9
1 ఎనిమిదో రోజు మోషే అహరోన్నూ అతడి కొడుకులనూ ఇస్రాయేల్‌ప్రజల పెద్దలనూ పిలిపించాడు. 2 అహరోనుతో ఇలా అన్నాడు: “నీవు పాపాలకోసమైన బలిగా లోపం లేని ఒక కోడెనూ హోమబలిగా లోపం లేని పొట్టేలును యెహోవా సన్నిధానానికి తీసుకురా. 3 ఆ తరువాత ఇస్రాయేల్ ప్రజతో ఈ విధంగా చెప్పు – ఈ రోజు యెహోవా మీకు ప్రత్యక్షం అవుతాడు, గనుక ఆయన సన్నిధానంలో బలులు సమర్పించాలి. మీరు పాపాలకోసమైన బలిగా లోపం లేని మేకపోతునూ హోమబలిగా లోపం లేని ఏడాది కోడెనూ గొర్రెపిల్లనూ తీసుకురండి; 4 శాంతి బలులుగా ఎద్దునూ, పొట్టేలునూ తీసుకురండి; నూనె కలపిన నైవేద్యాన్ని కూడా తీసుకురండి”.
5 మోషే ఆజ్ఞాపించినవాటిని వారు సన్నిధిగుడారం ఎదుటికి తీసుకువచ్చారు. సమాజమంతా దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధానంలో నిలబడ్డారు.
6 అప్పుడు మోషే “యెహోవా మహిమా ప్రకాశం మీకు కనిపించేలా మీరు ఇలా చెయ్యాలని ఆయన ఆజ్ఞాపించాడు” అన్నాడు.
7 అహరోనుతో మోషే “బలిపీఠం సమీపించి పాపాలకోసం నీ బలినీ నీ హోమాన్నీ సమర్పించు. నీ పాపాలనూ ప్రజల పాపాలనూ కప్పివెయ్యి. యెహోవా ఇచ్చిన ఆజ్ఞప్రకారం, ప్రజలు తెచ్చిన అర్పణ అర్పించి వారి పాపాలను కప్పివెయ్యి” అన్నాడు.
8 అందుచేత అహరోను బలిపీఠం సమీపించాడు. పాపాలకోసమైన బలిగా తన కోడెను వధించాడు. 9 అహరోను కొడుకులు దాని రక్తాన్ని అతనికి అందించారు. అతడు దానిలో తన వ్రేలు ముంచి బలిపీఠం మీది కొమ్ములమీద పూశాడు. మిగతా రక్తాన్ని బలిపీఠం అడుగున పోశాడు. 10 ఆ బలి కొవ్వునూ, మూత్రపిండాలనూ, కారిజం అంటివున్న కొవ్వునూ బలిపీఠం మీద కాల్చివేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారమే అదంతా చేశాడు. 11 దాని మాంసాన్నీ, చర్మాన్నీ శిబిరం బయట పూర్తిగా కాల్చివేశారు.
12 అతడు హోమబలిని వధించాడు. అహరోను కొడుకులు దాని రక్తాన్ని అతనికి అందించారు. అతడు దాన్ని బలిపీఠం చుట్టూరా చల్లాడు. 13 వారు హోమబలి తలను, ఏ భాగానికి ఆ భాగాన్ని అతనికి అందించారు, అతడు వాటిని బలిపీఠం మీద కాల్చివేశాడు. 14 దాని లోపలి భాగాలనూ కాళ్ళనూ నీళ్లతో కడిగి బలిపీఠం పైన ఉన్న ఆ హోమం మీద ఉంచి వాటిని కూడా కాల్చివేశాడు.
15 అప్పుడతను ప్రజల అర్పణను దగ్గరకు తెప్పించాడు. ప్రజల పాపాలకోసమైన బలిమేకను వధించి మొదటి దానిలాగే దాన్ని పాపాలకోసం అర్పించాడు. 16 హోమబలి జంతువును కూడా దగ్గరకు తెప్పించాడు. న్యాయనిర్ణయం ప్రకారం దాన్ని అర్పించాడు. 17 నైవేద్యాన్ని కూడా దగ్గరకు తెప్పించాడు. దానిలో నుంచి పిడికెడు తీసి, ప్రొద్దున చేసిన హోమం గాక దాన్ని కూడా బలిపీఠం మీద కాల్చివేశాడు.
18 ప్రజలకోసం శాంతిబలులుగా ఉన్న ఆ ఎద్దునూ, పొట్టేలునూ వధించాడు. అహరోను కొడుకులు అతనికి వాటి రక్తాన్ని అందించారు. అతడు బలిపీఠం చుట్టూరా దాన్ని చల్లాడు. 19 ఎద్దు కొవ్వును, పొట్టేలు కొవ్వును వాటి కొవ్విన తోకను వాటి పేగులమీది కొవ్వును వాటి మూత్రపిండాలను, కారిజం మీద అంటివున్న కొవ్వును తీశారు. 20 ఆ బలుల బోరలమీద ఆ కొవ్వును ఉంచారు. అహరోను ఆ కొవ్వును బలిపీఠం మీద కాల్చివేశాడు. 21 మోషే ఇచ్చిన ఆజ్ఞప్రకారం అహరోను ఆ బోరలనూ కుడి తొడలనూ కదలిక అర్పణగా యెహోవా సన్నిధానంలో అటూ ఇటూ కదల్చాడు.
22 అహరోను పాపాలకోసమైన బలినీ, హోమ బలినీ, శాంతి బలులనూ అర్పించాక, ప్రజలవైపు తన చేతులెత్తి వారిని దీవించాడు. అప్పుడతను దిగివచ్చాడు. 23 అతడు, మోషే సన్నిధిగుడారంలోకి ప్రవేశించారు. మళ్ళీ బయటికి వచ్చి ప్రజలను దీవించారు. అప్పుడు యెహోవా మహిమాప్రకాశం ప్రజలందరికీ కనిపించింది. 24 యెహోవా సన్నిధానంనుంచి మంటలు వచ్చి బలిపీఠం మీద వున్న హోమాన్నీ, కొవ్వునూ కాల్చివేశాయి. దాన్ని చూచి ప్రజలంతా ఆనందధ్వనులు చేసి, సాగిలపడ్డారు.