27
1 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 2 ✝“నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు – ఒక మనిషికి ఉన్నంత విలువ యెహోవాకు అర్పిస్తానని ఎవరైనా మొక్కుబడి చేస్తే, నిర్ణయించిన విలువే అతడు చెల్లించాలి. 3 మీరు ఈ విధంగా వెల నిర్ణయించాలి – ఇరవై ఏళ్ళు మొదలుకొని అరవై ఏళ్ళ వయసు వరకు పురుషుడి విలువ యాభై తులాల వెండి, పవిత్ర స్థానం తులం తూనిక ప్రకారం నీవు నిర్ణయించాలి. 4 స్త్రీ విలువ ముప్ఫయి తులాలు. 5 అయిదేళ్ళు మొదలుకొని ఇరవై ఏళ్ళ లోపలి వయసు గలవాడి విలువ ఇరవై తులాల వెండి. బాలిక విలువ పది తులాలు. 6 ఒక నెల మొదలుకొని అయిదేళ్ళ లోపలి వయసు గలవాడి విలువ అయిదు తులాల వెండి. బాలిక విలువ మూడు తులాల వెండి. 7 అరవై ఏళ్ళ ప్రాయం దాటినవాడి విలువ పదిహేను తులాల వెండి, స్త్రీ విలువ పది తులాలు. 8 మీరు నిర్ణయించిన వెలను మొక్కుబడి చేసినవాడు చెల్లించలేనంత బీదవాడైతే అతడు ఎవరి గురించి మొక్కుబడి చేశాడో ఆ వ్యక్తిని యాజి దగ్గరకు తేవాలి. అప్పుడు మొక్కుబడి చేసినవాడు చెల్లించగల దానిప్రకారం ఆ యాజి ఆ వ్యక్తికి వెల నిర్ణయించాలి.9 “యెహోవాకు అర్పణగా ఇవ్వతగ్గ పశువులలో ఒకదాన్ని ఇస్తానని ఎవరైనా మ్రొక్కుబడి చేస్తే, అలాంటి ప్రతి పశువూ యెహోవాకు పవిత్రం. 10 ఆ వ్యక్తి అలాంటిదానిని మార్చకూడదు. చెడ్డదానికి బదులుగా మంచిదానిని ఇవ్వకూడదు. మంచిదానికి బదులుగా చెడ్డదానిని ఇవ్వకూడదు. ఒకవేళ పశువుకు పశువును మార్చితే, అదీ, దానికి బదులుగా ఇచ్చినదీ రెండూ ప్రతిష్ఠితమవుతాయి. 11 యెహోవాకు అర్పించకూడని అశుద్ధ జంతువులలో ఒకదానికి ఇస్తానని ఆ వ్యక్తి చెపితే, దానిని యాజిదగ్గరికి తేవాలి. 12 అది మంచిదైనా, చెడ్డదైనా యాజి దాని వెల నిర్ణయించాలి. యాజి నిర్ణయించిన వెల ఖాయం. 13 తరువాత ఆ వ్యక్తి దాన్ని విడిపించుకోవడానికి ఇష్టపడితే, నిర్ణయించిన వెలలో అయిదో వంతు దానికి కలపాలి.
14 “ఎవరైనా తన ఇల్లు యెహోవాకు పవిత్రమైనదిగా ప్రతిష్ఠిస్తే, అది మంచిదైనా, చెడ్డదైనా, యాజి దాని వెల నిర్ణయించాలి. యాజి నిర్ణయించిన వెల ఖాయం. 15 తరువాత తన ఇల్లు ప్రతిష్ఠించినవాడు దాన్ని విడిపించుకోవడానికి ఇష్టపడితే నిర్ణయించిన వెలలో అయిదో వంతు దానికి కలిపి ఇవ్వాలి. అప్పుడా ఇల్లు అతడిది అవుతుంది.
16 “ఎవరైనా తన పిత్రార్జితంగా ఉన్న భూమిలో కొంత యెహోవాకు ప్రతిష్ఠ చేస్తే దానిలో చల్లే విత్తనాల కొలత ప్రకారం దాని వెల నిర్ణయించాలి. పది తూముల యవల విత్తనాల వెల యాభై తులాల వెండి. 17 అతడు మహోత్సవ సంవత్సరం మొదలుకొని తన భూమిని ప్రతిష్ఠిస్తే, మీరు నిర్ణయించే వెల ఖాయం. 18 మహోత్సవ సంవత్సరం తరువాత తన భూమిని ప్రతిష్ఠ చేస్తాడనుకోండి. అలాంటప్పుడు, మరుసటి మహోత్సవ సంవత్సరానికి మిగిలే సంవత్సరాలను లెక్కించి యాజి దానికి వెల నిర్ణయించాలి. దాని ప్రకారం మీరు నిర్ణయించిన వెలను అతడు తగ్గించాలి. 19 తరువాత ఆ భూమిని ప్రతిష్ఠించినవాడు దానిని విడిపించుకోవడానికి ఇష్టపడితే, మీరు నిర్ణయించిన వెలలో అయిదో వంతును అతడు దానికి కలిపి ఇవ్వాలి. అప్పుడది అతడిది అవుతుంది. 20 ఒకవేళ అతడు ఆ భూమిని విడిపించుకోకుండా వేరొకడికి దాన్ని అమ్మితే, తరువాత దాన్ని విడిపించే హక్కు ఎవరికీ ఎప్పుడూ ఉండదు. 21 ✝ఆ భూమి మహోత్సవ సంవత్సరంలో విడుదల అవుతుంది. అప్పుడు అది ప్రతిష్ఠించిన పొలంలాగే యెహోవాకు పవిత్రం అవుతుంది. యాజి స్వాధీనంలోకి వస్తుంది. 22 తన పిత్రార్జితం గాక తాను కొనుక్కొన్న వేరే పొలాన్ని ఎవరైనా యెహోవాకు ప్రతిష్ఠ చేస్తే, 23 మహోత్సవ సంవత్సరం వరకు నిర్ణయించిన వెల ప్రకారం యాజి దాని విలువ నిశ్చయించాలి. మీరు నిర్ణయించిన వెలను ఆ రోజే ఆ వ్యక్తి చెల్లించాలి. అది యెహోవాకు పవిత్రం. 24 ఆ పొలం ఎవడి పిత్రార్జితమో అతడికి, అంటే దాన్ని అమ్మినవాడికి మహోత్సవ సంవత్సరంలో తిరిగి రావాలి. 25 మీరు నిర్ణయించే వెలలన్నీ పవిత్రస్థానంలో వాడుకొనే తులం ప్రకారం ఉండాలి. తులం ముప్ఫయి చిన్నాలు.
26 ✝“జంతువులలో తొలిపిల్ల యెహోవాదే, గనుక ఎవ్వడూ దాన్ని ప్రతిష్ఠించకూడదు. అది ఎద్దు కానివ్వండి, గొర్రె కానివ్వండి, మేక కానివ్వండి, అది యెహోవాదే. 27 అది అశుద్ధ జంతువైతే మీరు నిర్ణయించే వెలలో అయిదో వంతును అతడు దానికి కలిపి ఇచ్చి దాన్ని విడిపించవచ్చు. దాన్ని విడిపించకపోతే మీరు నిర్ణయించిన వెలకు అది ఇంకెవరికైనా అమ్ముడుపోవాలి.
28 ✝“మనుషులు యెహోవాకు పూర్తిగా అప్పగించిన ప్రతిదీ అతి పరిశుద్ధం. అలా అప్పగించినది మనిషి కానివ్వండి, జంతువు కానివ్వండి, తన పొలం కానివ్వండి, తన స్వాధీనంలో ఏదైనా కానివ్వండి, అది అమ్ముడుపోకూడదు, విడిపించ బడకూడదు. 29 మరణ శిక్షకు అప్పగించబడ్డవాణ్ణి విడిపించ కూడదు. వాణ్ణి తప్పక హతమార్చాలి.
30 ✝“భూధాన్యంలో గానీ, చెట్ల పళ్ళలో గానీ – అలాంటి ప్రతిదానిలో పదో భాగం యెహోవాది✽. అది యెహోవాకు పరిశుద్ధం. 31 తాను ఇవ్వవలసిన ఆ పదో భాగంలో కొంత ఎవరైనా విడిపించుకోవడానికి ఇష్టపడితే, దానిలో అయిదో వంతును దానికి కలిపి ఆ వెల చెల్లించాలి. 32 గోవులలో గానీ, గొర్రె మేకలలో గానీ – కాపరి చేతికర్ర క్రింద నడిచే దానంతట్లో – పదో భాగం యెహోవాకు ప్రతిష్ఠితం. 33 ఈ పదో భాగం మంచిదో చెడ్డదో పరిశోధించకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చితే అదీ, దానికి బదులుగా ఇచ్చినదీ రెండూ ప్రతిష్ఠంగా ఉంటాయి. అలాంటిదాన్ని విడిపించ కూడదు.”
34 యెహోవా సీనాయి పర్వతం మీద ఇస్రాయేల్ ప్రజలకోసం మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు ఇవి.