12
1 యెహోవా మోషేతో ఇలా అన్నాడు, 2 “నీవు ఇస్రాయేల్‌ ప్రజతో ఈ విధంగా చెప్పు: ఒక స్త్రీ గర్భవతి అయి పిల్లవాణ్ణి కంటే, ఆమె ఏడు రోజులు అశుద్ధంగా ఉంటుంది. ఆమె బయట చేరిన రోజులలాగే ఆమె అశుద్ధంగా ఉంటుంది. 3 ఎనిమిదో రోజున పిల్లవాడికి సున్నతి సంస్కారం చేయించాలి. 4 ఆమె రక్తశుద్ధికోసం ఇంకా ముప్ఫయి మూడు రోజులు పడుతుంది. ఆ రోజులు పూర్తి అయ్యేవరకు ఆమె శుద్ధమైన దేనినీ తాకకూడదు, దేవుని గుడారం దగ్గరకు వెళ్ళకూడదు. 5 ఆమె కన్నది ఆడపిల్ల అయితే బయట చేరే రోజులలాగే ఆమె రెండు వారాలు అశుద్ధంగా ఉంటుంది. ఆమె రక్తశుద్ధికోసం ఇంకా అరవై ఆరు రోజులు పడుతుంది.
6 “కొడుకుకోసమైనా కూతురుకోసమైనా ఆమె శుద్ధిరోజులు పూర్తి అయ్యాక ఆమె హోమబలిగా ఒక ఏడాది గొర్రెపిల్లను తేవాలి. పాపాలకోసం బలిగా పావురం పిల్లను గానీ గువ్వను గానీ తేవాలి. వాటిని సన్నిధిగుడారం ద్వారానికి తెచ్చి యాజికివ్వాలి. 7 అతడు యెహోవా సన్నిధానంలో వాటిని అర్పించి ఆమెకోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు. అప్పుడు రక్తస్రావ విషయంలో ఆమెకు శుద్ధి కలుగుతుంది. మగపిల్లవాణ్ణి గానీ, ఆడపిల్లను గానీ కన్న స్త్రీని గురించిన చట్టం ఇదే. 8 ఒకవేళ ఆమె గొర్రెపిల్లను తీసుకురాలేనంత బీదరాలైతే రెండు గువ్వలను గానీ రెండు పావురం పిల్లలను గానీ తేవాలి. ఒకటి హోమబలిగా ఉంటుంది; రెండోది పాపాలకోసం బలిగా ఉంటుంది. యాజి ఆమెకోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు. ఆమెకు శుద్ధి కలుగుతుంది.