2
1 “ఎవరైనా యెహోవాకు నైవేద్యాన్ని అర్పిస్తే అతడు గోధుమ పిండి అర్పించాలి. అతడు దానిమీద నూనె పోసి సాంబ్రాణి వేసి 2 యాజులైన అహరోను కొడుకుల దగ్గరకి దాన్ని తేవాలి. దానిలో నుంచి యాజి పిడికెడు గోధుమపిండిని నూనెతోపాటు సాంబ్రాణి అంతా తీసుకొని స్మృతి చిహ్నంగా బలిపీఠంమీద దాన్ని కాల్చివేయాలి. అది మంటల్లో అర్పణ. అది యెహోవాకు పరిమళంగా ఉంటుంది. 3  ఆ నైవేద్యంలో మిగిలినది అహరోనుకూ అతడి కొడుకులకూ ఉంటుంది. యెహోవాకు అర్పించే హోమాలలో అది అతి పవిత్రం.
4 “మీరు పొయ్యిలో కాల్చిన నైవేద్యాన్ని అర్పించదలిస్తే పొంగజేసే పదార్థం లేకుండా మెత్తని గోధుమపిండిలో నూనె కలిపి అప్పడాలు చేసి అర్పించాలి. లేకపోతే పొంగజేసే పదార్థం లేకుండా వాటిని చేసి వాటిమీద నూనె పోయాలి. 5 మీ అర్పణ పెనంమీద కాల్చిన నైవేద్యమైతే పొంగజేసే పదార్థం లేకుండా మెత్తని గోధుమపిండిలో నూనె కలిపి చెయ్యాలి. 6 అది నైవేద్యం గనుక నీవు దాన్ని ముక్కలుగా చేసి వాటిమీద నూనె పోయాలి.
7 “మీ అర్పణ కుండలో వండిన నైవేద్యమైతే మెత్తని గోధుమ పిండిలో నూనె కలిపి చెయ్యాలి. 8 వాటితో చేసిన నైవేద్యాన్ని యెహోవా దగ్గరకి తేవాలి. యాజికి దాన్ని అప్పగించిన తరువాత అతడు దాన్ని బలిపీఠం దగ్గరికి తేవాలి. 9 యాజి ఆ నైవేద్యంలో కొంత తీసి స్మృతి చిహ్నంగా బలిపీఠంమీద కాల్చివెయ్యాలి. అది మంటల్లో అర్పణ. అది యెహోవాకు పరిమళంగా ఉంటుంది. 10 ఆ నైవేద్యంలో మిగిలినది అహరోనుకూ అతడి కొడుకులకూ ఉంటుంది. యెహోవాకు అర్పించే హోమాలలో అది అతి పవిత్రం.
11 “మీరు యెహోవాకు చేసే ఏ నైవేద్యాన్నీ పొంగజేసే పదార్థంతో చెయ్యకూడదు. పొంగజేసే పదార్థాన్నీ తేనెనూ ఏ అర్పణతోను యెహోవాకు హోమంగా కాల్చివెయ్యకూడదు. 12 వాటిని ప్రథమ ఫలంగా యెహోవాకు అర్పించవచ్చు గాని, అవి బలిపీఠం మీద పరిమళ హోమం కాకూడదు. 13  మీరు చేసే ప్రతి నైవేద్యానికీ ఉప్పు చేర్చాలి. మీ దేవుని ఒడంబడిక ఉప్పు మీ నైవేద్యాలతో తప్పక ఉండాలి. అన్ని అర్పణలతో ఉప్పు కూడా అర్పించాలి.
14 “మీరు యెహోవాకు మొదటి పంట నైవేద్యం చేయదలిస్తే కాల్చిన కొత్త మొక్కజొన్న కంకులను గానీ కొత్త మొక్కజొన్న పిండిని గానీ తీసుకురావాలి. 15 దానిమీద నూనె పోయాలి, సాంబ్రాణి వెయ్యాలి. అది నైవేద్యం గదా. 16 స్మృతి చిహ్నంగా ఆ పిండిలో కొంత దాని నూనెతోపాటు సాంబ్రాణి అంతా తీసుకొని యాజి కాల్చివెయ్యాలి. అది యెహోవాకు హోమం.