16
1 ✽ అహరోను కొడుకులలో✽ ఇద్దరు యెహోవా సముఖాన్ని సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇలా అన్నాడు: 2 “నీ అన్న అహరోను చావకుండేలా✽ అతడు ఒడంబడిక మందసం మీది ప్రాయశ్చిత్తస్థానమైన మూత ముందున్న అడ్డతెర లోపల అతి పవిత్ర స్థలంలోకి అన్ని సమయాల్లో✽నూ రాకూడదు. ఎందుకంటే నేను ఈ మూతమీద మేఘంలో కనిపిస్తాను. ఈ సంగతి అతడితో చెప్పు. 3 అహరోను పవిత్ర స్థలంలోకి రావలసిన విధం ఇదే: “అతడు పాపాలకోసం బలి✽గా కోడెనూ, హోమబలి✽గా పొట్టేలునూ తీసుకురావాలి. 4 ✝అతడు సన్ననారతో నేసిన శుద్ధమైన చొక్కాయి, సన్ననార షరాయి తొడుక్కొని, సన్ననార నడికట్టు కట్టుకొని, సన్ననార పాగా పెట్టుకోవాలి. అవి శుద్ధమైన వస్త్రాలు గనుక స్నానం చేసి వాటిని తొడుక్కోవాలి. 5 ✝అతడు ఇస్రాయేల్ సమాజం దగ్గరనుంచి పాపాలకోసం బలిగా రెండు మేకపోతులను, హోమబలిగా ఒక పొట్టేలును తీసుకోవాలి.6 ✝“అహరోను పాపాలకోసం బలిగా తన కోడెను సమర్పించి తన పాపాలను, తన ఇంటివారి పాపాలను కప్పివేయాలి. 7 ✽తరువాత ఆ రెండు మేకపోతులను సన్నిధిగుడారం ద్వారం దగ్గరికి యెహోవా సన్నిధానంలోకి తీసుకువచ్చి అక్కడ ఉంచాలి. 8 మేకపోతుల్లో ఒకదాన్ని యెహోవాకోసం, ఇంకోదానిని విడిచిపెట్టడం కోసం, అహరోను వాటిమీద చీట్లు వేయాలి. 9 ఏ మేకమీద ‘యెహోవాకోసం’ అనే చీటి పడుతుందో ఆ మేకపోతును పాపాలకోసం బలిగా అహరోను అర్పించాలి. 10 ఏ మేకపోతు మీద ‘విడిచి పెట్టాలి’ అనే చీటి పడుతుందో దాన్ని ప్రాణంతోనే యెహోవా సన్నిధానంలో ఉంచాలి. దానివల్ల ప్రజల పాపాలు కప్పివేయబడేలా తరువాత దాన్ని అరణ్యంలో విడిచిపెట్టాలి.
11 “అప్పుడు పాపాలకోసం బలిగా తన కోడెను అహరోను యెహోవా దగ్గరకు తీసుకువచ్చి దాన్ని అర్పించి తన పాపాలను, తన ఇంటివారి పాపాలను కప్పివెయ్యాలి. తన పాపాలకోసమైన ఆ బలి కోడెను వధించాలి. 12 ✝యెహోవా సన్నిధానంలో ఉన్న బలిపీఠం మీది నిప్పుకణికెలతో ధూపార్తి నింపి, దాన్నీ రెండు పిడికిళ్ళ పరిమళ ధూప చూర్ణాన్నీ అడ్డతెర లోపలికి తీసుకురావాలి. 13 ✝అక్కడ ఆ ధూమం మబ్బులాగా శాసనాలపెట్టెమీది ప్రాయశ్చిత్తస్థానమైన మూతను కమ్మేలా అతడు యెహోవా సముఖంలో ఆ నిప్పుమీద ఆ ధూపద్రవ్యం వెయ్యాలి. అలా వేస్తే అతడు అక్కడ చనిపోడు. 14 ✝అంతేగాక ఆ కోడె రక్తంలో కొంత తీసుకొని ఆ మూతమీద తూర్పు దిక్కుగా తన వ్రేలితో చిలకరించాలి; ఆ మూత ఎదుట ఆ రక్తంతో కొంత తన వ్రేలితో ఏడు సార్లు చిలకరించాలి.
15 ✝“ఆ తరువాత యాజి ప్రజల పాపాలకోసమైన బలి మేకపోతును వధించాలి. దాని రక్తాన్ని అడ్డతెర లోపలికి తీసుకువచ్చి, ఆ కోడె రక్తంతో అడ్డతెర లోపలికి తీసుకువచ్చి, ఆ కోడె రక్తంతో చేసినట్టే దాన్ని ఆ మూత మీదా, మూత ఎదుటా చిలకరించాలి. 16 ✽ ఈ విధంగా అతడు ఇస్రాయేల్ ప్రజల పాపాలన్నిటిలోనూ ఇమిడి ఉన్న అశుద్ధత, తిరుగుబాటు కారణంగా అతి పవిత్ర స్థలానికి ప్రాయశ్చిత్తం✽ చేయాలి. సన్నిధిగుడారం వారి అశుద్ధతల మధ్య ఉన్నది, గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తం చెయ్యాలి. 17 ✽అతి పవిత్ర స్థలంలో ప్రాయశ్చిత్తం చేయడానికి యాజి లోపలికి వెళ్ళినప్పటినుంచి బయట వచ్చేవరకు – తనకోసం, తన ఇంటివారికోసం, ఇస్రాయేల్ ప్రజల సర్వసమాజం కోసం ప్రాయశ్చిత్తం చేస్తున్న ఆ సమయంలో – ఇంకెవ్వరూ సన్నిధిగుడారంలో ఉండకూడదు.
18 “తరువాత అతడు యెహోవా సన్నిధానంలో ఉన్న బలిపీఠందగ్గరకి వెళ్ళి, దానికి ప్రాయశ్చిత్తం చెయ్యాలి. అతడా కోడె రక్తంలో కొంత, ఆ మేకపోతు రక్తంలో కొంత తీసుకొని బలిపీఠం కొమ్ముల మీద పూయాలి. 19 ఆ రక్తంలో కొంత తన వ్రేలితో బలిపీఠం మీద ఏడు సార్లు చిలకరించి దాన్ని శుద్ధి చెయ్యాలి. ఇస్రాయేల్ ప్రజల అశుద్ధత విషయంలో దాన్ని పవిత్రం చెయ్యాలి.
20 “అహరోను పవిత్ర స్థలానికీ సన్నిధిగుడారానికీ బలిపీఠానికీ పూర్తిగా ప్రాయశ్చిత్తం చేసిన తరువాత ప్రాణంతో ఉన్న ఆ మేకపోతును దగ్గరకు తీసుకురావాలి. 21 ✽అప్పుడు అతడు ఆ మేకపోతు తల మీద రెండు చేతులుంచాలి. ఇస్రాయేల్ ప్రజల అపరాధాలన్నీ తిరుగుబాటు కార్యాలన్నీ – వారి పాపాలన్నీ – ఆ మేకపోతు మీద చేతులుంచి ఒప్పుకోవాలి. ఈ విధంగా వాటిని ఆ మేకపోతు తలమీద మోపాలి. ఆ పనికి నియమించిన మనిషిచేత ఆ మేకపోతును అరణ్యంలోకి పంపించాలి. 22 ఆ మేకపోతు వారి అపరాధాలన్నీ నిర్జన ప్రదేశానికి మోసుకు పోతుంది. ఆ మనిషి ఆ మేకపోతును అరణ్యంలో విడిచిపెట్టాలి.
23 “అప్పుడు అహరోను సన్నిధిగుడారంలోకి రావాలి. పవిత్ర స్థలంలోకి వెళ్ళిన సమయంలో తాను వేసుకొన్న సన్ననార బట్టలను తీసి అక్కడ ఉంచాలి. 24 ఒక పవిత్రమైన చోట స్నానం చేసి బట్టలు వేసుకోవాలి. వెలుపలికి వచ్చి, తన హోమబలినీ ప్రజల హోమబలినీ అర్పించి, తన పాపాలను, ప్రజల పాపాలను కప్పివేయాలి. 25 పాపాలకోసం బలి పశువు క్రొవ్వును బలిపీఠం మీద కాల్చివేయాలి.
26 “విడిచిపెట్టవలసిన మేకపోతును వదలివేసినవాడు తన బట్టలు ఉతుక్కొని స్నానం చెయ్యాలి. ఆ తరువాత శిబిరంలోకి రావచ్చు. 27 ✽పవిత్ర స్థలంలో ప్రాయశ్చిత్తం చేయడానికి పాపాలకోసం బలి కోడె రక్తం, పాపాలకోసం బలి మేకపోతు రక్తం అతి పవిత్ర స్థలంలోకి తేవడం జరుగుతుంది గదా. వాటి కళేబరాలను ఒకడు శిబిరం వెలుపలికి తీసుకుపోవాలి. అక్కడ వాటి చర్మాన్నీ, మాంసాన్నీ, పేడను పూర్తిగా కాల్చివేయాలి. 28 వాటిని కాల్చివేసినవాడు తన బట్టలు ఉతుక్కొని స్నానం చేయాలి. ఆ తరువాత అతడు శిబిరంలోకి రావచ్చు.
29 ✽“ఇది మీకు ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం – ఏడో నెల పదో రోజు మీరంతా మిమ్ములను అదుపు చేసుకోవాలి. ఆ రోజు స్వదేశీయులు గానీ, మీ మధ్య ఉన్న పరదేశులు గానీ ఏ పనీ చెయ్యకూడదు. 30 ఎందుకంటే, మిమ్ములను శుద్ధం చేయడానికి ఆ రోజున మీ పాపాలను కప్పివేయడం జరుగుతుంది. మీరు యెహోవా సన్నిధానంలో మీ తప్పిదాలన్నిటి నుంచి✽ శుద్ధులవుతారు. 31 ఆ రోజు మీకు విశ్రాంతి దినం. అప్పుడు మీరంతా మిమ్ములను అదుపు చేసుకోవాలి. ఇది ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం. 32 తన తండ్రి స్థానంలో యాజిగా ఉండడానికి ఎవరైతే అభిషేకం పొంది ప్రతిష్ఠించబడతాడో అతడే ప్రాయశ్చిత్తం చెయ్యాలి. ఆ పవిత్ర నార వస్త్రాలు ధరించుకొని అలా చెయ్యాలి. 33 అతడు అతి పవిత్ర స్థలానికీ, సన్నిధిగుడారానికీ, బలిపీఠానికీ ప్రాయశ్చిత్తం చెయ్యాలి. యాజుల పాపాలనూ సమాజం పాపాలనూ కప్పివేయాలి. 34 ✝ఇది మీకు ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం. సంవత్సరానికి ఒకసారి ఇస్రాయేల్ ప్రజలు సమస్త పాపాలను కప్పివేయాలి.” యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే అతడు చేశాడు.