3
1 ✽ “ఎవరైనా పశువులలో మగదాన్ని గానీ, ఆడదాన్నీ గానీ✽ శాంతిబలిగా అర్పిస్తే యెహోవా దగ్గరికి తీసుకువచ్చినది లోపం లేకుండా ఉండాలి. 2 ✽ అతడు తాను అర్పించేదాని తలమీద చెయ్యి ఉంచి, సన్నిధిగుడారం ద్వారం దగ్గర దాన్ని వధించాలి. యాజులైన అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూరా దాని రక్తాన్ని చిలకరించాలి. 3 ✽అతడు ఆ శాంతి బలిపశువులోనుండి కొన్ని భాగాలను యెహోవాకు హోమంగా అర్పించాలి – అంటే, పేగులను అంటి ఉన్న కొవ్వు అంతా, 4 రెండు మూత్రపిండాలనూ వాటిమీద కొవ్వునూ, డొక్కలమీది కొవ్వునూ, మూత్రపిండాల దగ్గర ఉన్న కారిజం అంటుకొని ఉన్న కొవ్వునూ అర్పించాలి. 5 అహరోను కొడుకులు బలిపీఠం మీది నిప్పుపైన ఉన్న కట్టెల మీది హోమద్రవ్యం పైన వాటిని కాల్చివెయ్యాలి. అది మంటల్లో అర్పణ. అది యెహోవాకు పరిమళంగా ఉంటుంది.6 “ఎవరైనా యెహోవాకు గొర్రెను గానీ, మేకను గానీ శాంతిబలిగా అర్పిస్తే అది మగదైనా ఆడదైనా లోపం లేకుండా ఉండాలి. 7 అతడి అర్పణ గొర్రెపిల్లయితే దాన్ని యెహోవా సన్నిధానంలోకి తీసుకురావాలి. 8 అతడు తాను అర్పించేదాని తలమీద చెయ్యి ఉంచి సన్నిధిగుడారం ఎదుట దాన్ని వధించాలి. అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూరా దాని రక్తాన్ని చల్లాలి. 9 అతడు ఆ శాంతిబలి జంతువులో నుంచి కొన్ని భాగాలను యెహోవాకు హోమంగా అర్పించాలి – అంటే దాని కొవ్వునూ, వెన్నెముకనూ, కొవ్విన తోకనంతా, పేగులను అంటి ఉన్న కొవ్వునూ, పేగులమీది కొవ్వునంతటినీ 10 రెండు మూత్రపిండాలనూ, వాటిమీది కొవ్వునూ, డొక్కలమీది కొవ్వునూ, మూత్రపిండాల దగ్గర కారిజం అంటి ఉన్న కొవ్వునూ అర్పించాలి. 11 యాజి వాటిని ఆహారంగా✽ బలిపీఠం మీద కాల్చి వెయ్యాలి. అది యెహోవాకు హోమం.
12 ✝“అతడి అర్పణ మేక అయితే దాన్ని యెహోవా సన్నిధానంలోకి తీసుకురావాలి. 13 దాని తలమీద చెయ్యి ఉంచి సన్నిధిగుడారం ఎదుట దాన్ని వధించాలి. అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూరా దాని రక్తాన్ని చల్లాలి. 14 దానిలోనుండి కొన్ని భాగాలను యెహోవాకు హోమంగా అర్పించాలి – అంటే, పేగులను అంటి ఉన్న కొవ్వునూ, పేగుల మీది కొవ్వునంతటినీ, 15 రెండు మూత్రపిండాలనూ, వాటిమీది కొవ్వునూ, డొక్కలమీది కొవ్వునూ, మూత్రపిండాల దగ్గర ఉన్న కారిజం అంటి ఉన్న కొవ్వునూ అర్పించాలి. 16 ✽ యాజి వాటిని ఆహారంగా బలిపీఠంమీద కాల్చివెయ్యాలి. అది పరిమళ హోమం. కొవ్వంతా యెహోవాదే.
17 “మీరెక్కడ నివసించినా మీరు కొవ్వును గానీ రక్తాన్ని గానీ తిననేకూడదు. ఇది మీ తరతరాలకు ఎప్పటికీ నిలిచివుండే చట్టం.”