23
1 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 2 “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు – యెహోవా నియమించిన కాలాలు మీరు పవిత్ర సభలుగా చాటించాలి. నా నియామక కాలాలు ఇవే: 3 వారంలో పని చేయడానికి ఆరు రోజులున్నాయి. ఏడో రోజు విశ్రాంతి దినం, పవిత్ర సభదినం. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. మీరెక్కడ నివాసం చేసినా ఆ రోజు యెహోవాకు చెందిన విశ్రాంతి దినం.
4 “యెహోవా నియమించిన కాలాలు ఇవి: మీరు వాటి నియామక కాలాలలో పవిత్ర సభలుగా చాటించవలసినవి ఇవి: 5 మొదటి నెల పద్నాలుగో రోజు సాయంకాలాన యెహోవా పస్కా పండుగ ఆరంభం అవుతుంది.
6 “ఆ నెల పదిహేనో రోజు యెహోవాకు పొంగని రొట్టె పండుగ ఆరంభం అవుతుంది. అప్పుడు మీరు ఏడు రోజులు పొంగజేసే పదార్థం కలపని రొట్టెలు తినాలి. 7 మొదటి రోజున మీరు పవిత్ర సభగా సమకూడాలి. ఆరోజున మీ బ్రతుకుదెరువు కోసం ఏ పనీ చెయ్యకూడదు. 8 ఏడు రోజులు మీరు యెహోవాకు హోమాలు చెయ్యాలి. ఏడో రోజున కూడా మీరు పవిత్రసభగా సమకూడాలి. ఆ రోజున మీ బ్రతుకుదెరువుకోసం ఏ పనీ చెయ్యకూడదు.”
9 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు: 10 “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు – నేను మీకిచ్చే దేశానికి మీరు చేరి దాని పంట కోసేటప్పుడు ఆ మొదటి పంటలో ఒక కట్టను యాజి దగ్గరికి తేవాలి. 11 యెహోవా మిమ్ములను అంగీకరించేలా అతడు యెహోవా సన్నిధానంలో ఆ కట్టను అటూ ఇటూ కదల్చాలి. విశ్రాంతి దినానికి మరుసటి రోజున యాజి దానిని అలా కదల్చాలి. 12 మీరు ఆ కట్టను అర్పించేరోజున లోపం లేని ఏడాది పొట్టేలును యెహోవాకు హోమబలిగా అర్పించాలి. 13 దానితో అర్పించవలసిన నైవేద్యం రెండు కిలోగ్రాముల మెత్తని గోధుమపిండి, దానితో నూనె కలపాలి. దాన్ని యెహోవాకు పరిమళ హోమంగా అర్పించాలి. దానితో అర్పించవలసిన పానార్పణం ఒక లీటరు ద్రాక్షరసం. 14 ఆ రోజు వరకు, అంటే మీరు మీ దేవునికి ఇలా అర్పణ తెచ్చేవరకు ఆ మొదటి కంకులు గానీ, రొట్టెలు గానీ, పేలాలు గానీ తినకూడదు. మీరు ఎక్కడ నివాసం చేసినా మీ తరతరాలకు ఇది ఎప్పటికీ నిలిచివుండే చట్టం.
15 “విశ్రాంతి దినానికి మరుసటి రోజు మొదలుకొని కదల్చడానికి ఆ కట్టను మీరు తెచ్చిన రోజు మొదలుకొని ఏడు వారాలు లెక్కించాలి. 16 ఏడో విశ్రాంతిదినానికి తరువాతి రోజు వరకు మీరు యాభై రోజులు లెక్కించి యెహోవాకు కొత్త నైవేద్యం అర్పించాలి. 17 మీరు మీ ఇండ్లలోనుంచి రెండు కిలో గ్రాముల పిండితో చేసిన రెండు రొట్టెలు కదల్చే నైవేద్యంగా తేవాలి. గోధుమ పిండిలో పొంగజేసే పదార్థం వేసి వాటిని కాల్చాలి. అని యెహోవాకు ప్రథమ ఫలాల నైవేద్యం. 18 ఆ రొట్టెలతో కూడా లోపం లేని ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలనూ, ఒక కోడెనూ, రెండు పొట్టేళ్ళనూ అర్పించాలి. అవి యెహోవాకు హోమబలులు; నైవేద్యాలతో, వాటి పానార్పణలతోపాటు యెహోవాకు పరిమళ హోమం. 19 అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాపాలకోసం బలిగా, రెండు ఏడాది మగ గొర్రెపిల్లలను శాంతిబలిగా అర్పించాలి. 20 యాజి ప్రధమ ఫలాల రొట్టెలతోపాటు ఆ రెండు గొర్రెపిల్లలనూ యెహోవా సన్నిధానంలో కదల్చాలి. అవి యెహోవాకు పవిత్రమైనవి. అవి యాజివి అవుతాయి. 21 ఆ రోజే ప్రజలు పవిత్ర సభగా సమకూడాలని చాటించాలి, ఆ రోజున మీరు బ్రతుకు దెరువు కోసం ఏ పనీ చెయ్యకూడదు. మీరు ఎక్కడ నివాసం చేసినా మీ తరతరాలకూ ఇది ఎప్పటికీ నిలిచివుండే చట్టం.
22 “మీరు మీ పొలం పంట కోసేటప్పుడు పొలం ఓరలను పూర్తిగా కోయకూడదు; కోతలో పరిగె ఏరుకోకూడదు. బీదలకు, పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.”
23  యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 24 “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు – ఏడో నెల మొదటి రోజు మీకు విశ్రాంతిదినం. అది బూరలూదే జ్ఞాపకార్థ దినం. పవిత్ర సభగా సమకూడే రోజు. పొట్టేలు కొమ్ము బూరలు ఊది ఆ రోజును చాటించాలి. 25 ఆ రోజున మీరు బ్రతుకుదెరువు కోసం ఏ పనీ చేయకూడదు గాని, యెహోవాకు హోమం చెయ్యాలి.”
26  యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 27 “ఈ ఏడో నెల పదో రోజు పాపాలకోసం ప్రాయశ్చిత్త దినం. ఆ రోజున మీరు పవిత్ర సభగా సమకూడాలి. మీరు మిమ్ములను అదుపు చేసుకోవాలి. యెహోవాకు హోమం చెయ్యాలి. 28 ఆ రోజున ఎలాంటి పనీ చెయ్యకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధానంలో మీ పాపాలు కప్పివేయడం జరిగే ప్రాయశ్చిత్త దినం అది. 29 ఆ రోజు తనను అదుపు చేసుకోని ప్రతివాణ్ణీ ప్రజలలో లేకుండా చేయాలి. 30 ఆ రోజున ఎలాంటి పనైనా చేసిన ప్రతివాణ్ణీ ప్రజలలో లేకుండా నేనే నాశనం చేస్తాను. 31 ఆ రోజున మీరు ఎలాంటి పనీ చెయ్యకూడదు. మీరు ఎక్కడ నివాసం చేసినా మీ తరతరాలకూ ఎప్పటికీ నిలిచివుండే చట్టమిది. 32 అది మీకు మహా విశ్రాంతిదినం. అప్పుడు మిమ్ములను అదుపు చేసుకోవాలి. ఆ నెల తొమ్మిదో రోజు సాయంకాలం నుంచి మరుసటి రోజు సాయంకాలం వరకు మీరు దానిని విశ్రాంతిదినంగా ఆచరించాలి.”
33  యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 34 “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు– ఏడో నెల పదిహేనో రోజు పర్ణశాలల పండుగ ఆరంభం. యెహోవాకు ఏడు రోజులు దానిని ఆచరించాలి. 35 మొదటి రోజున పవిత్ర సభగా సమకూడాలి. ఆ రోజున మీరు బ్రతుకుదెరువు కోసం ఏ పనీ చెయ్యకూడదు. 36 ఆ ఏడు రోజులు మీరు యెహోవాకు హోమాలు చెయ్యాలి. ఎనిమిదో రోజున మీరు పవిత్ర సభగా సమకూడి యెహోవాకు హోమం చెయ్యాలి. అది పండుగ ముగింపు రోజు, అందులో మీరు బ్రతుకుదెరువు కోసం ఏ పనీ చెయ్యకూడదు.
37 “ఇవి యెహోవా నియమించిన కాలాలు. యెహోవా నియమించిన విశ్రాంతి దినాలు కాకుండా, యెహోవాకు మీరు ఇచ్చే కానుకలూ మొక్కుబళ్ళూ స్వేచ్ఛార్పణలూ కాకుండా, ఈ నియామక కాలాలలో కూడ అర్పణలు తేవాలి. 38 పవిత్ర సభగా సమకూడవలసిన రోజులుగా వాటిని చాటించాలి. ఆ రోజులలో యెహోవాకు హోమాలను, నైవేద్యాలను, బలులను, పానార్పణలను సమర్పించాలి. ఏ రోజు అర్పణ ఆ రోజున తీసుకురావాలి.
39 “ఏడో నెల పదిహేనో రోజు నుంచి – మీరు పొలం పంట కూర్చుకొన్నప్పుడు – యెహోవాకు ఏడు రోజుల పండుగ ఆచరించాలి. మొదటి రోజు విశ్రాంతిదినం, ఎనిమిదో రోజు విశ్రాంతిదినం. 40 మొదటి రోజున మీరు దబ్బ పండ్లను, ఈతమట్టలను, ఆకులతో నిండి ఉన్న గొంజి చెట్ల కొమ్మలను, కాలువల దగ్గర పెరిగే నిరవంజి చెట్లను తీసుకురావాలి. ఏడు రోజులు మీ దేవుడైన యెహోవా సన్నిధానంలో సంతోషించాలి. 41 ఈ విధంగా మీరు ఏటేటా యెహోవాకు ఈ పండుగ ఏడు రోజులుగా ఆచరించాలి. మీ తరతరాలకు ఎప్పటికీ నిలిచివుండే చట్టమిది. ఈ పండుగ ఏడో నెలలో ఆచరించవలసినది. 42 అప్పుడు మీరు పర్ణశాలలలో ఉండాలి. నేను ఇస్రాయేల్ ప్రజలను ఈజిప్ట్‌దేశంనుంచి తీసుకు వచ్చినప్పుడు వారు పర్ణశాలలలో నివసించేలా చేశాను. 43 మీ తరతరాలవారు ఈ సంగతి తెలుసుకొనేలా ఇస్రాయేల్ దేశస్తులందరూ ఆ ఏడు రోజులు పర్ణశాలలలో ఉండిపోవాలి. నేను యెహోవాను, మీ దేవుణ్ణి”.
44 అప్పుడు మోషే ఇస్రాయేల్‌ప్రజలకు యెహోవా నియామక కాలాలు వివరించి చెప్పాడు.