26
1 ✝“మీరు విగ్రహాలను చేసుకోకూడదు. చెక్కిన ప్రతిమను గానీ, స్తంభాన్ని గానీ నిలబెట్టకూడదు. ఆరాధనకోసం ఏదో రూపంగా చెక్కిన రాయి మీ దేశంలో నిలబెట్టకూడదు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.2 ✝“నేను నియమించిన విశ్రాంతిదినాలను ప్రత్యేక దినాలుగా మీరు ఆచరించాలి. నా పవిత్ర స్థానమంటే మీకు భయభక్తులు ఉండాలి. నేను యెహోవాను.
3 ✽“మీరు నా చట్టాల ప్రకారం నడుచుకొంటూ, నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటే, 4 ✽మీ వానకాలాల్లో నేను మీకు వర్షం కురిపిస్తాను. మీ భూమి పంటలు ఇస్తుంది, మీ చెట్లు ఫలిస్తాయి. 5 ✝మీ ద్రాక్షపళ్ళ కాలంవరకు మీ నూర్పు సాగుతూ ఉంటుంది. విత్తనాలు చల్లే కాలం వరకు ద్రాక్షపళ్ళు ఉంటాయి. మీరు సంతృప్తిగా తింటారు, మీ దేశంలో నిర్భయంగా కాపురముంటారు. 6 ✝దేశంలో నేను శాంతి ప్రసాదిస్తాను. మీరు నిద్రపోయేటప్పుడు మిమ్ములను ఎవడూ భయపెట్టడు. దేశంలో దుష్టమృగాలు లేకుండా చేస్తాను. మీ దేశం మీదికి ఖడ్గం రాదు. 7 మీరు మీ శత్రువులను తరుముతారు. వాళ్ళు మీ ఎదుట ఖడ్గం చేత కూలుతారు. 8 ✝మీలో అయిదుగురు నూరుమందిని తరుముతారు; నూరు మంది పది వేలమందిని తరుముతారు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గంచేత కూలుతారు.
9 “ఈ విధంగా నేను మిమ్ములను కటాక్షిస్తాను. మీకు సంతానమిచ్చి మిమ్ములను వృద్ధి చేస్తాను. మీతో నా ఒడంబడిక సుస్థిరం చేస్తాను. 10 ✽మునుపు కూర్చుకొన్న పాత ధాన్యం మీరు తింటారు; కొత్తది వచ్చినప్పుడు పాతది మిగిలి ఉంటుంది. 11 ✝నా నివాసం మీమధ్య ఉంచుతాను. మిమ్ములను నిరాకరించను. 12 ✝నేను మీ మధ్య సంచరిస్తాను, మీకు దేవుడుగా ఉంటాను. మీరు నాకు ప్రజగా ఉంటారు. 13 ✝నేను యెహోవాను. మీ దేవుణ్ణి. మీరు ఈజిప్ట్ వాళ్ళకు దాసులుగా ఉండకూడదని వాళ్ళ దేశం నుంచి మిమ్ములను తీసుకు వచ్చినవాణ్ణి. నేను మీ కాడిని విరగగొట్టి, మీరు తలెత్తుకుని నడిచేలా చేశాను.
14 ✽“కాని, మీరు నా మాట వినకపోతే, నా ఆజ్ఞలన్నిటి ప్రకారం ప్రవర్తించకపోతే, 15 నా చట్టాలను తృణీకరిస్తే, నా న్యాయనిర్ణయాలను నిరాకరిస్తే, నా ఆజ్ఞలన్నిటి ప్రకారం ప్రవర్తించకుండా నా ఒడంబడిక అతిక్రమిస్తే, 16 నేను మీకు ఈ విధంగా చేస్తాను: తాపజ్వరం, క్షయరోగం అనే భయంకరమైనవాటిని మీమీదికి రప్పిస్తాను. వాటివల్ల మీ కళ్ళు మసక బారతాయి. మీ ప్రాణాలు✽ కృశించిపోతాయి. మీరు విత్తనాలు చల్లడం వల్ల లాభం ఉండదు. ఎందుకంటే మీ శత్రువులు వాటి పంట తింటారు✽. 17 ✝నేను మీకు విరోధినవుతాను. మీ శత్రువులు మిమ్ములను కూలగొట్టివేస్తారు. మిమ్ములను ద్వేషించేవాళ్ళు మీమీద పరిపాలన చేస్తారు. మిమ్ములను తరిమేవాళ్ళెవరూ లేకపోయినా మీరు పారిపోతారు.
18 “ఇవన్నీ జరిగినా మీరింకా నా మాట వినకుండా ఉంటే, మీ పాపాల కారణంగా నేను మిమ్ములను ఇంకా ఏడంతలుగా✽ దండిస్తాను. 19 ✝మీ మొండి గర్వాన్ని అణగగొట్టివేస్తాను. ఆకాశాన్ని ఇనుములాగా, భూమిని కంచులాగా చేస్తాను. 20 ✝మీ భూమి ఫలించదు. మీ దేశంలో చెట్లు కాపు కాయవు, గనుక మీ బలం వ్యర్థంగా ఉడిగిపోతుంది.
21 “మీరు నన్ను ఎదిరించి, నా మాట వినడానికి ఇష్టపడకుండా ఉంటే, మీ పాపాల కారణంగా నేను మిమ్ములను బాధిస్తాను. 22 మీ మధ్యకు దుష్టమృగాలను✽ రప్పిస్తాను. అవి మీ పిల్లలను చంపివేస్తాయి. మీ పశువులను నాశనం చేస్తాయి. మిమ్ములను కొద్దిమందిగా చేస్తాయి. మీ త్రోవలు నిర్జనంగా✽ ఉంటాయి.
23 ✝“ఈ శిక్షలవల్ల మీరు నా ఎదుట బాగుపడకుండా, నన్ను ఎదిరిస్తే, 24 నేనూ మిమ్ములను ఎదిరిస్తాను. మీ పాపాల కారణంగా ఇంకా ఏడంతలుగా దండిస్తాను. 25 ✝మీమీదికి ఖడ్గం రప్పిస్తాను. ఆ ఖడ్గం నా ఒడంబడిక విషయం ప్రతిక్రియ చేస్తుంది. అప్పుడు మీరు మీ పట్టణాలలో గుమికూడితే మీ మధ్యకు ప్రాణాంతకమైన అంటురోగం రప్పిస్తాను. మీరు శత్రువుల వశం అవుతారు. 26 ప్రాణాధారమైన మీ ఆహారం నేను తీసివేసిన తరువాత, పదిమంది స్త్రీలు మీకోసం భోజనం వండడానికి ఒకే పొయ్యి సరిపోతుంది. మీ భోజనం కొలత ప్రకారం మీకిస్తారు. దానిని తిన్నా మీకు తృప్తిగా ఉండదు.
27 “ఇవన్నీ జరిగిన తరువాత కూడా మీరు నా మాట వినకుండా, నన్ను ఎదిరిస్తే 28 ✝నేనూ కోపాగ్నితో మిమ్ములను ఎదిరిస్తాను. నేనే మీ పాపాల కారణంగా ఏడంతలుగా మిమ్ములను దండిస్తాను. 29 ✝మీరు మీ కొడుకుల, కూతుళ్ళ శరీరాలను భక్షిస్తారు. 30 అప్పుడు మీ ఎత్తయిన పూజాస్థలాలను✽ నేను పాడు చేస్తాను. మీ సూర్యదేవతా విగ్రహాలను✽ పడగొట్టిస్తాను. ప్రాణం లేని మీ విగ్రహాలమీద మీ శవాలను పడవేయిస్తాను. నేను మిమ్ములను నిరాకరిస్తాను✽. 31 మీ పట్టణాలను నాశనం చేస్తాను. మీ పవిత్ర స్థలాలను పాడు చేస్తాను✽. మీ పరిమళ ధూపం వాసన చూడను✽. 32 ✝నేను మీ దేశాన్ని పాడు చేస్తాను. తరువాత దానిలో కాపురముండే మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపోతారు. 33 ✝మిమ్ములను ఇతర జనాలమధ్య చెదరగొట్టివేస్తాను. కత్తి దూసి మీ వెంట తరుముతాను. మీ దేశం పాడైపోతుంది, మీ పట్టణాలు శిథిలమైపోతాయి.
34 ✝“అప్పుడు మీ దేశం తన విశ్రాంతి కాలాలు అనుభవిస్తుంది. మీరు మీ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు, మీ దేశం పాడై ఉన్న రోజులన్నీ అది విశ్రమిస్తుంది. 35 మీరు దానిలో నివసించినప్పుడు మీ విశ్రాంతి కాలాలలో అది అనుభవించని విశ్రాంతి అప్పుడు అనుభవిస్తుంది. అది పాడై ఉన్న రోజులన్నీ విశ్రమిస్తుంది.
36 ✝“మీలో మిగిలినవారు వారి శత్రువుల దేశాల్లో ఉన్నప్పుడు వారి హృదయాలలో అధైర్యం పుట్టిస్తాను. గాలికి కొట్టుకుపోతున్న ఆకు చప్పుడుకు వారు పరుగెత్తుతారు, ఖడ్గం ఎదుటనుంచి పారిపోయినట్టు వారు ఆ చప్పుడు విని పారిపోతారు. తరిమేవాళ్ళు లేకపోయినా వారు కూలుతారు. 37 ✝తరిమేవాళ్ళు లేకపోయినా ఖడ్గం నుంచి పారిపోయినట్టు వారు పారిపోతూ ఒకడిమీద ఒకడు పడిపోతారు. మీ శత్రువులయెదుట మీరు నిలబడలేకపోతారు. 38 ✝మీరు ఇతర జనాలమధ్య నాశనమవుతారు. మీ శత్రువుల దేశం మిమ్ములను తినివేస్తుంది. 39 ✝మీలో మిగిలినవారు మీ శత్రువుల దేశాలలో తమ అపరాధాల కారణంగా కృశించి పోతారు.
40 ✽“వారు నన్ను ఎదిరించి ద్రోహం చేసినందువల్ల నేను వారిని ఎదిరించి వారి శత్రువుల దేశానికి పంపివేసిన తరువాత వారు తమ అపరాధాలు, తమ పూర్వీకుల అపరాధాలు ఒప్పుకుంటే 41 అప్పుడు సున్నతి లేని వారి హృదయాలు✽ అణగారిపోతే, తాము చేసిన అపరాధాలకు న్యాయమైన దండన పొందామని వారు ఒప్పుకుంటే, 42 యాకోబుతో చేసిన ఒడంబడికను తలచుకొంటాను. కనాను దేశాన్ని కూడా తలచుకొంటాను. 43 ఇస్రాయేల్ ప్రజలు లేనప్పుడు ఆ దేశం పాడైన స్థితిలో ఉంటుంది. అప్పుడది తన విశ్రాంతి కాలాలు అనుభవిస్తుంది. ఆలోగా వారు న్యాయమైన దండనకు గురి అవుతారు. ఎందుకంటే, వారు నా న్యాయనిర్ణయాలను తిరస్కరించిన వారుగా ఉంటారు. నా చట్టాలను నిరాకరించినవారుగా ఉంటారు. కాబట్టే ఇదంతా! 44 అయినా వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు కూడా నేను వారిని తిరస్కరించను. పూర్తిగా నాశనం చేయాలని వారిని నిరాకరించను. అలా నా ఒడంబడికను వమ్ము చేయను. ఎందుకంటే నేను యెహోవాను వారి దేవుణ్ణి. 45 ✽ఇతర జనాలు చూస్తుండగానే నేను వారి పూర్వీకులను ఈజిప్ట్ దేశంనుంచి తీసుకు వచ్చాను. నేను వారికి దేవుడుగా ఉండాలని అలా చేశాను. వారి పూర్వీకులతో నేను చేసిన ఒడంబడికను వారి కోసం తలచుకొంటాను. నేను యెహోవాను.
46 యెహోవా మోషే ద్వారా, సీనాయి పర్వతం మీద, తనకూ ఇస్రాయేల్ ప్రజకూ మధ్య నియమించిన చట్టాలు, న్యాయనిర్ణయాలు, ఆదేశాలు ఇవే.