మోషే, అహరోను, ఇస్రాయేల్‌ప్రజలలో తమ తమ పూర్వీకుల కుటుంబాలకు ప్రతినిధులుగా ఉన్న పన్నెండుగురు ప్రధానులు. 45 ఇస్రాయేల్‌ప్రజలలో ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, యుద్ధానికి వెళ్ళతగ్గవారు తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం నమోదయ్యారు. 46 ✝నమోదయిన వారందరి సంఖ్య ఆరు లక్షల మూడు వేల అయిదు వందల యాభై.
47 ✽అయితే లేవీగోత్రికులు తమ పూర్వీకుల గోత్రం ప్రకారం వారితో పాటు నమోదు కాలేదు. 48 అంతకు ముందు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 49 “నీవు లేవీ గోత్రాన్ని నమోదు చేయకూడదు. ఇస్రాయేల్‌ప్రజ జనాభా లెక్కించేటప్పుడు వారి జనాభా లెక్కించకూడదు. 50 శాసనాల గుడారం మీద, దాని సామానంతటిమీద, దానికి చెందిన వాటన్నిటిమీద లేవీ గోత్రికులను నియమించు. వారే దైవనివాసాన్ని, దాని సామానంతా మోయాలి. వారు దైవనివాసాన్ని చూచుకోవాలి. దాని చుట్టూరా తమ డేరాలు వేసుకోవాలి. 51 ✽బయలుదేరే సమయంలో లేవీవారే దైవనివాసాన్ని విప్పాలి. అది దిగితే లేవీవారే దాన్ని వేయాలి. లేవీ గోత్రికుడు కానివాడెవడైనా దానిని సమీపిస్తే వాడు మరణశిక్ష పొందాలి. 52 ✝ఇస్రాయేల్ ప్రజలో ప్రతి ఒక్కరూ వారి వారి సేనల ప్రకారం వారి వారి శిబిరంలో వారి వారి ధ్వజం దగ్గర డేరాలు వేయాలి. 53 అయితే ఇస్రాయేల్ ప్రజల సమాజం మీదికి నా కోపం రాకుండేలా✽ లేవీగోత్రికులు మాత్రమే శాసనాల దైవనివాసం చుట్టూరా దగ్గరగా తమ డేరాలు వేయాలి; శాసనాల దైవ నివాసాన్ని కాపాడాలి.”
54 యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే ఇస్రాయేల్ ప్రజలు చేశారు.