7
1 “అపరాధ బలి గురించిన చట్టమిది. ఆ బలి అతి పవిత్రం. 2 హోమ బలిని వధించే స్థలంలోనే ఈ బలిని కూడా వధించాలి. బలిపీఠం చుట్టూరా దాని రక్తాన్ని చిలకరించాలి. 3 దానిలో నుండి దాని కొవ్వునంతా – అంటే దాని కొవ్విన తోకనూ, పేగులను అంటి ఉన్న కొవ్వునూ, 4 రెండు మూత్రపిండాలనూ వాటిమీది కొవ్వునూ, డొక్కలపై ఉన్న కొవ్వునూ, మూత్రపిండాల దగ్గర కారిజంకు అంటివున్న కొవ్వునూ తీయాలి. 5 యాజి యెహోవాకు హోమంగా బలిపీఠంమీద వాటిని కాల్చివెయ్యాలి. అది అపరాధ బలి. 6  యాజులలో ప్రతి మగవాడూ దాన్ని తినవచ్చు. అయితే దాన్ని ఒక పవిత్రమైన చోట తినాలి. అది అతి పవిత్రం. 7 పాపాలకోసమైన బలికీ అపరాధ బలికీ చట్టం ఒకటే. వాటిని అర్పించి, పాపాన్ని కప్పివేసే యాజికి అవి చెందుతాయి. 8 ఎవరైనా హోమంకోసం బలితెస్తే దాన్ని ఏ యాజి అర్పిస్తాడో అతనికి ఆ బలిజంతువు చర్మం ఉంటుంది. 9 పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యం గానీ, కుండలో, పెనం మీద కాల్చిన ప్రతినైవేద్యం గానీ దాన్ని అర్పించే యాజికే చెందుతుంది. 10 ప్రతి నైవేద్యమూ, అది నూనె కలిసినదైనా పొడిగా ఉన్నా, దాన్ని అహరోను కొడుకులంతా సమంగా పంచుకోవాలి.
11 “యెహోవాకు సమర్పించే శాంతిబలి గురించిన చట్టమిది. 12 ఒక వ్యక్తి దాన్ని కృతజ్ఞత బలిగా సమర్పిస్తే దానితో అర్పించవలసినవి ఏవంటే పొంగజేసే పదార్ధం వెయ్యకుండా నూనె కలిపి చేసిన పిండి వంటలూ, పొంగజేసే పదార్థం వెయ్యకుండా నూనె పూసి చేసిన పలచని అప్పడాలు, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలూ, 13 అవి గాక, కృతజ్ఞత వెల్లడించే ఆ శాంతిబలితో కూడా పొంగజేసే పదార్థం వేసి చేసిన రొట్టెను కూడా అర్పించాలి. 14  ఆ వేరు అర్పణలలో నుంచి ఒక దాన్ని యెహోవాకు ప్రత్యేక నైవేద్యంగా ఇవ్వాలి. శాంతి బలిరక్తాన్ని చిలకరించిన యాజికి అవి ఉంటాయి.
15 “కృతజ్ఞత వెల్లడించే ఆ శాంతిబలి మాంసాన్ని దాన్ని అర్పించిన రోజే తినాలి. ఉదయం వరకు దానిలో ఏదీ మిగలకూడదు. 16 కానీ ఎవరైనా ఒకరు అర్పించే బలి మొక్కుబడి గానే, స్వేచ్ఛార్పణ గానీ అయితే, దాన్ని అర్పించే రోజు తినవచ్చు, మరుసటి రోజు కూడా తినవచ్చు. 17 మూడో రోజు ఆ బలి మాంసంలో మిగిలినది ఏదైనా ఉంటే, దాన్ని కాల్చాలి. 18 శాంతి బలిగా అర్పించినదాని మాంసంలో కొంచెమైనా మూడో రోజున తింటే, అర్పించినది యెహోవాకు అంగీకారంగా ఉండదు. దాన్ని తెచ్చిన వాడి లెక్కలోకి అది రాదన్నమాట. అంతేగాక అది అసహ్యమవుతుంది. దాన్ని తినేవాడు అపరాధి అవుతాడు. 19 మాంసం ఏదైనా అశుద్ధమైన దానికి తగిలితే దాన్ని తినకూడదు. దాన్ని కాల్చివెయ్యాలి. ఎవరైతే శుద్ధంగా ఉంటారో వారు ఆ మాంసం తినవచ్చు. 20  కానీ ఒక వ్యక్తి అశుద్ధంగా ఉండి యెహోవాకు చెందిన శాంతి బలి మాంసంలో కొంచమైనా తింటే అలాంటివాడు తన ప్రజలలో లేకుండా పోవాలి. 21 అంతేగాక, ఒక వ్యక్తి అశుద్ధమైనదాన్ని తాకుతాడనుకోండి – అది మానవ అశుద్ధత కానీ అశుద్ధ జంతువు కానీ, అశుద్ధ వస్తువు కానీ – అలాంటిదేనినైనా తాకి యెహోవాకు చెందిన శాంతిబలి మాంసంలో కొంచెమైనా తింటే ఆ వ్యక్తి తన ప్రజలలో లేకుండా పోవాలి.”
22 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 23 “నీవు ఇస్రాయేల్ ప్రజతో ఈ విధంగా చెప్పు – మీరు ఎద్దు కొవ్వునూ, గొర్రె కొవ్వునూ, మేక కొవ్వునూ ఏమీ తినకూడదు. 24 చచ్చినదాని కొవ్వునూ, మృగాలు చీల్చినదాని కొవ్వునూ ఏ పనికైనా ఉపయోగించవచ్చు గాని, దాన్ని తిననే తినకూడదు. 25 యెహోవాకు హోమంగా అర్పించే జంతువులలో దేని కొవ్వునైనా తినేవాడు తన ప్రజలలో లేకుండా పోవాలి. 26 అంతేగాక, మీరు ఎక్కడ నివసించినా ఏ పక్షి రక్తాన్ని గానీ, జంతువు రక్తాన్ని గానీ తినకూడదు. 27 ఏ రక్తాన్నైనా తినేవాడు తన ప్రజలలో లేకుండా పోవాలి.”
28 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 29 “నీవు ఇస్రాయేల్‌ప్రజతో ఈ విధంగా చెప్పు – యెహోవా దగ్గరికి శాంతిబలి జంతువును తెచ్చేవాడెవడైనా దానిలో ఒక భాగాన్ని ప్రత్యేక అర్పణగా యెహోవాకు అర్పించాలి. 30 అతడు తన సొంత చేతులతో యెహోవా సన్నిధానానికి హోమంగా ఉన్న తన అర్పణ తీసుకురావాలి. అతడు తేవలసినది ఆ జంతువు కొవ్వు, దాని బోర. ఆ బోర యెహోవా సన్నిధానంలో అటూ ఇటూ కదల్చాలి. అది కదలిక అర్పణ. 31 యాజి ఆ కొవ్వును బలిపీఠం మీద కాల్చివెయ్యాలి గాని ఆ బోర అహరోనుకూ అతడి కొడుకులకూ ఉంటుంది. 32 శాంతి బలి పశువులలో నుంచి ప్రత్యేక అర్పణగా యాజికి కుడి తొడ ఇవ్వాలి. 33 అహరోను కొడుకులలో ఎవడైతే శాంతి బలుల రక్తాన్నీ కొవ్వునూ అర్పిస్తాడో అతడికి ఆ కుడి తొడ ఉంటుంది. 34 ఇస్రాయేల్ ప్రజలు అర్పించే శాంతిబలి పశువులలో నుంచి బోరను కదలిక అర్పణగాను, తొడను ప్రత్యేకమైన అర్పణగాను నేను తీసుకొని అహరోనుయాజికి, అతని సంతానానికి ఇచ్చాను. ఇది ఇస్రాయేల్ ప్రజ అనుసరించవలసిన నిత్యమైన చట్టం.”
35 అహరోను, అతడి కొడుకులు యెహోవాకు యాజులుగా సేవ చేయనారంభించిన రోజున ఈ ప్రత్యేక భాగాలు వారికిచ్చారు. 36 తనకు అర్పించిన హోమాలలో ఈ భాగాలు వారికివ్వాలని యెహోవా ఇస్రాయేల్ ప్రజలకు ఆజ్ఞ ఇచ్చాడు. అహరోను, అతడి కొడుకులు అభిషేకం పొందిన రోజున ఇలా ఆజ్ఞాపించాడు. తరతరాలకు యాజుల వంతు అదే. ఇది ఎప్పటికి నిలిచివుండే చట్టం.
37 ఇవి హోమాన్ని గురించిన చట్టాలు, నైవేద్యాన్నీ పాపాలకోసమైన బలినీ అపరాధబలినీ ప్రతిష్ఠకోసమైన అర్పణనూ శాంతిబలినీ గురించిన చట్టాలు. 38 ఈ ఆజ్ఞలు యెహోవా సీనాయి పర్వతం మీద మోషేకిచ్చాడు. ఇస్రాయేల్ ప్రజలు తనకు అర్పణలు తేవాలని యెహోవా ఆజ్ఞాపించిన రోజున, సీనాయి ఎడారిలో, అలా జరిగింది.