14
1 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 2 ✝“చర్మవ్యాధి గల మనిషి శుద్ధంగా ఉన్నాడు అని నిర్ణయించిన రోజు అతణ్ణి గురించిన చట్టమిదే – అతణ్ణి యాజి దగ్గరికి తీసుకురావాలి. 3 ✽యాజి శిబిరం బయటకి వెళ్ళి అతణ్ణి చూడాలి. ఒకవేళ చర్మవ్యాధి గలవాడికి వ్యాధి పూర్తిగా నయం అయిందనుకోండి. 4 ✽అలాంటప్పుడు అతణ్ణి శుద్ధం చేయడానికి యాజి ప్రాణంతో ఉన్న రెండు శుద్ధ పక్షులనూ దేవదారు కర్రనూ ఎర్రని నూలునూ హిస్సోపుచెట్టు రెమ్మనూ తెమ్మని ఆజ్ఞాపించాలి. ఇవి చర్మవ్యాధి గలవాణ్ణి శుద్ధపరచడంకోసం. 5 యాజి ఆ పక్షులలో ఒకదానిని చంపమని ఆజ్ఞాపించాలి. దాన్ని పారుతున్న నీళ్ళ పైగా, మట్టి పాత్రలో చంపాలి. 6 తరువాత యాజి ప్రాణంతో ఉన్న పక్షిని చేతపట్టుకొని పారుతున్న నీళ్ళ పైగా చంపిన ఆ పక్షి రక్తంలో ముంచాలి. దేవదారు కర్రనూ, ఎర్రని నూలునూ, హిస్సోపు రెమ్మనూ కూడా ఆ రక్తంలో ముంచాలి. 7 అప్పుడు యాజి శుద్ధపరచబొయ్యే వాడిమీద ఆ రక్తాన్ని ఏడుసార్లు చిలకరించి, అతడు శుద్ధంగా ఉన్నాడని నిర్ణయించి చెప్పాలి. ప్రాణంతో ఉన్న పక్షిని బయట మైదానంలో వదిలిపెట్టాలి. 8 ✽శుద్ధపరచబడేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. వెంట్రుకలన్నీ క్షౌరం చేసుకొని నీళ్ళతో స్నానం చేయాలి. అప్పుడతడు శుద్ధంగా ఉంటాడు. ఆ తరువాత అతడు శిబిరంలోకి రావచ్చు గాని, తన గుడారం వెలుపలే ఏడు రోజులు ఉండిపోవాలి. 9 ఏడో రోజున తన తలనూ గడ్డాన్నీ కనుబొమ్మలనూ వెంట్రుకలనూ క్షౌరం చేసుకోవాలి. తన బట్టలు ఉతుక్కొని నీళ్ళతో స్నానం చేయాలి. అప్పుడతడు శుద్ధంగా ఉంటాడు.10 “ఎనిమిదో రోజు అతడు లోపం లేని రెండు మగ గొర్రెపిల్లలనూ, లోపం లేని ఏడాది ఆడ గొర్రెపిల్లనూ యాజి దగ్గరకి తేవాలి. వాటితో నైవేద్యం కోసం నూనె కలిసిన, మూడు కిలోగ్రాముల గోధుమపిండినీ, అరలీటర్ నూనెనూ తేవాలి. 11 శుద్ధి చేసే యాజి శుద్ధి కాబోయే ఆ వ్యక్తినీ, అతడు తెచ్చిన వాటినీ యెహోవా సన్నిధానంలో సన్నిధిగుడారం ద్వారం దగ్గర ఉంచాలి. 12 ✝అప్పుడు యాజి ఆ మగ గొర్రెపిల్లల్లో ఒకదానిని అపరాధ బలిగా అర్పించాలి. దానినీ ఆ అరలీటర్ నూనెనూ కదలిక అర్పణగా యెహోవా సన్నిధానంలో అటూ ఇటూ కదలించాలి. 13 తరువాత ఆ మగ గొర్రెపిల్లను ఒక పవిత్ర స్థానంలో, పాపాలకోసమైన బలినీ, హోమాన్నీ చంపే చోట వధించాలి. ఎందుకంటే పాపాలకోసం బలిలాగే అపరాధ బలి యాజిది. అది అతి పవిత్రం.
14 ✽“అప్పుడు యాజి ఆ అపరాధబలి రక్తంలో కొంత తీసుకొని శుద్ధం కాబొయ్యే వాడి కుడి చెవి కొనమీదా, కుడి చేతి బొటనవ్రేలిమీదా, కుడి కాలి బొటన వ్రేలిమీదా దాన్ని పూయాలి. 15 ✽యాజి ఆ అర లీటర్ నూనెలో కొంత తన ఎడమ అరచేతిలో పోసుకోవాలి. 16 తన ఎడమ అరచేతిలో ఉన్న నూనెలో తన కుడి చేతి వ్రేలు ముంచి యెహోవా సన్నిధానంలో ఏడు సార్లు తన వ్రేలితో నూనె చిలకరించాలి. 17 తన అరచేతిలో ఉన్న మిగతా నూనెలో కొంత శుద్ధి కాబొయ్యే వాడి కుడి చెవి కొనమీదా కుడి చేతి బొటన వ్రేలిమీదా కుడి కాలి బొటనవ్రేలిమీదా పూయాలి. వాటిమీద ఉన్న అపరాధ బలి రక్తం మీద పూయాలన్నమాట. 18 యాజి తన చేతిలో ఉన్న మిగతా నూనె శుద్ధి కాబొయ్యే వాడి తలమీద పూయాలి. ఇలా యాజి యెహోవా సముఖంలో అతడికోసం ప్రాయశ్చిత్తం చేయాలి. 19 ✽అంతే కాక అశుద్ధతను పోగొట్టుకొని శుద్ధి కాబోయే వాడికోసం ప్రాయశ్చిత్తం చేయడానికి యాజి పాపాలకోసమైన బలిని సమర్పించాలి. తరువాత యాజి హోమ బలిని వధించాలి. 20 ✝హోమాన్నీ నైవేద్యాన్నీ బలిపీఠం మీద సమర్పించాలి. ఈ విధంగా యాజి ఆ వ్యక్తి కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు, అతడు శుద్ధిగా ఉంటాడు.
21 ✝“ఒకవేళ ఆ వ్యక్తి బీదవాడై పై చెప్పినదంతా తేలేకపోతాడనుకోండి. అలాంటప్పుడు తన ప్రాయశ్చిత్తం కోసం యెహోవా సముఖంలో కదల్చడానికి అపరాధబలిగా ఒక మగగొర్రెపిల్లను తేవాలి. నూనెతో కలిసిన ఒక కిలోగ్రాం గోధుమ పిండినీ అర లీటర్ నూనెనూ కూడా తేవాలి. 22 పైగా, అతడు కొనగల రెండు గువ్వలను గానీ, రెండు పావురం పిల్లలను గానీ తేవాలి. వాటిలో ఒకటి పాపాలకోసం బలిగా, ఒకటి హోమబలిగా ఉంటాయి. 23 ఎనిమిదో రోజున అతడు తన శుద్ధికోసం వాటిని యెహోవా సన్నిధానానికి, సన్నిధిగుడారం ద్వారంలో యాజి దగ్గరకు తీసుకురావాలి. 24 అప్పుడు యాజి అపరాధబలి కోసం ఆ గొర్రెపిల్లనూ, ఆ అర లీటరు నూనెనూ చేతపట్టుకొని వాటిని కదలిక అర్పణగా యెహోవా సముఖంలో అటూ ఇటూ కదల్చాలి. 25 యాజి అపరాధబలి గొర్రెపిల్లను వధించాలి. ఆ బలిరక్తంలో కొంత తీసుకొని శుద్ధి కాబొయ్యేవాడి కుడి చెవి కొన మీదా, కుడి చేతి బొటనవ్రేలిమీదా దానిని పూయాలి. 26 యాజి నూనెలో కొంత తన ఎడమ అరచేతిలో పోసుకోవాలి. 27 తన ఎడమ అర చేతిలో ఉన్న ఆ నూనెలో కొంత తన కుడి వ్రేలితో యెహోవా సన్నిధానంలో ఏడు సార్లు చిలకరించాలి. 28 తన చేతిలో ఉన్న ఆ నూనెలో కొంత శుద్ధి కాబొయ్యేవాడి కుడి చెవి కొనమీదా, కుడి చేతి బొటనవ్రేలిమీదా, కుడి కాలి బొటనవ్రేలిమీదా పూయాలి. అపరాధ బలిపశువు రక్తం మీద పెట్టాలన్నమాట. 29 తన చేతిలో మిగతా నూనె శుద్ధి కాబొయ్యేవాడి తలమీద పూసి యాజి యెహోవా సముఖంలో అతడికోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. 30 అప్పుడా వ్యక్తి కొనగల ఆ గువ్వల్లో గానీ పావురం పిల్లల్లో గానీ ఒకదానిని సమర్పించాలి. 31 వాటిలో ఒకటి పాపాల కోసం బలిగా, ఇంకొకటి హోమబలిగా ఉంటాయి. వాటిని నైవేద్యంతో పాటు అర్పించాలి. ఈ విధంగా యాజి యెహోవా సన్నిధిలో శుద్ధం కాబొయ్యే వాడి పాపాలను కప్పివేస్తాడు. 32 చర్మవ్యాధి పొడ కలిగి శుద్ధికోసం మామూలైనవాటిని కొనలేని వ్యక్తి విషయంలో అనుసరించవలసిన చట్టం ఇదే.”
33 యెహోవా మోషే అహరోనులతో ఇంకా అన్నాడు, 34 ✽“వారసత్వంగా నేను మీకిచ్చే కనాను దేశంలోమీరు ప్రవేశించిన తరువాత ఆ మీ దేశంలోని ఏదో ఇంట బూజును నేను కలిగిస్తాననుకోండి. 35 ఆ ఇంటి యాజమాని యాజి దగ్గరకు వచ్చి ‘నా ఇంట్లో బూజు నాకు కనిపించింద’ని అతడికి తెలపాలి. 36 యాజి ఆ బూజు చూడడానికి వెళ్ళేముందు అతడు ఆ ఇంటిలోనుంచి వస్తువులన్నీ బయటికి తీసుకురావాలని ఆదేశించాలి. ఆ వస్తువులన్నీ అశుద్ధం కాకూడదని వారలా చెయ్యాలి. ఆ తరువాత ఇంటిని చూడడానికి యాజి లోపలికి వెళ్ళాలి. 37 అతడా బూజును చూడాలి. ఒకవేళ ఆ ఇంటి గోడలలో ఉన్న బూజు పల్లపు చారలతో ఉంటుందనుకోండి. అవి కొంచెం పచ్చగా, లేక ఎర్రగా ఉండి గోడకంటే పల్లంగా కనిపిస్తాయనుకోండి. 38 అలాంటప్పుడు యాజి ఇంట్లోనుంచి వాకిట్లోకి వచ్చి ఆ ఇల్లు ఏడు రోజులదాకా మూసివేయాలి. 39 ఏడో రోజున యాజి మళ్ళీ వచ్చి ఇల్లు పరిశీలనగా చూడాలి. ఆ బూజు ఇంటి గోడలలో వ్యాపించి ఉంటే 40 బూజు గల రాళ్ళు ఊడదీసి ఊరి వెలుపల ఉన్న అశుద్ధ స్థలంలో పారవెయ్యాలని యాజి ఆజ్ఞాపించాలి. 41 అప్పుడు ఇంటి లోపల చుట్టు గోడలను గీకించాలి. గీకిన పెళ్ళలు ఊరి వెలుపల ఉన్న అశుద్ధస్థలంలో వారు పారవేయాలి. 42 వేరే రాళ్ళు తీసుకువచ్చి ఊడదీసిన ఆ రాళ్ళకు బదులు ఉంచాలి. వేరే అడుసు తెప్పించి ఆ ఇంటి గోడలకు పూయాలి.
43 “ఆ రాళ్ళు ఊడదీసి, ఇల్లు గీకి, దానికి కొత్తగా అడుసు పూసిన తరువాత ఆ బూజు తిరిగి ఆ ఇంట బయట పడుతుందనుకోండి. 44 అలాంటప్పుడు యాజి వచ్చి దాన్ని చూడాలి. ఒకవేళ ఆ బూజు ఆ ఇంట్లో వ్యాపించి ఉంటే అది ఆ ఇంట్లో నాశనకరమైన బూజు, అది అశుద్ధం. 45 కనుక అతడు ఆ ఇంటినీ, దాని రాళ్ళనూ, కర్రలనూ, అడుసునంతా పడగొట్టించాలి; అదంతా ఊరి వెలుపల ఉన్న అశుద్ధ స్థలానికి మోయించి పారవేయించాలి. 46 ఆ ఇంటిని మూసివేసిన రోజుల్లో దానిలో ప్రవేశించిన వాడెవడైనా సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటాడు. 47 ఆ ఇంట ఎవరైనా పడుకొన్నా గానీ, భోజనం చేసినా గానీ ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి.
48 “ఇంటికి అడుసు వేసిన తరువాత బూజు దానిలో వ్యాపించకపోతే యాజి లోపల ప్రవేశించి చూచి ఇల్లు శుద్ధమని నిర్ణయించి చెప్పాలి. ఎందుకంటే బూజు మళ్ళీ పట్టలేదు. 49 ✽అప్పుడు ఇంటిని శుద్ధి చేయడానికి అతడు రెండు పక్షులనూ దేవదారు కర్రనూ ఎర్రని నూలునూ హిస్సోపు రెమ్మనూ తెప్పించాలి. 50 పక్షుల్లో ఒకదాన్ని పారుతున్న నీళ్ళపైగా మట్టి పాత్రలో వధించాలి. 51 దేవదారు కర్రనూ, హిస్సోపు రెమ్మనూ, ఎర్రని నూలునూ, ప్రాణంతో ఉన్న పక్షినీ చేతపట్టుకొని వధించిన పక్షి రక్తంలోనూ పారుతున్న నీటిలోనూ వాటిని ముంచాలి. ఆ ఇంటిమీద ఏడు సార్లు రక్తాన్ని చిలకరించాలి. 52 ఆ పక్షి రక్తంతో, పారుతున్న నీళ్ళతో, సజీవమైన పక్షితో, దేవదారు కర్రతో, హిస్సోపుతో, ఎర్రని నూలుతో ఆ ఇంటిని శుద్ధి చేయాలి. 53 తరువాత ప్రాణంతో ఉన్న పక్షిని బయట మైదానంలో వదిలిపెట్టాలి. ఈ విధంగా ఇంటికోసం యాజి ప్రాయశ్చిత్తం చెయ్యాలి. అప్పుడు ఇల్లు శుద్ధంగా ఉంటుంది.
54 “ప్రతి విధమైన చర్మరోగం గురించి, పక్కు గురించీ, 55 వస్త్రంలో గానీ, ఇంట్లో గానీ ఉన్న బూజు గురించీ, 56 వాపు, కురుపు, పక్కు, నిగనిగలాడే మచ్చ గురించీ ఇదే చట్టం. 57 ఏది శుద్ధమో ఏది అశుద్ధమో తెలియజేసే విధానమిదే. చర్మవ్యాధి గురించిన చట్టమిదే.”