19
1 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 2 “నీవు ఇస్రాయేల్ ప్రజల సమాజమంతటితో ఈ విధంగా చెప్పు – నేను మీ దేవుడు యెహోవాను. నేను పవిత్రుణ్ణి గనుక మీరూ పవిత్రులై ఉండాలి.
3 “మీలో ప్రతి వ్యక్తీ తన తల్లిపట్ల, తండ్రి పట్ల గౌరవం చూపాలి. నేను నియమించిన విశ్రాంతి దినాలను ఆచరించాలి. నేను యెహోవాను. మీ దేవుణ్ణి.
4 “మీరు వ్యర్థమైన వాటివైపు తిరగకూడదు. పోత విగ్రహాలను చేసుకోకూడదు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.
5 “మీరు యెహోవాకు శాంతిబలి అర్పిస్తే, అది అంగీకారంగా ఉండేలా తగిన విధంగా దాన్ని అర్పించాలి. 6 మీరు దాన్ని అర్పించిన రోజూ, తరువాతి రోజూ దాన్ని తినాలి. మూడో రోజు వరకూ మిగిలినదానిని పూర్తిగా కాల్చివేయాలి. 7 మూడో రోజు దానిలో కొంచెమైనా తింటే అది అసహ్యమవుతుంది. నేను దాన్ని అంగీకరించను. 8 మూడో రోజు దాన్ని తిన్నవాడు యెహోవాకు చెందిన పవిత్రమైనదాన్ని అపవిత్రం చేశాడు గనుక అతడు తన అపరాధం భరించాలి. అతణ్ణి ప్రజల్లో లేకుండా చేయాలి.
9 “మీరు మీ పొలం పంట కోసేటప్పుడు పొలం గట్టుదాకా పూర్తిగా కోయగూడదు, కోతతో పరిగె ఏరుకోకూడదు. 10 మీ ద్రాక్ష తీగెలనుంచి పళ్ళన్నీ కూర్చుకోకూడదు. ద్రాక్ష తోటలో రాలిన పళ్ళు ఏరుకోకూడదు. బీదలకు, విదేశీయులకు వాటిని విడిచిపెట్టాలి. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.
11 “మీరు దొంగతనం చేయకూడదు. మోసంతో వ్యవహరించకూడదు. ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పకూడదు.
12 “నా పేర అబద్ధంగా శపథం చేయకూడదు. దానివల్ల మీ దేవుని పేరు దూషణపాలు అవుతుంది. నేను యెహోవాను. 13 మీ పొరుగువాణ్ణి పీడించకూడదు, దోచుకోకూడదు. కూలివారి కూలి మరుసటి రోజువరకు మీ దగ్గర ఉంచకూడదు.
14 “చెవిటివాణ్ణి తిట్టకూడదు. గుడ్డివాడి ఎదుట అడ్డు బండలు వేయకూడదు. మీ దేవుడి పట్ల భయభక్తులు చూపాలి. నేను యెహోవాను.
15 “అన్యాయమైన తీర్పులు తీర్చకూడదు. బీదవాడని పక్షపాతం చూపకూడదు; న్యాయంతో మీ సాటి మానవుడికి తీర్పు తీర్చాలి.
16 “మీ ప్రజలలో ఎవరూ కొండెగాడుగా తిరగకూడదు. మీ పొరుగువాడు ప్రాణాపాయంలో ఉంటే మీరు నిర్లక్ష్యంగా నిలబడకూడదు. నేను యెహోవాను.
17 “మీ హృదయంలో స్వదేశస్థుల మీద పగపట్టకూడదు. మీ పొరుగువాడి అపరాధం మీమీదికి రాకుండేలా మీరు వాణ్ణి తప్పకుండా మందలించాలి.
18 “కీడుకు ప్రతికీడు చెయ్యకూడదు. మీ ప్రజలమీద కోపం ఉంచుకోకూడదు. మిమ్ములను ప్రేమించుకొన్నట్టే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి, నేను యెహోవాను.
19 “మీరు నా చట్టాల ప్రకారం ప్రవర్తించాలి. మీ జంతువులను ఇతర జాతి జంతువులను జత కూడనియ్యకూడదు. మీ పొలంలో రెండు జాతుల విత్తనాలు చల్లకూడదు. రెండు రకాల దారాలతో నేసిన బట్ట వేసుకోకూడదు.
20 “దాసిగా ఉన్న అమ్మాయికి వివాహం నిశ్చయం అయిందనుకోండి. ఆమెకు విడుదల కలగలేదు, స్వతంత్రం లేదు. వేరొకడు ఆమెతో పోతే శిక్ష తప్పక ఉండాలి. ఆమెకు స్వతంత్రం లేదు గనుక వారికి మరణ శిక్ష విధించకూడదు. 21 అలా చేసిన వ్యక్తి అపరాధ బలిగా ఒక పొట్టేలును సన్నిధిగుడారం ద్వారానికి యెహోవా సముఖంలోకి తీసుకురావాలి. 22 యాజి అపరాధ బలి పొట్టేలును సమర్పించి యెహోవా సన్నిధానంలో అతడి పాపాన్ని కప్పివేస్తాడు. ఈ విధంగా అతడు చేసిన పాపం విషయం అతడికి క్షమాపణ దొరుకుతుంది.
23 “మీరు కనాను దేశానికి చేరి అక్కడ నానా రకాల ఫలవృక్షాలను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రమని భావించాలి. అంటే, అవి మూడేళ్ళ వరకు మీకు అపవిత్రంగా ఉండాలి. వాటిని తినకూడదు. 24 నాలుగో ఏట యెహోవాకు స్తుతి నైవేద్యంగా అర్పించడానికి ఆ చెట్ల పండ్లన్నీ పవిత్రంగా ఉంటాయి. 25 అయిదో ఏట వాటి పండ్లు తినవచ్చు. ఈ విధంగా చేస్తే ఆ చెట్లు మీకు ఎక్కువగా కాస్తాయి. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.
26 “మీరు దేనినీ దాని రక్తంతోపాటు తినకూడదు.
“శకునాలు చూడకూడదు, మంత్రవిద్య అభ్యసించ కూడదు.
27 “మీ తలకు ప్రక్కల ఉన్న వెండ్రుకలను గుండ్రంగా కత్తిరించకూడదు. మీ గడ్డం ప్రక్కలను గొరగకూడదు.
28 “చనిపోయినవారి కోసం మీ శరీరంలో గాయాలు చేసుకోకూడదు; దేహం మీద పచ్చబొట్లు పొడుచుకోకూడదు. నేను యెహోవాను.
29 “మీ కూతురును వేశ్యగా చేయకూడదు. ఆ విధంగా ఆమెను అపవిత్రం చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే దేశమంతా వేశ్యలమయంగా ఉంటుంది, పోకిరితనంతో నిండిపోతుంది.
30 “నేను నియమించిన విశ్రాంతి దినాలను మీరు ప్రత్యేక దినాలుగా ఆచరించాలి. నా పవిత్రాలయాన్ని భయభక్తులతో చూడాలి. నేను యెహోవాను.
31 “పూనకం వచ్చేవాళ్ళ దగ్గరికి, సోదె చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళ వల్ల మీరు అశుద్ధులవుతారు. వాళ్ళను వెదకకూడదు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.
32 “తల నెరసిన వ్యక్తి సముఖంలో నిలబడాలి. ముసలివాడి ముఖాన్ని గౌరవించాలి. మీ దేవుని పట్ల భయభక్తులు చూపాలి. నేను యెహోవాను.
33 “మీ దేశంలో మీ మధ్య విదేశీయుడు నివసిస్తే అతడికి కీడు చెయ్యకూడదు. 34 మీ మధ్య నివసించే విదేశీయుణ్ణి స్వదేశీయుణ్ణి సమదృష్టితో చూడాలి. మిమ్మల్నెలాగో అతణ్ణి అలాగే చూడాలి. మీరు ఈజిప్ట్‌లో విదేశీయులు గదా. నేను మీ దేవుడైన యెహోవాను.
35 “అన్యాయమైన తీర్పులు తీర్చకూడదు. కొలతలో గానీ, తూకంలో గానీ, పరిమాణంలో గానీ అన్యాయం చేయకూడదు. 36 సరైన త్రాసులు, సరైన తూకం రాళ్ళు, సరైన తూము, సరైన కొలత మీరు వినియోగించాలి. నేను యెహోవాను; ఈజిప్ట్ దేశం నుంచి మిమ్ములను తీసుకువచ్చిన మీ దేవుణ్ణి. 37 మీరు నా చట్టాలన్నీ, నా న్యాయనిర్ణయాలన్నీ పాటించి వాటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉండాలి. నేను యెహోవాను.”