21
1 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, “అహరోను కొడుకులైన యాజులతో ఈ విధంగా చెప్పు – మీ ప్రజలలో చనిపోయినవారి శవాన్ని తాకి మీలో ఎవరూ తనను అశుద్ధం చేసుకోకూడదు. 2 అయితే తన రక్తసంబంధులలో ఎవరైనా చనిపోతే – తన తల్లి గానీ, తండ్రి గానీ, కొడుకు గానీ, కూతురు గానీ, తోబుట్టినవాడు గానీ, 3 పెళ్ళికాని కన్య అయి తన దగ్గర ఉన్న సోదరి గానీ చనిపోతే – వారి శవాన్ని తాకడం వల్ల తనను అశుద్ధం చేసుకోవచ్చు. 4 యాజి తన ప్రజలలో ప్రముఖుడు గనుక అతడు లౌకికుడుగా ప్రవర్తించకూడదు. అలా తనను అశుద్ధం చేసుకోకూడదు.
5 “యాజులు తమ తలలు బోడి చేసుకోరాదు. గడ్డం ప్రక్కలను క్షౌవరం చేసుకోకూడదు. శరీరంలో గాయాలు చేసుకోకూడదు.
6 “వారు తమ దేవునికి పవిత్రులుగా ఉండాలి. తమ దేవుని పేరుకు అపకీర్తి కలిగించకూడదు. వారు తమ దేవునికి చెందిన ఆహారాన్ని, అంటే, యెహోవాకు చెందిన హోమబలులు అర్పిస్తారు గదా! కనుక వారు పవిత్రంగా ఉండాలి.
7 “వారు వేశ్యను గానీ, భ్రష్ట స్త్రీని గానీ పెళ్ళి చేసుకోకూడదు. ఎందుకంటే యాజులు తమ దేవునికి ప్రత్యేకమైనవారు.
8 “మీ దేవునికి చెందిన ఆహారాన్ని వారు అర్పిస్తారు, గనుక వారు పవిత్రులని మీరు భావించాలి. నేను యెహోవాను. నేను పవిత్రుణ్ణి, మిమ్ములను పవిత్రం చేసేవాణ్ణి, గనుక వారు మీ దృష్టిలో పవిత్రులుగా ఉండాలి. 9 యాజులలో ఎవరి కూతురైనా వ్యభిచారం చెయ్యడం వల్ల తనను అపవిత్రం చేసుకొంటే, ఆమె తన తండ్రిని అపవిత్రం చేసినట్టే. ఆమెను మంటల్లో వేసి కాల్చివేయాలి.
10 “సాటి యాజులలో ప్రముఖయాజి కావడానికి తన తలమీద తైలాభిషేకం పొందినవాడు, యాజి విశేష వస్త్రాలు ధరించుకోవడానికి ప్రతిష్ఠించబడ్డ ఆ వ్యక్తి, తన తల విరబోసుకోకూడదు. తాను వేసుకొన్న బట్టలను చింపుకో కూడదు. 11 అతడు ఎవరి శవం దగ్గరికీ వెళ్ళకూడదు. తండ్రి శవం వల్ల గానీ, తల్లి శవం వల్ల గానీ తనను అశుద్ధం చేసుకోకూడదు. 12 అతడు తన దేవుని పవిత్ర నివాసాన్ని అపవిత్రం చెయ్యకుండేలా దాన్ని విడిచి వెళ్ళకూడదు. ఎందుకంటే, అతణ్ణి ప్రతిష్ఠించిన దేవుని అభిషేక తైలం అతడి మీద ఉంటుంది. నేను యెహోవాను.
13 “యాజి కన్యనే వివాహమాడాలి. 14 వితంతువును గానీ, విడిచిపెట్టబడ్డ స్త్రీని గానీ, భ్రష్ట స్త్రీని గానీ, వేశ్యను గానీ పెళ్ళి చేసుకోకూడదు; తన ప్రజలలో ఉన్న కన్యనే పెళ్ళి చేసుకోవాలి. 15 నేను యెహోవాను, అతణ్ణి ప్రత్యేకించుకొన్న వాణ్ణి, గనుక అతడు తన ప్రజలలో తన సంతానాన్ని అపవిత్రపరచకూడదు.
16 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 17 “నీవు అహరోనుతో ఈ విధంగా చెప్పు – తరతరాలకు నీ సంతానంలో ఎవడికైనా ఏదైనా లోపం ఉంటే, అతడు దేవునికి చెందిన ఆహారాన్ని అర్పించడానికి సమీపించకూడదు. 18 లోపం ఉన్నవాడెవడైనా సరే సమీపించకూడదు. గుడ్డివాడు గానీ, కుంటివాడు గానీ, ముఖరూపం చెడినవాడు గానీ, వికలాంగుడు గానీ, 19 కాలు విరిగినవాడు గానీ, చెయ్యి విరిగినవాడు గానీ, 20 గూనివాడు గానీ, మరుగుజ్జువాడు గానీ, కంటిలో పువ్వుగలవాడు గానీ, గజ్జిగలవాడు గానీ, తామరగలవాడు గానీ, బీజం నలిగినవాడు గానీ సమీపించకూడదు. 21 యాజి అయిన అహరోను సంతానంలో లోపం గల వాడెవ్వడూ యెహోవాకు హోమాలు అర్పించడానికి సమీపించకూడదు. అతడికి లోపం ఉంది, గనుక దేవునికి చెందిన ఆహారాన్ని అర్పించడానికి అతడు సమీపించకూడదు. 22 దేవునికి చెందిన ఆహారాన్ని అతడు తినవచ్చు. 23 అయినా, అతడు లోపం గలవాడుగా ఉండడం చేత అడ్డతెర దగ్గరికి చేరకూడదు, బలిపీఠాన్ని సమీపించకూడదు. నా పవిత్ర స్థలాలను అపవిత్రపరచకూడదు. నేనే వాటిని పవిత్రం చేసేవాణ్ణి. నేను యెహోవాను.”
24 మోషే అహరోనుతో, అతడి కొడుకులతో ఇస్రాయేల్ ప్రజలందరితో ఈ సంగతులు చెప్పాడు.