25
1 యెహోవా సీనాయి పర్వతంమీద మోషేతో అన్నాడు, 2 “నీవు ఇస్రాయేల్ ప్రజలతో చెప్పు – నేను మీకు ఇచ్చే దేశానికి చేరిన తరువాత యెహోవా పేర ఆ భూమికి కూడా విశ్రాంతి కాలాలు ఉండాలి. 3 మీరు ఆరు సంవత్సరాలు మీ పొలంలో విత్తనాలు చల్లాలి. ఆరు సంవత్సరాలు ద్రాక్షతోటలో కొమ్మలూ రెమ్మలూ తీర్చి దిద్దాలి. దాని ఫలాలు కూర్చుకోవాలి. 4 అయితే ఏడో సంవత్సరం భూమికి మహా విశ్రాంతి కాలం. అది యెహోవా పేర విశ్రాంతి సంవత్సరంగా ఉండాలి. ఆ ఏట మీ పొలంలో విత్తనాలు చల్లకూడదు, మీ ద్రాక్షతోటలో కొమ్మలు తీర్చి దిద్దకూడదు. 5 పూర్వం ఈ పొలంలో పడ్డ విత్తనాలవల్ల వచ్చిన పంట కోసుకోకూడదు. దిద్దని ద్రాక్షతీగెల నుంచి పళ్ళు కూర్చుకోకూడదు. ఆ సంవత్సరంలో భూమికి విశ్రాంతి కాలం. 6 అయినా విశ్రాంతి సంవత్సరంలో ఆ దేశంలో దానంతట అదే పండేది మీకు, మీ దాసుడికి, మీ దాసికి, మీ జీతగాడికి, మీతో నివసించే విదేశీయుడికి ఆహారం అవుతుంది. 7 ఆ పంట మీ పశువులకు, దేశ జంతువులకు మేతగా ఉంటుంది కూడా.
8 “అంతేగాక మీరు ఏడు విశ్రాంతి సంవత్సరాలను లెక్కించాలి. అంటే, ఏడేళ్ళను ఏడు సార్లు లెక్కించాలి. ఏడు విశ్రాంతి సంవత్సరాలున్న ఈ కాలం నలభై తొమ్మిది సంవత్సరాలు. 9 అప్పుడు ఏడో నెల పదో రోజున పొట్టేలు కొమ్ము బూర ఊదాలి. ప్రాయశ్చిత్త దినాన మీ దేశంలో అంతటా ఆ బూర ఊదాలి. 10 మీరు ఆ యాభైయో సంవత్సరాన్ని ప్రత్యేకమైనదిగా ఎంచాలి. అప్పుడు విడుదల కలిగిందని మీ దేశవాసులందరికీ చాటించాలి. అది మీకు బూర ధ్వని చేసే మహోత్సవ కాలం. అప్పుడు అందరూ తమ తమ పిత్రార్జితం మళ్ళీ పొందాలి. తమ తమ వంశం వారి దగ్గరికి మళ్ళీ చేరాలి. 11 ఆ యాభైయో సంవత్సరం మీకు మహోత్సవ కాలంగా ఉంటుంది. ఆ ఏట మీరు విత్తనాలు చల్లకూడదు. గతంలో పొలంలో పడ్డ విత్తనాల వల్ల వచ్చిన పంట కోయకూడదు. తీర్చి దిద్దిన ద్రాక్ష తీగెలనుంచి పళ్ళు కూర్చుకోకూడదు. 12 అది మహోత్సవ కాలం. అది మీకు పవిత్రంగా ఉండాలి. అప్పుడు పొలంలో దానంతట అదే పండిన పంట మీరు తినాలి.
13 “ఆ మహోత్సవ సంవత్సరంలో అందరూ తమ తమ పిత్రార్జితం మళ్ళీ పొందాలి. 14 మీరు మీ పొరుగువాడికి ఏమైనా అమ్మినా అతడిదగ్గర ఏమైనా కొన్నా ఆ విషయంలో మీరు ఒకడిమీద ఒకడు దౌర్జన్యం చెయ్యకూడదు. 15 మునుపటి మహోత్సవ సంవత్సరం తరువాత గడిచిన ఏళ్ళ లెక్కప్రకారం మీ పొరుగువాడి దగ్గర పొలం కొనుక్కోవాలి. మిగతా పంట లెక్క ప్రకారం అతడు మీకు దాన్ని అమ్మాలి. 16 ఆ సంవత్సరాల లెక్క ఎక్కువైన కొద్ది దాని వెల తగ్గించాలి. ఎందుకంటే అతడు మీకు పంటలే గదా అమ్మేది. 17 మీ దేవుని పట్ల భయభక్తులు చూపాలి. ఒకడిమీద ఒకడు దౌర్జన్యం చెయ్యకూడదు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.
18 “కాబట్టి మీరు నా చట్టాలు, నా న్యాయనిర్ణయాలు పాటించి వాటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉండాలి. అలాంటప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా కాపురముంటారు; 19 అక్కడి భూమి ఫలవంతంగా ఉంటుంది; మీరు సంతృప్తిగా తింటారు; సురక్షితంగా కాపురముంటారు. 20 మీరనవచ్చు, ‘ఏడో ఏట మేము విత్తనాలు చల్లకూడదు, పంట కూర్చుకోకూడదు అంటున్నారు, మరి ఆ సంవత్సరంలో మేమేం తినాలి?’ 21 అయితే ఆరో ఏట నా ఆశీస్సులు మీకు కలిగేలా నిర్ణయిస్తాను. ఆ సంవత్సరం మూడేళ్ళ పంట పండుతుంది. 22 మీరు ఎనిమిదో సంవత్సరంలో మళ్ళీ విత్తనాలు చల్లాలి. ఆ సంవత్సరంలో, తొమ్మిదో సంవత్సరంలో మళ్ళీ పంట కూర్చుకొనేవరకూ మీరు ఆ పాత పంట తింటారు.
23 “భూములను శాశ్వత విక్రయం చేయకూడదు. ఎందుకంటే ఆ భూములు నావే. మీరు నాదగ్గర కాపురముంటున్న విదేశీయుల్లాంటివారు. 24  మీ దేశమంతటిలో పిత్రార్జితంలో అమ్మిన ప్రతి పొలం మళ్ళీ వెల ఇచ్చి కొనుక్కొనే హక్కు గుర్తించాలి. 25 మీ సాటి దేశస్తుడు బీదవాడై తన ఆస్తిలో కొంత అమ్మివేస్తాడనుకోండి. అలాంటప్పుడు అతడి సమీపబంధువుడు వచ్చి అతడు అమ్మిన ఆస్తిని విడుదల వెల ఇచ్చి విడిపించాలి. 26 అయితే అతడికి సమీపబంధువుడు లేడనుకోండి, తరువాత ఆ ఆస్తిని మళ్ళీ కొనుక్కొని విడిపించడానికి కావలసిన డబ్బు తానే సంపాదించుకొంటాడనుకోండి. 27 ఆ పక్షంలో ఆ ఆస్తిని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరాలు లెక్కించి, మహోత్సవ సంవత్సరానికి మిగిలే ఏళ్ళ ప్రకారం దాని వెల నిర్ణయించి ఆ ఆస్తిని కొన్నవారికి ఆ వెల ఇచ్చి, తన ఆస్తిని మళ్ళీ స్వాధీనం చేసుకోవచ్చు. 28 కాని, ఆ ఆస్తిని మళ్ళీ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు అతడికి దొరకకపోతే అతడు అమ్మిన ఆస్తి మహోత్సవ సంవత్సరంవరకూ దానిని కొనుక్కొన్నవారి వశంలోనే ఉండిపోతుంది. మహోత్సవ సంవత్సరంలో ఆ ఆస్తి దానిని అమ్మినవాడి స్వాధీనం అవుతుంది. అతడికి తన ఆస్తి మళ్ళీ వస్తుంది.
29 “ఒక వ్యక్తి చుట్టుగోడ ఉన్న ఊరిలో గృహాన్ని అమ్మితే, దాన్ని అమ్మిన రోజు మొదలుకొని ఒక పూర్తి సంవత్సరంలోగా వెల ఇచ్చి దాన్ని మళ్ళీ విడిపించవచ్చు. ఆ సంవత్సరంలో అంతా అతడికి మళ్ళీ విడిపించుకొనే హక్కు ఉంటుంది. 30 కాని, ఆ సంవత్సరం పూర్తి అయ్యేముందు దాన్ని విడిపించుకోడనుకోండి. అలాంటప్పుడు చుట్టుగోడ ఉన్న ఊరిలో ఉన్న ఆ ఇంటిని కొన్నవాడికీ అతడి వారికీ తరతరాలకు అది స్థిరంగా ఉంటుంది. మహోత్సవ సంవత్సరంలో అది మొదటి యజమాని స్వాధీనంలోకి రాదు. 31 చుట్టుగోడ లేని గ్రామాలలో ఉన్న ఇళ్ళ సంగతి వేరు. వాటిని పొలాలుగా ఎంచాలి. వాటిని మళ్ళీ విడిపించే హక్కు ఉంటుంది. మహోత్సవ సంవత్సరంలో అవి విడుదల కావాలి. 32 లేవీగోత్రికుల పట్టణాల సంగతి ఇది – వారికి చెందిన పట్టణాలలో ఉన్న ఇళ్ళను మళ్ళీ విడిపించుకొనే హక్కు ఎల్లప్పుడూ ఉంటుంది. 33 ఇస్రాయేల్ ప్రజల మధ్య, ఆ పట్టణాలలో ఉన్న ఇళ్ళు లేవీగోత్రికుల ఆస్తి, గనుక ఎవరైనా లేవీ వారి దగ్గర ఇల్లు కొంటే లేవీవారి పట్టణంలో అమ్ముడు పోయిన ఆ ఇల్లు మహోత్సవ సంవత్సరంలో విడుదల అవుతుంది. 34 లేవీగోత్రికుల పట్టణాలకు చుట్టూరా ఉన్న పొలాలు వారు అమ్మకూడదు. అవి వారికి ఎప్పటికీ ఉండే ఆస్తి.
35 “మీ సాటి మానవుడు – అతడు విదేశీయుడే గానీ, పరాయివాడే గానీ – బీదవాడై బ్రతుకుదెరువు లేకుండా ఉంటే, నీవు అతడికి సహాయం చెయ్యాలి. అతడు మీ వల్ల బ్రతకాలి. 36 మీ దేవుని పట్ల భయభక్తులు కలిగి అతడిదగ్గర ఏమీ వడ్డీ తీసుకోకూడదు. మీ సాటి మానవుడు మీవల్ల బ్రతకాలి. 37 మీ డబ్బు అతడికి వడ్డీలకు ఇవ్వకూడదు, మీ ఆహారం లాభానికి ఇవ్వకూడదు. 38 నేను యెహోవాను, మీ దేవుణ్ణి, మీకు దేవుడుగా ఉండడానికి కనానుదేశాన్ని మీకు ఇవ్వడానికి నేను మిమ్ములను ఈజిప్ట్‌దేశం నుంచి తీసుకువచ్చినవాణ్ణి.
39 “మీదగ్గర నివసించే స్వప్రజలో ఒకడు బీదవాడై తనను అమ్ముకొంటే, అతడిచేత ఊడిగం చేయించుకోకూడదు. 40 అతడు జీతగాడులాగా గానీ, విదేశీయుడులాగా గానీ మీదగ్గర ఉండి మహోత్సవ సంవత్సరం వరకు పని చేస్తాడు. 41 అప్పుడు అతడు తన పిత్రార్జితం మళ్ళీ పొంది, తన పిల్లలతోపాటు మీ దగ్గర నుంచి వెళ్ళి తన వంశీయుల దగ్గరకు చేరాలి. 42 ఎందుకంటే, వారు నా సేవకులు. నేను ఈజిప్ట్ నుంచి వారిని రప్పించాను. బానిసలను అమ్మినట్టు వారిని అమ్మకూడదు. 43 మీ దేవుని పట్ల భయభక్తులతో ఉండి, అలాంటి వారిని కఠినంగా అణచివేయకూడదు. 44 మీ చుట్టుపట్ల ఉన్న జనాలలోనుంచి దాసీలను, దాసులను కొనవచ్చు. 45 మీ మధ్య నివసించే విదేశీయులనూ, మీ దేశంలో వాళ్ళకు పుట్టిన సంతానానికి కూడా కొనవచ్చు. వాళ్ళు మీ సొత్తవుతారు. 46 మీ తరువాత మీ సంతానానికి కూడా సొత్తుగా ఉండేలా మీరు అలాంటివాళ్ళను స్వాధీనం చేసుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడూ మీకు దాసులవుతారు. కానీ సాటి ఇస్రాయేల్ వారిలో ఒకడిపై ఒకడు కఠినంగా పెత్తనం చేయకూడదు.
47 “మీ మధ్య నివాసమేర్పరచుకొన్న విదేశీయుడు ధనవంతుడనుకోండి. అతడి దగ్గర నివసించే మీ స్వదేశస్తుడొకడు బీదవాడై, అతడికి గానీ, అతడి కుటుంబంవాడొకడికి గానీ తనను అమ్ముకుంటాడనుకోండి. 48 ఆ పక్షంలో, తనను అమ్ముకొన్న తరువాత అతణ్ణి విడిపించే హక్కు ఉంటుంది. అంటే, అతడి అన్నదమ్ములలో ఒకడు అతణ్ణి విడిపించవచ్చు. 49 అతడి పినతండ్రిగానీ, పినతండ్రి కొడుకుగానీ, అతడి వంశంలో సమీప బంధువుడు గానీ అతణ్ణి విడిపించుకోవచ్చు. తనకే డబ్బు లభిస్తే తనను తానే విడిపించ వచ్చు. 50 అలాంటప్పుడు అతడూ అతణ్ణి కొనుక్కొన్న వ్యక్తీ కలిసి, అమ్ముడు పోయిన సంవత్సరంనుంచి మహోత్సవ సంవత్సరం వరకు మిగతా కాలమెంతో పరిగణించాలి. అతడి వెల ఆ సంవత్సరాల లెక్క ప్రకారం ఉంటుంది. అతడు జీతగాడై ఉన్నట్టు ఆ రోజుల ప్రకారం అతడి వెల ఉంటుంది. 51 ఇంకా చాలా సంవత్సరాలు మిగిలి ఉంటే వాటి ప్రకారం తనను అమ్ముకొన్న మొత్తంలో తనను విడిపించే వెల మళ్ళీ ఇవ్వాలి. 52 మహోత్సవ సంవత్సరం వరకు మిగతా ఏళ్ళు తక్కువైతే తన యాజమానితో లెక్క చూచుకొని సంవత్సరాల లెక్క ప్రకారం తనను విడిపించే వెల ఇవ్వాలి. 53 ఏటేటా కూలికి వచ్చినవాడిలాగా అతడు తన యజమాని దగ్గర ఉండాలి. అతడి యజమాని అతణ్ణి కఠినంగా అణచివేయకుండేలా మీరు చూడాలి. 54 పై చెప్పిన పద్ధతులలో వెల ఇవ్వడంవల్ల అతడికి విడుదల కలగకపోతే, మహోత్సవ సంవత్సరంలో అతడు తన పిల్లలతోపాటు విడుదల అవుతాడు. 55 ఎందుకంటే, ఇస్రాయేల్ ప్రజలు నాకే దాసులు. నేను ఈజిప్ట్ దేశం నుంచి వారిని తీసుకువచ్చాను. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.