15
1 యెహోవా మోషే అహరోనులతో ఇంకా అన్నాడు, 2 “మీరు ఇస్రాయేల్‌ప్రజలతో ఈ విధంగా చెప్పండి: పురుషుడికి శరీరంలో స్రావం ఏదైనా ఉంటే, దానివల్ల అతడు అశుద్ధంగా ఉంటాడు. 3 అది కారుతూ ఉన్నా కారకపోయినా అతడి శరీర స్థితి అశుద్ధమే. 4 స్రావమున్న ఆ వ్యక్తి ఏ పరుపుమీద పడుకొన్నా ఆ పరుపు అశుద్ధమవుతుంది. దేని మీద కూర్చున్నా అది అశుద్ధం. 5 అంతేకాక, అతడి పరుపును ఎవరైనా తాకితే వారు తమ బట్టలు ఉతుక్కొని నీళ్ళతో స్నానం చేయాలి. వారు సాయంకాలంవరకు అశుద్ధంగా ఉంటారు. 6 స్రావమున్న ఆ వ్యక్తి దేని మీద కూర్చుంటాడో దానిమీద మరెవరైనా కూర్చుంటే వారు తమ బట్టలు ఉతుక్కొని స్నానం చెయ్యాలి. వారు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటారు. 7 స్రావమున్న వ్యక్తి శరీరాన్ని ఎవరైనా తాకితే వారు తమ బట్టలు ఉతుక్కొని స్నానం చెయ్యాలి. వారు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటారు. 8 స్రావమున్న వ్యక్తి శుద్ధంగా ఉన్న ఎవరిమీదైనా ఉమ్మివేస్తే వారు తమ బట్టలు ఉతుక్కొని స్నానం చెయ్యాలి. వారు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటారు. 9 స్రావమున్నవాడు జీనుమీద కూర్చుంటే అది అశుద్ధం అవుతుంది. 10 ఆ వ్యక్తి కూర్చుని ఉన్న దేనినైనా తాకేవాడు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటాడు. వాటిని మోసేవాడు కూడా తన బట్టలు ఉతుక్కొని స్నానం చెయ్యాలి. అతడు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటాడు. 11 స్రావమున్న వ్యక్తి నీళ్ళతో చేతులు కడుక్కోకుండా ఎవరినైనా తాకితే వారు తమ బట్టలు ఉతుక్కొని స్నానం చెయ్యాలి. వారు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటారు. 12 స్రావమున్న వ్యక్తి ముట్టుకొన్న మట్టిపాత్రను పగలగొట్టాలి; ప్రతి చెక్కపాత్రను కడగాలి.
13 “స్రావమున్న వ్యక్తికి స్రావం మానిన తరువాత శుద్ధం కావడానికి ఏడు రోజులు పడుతుంది. అతడు ఏడు రోజులు లెక్కించి తన బట్టలు ఉతుక్కొని, పారుతున్న నీళ్ళతో ఒళ్ళు కడుక్కోవాలి. అప్పుడు శుద్ధంగా ఉంటాడు. 14 ఎనిమిదో రోజున అతడు రెండు గువ్వలను గానీ, రెండు పావురం పిల్లలను కానీ చేతపట్టుకొని యెహోవా సన్నిధానానికి సన్నిధిగుడారం ద్వారం దగ్గరికి వచ్చి యాజికి వాటిని ఇవ్వాలి. 15 వాటిలో ఒకదానిని పాపాలకోసం బలిగా, ఒకదానిని హోమబలిగా యాజి సమర్పించాలి. ఇలా యాజి ఆ వ్యక్తి స్రావం విషయం యెహోవా సముఖంలో ప్రాయశ్చిత్తం చెయ్యాలి.
16 “ఒక వ్యక్తికి వీర్యస్ఖలనం జరిగితే అతడు స్నానం చెయ్యాలి. అతడు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటాడు. 17 వీర్యం బట్టమీద గానీ, తోలు మీద గానీ పడితే ఆ బట్ట, ఆ తోలు ఉతుక్కోవాలి. ఆ బట్ట లేక ఆ తోలు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటుంది. 18 పురుషుడు స్త్రీతో సంపర్కం చేసిన తరువాత ఇద్దరూ స్నానం చెయ్యాలి. వారు సాయంకాలంవరకు అశుద్ధంగా ఉంటారు.
19 “స్త్రీకి శరీరంలో రక్తస్రావం కలిగితే ఆమె ఏడు రోజులు కడగా ఉంటుంది. ఆమెను ఎవరైనా తాకితే వారు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటారు. 20 కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పడుకుంటుందో అది అశుద్ధం అవుతుంది; దేని మీద కూర్చుంటుందో అది అశుద్ధం అవుతుంది. 21 ఆమె పడకను ఎవరైనా తాకితే వారు తమ బట్టలు ఉతుక్కొని స్నానం చెయ్యాలి. వారు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటారు. 22 ఆమె దేనిమీద కూర్చుంటుందో దాన్ని ఎవరైనా తాకితే వారు తమ బట్టలు ఉతుక్కొని స్నానం చెయ్యాలి. వారు సాయంకాలంవరకు అశుద్ధంగా ఉంటారు. 23 ఆమె పరుపును గానీ, ఆమె కూర్చున్న వస్తువును గానీ, అది ఏదైనా సరే, దాన్ని ఎవరైనా తాకితే వారు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటారు. 24 పురుషుడు ఆమెతో శయనిస్తే ఆమె అశుచి అతడికి తగిలిందంటే అతడు ఏడు రోజులు అశుద్ధంగా ఉంటాడు. అతడు ఏడు రోజులు అశుద్ధంగా ఉంటాడు. అతడు ఏ పడకమీద పడుకుంటాడో ఆ పడక అశుద్ధం అవుతుంది.
25 “స్త్రీ కడగా చేరే కాలానికి ముందుగా ఆమెకు రక్తస్రావం చాలా రోజులు కలిగినా, కడగా ఉండే కాలం తరువాత అది కలిగినా, ఆమె అశుద్ధంగా ఉంటుంది. ఆమె కడగా ఉండే రోజుల్లో లాగే ఆ రక్తస్రావ కాలంలో అశుద్ధంగా ఉంటుంది. 26 ఆ రక్తస్రావం జరిగే కాలమంతట్లో ఆమె కడగా ఉన్నట్టే ఏ పడకమీద పడుకొంటుందో అది అశుద్ధం అవుతుంది. ఆమె కడగా ఉండే కాలంలో లాగే దేనిమీద కూర్చుంటుందో అది అశుద్ధం అవుతుంది. 27 వాటిని తాకేవారెవరైనా అశుద్ధంగా ఉంటారు. వారు తమ బట్టలు ఉతుక్కొని స్నానం చెయ్యాలి. వారు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటారు. 28 ఆమెకు రక్తస్రావం మానిన తరువాత ఆమె ఏడురోజులు లెక్కించాలి. ఆ రోజులయ్యాక ఆమె శుద్ధంగా ఉంటుంది. 29 ఎనిమిదో రోజు ఆమె రెండు గువ్వలను గానీ, రెండు పావురం పిల్లలను గానీ చేతపట్టుకొని సన్నిధిగుడారం ద్వారానికి యాజి దగ్గరకు వాటిని తేవాలి. 30 యాజి వాటిలో ఒకదానిని పాపాలకోసం బలిగా, రెండో దానిని హోమబలిగా సమర్పించాలి. ఈ విధంగా యాజి ఆమె అశుద్ధత విషయం ఆమె కోసం యెహోవా సన్నిధానంలో ప్రాయశ్చిత్తం చెయ్యాలి.
31 “ఇస్రాయేల్ ప్రజల మధ్యలో నా నివాసస్థలం ఉంది. వారు దాన్ని అశుద్ధం చేయకుండా తమ అశుద్ధతవల్ల చావకుండా మీరు వారిని వారి అశుద్ధత నుంచి వేరు చేయాలి.
32 “స్రావమున్నవాడి విషయం, వీర్యస్ఖలనం వల్ల అశుద్ధంగా ఉన్న వాడి విషయం, 33 కడగా ఉన్న స్త్రీ విషయం, స్రావమున్న స్త్రీ పురుషుల విషయం, అశుద్ధంగా ఉన్న స్త్రీతో శయనించే వాడి విషయం అనుసరించవలసిన చట్టం ఇదే.”