20
1 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 2 “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు – ఇస్రాయేల్ ప్రజలలో గానీ, ఇస్రాయేల్‌దేశంలో నివసించే విదేశీయులలో గానీ ఎవరైనా తమ సంతానంలో ఎవరినైనా మోలెక్✽దేవుడికి అర్పిస్తే వారిని చంపితీరాలి. మీ దేశ ప్రజలు వాళ్ళను రాళ్ళతో కొట్టాలి. 3 అలాంటి వ్యక్తి తన సంతానాన్ని మోలెక్‌దేవుడికి ఇచ్చి, నా పవిత్రాలయాన్ని అశుద్ధం చేశాడు, నా పవిత్రమైన పేరును దూషణకు గురి చేశాడు గనుక నేను ఆ వ్యక్తికి విరోధినై వాణ్ణి ప్రజలలో లేకుండా చేస్తాను. 4 ఆ మనిషి తన సంతానాన్ని మోలెక్‌కు ఇచ్చినప్పుడు మీ దేశప్రజలు నిర్లక్ష్యంగా ఉండి, వాణ్ణి చంపకపోతే, 5 నేను ఆ మనిషికీ వాడి కుటుంబంవాళ్ళకూ విరోధినై వాణ్ణి ప్రజలలో లేకుండా చేస్తాను. అంతే కాక, వాణ్ణి అనుసరించి మోలెక్‌దేవుడితో వ్యభిచారిణిలాగా✽ ప్రవర్తించిన వాళ్ళందరినీ కూడా ప్రజల్లో లేకుండా చేస్తాను.6 ✝“ఆ విధంగా, పూనకం వచ్చినవాళ్ళవైపు, సోదె చెప్పేవాళ్ళ వైపు తిరిగి, వాళ్ళను అనుసరించే వ్యక్తికి కూడా నేను విరోధినై అతణ్ణి ప్రజలలో లేకుండా చేస్తాను.
7 ✽“నేను యెహోవాను, మీ దేవుణ్ణి, గనుక మిమ్ములను మీరు పవిత్రపరచుకొని పవిత్రులై ఉండాలి. 8 ✝నా చట్టాలను పాటించి వాటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉండాలి. నేను మిమ్ములను పవిత్రపరచే యెహోవాను.
9 ✝“ఎవరైనా తన తండ్రినయినా తల్లినయినా దూషిస్తే వారిని చంపితీరాలి. వారు తమ తండ్రినో తల్లినో దూషించినందుచేత తమ మరణానికి వారే బాధ్యులు.
10 ✝“మరో మనిషి భార్యతో ఎవరైనా వ్యభిచారం చేస్తే, పొరుగువాడి భార్యతో వ్యభిచారం చేసిన ఆ వ్యక్తినీ ఆ వ్యభిచారిణినీ చంపితీరాలి.
11 ✝“ఎవడైనా తన తండ్రి భార్యతో పోతే అది తన తండ్రిని నగ్న శరీరిగా చేసినట్టే. అలా చేసిన ఆ ఇద్దరినీ చంపితీరాలి. వాళ్ళ చావుకు వాళ్ళే బాధ్యులు.
12 “ఎవడైనా తన కోడలితో పోతే వాళ్ళిద్దరినీ చంపితీరాలి. వాళ్ళు వరుసలు తప్పి పాపం చేశారు. వాళ్ళ చావుకు వాళ్ళే బాధ్యులు.
13 “పురుషుడు స్త్రీతో పోయినట్టు పురుషుడితో పోతే వాళ్ళిద్దరూ చేసినది చాలా అసహ్య కార్యం. వాళ్ళను చంపితీరాలి. వాళ్ళ చావుకు వాళ్ళే బాధ్యులు.
14 “ఎవడైనా ఒకామెను, ఆమె తల్లిని పెళ్ళి చేసుకొంటే అది దుర్మార్గం. మీ మధ్య దుర్మార్గం ఉండకుండేలా ఆ ముగ్గురినీ మంటల్లో వేసి కాల్చివేయాలి.
15 “పురుషుడు జంతువుతో సంపర్కం చేస్తే వాణ్ణి చంపితీరాలి. జంతువును కూడా చంపితీరాలి. 16 స్త్రీ తనను జంతువు పొందేలా దాని దగ్గరికి పోతే ఆమెనూ ఆ జంతువునూ చంపితీరాలి. ఆమె, అది తప్పక చావాలి. తమ చావుకు బాధ్యత తమదే.
17 “ఒకడు తన తోబుట్టువును – ఆమె పినతండ్రి కూతురు కానియ్యి, తన తల్లి కూతురు కానియ్యి – చేర్చుకొని ఆమె దిసమొలను చూస్తే, అతడి దిసమొలను ఆమె చూస్తే అది సిగ్గుచేటు. వాళ్ళ ప్రజల కళ్ళెదుటే వాళ్ళను ప్రజల్లో లేకుండా చేయాలి. వాడు తన తోబుట్టువును నగ్న శరీరిగా చేశాడు. వాడు తన అపరాధం భరించాలి.
18 “ఎవరైనా కడగా ఉన్న ఆమెతో పోయి ఆమెను నగ్న శరీరిగా చేస్తే అతడు ఆమె రక్తధారను దిగంబరం చేశాడు, ఆమె తన రక్తధారను దిగంబరం చేసింది. వాళ్ళిద్దరినీ తమ ప్రజలలో లేకుండా చేయాలి.
19 “నీ తల్లి తోబుట్టువును గానీ, నీ తండ్రి తోబుట్టువును గానీ నగ్న శరీరిగా చెయ్యకూడదు. అలా చేసినవాడు తన సమీప బంధువురాలిని నగ్నశరీరిగా చేశాడు. వాళ్ళు తమ అపరాధం భరించాలి.
20 “తన పినతండ్రి భార్యతో గానీ, మేనమామ భార్యతో గానీ ఎవరైనా పోతే అది అతణ్ణి నగ్నశరీరిగా చేసినట్టే. అలా చేసిన ఆ స్త్రీ పురుషులు తమ అపరాధం భరించాలి. వాళ్ళకు సంతానం ఎన్నడూ కలగదు.
21 “ఎవరైనా తన తోబుట్టినవాడి భార్యను చేర్చుకొంటే అది అసహ్యం. అది తోబుట్టినవాణ్ణి నగ్నశరీరిగా చేసినట్టే. వాళ్ళకు ఎన్నడూ సంతానం కలగదు.
22 ✽“కాబట్టి, మీరు నా చట్టాలన్నీ, నా న్యాయనిర్ణయాలన్నీ పాటించి వాటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉండాలి. అలాంటప్పుడు మీరు నివసించడానికి నేను మిమ్ములను తీసుకుపోతున్న దేశం మిమ్ములను వెళ్ళగక్కివేయదు. 23 ✝నేను మీ ఎదుటనుంచి వెళ్ళగొట్టే ప్రజల వాడుకల ప్రకారం మెలగకూడదు. పై చెప్పినవాటిని వాళ్ళు జరిగించారు గనుక వాళ్ళంటే నాకు అసహ్యం. 24 ✝మీరు వాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకొంటారు. అది పాలు తేనెలు నదులై పారుతున్న దేశం. ఆ దేశం మీది అయ్యేలా దాన్ని మీకిచ్చానని మీతో చెప్పాను గదా! నేను యెహోవాను; ఇతర ప్రజలలోనుంచి మిమ్ములను ప్రత్యేకించుకొన్న మీ దేవుణ్ణి.
25 ✝“అందుచేత మీరు శుద్ధ జంతువులను అశుద్ధ జంతువులనుంచీ, శుద్ధ పక్షులను అశుద్ధ పక్షులనుంచీ ప్రత్యేకించాలి. అశుద్ధమని నేను మీకు వేరు చేసిన ఏ జంతువువల్ల గానీ, ఏ పక్షివల్ల గానీ, నేల మీద తిరిగే ఏ ప్రాణివల్ల గానీ మిమ్ములను అసహ్యం చేసుకోకూడదు. 26 నేను యెహోవాను; నేను పవిత్రుణ్ణి; మీరు నావారు కావాలని ఇతర ప్రజలనుంచి మిమ్ములను ప్రత్యేకించుకొన్నాను; గనుక మీరు నాకు పవిత్రప్రజగా ఉండాలి.
27 ✝“పురుషుడు గానీ, స్త్రీ గానీ పూనకం వచ్చి పలికితే సోదె చెపితే వాళ్ళను చంపితీరాలి. వాళ్ళను రాళ్ళతో కొట్టాలి. వాళ్ళ చావుకు వాళ్ళే బాధ్యులు.”