18
1 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 2 “నీవు ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు – నేను యెహోవాను, మీ దేవుణ్ణి. 3 పూర్వం మీరు కాపురమున్న ఈజిప్ట్ దేశం వాళ్ళలాగా మీరు ప్రవర్తించకూడదు. నేను మిమ్ములను తీసుకుపోతున్న కనానుదేశం వాళ్ళలాగా కూడా మీరు మెలగకూడదు. వాళ్ళ ఆచారాలను అనుసరించి నడుచు కోకూడదు. 4 నా న్యాయనిర్ణయాల ప్రకారం, మీరు ప్రవర్తిస్తూ ఉండాలి. నా చట్టాలలో నడుచుకొంటూ ఉండాలి. నేను యెహోవాను. మీ దేవుణ్ణి. 5 కనుక మీరు నా చట్టాలను, నా న్యాయనిర్ణయాలను పాటించాలి. వాటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉండేవాడు వాటివల్ల బ్రతుకుతాడు. నేను యెహోవాను.
6 “నేను యెహోవాను. మీలో ఎవరూ తన రక్తసంబంధులను సమీపించి వారిని నగ్న శరీరులుగా చేయకూడదు.
7 “మీ తండ్రిని నగ్న శరీరిగా చేయకూడదు. మీ తల్లిని నగ్న శరీరిగా చేయకూడదు. ఆమె మీ తల్లి. ఆమెను నగ్న శరీరిగా చేయకూడదు.
8 “మీ తండ్రి భార్యను నగ్న శరీరిగా చేయకూడదు. ఆమెది మీ తండ్రి నగ్నతే.
9 “మీ సోదరిని నగ్న శరీరిగా చేయకూడదు. ఆమె మీ తండ్రి కూతురు కానియ్యి, మీ తల్లి కూతురు కానియ్యి; ఆమె ఇంట్లో పుట్టినా, వేరే స్థలంలో పుట్టినా ఆమెను నగ్న శరీరిగా చేయకూడదు.
10 “మీ కొడుకు కూతురును, మీ కూతురి కూతురును నగ్నశరీరిగా చెయ్యకూడదు. వారి నగ్నత మీదే.
11 “మీ తండ్రి భార్య కూతురు మీ తండ్రికి పుట్టింది. ఆమె మీ సోదరి. ఆమెను నగ్న శరీరిగా చెయ్యకూడదు.
12 “మీ తండ్రి సోదరిని నగ్నశరీరిగా చెయ్యకూడదు. ఆమె మీ తండ్రికి రక్తసంబంధి.
13 “మీ తల్లి సోదరిని నగ్నశరీరిగా చెయ్యకూడదు. ఆమె మీ తల్లికి సమీపబంధువు.
14 “మీ తండ్రి తోడబుట్టినవాణ్ణి నగ్నశరీరిగా చెయ్యకూడదు – అంటే అతడి భార్యను ముట్టడానికి సమీపించకూడదు. ఆమె మీ పినతల్లి.
15 “మీ కోడలును నగ్నశరీరిగా చెయ్యకూడదు. ఆమె మీ కొడుకు భార్య. ఆమెను నగ్నశరీరిగా చెయ్యకూడదు.
16 “మీ తోడబుట్టినవాడి భార్యను నగ్నశరీరిగా చెయ్యకూడదు. ఆమెది అతడి నగ్నతే.
17 “ఒక స్త్రీనీ ఆమె కూతురునూ నగ్నశరీరులుగా చెయ్యకూడదు. ఆమె కొడుకు కూతురును గానీ, ఆమె కూతురు కూతురును గానీ నగ్న శరీరిగా చేయడానికి వారిని చేర్చు కోకూడదు. అలా చేయడం అవినీతి. వారు సమీప బంధువులు.
18 “మీ భార్య బ్రతికి ఉండగానే ఆమె సోదరిని నగ్న శరీరిగా చేయడానికి సవతిగా చేర్చుకోకూడదు.
19 “అశుద్ధత వల్ల స్త్రీ కడగా ఉంటే ఆమెను నగ్న శరీరిగా చేయడానికి ఆమెను సమీపించకూడదు.
20 “మీ పొరుగువాడి భార్యతో శయనించకూడదు. అలా చేస్తే మీరు అశుద్ధులవుతారు.
21 “మీ సంతానంలో ఎవరినీ మోలెక్‌దేవుడికి అర్పించ కూడదు. ఆ విధంగా మీ దేవుని పేరుకు అపకీర్తి కలిగించ కూడదు, నేను యెహోవాను.
22 “స్త్రీతో శయనించినట్టు పురుషుడితో శయనించకూడదు. అది అసహ్యం. 23 “ఏ జంతువుతో సంపర్కం చేయకూడదు. దానివల్ల మీరు అశుద్ధులవుతారు. జంతువు స్త్రీని పొందేందుకు ఆమె దాని ఎదుట నిలబడకూడదు. అలా చెయ్యడం అసహ్యం.
24  “ఈ కార్యాలలో దేనివల్లా అశుద్ధులు కాకూడదు. నేను మీ ఎదుట నుంచి వెళ్ళగొట్టబోయే జనాలు ఇవన్నీ చేసి అశుద్ధులయ్యారు. 25 ఆ దేశం అశుద్ధమైపోయింది, గనుక దానికి సరిపోయిన శిక్షను నేను దానిమీదికి రప్పిస్తున్నాను. దాని నివాసులు అది వెళ్ళగ్రక్కివేస్తున్నది. 26 అందుచేత మీరు నా చట్టాలను, నా న్యాయనిర్ణయాలను పాటిస్తూ ఆ అసహ్య కార్యాలలో దేనినీ చెయ్యకూడదు. స్వదేశీయుడు గానీ, మీలో ఉంటున్న విదేశీయుడు గానీ వాటిని చెయ్యకూడదు. 27 ఆ దేశం మీవల్ల అశుద్ధమై మీకు పూర్వమున్న ప్రజలు వెళ్ళగ్రక్కివేస్తున్నట్టు మిమ్ములను కూడా వెళ్ళగ్రక్కివేయకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. 28 మీకు పూర్వమున్న ఆ దేశనివాసులు ఈ అసహ్య కార్యాలన్నీ చేయడం వల్ల ఆ దేశం అశుద్ధమైపోయింది. 29 మీలో ఎవరైనా అలాంటి అసహ్య కార్యాలలో దేనినైనా చేస్తే వారిని ప్రజలలో లేకుండా చేయాలి. 30 గనుక మీరు వచ్చేముందు ఆ దేశస్తులు చేసిన ఈ అసహ్యమైన వాడుకలను అనుసరించకుండా, వాటివల్ల అశుద్ధులు కాకుండేలా మీరు నా ఆజ్ఞలు శిరసావహించాలి. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.”