5
1 “తాను చూచిన, తెలిసిన సంగతి గురించి సాక్ష్యమిమ్మని ఒక వ్యక్తిని ఆదేశించడం జరుగుతుందనుకోండి. ఆ సంగతి తెలియజేయకపోతే అది పాపం. అలా చేసిన వ్యక్తి తన అపరాధం భరిస్తాడు.
2 “ఎవరైనా అశుద్ధమైన దేనినైనా తాకితే అశుద్ధమని తనకు తెలియకపోయినా ఆ వ్యక్తి అశుద్ధంగా ఉంటాడు. తాకినది అశుద్ధ జంతువు పీనుగు కానివ్వండి, అశుద్ధ పశువు పీనుగు కానివ్వండి, ప్రాకే అశుద్ధ ప్రాణుల పీనుగులు కానివ్వండి – తాకినవాడు అపరాధే. 3 తనకు తెలియకుండా మానవ అశుద్ధతను – అది ఎలాంటి అశుద్ధతైనా – తాకితే ఆ సంగతి తెలిసిన తరువాత అతడు అపరాధి అవుతాడు.
4 “కీడు గానీ, మేలు గానీ చేస్తామని ఆలోచన లేకుండా ఒట్టుపెట్టుకొనే వారు ఉంటారనుకోండి. ఎవరైనా అలా ఆలోచన లేకుండా ఏదైనా ఒక సంగతి గురించి ఒట్టు పెట్టుకొని, ఆ సంగతి మరచిపోతే, అది గుర్తుకు వచ్చాక అతడు అపరాధి అవుతాడు.
5 “ఇలాంటి విషయాలలో దేన్నిగురించి అయినా ఎవరైనా అపరాధి అయితే చేసిన తప్పిదం ఒప్పుకోవాలి. 6 తన అపరాధానికి తన మందలో నుంచి ఆడ గొర్రెను గానీ, ఆడ మేకను గానీ, పాపాలకోసం బలిగా యెహోవాకు తీసుకురావాలి. ఆ వ్యక్తికి పాపక్షమాపణ దొరికేలా యాజి ఆ బలి అర్పించి అతడి పాపాన్ని కప్పివేస్తాడు.
7 “ఆ వ్యక్తి గొర్రెపిల్లను తీసుకురాలేనంత బీదవాడైతేనే తాను తప్పిదం చేసి అపరాధి అయిన విషయంలో రెండు గువ్వలను గానీ, రెండు పావురం పిల్లలను గానీ యెహోవాకు తేవాలి. వాటిలో ఒకటి పాపాలకోసమైన బలిగా, రెండోది హోమ బలిగా ఉంటాయి. 8 అతడు వాటిని యాజి దగ్గరికి తేవాలి. యాజి మొదట పాపాలకోసమైన బలిని అర్పించాలి. ఆ పిట్ట తలదగ్గరే దాని మెడను నులమాలి గాని, తలను వేరు చేయకూడదు. 9 పాపాలకోసమైన ఆ బలిరక్తంలో కొంత బలిపీఠం ప్రక్కన చిలకరించాలి. మిగతా రక్తాన్నంతా ఆ బలిపీఠం అడుగున పిండాలి. ఆది పాపాలకోసం బలి. 10 తరువాత యాజి ఆ రెండో పిట్టను విధిప్రకారం హోమబలిగా సమర్పించాలి. ఆ వ్యక్తి చేసిన తప్పిదాన్ని యాజి ఈ విధంగా కప్పివేస్తాడు. అతనికి క్షమాపణ దొరుకుతుంది.
11 “ఆ వ్యక్తి రెండు గువ్వలను గానీ, రెండు పావురం పిల్లలను గానీ తీసుకురాలేనంత బీదవాడనుకోండి. అలాంటప్పుడు అతడు చేసిన తప్పిదానికి పాపాలకోసమైన అర్పణగా ఒక కిలోగ్రాం గోధుమపిండిని తీసుకురావాలి. అది పాపాలకోసమైన అర్పణ గనుక దానిమీద అతడు నూనె గానీ, సాంబ్రాణి గానీ వెయ్యకూడదు. 12 అతడు దాన్ని యాజి దగ్గరకి తేవాలి. యాజి దానిలో పిడికెడు స్మృతి చిహ్నంగా తీసి, యెహోవాకు హోమాలు అర్పించే చోట బలిపీఠం మీద దాన్ని కాల్చివెయ్యాలి. అది పాపాలకోసమైన అర్పణ. 13 పైన చెప్పిన వాటిలో ఏ విషయంలోనైనా అతడు చేసిన తప్పిదాన్ని యాజి ఇలా కప్పి వేస్తాడు. అతడికి క్షమాపణ దొరుకుతుంది. మిగతా గోధుమ పిండి నైవేద్యంలాగే యాజిది అవుతుంది.”
14 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 15 “ఎవరైనా యెహోవాకు చెందిన పవిత్ర వస్తువుల విషయంలో పొరపాటున తప్పిదం చేస్తాడనుకోండి. అలాంటివాడు తన అపరాధానికి మందలోనుంచి లోపం లేని పొట్టేలును అపరాధబలిగా యెహోవాకు తేవాలి. ఆ పొట్టేలు విలువకు సమానమైన వెండిని నీవు పవిత్ర స్థలం తులం తూనిక ప్రకారం నిర్ణయించాలి. 16 ఆ వ్యక్తి ఆ పవిత్ర వస్తువు విషయంలో చేసిన తప్పిదంవల్ల వచ్చే నష్టం ఇచ్చివేయాలి. దానితో ఇంకో అయిదో భాగం ఇవ్వాలి. అదంతా యాజికివ్వాలి. యాజి అపరాధబలిగా ఉన్న ఆ పొట్టేలును సమర్పించి అతడు అపరాధాన్ని కప్పివేస్తాడు. అతడికి క్షమాపణ దొరుకుతుంది.
17 “చెయ్యకూడదని యెహోవా ఆజ్ఞాపించిన విషయాలలో దేనినైనా జరిగించడంవల్ల ఎవరైనా తప్పిదం చేస్తే – తెలియకుండానే చేసినా – ఆ వ్యక్తి అపరాధి అవుతాడు. అతడు జవాబుదారి. 18 అలాంటివాడు మందలోనుండి లోపం లేని పొట్టేలును అపరాధబలిగా యాజి దగ్గరకి తేవాలి. దాని విలువ నీవు నిర్ణయించాలి. ఆ వ్యక్తి తెలియకుండా చేసిన తప్పిదాన్ని యాజి కప్పివేస్తాడు. అతడికి క్షమాపణ దొరుకుతుంది. 19 అది అపరాధబలి. అలాంటి వ్యక్తి యెహోవాకు విరోధంగా అపరాధం చేసినవాడు, సందేహం లేదు.”