10
1 ఆ తరువాత అహరోను కొడుకులు నాదాబు, అబీహు తమ ధూపార్తులను చేతపట్టుకొని వాటిలో నిప్పు ఉంచి ధూప ద్రవ్యాన్ని వేశారు. ఈ నిప్పు యెహోవా తమకాజ్ఞాపించని వేరే నిప్పు. 2 అందుచేత యెహోవా సన్నిధానంనుంచి మంటలు వచ్చి వారిని కాల్చివేశాయి. అలాగే వారు యెహోవా సన్నిధానంలో చనిపోయారు. 3 అప్పుడు మోషే అహరోనుతో అన్నాడు, “ఇది యెహోవా చెప్పిన మాట – నన్ను సమీపించిన వారిపట్ల నా పవిత్రతను కనుపరుస్తాను. ప్రజలందరి ఎదుట నా మహిమను వెల్లడి చేస్తాను.” అహరోను మౌనం వహించాడు.
4 అప్పుడు అహరోను పినతండ్రి అయిన ఉజ్జీయేల్ కొడుకులను మోషే పిలిపించాడు. వారు మిషాయేల్, ఎల్‌సాఫాను. అతడు వారితో, “దగ్గరకు రండి. పవిత్ర స్థలం ఎదుటనుంచి శిబిరం బయటకి మీ దాయాదులను తీసుకుపోండి” అన్నాడు.
5 మోషే చెప్పినట్టు వారు దగ్గరకు వచ్చి చొక్కాలతోనే వాళ్ళను శిబిరం బయటకి మోసుకుపొయ్యారు.
6 అహరోనుతోను, అతడి కొడుకులు ఎలియాజరు, ఈతామారులతోను మోషే ఇలా అన్నాడు: “మీరు చావకుండేలా, యెహోవా ఈ సమాజమంతటిమీదా కోపపడకుండేలా, మీరు తల విరబోసుకోకూడదు, వేసుకొన్న బట్టను చింపుకోకూడదు. కాని, యెహోవా కాల్చివేసిన వాళ్ళ విషయం మీ సోదరులు అంటే ఇస్రాయేల్ వంశస్థులందరూ ఏడ్వవచ్చు. 7 మీరైతే చావకుండేలా సన్నిధిగుడారం ద్వారం విడిచి వెళ్ళకూడదు. యెహోవా అభిషేకతైలం మీ మీద ఉంది గదా!” మోషే చెప్పిన మాట ప్రకారమే వారు చేశారు.
8 యెహోవా అహరోనుతో అన్నాడు, 9 “మీరు చావకుండేలా నీవూ నీ కొడుకులూ సన్నిధిగుడారంలోకి వచ్చేటప్పుడు ద్రాక్ష మద్యం గానీ, మరే మద్యం గానీ తాగకూడదు. ఇది మీ తరతరాలకు ఎప్పటికీ నిలిచివుండే చట్టం. 10 మీరు ప్రతిష్ఠమైన దానినుంచి లౌకికమైనదాన్ని ప్రత్యేకపరచాలి. శుద్ధమైనదాని నుంచి అశుద్ధమైనదాన్ని వేరు చెయ్యాలి. 11 యెహోవా మోషే ద్వారా ఇస్రాయేల్ ప్రజలకు ఆజ్ఞాపించిన శాసనాలన్నీ మీరు వారికి నేర్పాలి. గనుక ఆ సమయాలలో ద్రాక్షమద్యం గానీ, మరే మద్యం గానీ తాగకూడదు.”
12 మోషే అహరోనుతోను, మిగిలిన అతడి కొడుకులు ఎలియాజరు, ఈతామారులతోను ఇలా అన్నాడు: “యెహోవా హోమ వస్తువులలో మిగతా నైవేద్యాన్ని మీరు తీసుకొని బలిపీఠం దగ్గర తినండి. పొంగజేసే పదార్థం లేకుండా దాన్ని తినండి. అది అతి పవిత్రం. 13 యెహోవా హోమాలలో అది నీకూ నీ కొడుకులకూ నియామక భాగం. యెహోవా నన్ను అలా ఆదేశించాడు. గనుక మీరు ఒక పవిత్రమైన చోట దాన్ని తినాలి. 14 కదలిక అర్పణగా ఉన్న ఆ బోరనూ ప్రతిష్ఠ చేసిన ఆ తొడనూ కూడా ఒక శుద్ధమైన చోట తినాలి – నీవూ, నీతోపాటు నీ కొడుకులూ కూతుళ్ళూ తినాలి. ఇస్రాయేల్ ప్రజలు తెచ్చిన శాంతి బలులలో నుంచి అవి నీకూ నీ సంతానానికీ నియామక భాగం. 15 కొవ్వును హోమంగా అర్పించేటప్పుడు బోరను కదలిక అర్పణగా యెహోవా సన్నిధానంలో అటూ ఇటూ కదల్చి తొడను ప్రతిష్ఠిస్తారు గదా. అవి నీకూ నీ సంతానానికీ నియామక భాగం – ఇది ఎప్పటికీ నిలిచివుండే చట్టం – ఇది యెహోవా ఆజ్ఞ.”
16 తరువాత పాపాలకోసమైన మేక బలిని గురించి మోషే అడిగినప్పుడు అంతకుముందు వారు దాన్ని కాల్చివేశారని తెలిసింది. అహరోను మిగిలిన కొడుకులు ఎలియాజరు, ఈతామారులమీద మోషేకు కోపం వచ్చింది. 17 అతడు వారితో అన్నాడు “పాపాల కోసమైన బలి మాంసం పవిత్ర స్థానంలో మీరెందుకు తినలేదు? అది అతి పవిత్రం గదా! యెహోవా దాన్ని ఎందుకు నియమించాడు? సమాజ అపరాధాన్ని మీరు భరించి ఆయన సన్నిధానంలో వారి పాపాలను కప్పివేయడానికే గదా. 18 ఇదిగో, పవిత్ర స్థలంలోకి దాని రక్తాన్ని తేవలెను, గనుక నేను ఆజ్ఞాపించి నట్టే తప్పకుండా పవిత్ర స్థలంలో దాని మాంసం తినవలసిందే.”
19 అహరోను మోషేతో మాట్లాడాడు – “ఇదిగో విను. ఈ రోజు వారు పాపాలకోసమైన తమ బలినీ హోమాన్నీ యెహోవా సన్నిధానంలో అర్పించారు. అయినా ఇలాంటి విపత్తులు నాకు జరిగాయి. ఒకవేళ పాపాలకోసమైన బలిమాంసం నేను ఈ రోజు తింటే అది యెహోవాకు అంగీకారమా?” అన్నాడు. 20 మోషే అది విని ఒప్పుకొన్నాడు.