4
1 యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, 2 “నీవు ఇస్రాయేల్ ప్రజతో ఈ విధంగా చెప్పాలి: యెహోవా ఆజ్ఞాపించిన విషయాలలో దేనినైనా ఎవరైనా పొరపాటున మీరి చెయ్యకూడని తప్పిదం చేస్తారనుకోండి. 3 అలా చేసి ప్రజలమీదికి అపరాధం తెచ్చి పెట్టేవాడు అభిషేకం పొందిన యాజి అయితే అతడు తాను చేసిన ఆ పాపానికి బలి చేయాలి. లోపం లేని కోడెను యెహోవాకు పాపాలకోసం బలిగా సమర్పించాలి. 4 అతడు ఆ కోడెను యెహోవా సన్నిధానంలోకి, సన్నిధిగుడారం ద్వారం దగ్గరికి తేవాలి. ఆ కోడె తలమీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధానంలో దాన్ని వధించాలి. 5 అప్పుడు అభిషేకం పొందిన ఆ యాజి ఆ కోడె రక్తంలో కొంత సన్నిధిగుడారంలోకి తీసుకురావాలి. 6 అక్కడ యాజి పవిత్ర స్థలంలో ఉన్న అడ్డ తెర ఎదుట యెహోవా సన్నిధానంలో తన వ్రేలు ఆ రక్తంలో ముంచి ఏడు సార్లు చిలకరించాలి. 7 అప్పుడు ఆ యాజి యెహోవా సన్నిధానంలో సన్నిధిగుడారంలో ఉన్న సువాసన ధూపవేదికమీది కొమ్ములమీద ఆ రక్తంలో కొంత పూయాలి. మిగతా కోడె రక్తాన్నంతా సన్నిధిగుడారం ద్వారం దగ్గర ఉన్న హోమ బలిపీఠం అడుగున పోయాలి. 8 ఆ తరువాత పాపాలకోసమైన బలిగా ఉన్న ఆ కోడె కొవ్వునంతా తీయాలి. పేగులను కప్పి ఉన్న కొవ్వునూ, పేగులమీది కొవ్వునంతటినీ 9 రెండు మూత్రపిండాల దగ్గర ఉన్న కారిజం అంటి ఉన్న కొవ్వునూ తీయాలి; 10 శాంతిబలిగా అర్పించే ఎద్దునుంచి తీసినట్టే యాజి వాటిని తీసి హోమ బలిపీఠంమీద వాటిని కాల్చివెయ్యాలి. 11  కానీ ఆ కోడె చర్మాన్ని, దాని మాంసాన్నంతా, దాని తలనూ, కాళ్ళనూ, లోపలిభాగాలనూ, పేడనూ, 12 ఆ కోడెనంతా శిబిరం బయట, బూడిద పారబోసే శుద్ధమైన చోటికి తీసుకుపోవాలి. అక్కడ బూడిద పారబోసే స్థలంలోనే దాన్ని కట్టెలమీద కాల్చివెయ్యాలి.
13 “చెయ్యకూడదని యెహోవా ఆజ్ఞాపించిన విషయాలలో దేనినైనా ఇస్రాయేల్‌ప్రజల సమాజమంతా పొరపాటున చేసి అపరాధులవుతారనుకోండి. ఆ సంగతి వారికి తెలియదనుకోండి. 14 వారు చేసిన ఆ పాపం సమాజానికి తెలిసినప్పుడు వారు పాపాలకోసం బలిగా ఒక కోడెను అర్పించాలి; సన్నిధిగుడారం ఎదుటికి దాన్ని తీసుకురావాలి. 15 అక్కడ సమాజ నాయకులు యెహోవా సన్నిధానంలో కోడెను వధించాలి. 16 కోడె రక్తంలో కొంత, అభిషేకం పొందిన యాజి సన్నిధి గుడారంలోకి తీసుకురావాలి. 17 ఆ యాజి ఆ రక్తంలో వ్రేలు ముంచి అడ్డతెర ఎదుట యెహోవా సన్నిధానంలో దాన్ని ఏడు సార్లు చిలకరించాలి. 18 యెహోవా సన్నిధానంలో సన్నిధిగుడారంలో ఉన్న ధూపవేదిక కొమ్ములమీద కూడా ఆ రక్తంలో కొంత పూయాలి. మిగతా రక్తాన్నంతా సన్నిధిగుడారం ద్వారం దగ్గర ఉన్న హోమబలిపీఠం అడుగున పోయాలి. 19 అతడు ఆ జంతువు కొవ్వంతా తీసి బలిపీఠంమీద కాల్చివెయ్యాలి. 20 అలాగే ఈ కోడెను చెయ్యాలి. పాపాలకోసం బలిగా ఉన్న ఆ కోడెను చేసినట్టే దీన్ని చెయ్యాలి. ఈ విధంగా యాజి వారి పాపాన్ని కప్పివేస్తాడు. వారికి క్షమాపణ దొరుకుతుంది. 21 అప్పుడు అతడు ఆ కోడెను శిబిరం బయటికి తీసుకువెళ్ళి, ఆ మొదటి కోడెను కాల్చినట్టు దీన్ని కాల్చాలి. ఇది సమాజానికి పాపాలకోసమైన బలి.
22 “చెయ్యకూడదని తన దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన విషయాలలో దేనినైనా ఒక అధికారి పొరపాటున చేసి అపరాధి అవుతాడనుకోండి. 23 తాను చేసిన ఆ పాపం తనకు తెలియవస్తే అతడు బల్యర్పణగా లోపం లేని మగ మేకను తీసుకురావాలి. 24 అతడు ఆ మేక తలమీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధానంలో హోమ పశువులను వధించేచోట దాన్ని వధించాలి. అది పాపాలకోసం బలి. 25 పాపాలకోసమైన ఆ బలి రక్తంలో కొంత యాజి తన వ్రేలితో తీసి బలిపీఠం మీది కొమ్ముల పై పూయాలి. మిగతా రక్తాన్నంతా హోమబలిపీఠం అడుగున పోయాలి. 26 శాంతిబలి జంతువు కొవ్వును చేసినట్టే దీని కొవ్వునంతా ఆ బలిపీఠం మీద కాల్చివెయ్యాలి. ఇలా యాజి ఆ వ్యక్తి చేసిన ఆ పాపాన్ని కప్పివేస్తాడు. అతడికి క్షమాపణ దొరుకుతుంది.
27 “చెయ్యకూడదని యెహోవా ఆజ్ఞాపించిన విషయాలలో దేనినైనా సామాన్య ప్రజల్లో ఎవరైనా పొరపాటున చేసి అపరాధి అవుతారనుకోండి. 28 తాను చేసిన ఆ పాపం తనకు తెలియవస్తే ఆ పాపంకోసం ఆ వ్యక్తి లోపం లేని ఆడ మేకను బల్యర్పణగా తీసుకురావాలి. 29 పాపాలకోసమైన ఆ జంతువు తలమీద చెయ్యి ఉంచి హోమబలి పశువులను వధించే చోట దాన్ని వధించాలి. 30 దాని రక్తంలో కొంత యాజి తన వ్రేలితో తీసి హోమ బలిపీఠంపైన ఉన్న కొమ్ములమీద పూయాలి. 31 శాంతిబలి పశువులనుంచి కొవ్వును తీసినట్టే దీని కొవ్వునంతా తీయాలి. యెహోవాకు పరిమళ హోమంగా యాజి దాన్ని బలిపీఠం మీద కాల్చివెయ్యాలి. ఇలా యాజి ఆ వ్యక్తి పాపాన్ని కప్పివేస్తాడు. ఆ వ్యక్తికి క్షమాపణ దొరుకుతుంది.
32 “ఒకవేళ ఆ వ్యక్తి పాపాలకోసమైన బల్యర్పణగా ఒక గొర్రెను తీసుకువస్తే లోపం లేని ఆడ గొర్రెను తీసుకురావాలి. 33 పాపాలకోసమైన ఆ బలి జంతువు తలమీద చెయ్యి ఉంచి, హోమ పశువులను వధించే చోట పాపాలకోసమై బలిగా దాన్ని వధించాలి. 34 పాపాలకోసమైన ఈ బలి రక్తంలో కొంత యాజి తన వ్రేలితో తీయాలి, హోమ బలిపీఠం పైన ఉన్న కొమ్ములమీద పూయాలి. మిగతా రక్తాన్నంతా పీఠం అడుగున పోయాలి. 35 శాంతిబలి జంతువునుంచి కొవ్వును తీసినట్టే దీని కొవ్వునంతా తీయాలి. యెహోవాకు హోమాలు అర్పించే చోట, ఆ బలిపీఠంమీద యాజి దాన్ని కాల్చివెయ్యాలి. యాజి ఆ వ్యక్తి చేసిన ఆ పాపాన్ని అలా కప్పివేస్తాడు. ఆ వ్యక్తికి క్షమాపణ దొరుకుతుంది.