22
1 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 2 “ఇస్రాయేల్ ప్రజలు నాకు ప్రతిష్ఠించినవాటి విషయంలో అహరోను, అతడి కొడుకులు జాగ్రత్తగా ఉండి, నా పవిత్రమైన పేరుకు అపకీర్తి కలిగించకూడదని వారితో చెప్పు. నేను యెహోవాను. 3 నీవు వారితో ఈ విధంగా చెప్పు – మీ తరతరాలకు, మీ సంతతివారందరిలో ఎవడైనా అశుద్ధంగా ఉన్నప్పుడు, ఇస్రాయేల్ ప్రజలు నాకు ప్రతిష్ఠించిన పవిత్రమైన వాటిని సమీపిస్తాడనుకోండి. అలాంటివాడు నా సన్నిధానంలో లేకుండా పోవాలి. నేను యెహోవాను.
4 “అహరోను సంతానంలో ఎవడికైనా చర్మవ్యాధి గానీ, ఏదైనా స్రావం గానీ ఉంటే అలాంటివాడు శుద్ధమయ్యేవరకు పవిత్రమైనవాటిని తినకూడదు. ఎవడైనా శవం వల్ల అశుద్ధం అయిపోయిన దేనినైనా తాకితే, ఎవడికైనా వీర్యస్ఖలనం జరిగితే, 5 ఎవడైనా అశుద్ధమైన పురుగును తాకితే, ఏదైనా అశుద్ధతవల్ల అశుద్ధంగా ఉన్న మనిషిని తాకితే అతడు అశుద్ధంగా ఉంటాడు. 6 అలాంటి అశుద్ధత తగిలినవాడు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటాడు. స్నానం చేసేవరకు అతడు పవిత్రమైన వాటిని తినకూడదు. 7 పొద్దు క్రుంకిన తరువాత అతడు శుద్ధంగా ఉంటాడు. అప్పుడు పవిత్రమైనవాటిని తినవచ్చు. అతడి ఆహారం అదే గదా. 8 చచ్చిన జంతువును గానీ పక్షిని గానీ, తినకూడదు. అలా తనను అశుద్ధంగా చేసుకోకూడదు. నేను యెహోవాను. 9 గనుక పాటించమని నేను ఇచ్చిన ఆజ్ఞలను వారు పాటించాలి. పాటించకపోతే నా ఆలయాన్ని అపవిత్రపరచి, అపరాధులై, మరణశిక్షకు గురి అవుతారు. నేను వారిని ప్రత్యేకించుకొన్న యెహోవాను.
10 “యాజి కాని వ్యక్తి ప్రతిష్ఠమైనదాన్ని తినకూడదు. యాజి ఇంట్లో ఉన్న అతిధి దాన్ని తినకూడదు, జీతగాడు తినకూడదు. 11 కాని, యాజి వెల ఇచ్చి కొనుక్కొన్నవాడు, అతడి ఇంట్లో పుట్టిన దాసుడు, యాజి తినే ఆహారాన్ని తినవచ్చు. 12 యాజి కూతురు యాజి కాని వాణ్ణి పెళ్ళాడితే ఆమె ప్రతిష్ఠితమైన అర్పణలలో దేనినీ తినకూడదు. 13 అయితే యాజి కూతురి భర్త చనిపోతాడనుకోండి, లేక ఆమెను విడిచిపెడతాడనుకోండి, ఆమెకు సంతానం లేదనుకోండి. పసితనంలో లాగే ఆమె పుట్టింటికి తిరిగి చేరుకొంటే, తన తండ్రి ఆహారాన్ని తినవచ్చు. అయితే హక్కు లేనివారెవరూ దానిని తినకూడదు. 14 అలాంటి వాడు పొరపాటున ప్రతిష్ఠితమైనదానిని తింటే, దాని విలువతో మరో అయిదో వంతు కలిపి యాజికివ్వాలి. 15 ఇస్రాయేల్ ప్రజలు యెహోవాకు ప్రతిష్ఠించిన అర్పణలు తినేహక్కు లేని వ్యక్తిని యాజి తిననివ్వకూడదు. అలా వాటిని అపవిత్ర పరచకూడదు, అలాంటి వ్యక్తిని తిననివ్వడంవల్ల అతడిమీదికి అపరాధం, శిక్ష తెచ్చిపెట్టకూడదు. 16 నేను యెహోవాను, అర్పణలను పవిత్ర పరచేవాణ్ణి.”
17 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 18 “అహరోనుతో, అతడి కొడుకులతో, ఇస్రాయేల్ ప్రజలందరితో ఈ విధంగా చెప్పు: ఇస్రాయేల్ వంశీయులలో గానీ ఇస్రాయేల్ దేశంలోని విదేశీయులలో గానీ ఎవరైనా యెహోవాకు హోమబలిని అర్పించదలిస్తే – అది ఏ రకమైన స్వేచ్ఛార్పణ కానివ్వండి, మొక్కుబడి కానివ్వండి – 19 ఆ బలి అంగీకారంగా ఉండాలంటే అతడు పశువులలో గానీ, గొర్రెమేకలలో గానీ లోపం లేని మగదానిని సమర్పించాలి. 20 లోపం గలదాన్ని సమర్పించ కూడదు. అది మీకోసం అంగీకారంగా ఉండదు. 21 ఎవరైనా మొక్కుబడి చెల్లించడానికి గానీ స్వేచ్ఛార్పణ అర్పించడానికి గానీ శాంతిబలిగా గొడ్లలోనుంచి లేదా గొర్రెమేకలలో నుంచి ఒకదానిని యెహోవాకు తెస్తాడనుకోండి. అది అంగీకారంగా ఉండాలంటే లోపం లేకుండా ఉండాలి. దానికి ఏ కళంకమూ ఉండకూడదు. 22 గుడ్డిదానిని గానీ, కుంటిదానిని గానీ, అంగవైకల్యం గల దానిని గానీ, పుండు గల దానిని గానీ, గజ్జిగలదానిని గానీ, తామర గలదానిని గానీ యెహోవాకు సమర్పించ కూడదు. వాటిలో దేనినీ బలిపీఠం మీద హోమంగా యెహోవాకు సమర్పించ కూడదు. 23 కురూపమైన కోడెను గానీ, గొర్రెమేకల మందలో ఒకదానిని గానీ స్వేచ్ఛార్పణగా అర్పించవచ్చు, అయితే అది మొక్కుబడిగా అంగీకారం కాదు. 24 విత్తులు నులిమినదానిని గానీ, విరిగినదానిని గానీ, చితికినదానిని గానీ, కోసినదానిని గానీ యెహోవాకు అర్పించకూడదు. మీ దేశంలో అలాంటిది అర్పించకూడదు. 25 అలాంటివాటిలో దేనినైనా విదేశీయుడు తెస్తే మీరు దాన్ని తీసుకొని మీ దేవునికి చెందిన ఆహారంగా అర్పించకూడదు. అలాంటివి లోపం గలవి. వాటికి కళంకం ఉంది, అవి మీకోసం అంగీకారంగా ఉండవు.”
26 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 27 “దూడ గానీ, గొర్రెపిల్ల గానీ, మేకపిల్ల గానీ పుడితే అది ఏడు రోజులు దాని తల్లితో ఉండాలి. అయితే ఎనిమిదో రోజు మొదలుకొని అది యెహోవాకు హోమబలిగా అంగీకారం. 28 ఆవును గానీ, గొర్రెను గానీ, మేకను గానీ దాని పిల్లలతోపాటు ఒకే రోజున వధించకూడదు. 29 మీరు కృతజ్ఞతాబలిని అర్పించేటప్పుడు నేను మిమ్ములను అంగీకరించేలా దానిని సరైన విధంగా అర్పించాలి. 30 అర్పించిన రోజే దాన్ని తినివేయాలి. మరుసటి రోజువరకు దానిలో కొంచెమైనా మిగల్చకూడదు. నేను యెహోవాను. 31 మీరు నా ఆజ్ఞలు శిరసావహించి వాటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉండాలి. నేను యెహోవాను. 32 నా పవిత్రమైన పేరుకు అపకీర్తి కలిగించకూడదు. ఇస్రాయేల్ ప్రజలలో నా పేరు పవిత్రమై ఉండాలి. నేను యెహోవాను, మిమ్ములను పవిత్రం చేసేవాణ్ణి. 33 నేను మీకు దేవుణ్ణయి ఉండేందుకు మిమ్ములను ఈజిప్ట్ దేశం నుంచి తీసుకువచ్చిన యెహోవాను.”