8
1 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 2 ✝“నీవు అహరోన్నూ అతడి కొడుకులనూ సన్నిధిగుడారం ద్వారం దగ్గరికి తీసుకురా. యాజి వస్త్రాలనూ, అభిషేక తైలాన్నీ, పాపాలకోసమైన బలి కోడెనూ, రెండు పొట్టేళ్ళనూ, గంపెడు పొంగని రొట్టెలనూ కూడా తీసుకురా. 3 అక్కడ సమాజమంతటినీ సమకూర్చు.”4 యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అతడు చేశాడు. సమాజం సన్నిధిగుడారం ద్వారం దగ్గర సమావేశం అయ్యారు. 5 మోషే సమాజంతో “ఇలా చెయ్యాలని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు” అన్నాడు.
6 మోషే అహరోన్నూ అతడి కొడుకులనూ తీసుకువచ్చి వారికి స్నానం చేయించాడు. 7 అప్పుడతడు అహరోనుకు చొక్కాను తొడిగి, నడికట్టు కట్టి, నిలువుటంగీనీ ఏఫోదునూ వేసి, నేర్పుతో నేసిన ఏఫోదు కట్టును కట్టి, దానితో అతడికి ఏఫోదును బిగించాడు. 8 వక్షపతకం కూడా అతడికి వేశాడు. వక్షపతకంలో “ఊరీం”, “తుమ్మీం” ఉంచాడు. 9 అతడి తలమీద పాగా పెట్టాడు; పాగా ముందు భాగం మీద కిరీటంలాంటి పవిత్రమైన బంగారు రేకును ఉంచాడు. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞప్రకారమే ఇదంతా జరిగింది.
10 అప్పుడు మోషే అభిషేక తైలం చేతపట్టుకొని దైవనివాసాన్ని, దానిలో ఉన్న ప్రతిదాన్నీ అభిషేకించి ప్రతిష్ఠించాడు. 11 అతడు ఆ తైలంలో కొంత ఏడు సార్లు బలిపీఠం మీద చిలకరించాడు. దాని సామానంతా, గంగాళాన్నీ, దాని బలిపీఠాన్నీ ప్రతిష్ఠించడానికి అభిషేకించాడు. 12 ✽ అహరోన్ను ప్రతిష్ఠించడానికి అభిషేక తైలంలో కొంత అతడి తలమీద పోసి అభిషేకించాడు. 13 ✽అప్పుడు మోషే అహరోను కొడుకులను దగ్గరికి తీసుకువచ్చి వారికి చొక్కాలను తొడిగాడు, నడికట్లను కట్టాడు, కుళ్ళాయిలను పెట్టాడు. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే ఇదంతా జరిగింది.
14 అప్పుడతడు పాపాలకోసమైన బలిగా కోడెను తెప్పించాడు. అహరోను, అతడి కొడుకులు దాని తలమీద చేతులు పెట్టారు. 15 దాన్ని వధించిన తరువాత మోషే దాని రక్తాన్ని తీసుకొని దానిలో కొంత బలిపీఠం కొమ్ములన్నిటిమీదా తన వ్రేలితో పూసి దాన్ని పవిత్రం చేశాడు. మిగతా రక్తాన్ని బలిపీఠం అడుగున పోసి, అలా ఆ పీఠం కోసం ప్రాయశ్చిత్తం చేయడం వల్ల దాన్ని ప్రతిష్ఠించాడు. 16 అప్పుడు మోషే ఆ బలిజంతువు పేగులమీది కొవ్వునంతా, కారిజం అంటివున్న కొవ్వునూ, రెండు మూత్ర పిండాలనూ వాటి కొవ్వునూ తీసి బలిపీఠం మీద కాల్చివేశాడు. 17 అయితే ఆ కోడెనూ, దాని చర్మాన్నీ, దాని మాంసాన్నీ, దాని పేడనూ, శిబిరం బయట పూర్తిగా కాల్చివేశారు. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే ఇదంతా జరిగింది.
18 ఆ తరువాత అతడు హోమంగా ఒక పొట్టేలును తెప్పించాడు. అహరోను, అతడి కొడుకులు ఆ పొట్టేలు తలమీద చేతులు పెట్టారు. 19 దాన్ని వధించిన తరువాత మోషే దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాడు. 20 ఆ పొట్టేలు అవయవాలను విడదీసి వాటినీ, దాని తలనూ కొవ్వునూ కాల్చివేశాడు. 21 దాని లోపలి భాగాలనూ కాళ్ళనూ నీళ్ళతో కడిగి ఆ పొట్టేలునంతా బలిపీఠంమీద కాల్చివేశాడు. అది పరిమళంగా ఉన్న హోమం, యెహోవాకు మంటల్లో అర్పించిన అర్పణ. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞప్రకారమే ఇది జరిగింది.
22 మోషే ఆ రెండో పొట్టేలును కూడా తెప్పించాడు. అది యాజి సేవాప్రతిష్ఠకోసం. దాని తలమీద అహరోను, అతడి కొడుకులు చేతులు పెట్టారు. 23 దాన్ని వధించాక మోషే దాని రక్తంలో కొంత తీసి అహరోను కుడి చెవి కొనమీద, కుడిచేతి బొటనవ్రేలిమీద, కుడికాలి బొటనవ్రేలిమీద పూశాడు. 24 అహరోను కొడుకులను కూడా దగ్గరికి తీసుకువచ్చి వారి కుడిచెవి కొనమీద, కుడిచేతి బొటనవ్రేలిమీద, కుడికాలి బొటనవ్రేలిమీద కూడా పూశాడు. మిగతా రక్తాన్ని బలిపీఠం చుట్టూరా చల్లాడు. 25 అప్పుడు దాని కొవ్వునూ, కొవ్విన తోకనూ, పేగులమీది కొవ్వునూ, కారిజం అంటివున్న కొవ్వునూ, రెండు మూత్రపిండాలనూ, వాటి కొవ్వునూ, కుడి తొడనూ తీశాడు. 26 యెహోవా సన్నిధానంలో ఉన్న గంపెడు పొంగని రొట్టెలలో నుంచి పొంగజేసే పదార్థం లేని ఒక పిండి వంటకం, నూనె కలిపిన ఒక భక్ష్యం, ఒక పలచని అప్పడం తీసుకొని ఆ కొవ్వుమీద, కుడితొడమీద ఉంచాడు. 27 అప్పుడు అవన్నీ అహరోను చేతులలో, అతడి కొడుకుల చేతులలో పెట్టి యెహోవా సన్నిధానంలో అటూ ఇటూ కదల్చాడు. అది కదలిక అర్పణ. 28 ఆ తరువాత మోషే వారి చేతుల్లోనుంచి వాటిని తీసి, బలిపీఠంమీద ఉన్న హోమబలిమీద పెట్టి కాల్చివేశాడు. అదంతా పరిమళంగా ఉన్న సేవాప్రతిష్ఠ అర్పణంగా ఉంది. అది యెహోవాకు మంటల్లో అర్పణ. 29 మోషే దాని బోరను కూడా తీసి కదలిక అర్పణగా యెహోవా సన్నిధానంలో కదల్చాడు. సేవా ప్రతిష్ఠ కోసమైన పొట్టేలులో అది మోషేకు వచ్చిన భాగం. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞప్రకారమే ఇదంతా జరిగింది.
30 అప్పుడు మోషే, అభిషేక తైలంలో కొంత, బలిపీఠం మీద ఉన్న రక్తంలో కొంత తీసుకొని, అహరోను మీద, అతడి వస్త్రాలమీద, అతడి కొడుకుల మీద, వారి వస్త్రాల మీద చిలకరించాడు. ఈ విధంగా అహరోన్నూ, అతడి వస్త్రాలనూ, అతడి కొడుకులనూ, వారి వస్త్రాలనూ ప్రతిష్ఠించాడు.
31 మోషే అహరోనుతోను, అతడి కొడుకులతోను ఇలా అన్నాడు: “సన్నిధిగుడారం ద్వారం దగ్గర ఈ మాంసం వండాలి: అక్కడే దాన్నీ, సేవాప్రతిష్ఠ కోసమైన రొట్టెనూ ఆ గంపలోని రొట్టెనూ తినాలి. అహరోను, అతడి కొడుకులు దాన్ని తినాలని నేను ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చెయ్యాలి. 32 మిగతా మాంసం, రొట్టె పూర్తిగా కాల్చివెయ్యాలి. 33 మిమ్మల్ని ప్రతిష్ఠించడం ఏడు రోజులు పడుతుంది. మీ ప్రతిష్ఠ దినాలు ముగిసేవరకు, ఆ ఏడు రోజులలో మీరు సన్నిధిగుడారం ద్వారం విడిచి వెళ్ళకూడదు. 34 ఈ రోజు మీ పాపాలను కప్పివేయడానికి ఇలా చేశాను. చేయాలని యెహోవా ఆజ్ఞాపించాడు. 35 ✽మీరు చావకుండేలా సన్నిధిగుడారం ద్వారా దగ్గరే ఏడు రోజులు రాత్రింబగళ్ళూ ఉండాలి. యెహోవా చెప్పినట్టే చేస్తూ ఉండాలి. ఆయన అలా నాకు ఆజ్ఞ ఇచ్చాడు”.
36 యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్టెల్లా అహరోను, అతడి కొడుకులు చేశారు.