17
1 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 2 “నీవు అహరోనుతో, అతడి కొడుకులతో, ఇస్రాయేల్ ప్రజలందరితో ఈ విధంగా చెప్పు: ఇది యెహోవా ఆజ్ఞాపించిన విషయం – 3 ఇస్రాయేల్ ప్రజల్లో ఎవరైనా ఎద్దును గానీ, గొర్రెను గానీ, మేకను గానీ యెహోవాకు బలిగా అర్పించాలనుకొంటే, ఆ వ్యక్తి దాన్ని యెహోవా నివాసం ఎదుటికి సన్నిధిగుడారం ద్వారానికి తేవాలి. ఒకవేళ అతడు శిబిరంలో గానీ, శిబిరం వెలుపల గానీ వేరే చోట దాన్ని వధిస్తే 4 ఆ వ్యక్తిని తన ప్రజలలో లేకుండా చేయాలి. అతడు రక్తాన్ని చిందించినవాడు; రక్తం విషయంలో అతడు అపరాధి అని నిర్ణయించాలి. 5 కారణ మేమిటంటే, ఇస్రాయేల్ ప్రజలు బయట వధిస్తున్న బలిపశువులను ఇకనుంచి బయట వధించకుండా యెహోవా దగ్గరకు తేవాలి. సన్నిధిగుడారం ద్వారానికి యాజిదగ్గరకి వాటిని తెచ్చి శాంతి బలులుగా యెహోవాకు సమర్పించాలి. 6 యాజి సన్నిధిగుడారం ద్వారం దగ్గర ఉన్న యెహోవా బలిపీఠం మీద వాటి రక్తాన్ని చిలకరించాలి. యెహోవాకు పరిమళ అర్పణగా వాటి కొవ్వును కాల్చివేయాలి. 7 ఇంతకుముందు ఇస్రాయేల్ ప్రజ వ్యభిచారిణిలాగా దయ్యాల వెంటబడుతూ వాటికి బలులు అర్పిస్తూ ఉన్నారు. ఇక నుంచి వారు అలా చెయ్యకూడదు. ఇది తరతరాలకు వారికి ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం. 8 అందుచేత నీవు వారితో ఇలా చెప్పాలి – ఇస్రాయేల్ ప్రజల్లో, వారి మధ్య ఉన్న పరదేశుల్లో ఎవరైనా హోమబలిని గానీ, వేరే బలిని గానీ, యెహోవాకు అర్పించడానికి సన్నిధిగుడారం ద్వారానికి తీసుకురాకుండా, 9 వేరే చోట అర్పిస్తే ఆ వ్యక్తిని తన ప్రజలలో లేకుండా చేయాలి.
10 “అంతేగాక, ఇస్రాయేల్ ప్రజలలో గానీ, వారి మధ్య ఉంటున్న పరదేశులలో గానీ ఎవరైనా దేని రక్తాన్నైనా తింటే, రక్తాన్ని తిన్న ఆ వ్యక్తికి నా ముఖం విరోధంగా ఉంటుంది. నేను అతణ్ణి అతడి ప్రజలలో లేకుండా చేస్తాను. 11 ఎందుకంటే శరీరానికి ప్రాణం రక్తంలో ఉన్నది. బలిపీఠం మీద మీ పాపాలను కప్పివేయడానికి దాన్ని మీకు నియమించాను. రక్తంలో ఉన్న ప్రాణం కారణంగా అది ప్రాయశ్చిత్తం చేస్తుంది. 12 అందుచేత మీలో గానీ, మీ మధ్య ఉంటున్న పరదేశులలో గానీ ఎవ్వరూ రక్తాన్నీ తినకూడదని నేను ఇస్రాయేల్ ప్రజలకు ఆజ్ఞాపించాను.
13 “ఇస్రాయేల్ ప్రజల్లో, వారి మధ్య ఉంటున్న పరదేశుల్లో ఎవరైనా వేటకు వెళ్ళి తినతగ్గ జంతువును గానీ, పక్షిని గానీ పడితే అతడు దాని రక్తాన్ని పూర్తిగా ఒలికించాలి. రక్తాన్ని మట్టిలో కప్పివేయాలి. 14 ఎందుకంటే, శరీరం ఉన్న ప్రతిదానికీ దాని రక్తమే ప్రాణాధారం. అందుచేత, మీరు ఏ ప్రాణి రక్తాన్నీ తినకూడదు. శరీరంతో ఉన్న ప్రతిదానికీ ప్రాణం దాని రక్తమే; రక్తాన్ని తినే వ్యక్తిని లేకుండా చేయాలని నేను ఇస్రాయేల్ ప్రజలకు ఆజ్ఞాపించాను.
15 “చచ్చిన జంతువును గానీ పక్షిని గానీ, మృగాలు చీల్చిన జంతువును గానీ పక్షిని గానీ ఎవరైనా తింటే ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని స్నానం చేయాలి. స్వదేశస్తుడు, విదేశస్తుడు కూడా అలా చెయ్యాలి. ఆ వ్యక్తి సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటాడు. తరువాత శుద్ధం అవుతాడు. 16 కాని, అతడు తన బట్టలు ఉతుక్కోకుండా స్నానం చేయకుండా ఉంటే అతడు తన అపరాధం భరించాలి.”