13
1 ✽యెహోవా మోషే అహరోనులతో అన్నాడు, 2 “ఒక వ్యక్తికి చర్మంలో వాపు గానీ, పక్కు గానీ, నిగనిగలాడే మచ్చ గానీ ఉందనుకోండి. అది చర్మంలో అంటువ్యాధి పొడలాగా కనిపిస్తే అతణ్ణి అహరోనుయాజి దగ్గరికి లేదా, యాజులైన అతని కొడుకుల్లో ఒకని దగ్గరికి తీసుకురావాలి. 3 యాజి అతడి చర్మానికి ఉన్న పొడను చూడాలి. ఆ పొడలో ఉన్న వెంట్రుకలు తెల్లబారి ఉంటే, ఆ పొడ అతడి చర్మం కంటే నొక్కుగా ఉంటే అది చర్మంలో అంటువ్యాధి. దాన్ని చూచి యాజి ఆ వ్యక్తి అశుద్ధంగా ఉన్నాడని నిర్ణయించి చెప్పాలి. 4 కానీ ఆ వ్యక్తి చర్మంలో నిగనిగలాగే ఆ మచ్చ తెల్లగా ఉండి, చర్మం కంటే నొక్కుగా లేకపోతే దానిలో ఉన్న వెంట్రుకలు తెల్లబారకుండా ఉంటే యాజి అతణ్ణి ఏడు రోజులు ప్రత్యేకంగా ఉంచాలి. 5 ఏడో రోజున యాజి అతణ్ణి చూడాలి. అప్పుడు ఆ పొడ చర్మంలో అలాగే ఉండి, వ్యాపించకుండా ఉంటే యాజి ఇంకా ఏడు రోజులు అతణ్ణి ప్రత్యేకంగా ఉంచాలి. 6 ఆ ఏడో రోజున కూడా యాజి అతణ్ణి మళ్ళీ చూడాలి. ఆ పొడ చర్మంలో వ్యాపించకుండా, కొంత మానిందంటే యాజి ఆ వ్యక్తి శుద్ధంగా ఉన్నాడని నిర్ణయించి చెప్పాలి. అది పక్కు మాత్రమే. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని శుద్ధంగా ఉంటాడు. 7 అయితే అతడు తన శుద్ధికోసం యాజికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మంలో వ్యాపిస్తుందనుకోండి. అలాంటప్పుడు అతడు రెండో సారి యాజికి కనబడాలి. 8 చర్మంలో వ్యాపించి ఉన్న ఆ పక్కును చూచి, యాజి ఆ వ్యక్తి అశుద్ధంగా ఉన్నాడని నిర్ణయించి చెప్పాలి. అది చర్మంలో అంటువ్యాధి.9 “ఒక వ్యక్తికి వ్యాధి పొడ పుడితే అతణ్ణి యాజి దగ్గరికి తీసుకురావాలి. 10 యాజి అతణ్ణి చూడాలి. అతడి చర్మంలో తెల్లని వాపూ, దానిలో తెల్లబారిన వెంట్రుకలూ పచ్చి పుండూ కనబడితే అది అతడి చర్మంలో పాత వ్యాధి. 11 అతడు అశుద్ధంగా ఉన్నాడని యాజి నిర్ణయించి చెప్పాలి. అతడు అశుద్ధంగా ఉన్నాడు, గనుక అతణ్ణి ప్రత్యేకంగా ఉంచకూడదు. 12 తరువాత ఆ వ్యాధి అతడి చర్మంలో తలనుంచి పాదాల వరకు వ్యాపిస్తే యాజి అతణ్ణి మళ్ళీ చూడాలి. 13 యాజి చూచినంత వరకు ఆ వ్యాధి అతడి శరీరమంతటా వ్యాపించి ఉంటే అతడు శుద్ధంగా ఉన్నాడని నిర్ణయించి చెప్పాలి. అతడి ఒళ్ళంతా తెల్లబారిందన్నమాట. అతడు శుద్ధంగా ఉన్నాడు. 14 అయితే తరువాత అతడి శరీరంలో పచ్చి పుండు కనిపిస్తే అతడు అశుద్ధంగా అవుతాడు. 15 యాజి ఆ పచ్చి పుండును చూచి అతడు అశుద్ధంగా ఉన్నాడని నిర్ణయించి చెప్పాలి. ఆ పచ్చి పుండు అశుద్ధమే. అది చర్మంలో అంటువ్యాధి. 16 తరువాత ఆ పచ్చి పుండు ఆరి తెల్లబారితే అతడు యాజి దగ్గరికి మళ్ళీ రావాలి. 17 యాజి అతణ్ణి చూడాలి. ఆ పొడ తెల్లబారి ఉంటే అతడు శుద్ధంగా ఉన్నాడని నిర్ణయించి చెప్పాలి. అతడు శుద్ధంగా ఉన్నాడు.
18 “ఒక వ్యక్తికి చర్మంలో పుండు పుడుతుందనుకోండి. 19 అది మానిన తరువాత ఆ చోటే తెల్లని వాపు గానీ, నిగనిగలాడే తెలుపుతో కూడిన ఎర్రని మచ్చ గానీ కనిపిస్తుందనుకోండి. దాన్ని యాజికి చూపెట్టాలి. 20 అది చర్మంకంటే నొక్కుగా ఉంటే దానిలో ఉన్న వెంట్రుకలు తెల్లబారివుంటే, దాన్ని చూచి యాజి అతడు అశుద్ధంగా ఉన్నాడని నిర్ణయించి చెప్పాలి. అది ఆ పుండు ఉన్న చోట కలిగిన చర్మ వ్యాధి. 21 కానీ దానిలో తెల్లని వెంట్రుకలు లేకపోతే, అది చర్మంకంటే పల్లం కాక కొంచెం మానిందంటే దాన్ని చూచి యాజి అతణ్ణి ఏడు రోజులు ప్రత్యేకంగా ఉంచాలి. 22 ఆ లోగా అది అతడి చర్మంలో వ్యాపిస్తే అతడు అశుద్ధంగా ఉన్నాడని యాజి నిర్ణయించి చెప్పాలి. అది చర్మంలో అంటువ్యాధి. 23 కాని, నిగనిగలాడే ఆ పొడ వ్యాపించకుండా అలాగే ఉంటే అది కురుపు మచ్చ. అతడు శుద్ధంగా ఉన్నాడని యాజి నిర్ణయించి చెప్పాలి.
24 “ఒక వ్యక్తికి చర్మంలో కాలిన గాయం ఉందనుకోండి. ఆ తరువాత అది నిగనిగలాడే తెల్లని మచ్చగా గానీ, తెలుపుతో కూడిన ఎర్రని మచ్చగా గానీ ఉంటే, యాజి దాన్ని చూడాలి. 25 నిగనిగలాడే ఆ మచ్చలో ఉన్న వెంట్రుకలు తెల్లబారివుంటే ఆ మచ్చ చర్మంకంటే పల్లంగా ఉంటే, అది ఆ వాత ఉన్నచోట కలిగిన చర్మవ్యాధి. అతడు అశుద్ధంగా ఉన్నాడని యాజి నిర్ణయించి చెప్పాలి. అది చర్మవ్యాధి. 26 కానీ నిగనిగలాడే ఆ మచ్చలో తెల్లని వెంట్రుకలు లేవనుకోండి, మచ్చ చర్మంకంటే పల్లంగా ఉండకుండా కొంచెం నయంగా ఉందనుకోండి. అలాంటప్పుడు దాన్ని చూచి యాజి అతణ్ణి ఏడు రోజులు ప్రత్యేకంగా ఉంచాలి. 27 ఏడో రోజు యాజి అతణ్ణి మళ్ళీ చూడాలి. ఆ లోగా అది అతడి చర్మంలో వ్యాపిస్తే అతడు అశుద్ధంగా ఉన్నాడని యాజి నిర్ణయించి చెప్పాలి. అది చర్మవ్యాధి. 28 కానీ నిగనిగలాడే ఆ మచ్చ వ్యాపించకుండా ఆ చోటనే ఉండి మానినట్టుంటే అది ఆ కాలిన గాయంలోని వాపు. ఆ వ్యక్తి శుద్ధంగా ఉన్నాడని యాజి నిర్ణయించి చెప్పాలి. అది కాలిన గాయం మచ్చ.
29 “పురుషుడికైనా స్త్రీకైనా తలమీద గానీ, గడ్డం మీద గానీ పుండు పుడితే యాజి దాన్ని చూడాలి. 30 అది చర్మంకంటే నొక్కుగా ఉంటుందనుకోండి. దానిలో పసుపు రంగు గల సన్నని వెంట్రుకలు ఉంటాయనుకోండి. ఆ వ్యక్తి అశుద్ధంగా ఉన్నాడని యాజి నిర్ణయించి చెప్పాలి. అది తలమీద గానీ, గడ్డం మీద గానీ పుట్టిన చర్మవ్యాధి పక్కు. 31 కానీ యాజి ఆ పొడ చూచినప్పుడు అది చర్మంకంటే నొక్కుగా ఉండకపోతే, దానిలో నల్ల వెంట్రుకలు లేకపోతే పొడ ఉన్న వ్యక్తిని ఏడు రోజులు ప్రత్యేకంగా ఉంచాలి. 32 ఏడో రోజున యాజి ఆ పొడను మళ్ళీ చూడాలి. అది వ్యాపించకుండా ఉంటే, దానిలో పసుపురంగు గల వెంట్రుకలు లేకపోతే, అది చర్మంకంటే నొక్కుగా ఉండకపోతే, 33 ఆ వ్యక్తి క్షౌరం చేసుకోవాలి గానీ ఆ పక్కు ఉన్న చోట క్షౌరం చేసుకోకూడదు. యాజి ఆ వ్యక్తిని ఇంకా ఏడు రోజులు ప్రత్యేకంగా ఉంచాలి. 34 ఏడో రోజున యాజి ఆ పొడను మళ్ళీ చూడాలి. అది చర్మంలో వ్యాపించకుండా చర్మం కంటే నొక్కుగా లేకపోతే ఆ వ్యక్తి శుద్ధంగా ఉన్నాడని నిర్ణయించి చెప్పాలి. అతడు తన బట్టలు ఉతుక్కొని శుద్ధంగా ఉంటాడు. 35 ఒకవేళ అతడు శుద్ధంగా ఉన్నాడని నిర్ణయించిన తరువాత ఆ కురుపు పక్కు అతడి చర్మంలో వ్యాపిస్తే, 36 యాజి అతణ్ణి మళ్ళీ చూడాలి. ఆ కురుపు పక్కు వ్యాపించి ఉంటే యాజి పసుపు రంగు గల వెంట్రుకల కోసం వెదకనక్కరలేదు. ఆ వ్యక్తి అశుద్ధంగా ఉన్నాడు. 37 అయితే ఆ కురుపు పక్కు అలాగే నిలిచి ఉంటే, దానిలో నల్లని వెంట్రుకలు పుడితే అది మానిందన్నమాట. ఆ వ్యక్తి శుద్ధంగా ఉన్నాడు. అతడు శుద్ధంగా ఉన్నాడని యాజి నిర్ణయించి చెప్పాలి.
38 “పురుషుడికి గానీ, స్త్రీకి గానీ చర్మంలో నిగనిగలాడే మచ్చలు పుడితే ఆ మచ్చలు తెల్లగా ఉంటే, 39 యాజి వాటిని చూడాలి. ఒక వేళ ఆ మచ్చలు స్పష్టంగా లేకపోతే, అది చర్మం మీద అంకురించిన పక్కు మాత్రమే. ఆ వ్యక్తి శుద్ధంగా ఉన్నాడు.
40 “తలవెంట్రుకలు రాలినవాడు బట్టతలవాడు, అయినా అతడు శుద్ధంగా ఉన్నాడు. 41 ముందు భాగం నుంచి తల వెంట్రుకలు రాలినవాడు బోడి నొసటివాడు. అతడు కూడా శుద్ధంగా ఉన్నాడు, 42 కాని, బట్టతలమీద గానీ బోడినొసటిమీద గానీ ఎరుపుతో కలిసిన తెల్లని పొడ పుడితే అది బట్టతల మీద గానీ, బోడినొసటిమీద గానీ పుడుతున్న చర్మవ్యాధి. 43 యాజి అతణ్ణి చూడాలి. ఆ వ్యక్తి బట్టతల మీద గానీ బోడినొసటిమీద గానీ ఉన్న ఆ పొడ వాపు మిగతా శరీర చర్మంలో ఉన్న చర్మవ్యాధిలాగా ఎరుపుతో కలిసిన తెల్లనిదైతే అతడు చర్మవ్యాధి గలవాడు. 44 అతడు అశుద్ధంగా ఉన్నాడు. అతడు అశుద్ధంగా ఉన్నాడని యాజి తప్పక నిర్ణయించి చెప్పాలి. అతడి చర్మవ్యాధి అతడి తలలో ఉంది.
45 ✽ “చర్మవ్యాధి గల వ్యక్తి బట్టలు చింపివెయ్యాలి. తల విరబోసుకోవాలి. తన పై పెదవిని కప్పుకొని ‘అశుద్ధంగా ఉన్నాను, అశుద్ధంగా ఉన్నాను’ అంటూ బిగ్గరగా చెప్తూ ఉండాలి. 46 చర్మవ్యాధి ఉన్న రోజులన్నీ ఆ వ్యక్తి అశుద్ధంగా ఉండాలి. అశుద్ధంగా కావడంచేత ప్రత్యేకంగానే నివసించాలి. అతడి నివాసం శిబిరం బయట ఉండాలి.
47 ✽“గొర్రె వెంట్రుకల బట్టలో గానీ నారబట్టలో గానీ బూజు ఉంటుందనుకోండి. 48 నారతో, లేక వెంట్రుకలతో నేసిన పడుగుకు గానీ పేకకు గానీ ఉంటుందనుకోండి. తోలుమీద గానీ, తోలుతో చేసిన ఏ వస్తువులోనైనా ఉందనుకోండి. 49 ఆ బట్టలో గానీ, తోలుమీద గానీ, పడుగుకు గానీ, పేకకు గానీ, తోలుతో చేసిన ఆ వస్తువులో గానీ ఉన్న ఆ మచ్చ కొంత పచ్చగా, లేక కొంత ఎర్రగా కనిపిస్తే అది బూజు అని దాన్ని యాజికి చూపెట్టాలి. 50 ఆ మచ్చ గలదాన్ని చూచి యాజి దాన్ని ఏడు రోజులు ప్రత్యేకంగా ఉంచాలి. 51 ఏడో రోజున ఆ మచ్చను మళ్ళీ చూడాలి. ఆ మచ్చ బట్టలో గానీ, పడుగులో గానీ, పేకలో గానీ, తోటలో గానీ, తోలుతో చేసిన వస్తువులో గానీ వ్యాపించి ఉంటే అది నాశనకరమైన బూజు. అది అశుద్ధం. 52 గనుక ఆ మచ్చ దేనిలో ఉందో దాన్ని అతడు కాల్చివెయ్యాలి. ఆ బట్టను గానీ, నారతో లేదా వెంట్రుకలతో నేసిన పడుగును గానీ పేకనుగానీ, తోలుతో చేసిన ఆ వస్తువును గానీ కాల్చి వెయ్యాలి. అది నాశనకరమైన బూజు. దాన్ని నిప్పుతో భస్మం చెయ్యాలి. 53 కాని, ఒకవేళ బట్టలో గానీ, పడుగులో గానీ, పేకలో గానీ, తోలుతో చేసిన వస్తువులో గానీ ఆ మచ్చ వ్యాపించకుండా ఉంటే 54 మచ్చ గలదాన్ని చూచి దాన్ని ఉతకాలని యాజి ఆజ్ఞ జారీ చెయ్యాలి. అప్పుడు ఇంకా ఏడు రోజులు దాన్ని ప్రత్యేకంగా ఉంచాలి. 55 దాన్ని ఉతికిన తరువాత యాజి మళ్ళీ చూడాలి. ఆ మచ్చ వ్యాపించకపోయినా అది మారకపోయినా అది అశుద్ధమే. అది లోపల గానీ, పైన గానీ కుళ్ళిపోతే దాన్ని కాల్చివేయాలి.
56 “అయితే దాన్ని ఉతికిన తరువాత ఆ మచ్చ వాడిపోయి ఉంటే దాన్ని చూచి యాజి ఆ బట్టలోనుంచి గానీ, తోలులోనుంచి గానీ, పడుగులోనుంచి గానీ, పేకలోనుంచి గానీ చించివెయ్యాలి. 57 ఆ తరువాత అది బట్టలో గానీ, పడుగులో గానీ, పేకలో గానీ, తోలుతో చేసిన వస్తువులో గానీ మళ్ళీ కనిపిస్తుందనుకోండి. అది మళ్ళీ సోకుతూ ఉంది గనుక ఆ పొడ దేనిలో ఉందో దానిని కాల్చివేయాలి. 58 అయితే ఉతికిన బట్టలోనుంచి గానీ, పడుగులోనుంచి గానీ, తోలుతో చేసిన వస్తువులోనుంచి గానీ ఆ మచ్చ పోయిందనుకోండి. రెండో సారి దాన్ని ఉతికిన తరువాత అది శుద్ధంగా ఉంటుంది.
59 “చర్మవ్యాధిని, బూజును గురించిన చట్టమిదే. మచ్చ గల బట్ట, నారబట్ట, పడుగు, పేక, తోలు వస్తువులన్నీ అశుద్ధమో కాదో ఇలాగే నిర్ణయించాలి.”