6
1 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 2 “ఎవరైనా తనకు తన పొరుగువాడు అప్పగించినదాని విషయంలో అతణ్ణి వంచించడంవల్ల యెహోవాకు ద్రోహి అయి పాపం చేస్తా డనుకోండి; తాకట్టు ఉంచిన దానిని గురించి అతణ్ణి వంచిస్తాడనుకోండి; లేకపోతే అతడి వస్తువును దొంగిలిస్తా డనుకోండి; అతణ్ణి మోసగించి ఏదో తీసుకుంటాడనుకోండి. 3 పోయినది తనకు దొరికినప్పుడు దొరకలేదని బొంకుతా డనుకోండి. లేకపోతే, మనుషులు చేసే ఇలాంటి పాపాలలో తాను చేసినదాని గురించి అబద్ధసాక్ష్యం పలుకుతాడనుకోండి. అలాంటివాడు యెహోవాపట్ల ద్రోహి అవుతున్నాడు. 4  ఎవరైనా ఇలా పాపం చేసి అపరాధి అయితే తాను దొంగలించినదాన్ని మళ్ళీ ఇచ్చివేయాలి. మోసంచేత తీసుకొన్న దాన్ని గానీ, తనకు అప్పగించిన దాన్ని గానీ, పోయి తనకు దొరికినదాన్ని గానీ మళ్ళీ ఇచ్చివేయాలి. 5 దేని గురించి అబద్ధ సాక్ష్యం పలికాడో దాన్ని పూర్తిగా ఇచ్చివేయాలి. అంతేగాక దానిలో అయిదో భాగాన్ని కూడా ఇవ్వాలి. అది ఎవరికి చెందుతుందో వారికి అదంతా ఇవ్వాలి. తాను అపరాధ బలిని సమర్పించే రోజే దాన్ని ఇవ్వాలి. 6 అతడు యెహోవాకు సమర్పించే తన అపరాధబలిగా మందలోనుంచి లోపం లేని పొట్టేలును యాజి దగ్గరికి తేవాలి. నీవు దాని విలువను నిర్ణయించాలి. 7 యెహోవా సన్నిధానంలో యాజి ఆ బలిని అర్పించి ఆ వ్యక్తి తప్పిదాలను కప్పివేస్తాడు. ఆ వ్యక్తి ఏమేమి చేసి అపరాధి అయ్యాడో వాటన్నిటిలో అతడికి క్షమాపణ దొరుకుతుంది.”
8 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 9 “నీవు అహరోనుకూ అతని కొడుకులకూ ఈ విధంగా ఆజ్ఞాపించు. హోమాన్ని గురించిన చట్టం ఇది – హోమం రాత్రి అంతా ఉదయం వరకూ బలిపీఠం మీద కాలుతూ ఉండాలి. బలిపీఠం మీది నిప్పు ఎప్పుడూ మండుతూ ఉండాలి. 10 యాజి నార షరాయిలనూ, సన్ననార నిలువుటంగీనీ తొడుక్కోవాలి; బలిపీఠం మీద మంటలు కాల్చివేసిన హోమం బూడిదను ఎత్తి బలిపీఠం దగ్గర పెట్టాలి. 11 అప్పుడతడు తన బట్టలు మార్చుకొని ఆ బూడిదను శిబిరం బయట ఉన్న శుద్ధమైన చోటుకు తీసుకుపోవాలి. 12 బలిపీఠం మీది నిప్పు మండుతూ ఉండాలి. అది ఎన్నడూ ఆరిపోకూడదు. ప్రతి రోజూ ప్రొద్దున్నే యాజి దానిమీద కట్టెలు వెయ్యాలి, దానిమీద హోమాన్ని చక్కగా ఉంచాలి. శాంతిబలి పశువు కొవ్వును కాల్చివెయ్యాలి. 13 బలిపీఠం మీద నిప్పు ఎప్పుడూ మండుతూ ఉండాలి. అది ఆరిపోకూడదు.
14 “నైవేద్యాన్ని గురించిన చట్టం ఇది: అహరోను కొడుకులు యెహోవా సన్నిధానంలో బలిపీఠానికి ముందుగా దాన్ని సమర్పించాలి. 15 యాజి ఆ నైవేద్యంనుంచి పిడికెడు పిండిని, దాని నూనెలో నుంచి కొంత, దాని సాంబ్రాణి అంతా తీయాలి. స్మృతి చిహ్నంగా వాటిని బలిపీఠం మీద యెహోవాకు పరిమళంగా కాల్చివెయ్యాలి. 16 మిగతాదాన్ని అహరోను, అతడి కొడుకులు తినాలి. పొంగజేసే పదార్థం వెయ్యకుండా రొట్టెలు చేసి ఒక పవిత్రమైన చోట వాటిని తినాలి. అంటే సన్నిధి గుడారం ఆవరణంలో దాన్ని తినాలి. 17 పొంగజేసే పదార్థం వేసి ఆ రొట్టె కాల్చకూడదు. నా హోమాలలో వారికి ఈ భాగాన్ని ప్రసాదించాను. పాపాలకోసమైన బలిలాగే, అపరాధ బలిలాగే, అది అతి పవిత్రం. 18 అహరోను కొడుకులలో ప్రతి ఒక్కరూ దాన్ని తినవచ్చు. ఇది యెహోవా హోమాల విషయం మీ తరతరాలకు ఎప్పటికీ నిలిచివుండే చట్టం. వాటికి తగిలే ప్రతి వస్తువూ పవిత్రం అవుతుంది.”
19 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 20 “అహరోను అభిషేకం పొందిన రోజు అతడూ అతడి కొడుకులూ ఈ నైవేద్యాన్ని యెహోవాకు సమర్పించాలి – మామూలు నైవేద్యం లాగే సుమారు ఒక కిలోగ్రాం మెత్తని గోధుమ పిండి దానిలో సగం పొద్దున, సగం సాయంకాలం సమర్పించాలి. 21 నూనెతో బాగా కలిపి పెనం మీద కాల్చి దాన్ని తేవాలి. అప్పుడా నైవేద్యాన్ని ముక్కలుముక్కలుగా చేసి యెహోవాకు పరిమళంగా సమర్పించాలి. 22 అహరోను కొడుకులలో అతడి స్థానంలో అభిషేకం పొందే యాజి కూడా అలాగే సమర్పించాలి. ఇది ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం. అదంతా యెహోవాకు పూర్తిగా కాల్చివెయ్యాలి. 23 యాజి చేసే ప్రతి నైవేద్యాన్నీ పూర్తిగా కాల్చివెయ్యాలి. దాన్ని తినకూడదు.”
24 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 25 “నీవు అహరోనుతోను అతడి కొడుకులతోను ఈ విధంగా చెప్పు: పాపాలకోసమైన బలిని గురించిన చట్టమిది – హోమబలి జంతువును వధించిన స్థలంలోనే యెహోవా సన్నిధానంలో పాపాలకోసమైన బలి జంతువును కూడా వధించాలి. అది అతి పవిత్రం. 26 పాపాల కోసం దాన్ని అర్పించిన యాజి దాన్ని తినాలి. ఒక పవిత్ర స్థలంలో, అంటే సన్నిధిగుడారం ఆవరణంలో దాన్ని తినాలి. 27 దాని మాంసానికి తగిలే ప్రతి వస్తువూ పవిత్రంగా ఉంటుంది. ఒకవేళ దాని రక్తంలో కొంత వస్త్రం మీద పడితే ఆ వస్త్రం ఒక పవిత్రమైన చోట ఉతకాలి. 28 ఆ బలి మాంసాన్ని మట్టి కుండలో వండితే ఆ కుండను పగలకొట్టాలి; కంచు పాత్రలో వండితే ఆ పాత్రను తోమి నీళ్ళతో కడగాలి. 29 యాజులలో ప్రతి మగవాడూ దాన్ని తినవచ్చు. అది అతి పవిత్రమైనది. 30 కాని, పాపాలకోసమైన బలి రక్తంలో కొంచమైనా సన్నిధిగుడారంలోని పవిత్ర స్థలంలో పాపాన్ని కప్పివేయడానికి తీసుకువస్తే ఆ బలి మాంసాన్ని తినకూడదు. దాన్ని పూర్తిగా కాల్చివెయ్యాలి.