24
1 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 2 “ఇస్రాయేల్ ప్రజలు దీపంకోసం దంచి తీసిన స్వచ్ఛమైన ఆలీవ్ నూనె నీ దగ్గరికి తేవాలని ఆదేశించు. ఆ దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండేలా వారు ఆ నూనె తేవాలి. 3 సన్నిధిగుడారంలో శాసనాల స్థలం ఎదుట ఉన్న అడ్డతెరకు వెలుపల ఆ దీపం ఉంటుంది. అది సాయంకాలంనుంచి ఉదయంవరకు యెహోవా సన్నిధానంలో ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండేలా అహరోను చూచుకోవాలి. ఇది మీ తరతరాలకు ఎప్పటికీ నిలిచివుండే చట్టం. 4 యెహోవా సన్నిధానంలో ఉన్న మేలిమి బంగారు సప్తదీపస్తంభంమీద ఆ దీపాలను అతడు ఎల్లప్పుడూ చూచుకోవాలి.
5 “నీవు గోధుమపిండితో పన్నెండు భక్ష్యాలు వండాలి. ఒక్కొక్క భక్ష్యానికి రెండు కిలోగ్రాముల పిండి ఉపయోగించాలి. 6 ఆ భక్ష్యాలు యెహోవా సన్నిధానంలో ఉన్న మేలిమి బంగారు బల్లమీద రెండు వరుసలుగా ఉంచాలి. ఒక్కొక్క వరుసలో ఆరు భక్ష్యాలు ఉండాలి. 7 ఒక్కొక్క వరుసలో స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచాలి. అది ఆ భక్ష్యాలకు స్మృతిచిహ్నంగా, యెహోవాకు చేసిన హోమంగా ఉంటుంది. 8 యాజి ప్రతి విశ్రాంతిదినమూ యెహోవా సన్నిధానంలో క్రమంగా అదంతా పెట్టాలి. ఇది నిత్యమైన ఒడంబడిక ప్రకారం ఇస్రాయేల్ ప్రజలు ఇవ్వవలసినది. 9 ఆ భక్ష్యాలు అహరోనుకు, అతడి సంతతివారికి చెందాలి. వారు ఒక పవిత్రమైన చోట వాటిని తినాలి. నిత్యమైన చట్టం ప్రకారం యెహోవాకు చేసే హోమాలలో అది అతి పవిత్రం.”
10 ఇస్రాయేల్ స్త్రీకి, ఈజిప్ట్‌వాడికి పుట్టిన కొడుకు ఉండేవాడు. అతడి తల్లి పేరు షెలోమీత్. ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కూతురు. ఆ ఇస్రాయేల్ స్త్రీ కొడుకు ఇస్రాయేల్‌ప్రజల శిబిరం లోకి వెళ్ళి ఇస్రాయేల్ మనిషితో పోరాడాడు. 11 ఆ ఇస్రాయేల్ స్త్రీ కొడుకు యెహోవా పేరును శపించి దూషించాడు. వారు అతణ్ణి మోషే దగ్గరికి తీసుకువచ్చారు. 12 అతడి విషయం యెహోవా ఆజ్ఞ జారీ చేసేవరకు వారతణ్ణి కావలిలో ఉంచారు.
13 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 14 “దూషించినవాణ్ణి శిబిరం వెలుపలికి తీసుకుపో, వాడి దూషణ విన్నవారంతా వాడి తలమీద చేతులు ఉంచాలి. సమాజమంతా వాణ్ణి రాళ్ళు రువ్వి చంపాలి. 15 అప్పుడు నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పాలి – తన దేవుణ్ణి దూషించినవాడు తన అపరాధం భరించాలి. 16 యెహోవా పేరును శపించినవాడు మరణశిక్షకు గురి కావాలి. సంఘమంతా అలాంటివాణ్ణి రాళ్ళు రువ్వి చంపాలి. విదేశీయుడు గానీ, స్వదేశీయుడు గానీ యెహోవా పేరును దూషిస్తే వాడు మరణశిక్షకు గురి కావాలి.
17 “మనిషిని హత్య చేసినవాడెవడైనా మరణశిక్షకు గురి కావాలి. 18 జంతువును చంపినవాడెవడైనా ‘ప్రాణానికి బదులుగా ప్రాణం’ ప్రకారం దాని నష్టం చెల్లించాలి. 19 ఎవడైనా సాటి మానవుణ్ణి గాయం చేస్తే వాడు చేసినట్టే వాడికి చెయ్యాలి. 20 ఎముక విరగగొడితే వాడికి ఎముక విరగగొట్టాలి. కంటికి కన్ను, పంటికి పన్ను పోగొట్టాలి. వాడు మరొకణ్ణి గాయం చేసినట్టే వాణ్ణి గాయం చేయాలి. 21 జంతువును చంపినవాడు దాని నష్టం ఇచ్చుకోవాలి. మనిషిని హత్య చేసినవాడు మరణ శిక్షకు గురి కావాలి. 22 మీరు విదేశీయులకూ స్వదేశీయులకూ సమదృష్టితో తీర్పు తీర్చాలి. ఎందుకంటే నేను యెహోవాను, మీ దేవుణ్ణి.”
23 మోషే ఇస్రాయేల్ ప్రజలతో ఆ విధంగా చెప్పాడు, గనుక వారు దూషించినవాణ్ణి శిబిరం వెలుపలికి తీసుకుపోయి రాళ్ళు రువ్వి చంపారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇస్రాయేల్ ప్రజలు చేశారు.