11
1 యెహోవా మోషేతోను అహరోనుతోను అన్నాడు, 2 “మీరు ఇస్రాయేల్‌ప్రజతో ఈ విధంగా చెప్పండి – భూమిమీద ఉన్న జంతువులలో వీటిని మాత్రమే మీరు తినవచ్చు – 3 జంతువులలో ఏవైతే చీలిన గిట్టలుండి నెమరువేస్తాయో వాటిని మీరు తినవచ్చు. 4 కొన్ని జంతువులకు చీలిన గిట్టలున్నా అవి నెమరువేయవు. నెమరువేసినా చీలిన గిట్టలుండవు – అలాంటి వాటిని మీరు తినకూడదు. వీటిలో ఒంటె ఉంది. అది నెమరువేస్తుంది గానీ దానికి చీలిన గిట్టలు లేవు, గనుక అది మీకు అశుద్ధం. 5 పొట్టి కుందేలు ఉంది. అది నెమరు వేస్తుంది గాని, దానికి చీలిన గిట్టలు లేవు, గనుక అది మీకు అశుద్ధం. 6 కుందేలు కూడా ఉంది. అది నెమరువేస్తుంది గాని దానికి చీలిన గిట్టలు లేవు గనుక అది మీకు అశుద్ధం. 7 పంది కూడా ఉంది. దానికి చీలిన గిట్టలు ఉన్నాయి గాని, అది నెమరు వేయదు గనుక అది మీకు అశుద్ధం. 8 ఆ జంతువుల మాంసం మీరు తినకూడదు. వాటి పీనుగులను తాకకూడదు. అవి మీకు అశుద్ధం.
9 “జలచరాలలో వీటిని తినవచ్చు – సముద్రంలో గానీ, నదులలో గానీ వేటికి రెక్కలు, పొలుసులు ఉంటాయో వాటిని తినవచ్చు. 10 కాని, రెక్కలూ పొలుసులూ లేనివాటిని మీరు అసహ్యించుకోవాలి. అవి సముద్రంలో ఉన్నా నదులలో ఉన్నా సమస్త జల ప్రాణులలోను, నీళ్ళలో పారాడే వాటిలోను అలాంటివి మీకు అసహ్యంగానే ఉండాలి. 11 వాటి మాంసం తినకూడదు. వాటి పీనుగులను మీకు అసహ్యమైనవని భావించాలి. 12 నీళ్ళలో దేనికి రెక్కలూ పొలుసులూ ఉండవో వాటిని మీరు అసహ్యించుకోవాలి.
13 “పక్షులలో కూడా కొన్ని అసహ్యమైనవిగా భావించాలి. వాటిని తినకూడదు. అవి అసహ్యంగా ఉన్నాయి. అవేవంటే, గరుడపక్షి, రాబందు, క్రౌంచపక్షి, 14 ప్రతి విధమైన గద్ద, 15 ప్రతి విధమైన కాకి, 16 నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, 17 పైగిడికంటె, చెరువుకాకి, గుడ్లగూబ, 18 హంస, గూడబాతు, నల్ల రాబందు, 19 సంకుబుడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలం.
20 “రెక్కలు ఉండి నాలుగు కాళ్ళతో తిరిగే ప్రాణులన్నీ మీకు అసహ్యంగా ఉండాలి. 21 అయితే రెక్కలు ఉండి నాలుగు కాళ్ళతో తిరుగుతూ, నేలమీద గంతులు వేయడానికి తొడలుగల పురుగులన్నిటినీ తినవచ్చు. 22 గాలిలో ఎగిరే ప్రతి విధమైన మిడతను గానీ, చిన్న మిడతను గానీ, కీచురాయిని గానీ, ఆకు మిడతను గానీ తినవచ్చు. 23 కాని, నాలుగు కాళ్ళు గల తక్కిన పురుగులన్నీ మీకు అసహ్యంగా ఉండాలి.
24 “వీటివల్ల కూడా మీరు అశుద్ధంగా అవుతారు: వీటి పీనుగులను తాకిన ప్రతి ఒక్కరూ సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటారు. 25 వీటి పీనుగులను మోసిన ప్రతి ఒక్కరూ బట్టలు ఉతుక్కోవాలి. ఆ వ్యక్తి సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటాడు. 26 రెండు గిట్టలున్న అన్ని జంతువులలో చీలిన గిట్టలు లేకుండా నెమరువేయకుండా ఉండే జంతువులు మీకు అశుద్ధం. అలాంటివాటిని తాకిన ప్రతి ఒక్కరూ అశుద్ధంగా ఉంటారు. 27 నాలుగు కాళ్లతో నడిచే జంతువులలో ఏవి పంజాలతో నడుస్తాయో అవన్నీ మీకు అశుద్ధం. వాటి పీనుగులను తాకిన ప్రతి ఒక్కరూ సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటారు. 28 వాటి పీనుగులను మోసినవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. అతడు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటాడు. అలాంటివి మీకు అశుద్ధంగా ఉంటాయి.
29 “నేలమీద ప్రాకే ప్రాణులలో ఇవి మీకు అశుద్ధంగా ఉంటాయి – అడవి ఎలుక, ఎలుక, ప్రతి రకమైన బల్లి, 30 ప్రతి రకమైన ఊసరవెల్లి, తొండ. 31 ప్రాకే ప్రాణులలో అవి మీకు అశుద్ధం. వాటి పీనుగును తాకిన ప్రతి ఒక్కరూ సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటారు. 32 వాటిలో చచ్చినది ఏ వస్తువు మీద పడితే ఆ వస్తువు అశుద్ధంగా ఉంటుంది. అది చెక్కపాత్ర కావచ్చు, బట్ట, తోలు, సంచి కావచ్చు. అది మీరు ఉపయోగించుకొనే వస్తువైతే – అది ఏదైనా సరే – దాన్ని నీళ్ళలో వెయ్యాలి. అది సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటుంది. తరువాత శుద్ధంగా ఉంటుంది. 33 అలాంటి ప్రాణి పీనుగు మట్టి పాత్రలో పడితే దానిలో ఉన్నదంతా అశుద్ధంగా ఉంటుంది. ఆ పాత్రను పగలగొట్టాలి. 34 ఆ పాత్రలో ఆహారమూ నీళ్ళూ ఉంటే ఆ ఆహారం అశుద్ధంగా ఉంటుంది. అలాంటి పాత్రలోని ఏ పానీయమైనా అశుద్ధంగా ఉంటుంది. 35 వాటి పీనుగులలో ఏదైనా పొయ్యిమీద గానీ, కుంపటిమీద గానీ, అలాంటి దేని మీద పడ్డా ఆ వస్తువు అశుద్ధంగా ఉంటుంది, మీరు దాన్ని అశుద్ధమైనదిగా ఎంచాలి. దాన్ని ముక్కలుగా పగలగొట్టాలి. 36 కాని, నీళ్ళుండే ఊటలో గానీ, బావిలో గానీ అది పడినా ఆ ఊట లేక బావి అశుద్ధంగా ఉండదు. అయితే అలాంటి ప్రాణి పీనుగును తాకిన ప్రతి ఒక్కరూ అశుద్ధంగా ఉంటారు. 37 వాటి పీనుగులలో ఏదైనా చల్లబోయే విత్తనాలమీద పడినా అవి అశుద్ధంగా ఉండవు. 38 కానీ, నానబెట్టిన విత్తనాలమీద పడితే అవి మీకు అశుద్ధంగా ఉంటాయి.
39 “మీరు తినదగ్గ జంతువులలో ఏదైనా చస్తే దాని పీనుగును తాకిన వ్యక్తి సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటాడు. 40 దానిలో ఏదైనా తినేవాడు గానీ, దాన్ని మోసేవాడు గానీ తన బట్టలు ఉతుక్కోవాలి. అతడు సాయంకాలం వరకు అశుద్ధంగా ఉంటాడు. 41 నేలమీద ప్రాకే చిన్న ప్రాణులన్నీ అసహ్యంగా ఉంటాయి. వీటిని తినకూడదు. 42 కడుపుతో ప్రాకే వాటిని గానీ, నాలుగు కాళ్ళతో తిరిగే వాటిని గానీ, చాలా కాళ్ళున్న వాటినీ, అలాంటి ప్రాకే ప్రాణులలో దేనినీ తినకూడదు. అవి అసహ్యంగా ఉంటాయి. 43 ఇలాంటి ప్రాకే ప్రాణులలో ఏదో ఒక దానివల్ల మిమ్ములను మీరు అసహ్యంగా అశుద్ధంగా చేసుకోకూడదు. 44 ఎందుకంటే నేను మీ దేవుడైన యెహోవాను. నేను పవిత్రుణ్ణి. గనుక మిమ్ములను మీరు పరిశుద్ధం చేసుకొని శుద్ధులుగా ఉండండి. నేలమీద ప్రాకే ప్రాణులలో దేని వల్లా మిమ్ములను మీరు అశుద్ధంగా చేసుకోకూడదు. 45 నేను మీకు దేవుడుగా ఉండేందుకు ఈజిప్ట్ నుంచి మిమ్ములను తీసుకువచ్చిన యెహోవాను. నేను పవిత్రుణ్ణి, గనుక మీరూ పవిత్రులై ఉండాలి.
46 “జంతువులనూ పక్షులనూ అన్ని జలప్రాణులనూ నేలమీద ప్రాకే ప్రాణులన్నీటినీ గురించిన చట్టమిది. 47 దీని ఉద్దేశం అశుద్ధమైనదానికీ శుద్ధమైనదానికీ, తినదగ్గదానికీ తినదగనిదానికీ భేదం చెయ్యడమే.