లేవీయకాండం (యాజి ధర్మవిధులు)
1
1 ✝యెహోవా మోషేను పిలిచి, సన్నిధి గుడారంలో నుంచి అతనితో ఇలా అన్నాడు: 2 ✽“నీవు ఇస్రాయేల్ ప్రజలకు ఈ విధంగా చెప్పు – మీలో ఎవరైనా యెహోవాకు అర్పణ తీసుకు వచ్చేటప్పుడు గోవులలో నుంచి గానీ గొర్రెల, మేకల మందలో నుంచి గానీ దానిని తేవాలి.3 ✽“అతడు గోవు✽లలో నుంచి ఒక దానిని హోమబలిగా అర్పించడానికి నిశ్చయించుకొంటే లోపం లేని✽ మగదానిని తీసుకురావాలి. యెహోవా అతణ్ణి స్వీకరించేలా అతడు దానిని సన్నిధిగుడారం ద్వారానికి తేవాలి. 4 ✽ అతడు హోమబలిగా అర్పించేదాని తలమీద చెయ్యి ఉంచాలి. అతడి పాపాలను కప్పివేయడానికి✽ అతడికోసం ఆ బలి అంగీకారంగా ఉంటుంది. 5 ✽యెహోవా సన్నిధానంలో అతడు ఆ కోడెదూడను వధించాలి. యాజులైన అహరోను కొడుకులు దాని రక్తాన్ని తెచ్చి సన్నిధి గుడారం ద్వారం ఎదుట ఉన్న బలిపీఠం చుట్టూరా దాన్ని చిలకరించాలి.
6 ✝“అప్పుడతడు హోమబలిగా అర్పించే దాని చర్మం ఒలిచి ఆ జంతువును ఏ భాగానికి ఆ భాగం విడదీయాలి. 7 ✽ యాజి అయిన అహరోను కొడుకులు బలిపీఠం మీద నిప్పు ఉంచి, నిప్పుమీద కట్టెలు పేర్చాలి. 8 ✝యాజులైన అహరోను కొడుకులు ఆ విభాగాలనూ, తలనూ, కొవ్వునూ బలిపీఠంపై ఉన్న నిప్పుమీది కట్టెలపైన పేర్చాలి. 9 కానీ దాని లోపలి భాగాలనూ కాళ్ళనూ నీళ్ళతో కడగాలి✽. అప్పుడు యాజి దాన్నంతా బలిపీఠంపైన కాల్చివేయాలి. అది మంటల్లో అర్పణ, హోమబలి. అది యెహోవాకు పరిమళం✽గా ఉంటుంది.
10 “ఎవరైనా మందలో నుంచి గొర్రె✽ను గానీ, మేక✽ను గానీ హోమబలిగా అర్పించాలనుకొంటే లోపం లేని మగదానిని తీసుకురావాలి. 11 బలిపీఠానికి ఉత్తర దిక్కున, యెహోవా సన్నిధానంలో అతడు దానిని వధించాలి. యాజులైన అహరోను కొడుకులు దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూరా చిలకరించాలి. 12 అతడు దానిని ఏ భాగానికి ఆ భాగం విడదీయాలి. యాజి ఆ విభాగాలనూ, తలనూ, కొవ్వునూ బలిపీఠం పై ఉన్న నిప్పు మీది కట్టెపైన పేర్చాలి. 13 ✽కాని ఆ వ్యక్తి దాని లోపలి భాగాలనూ కాళ్ళనూ నీళ్ళతో కడగాలి. అప్పుడు యాజి దాన్నంతా తీసుకువచ్చి బలిపీఠం మీద కాల్చివేయాలి. అది మంటల్లో అర్పణ, హోమబలి. అది యెహోవాకు పరిమళంగా ఉంటుంది.
14 ✽“ఒక వ్యక్తి హోమబలిగా అర్పించదలచినది పిట్ట అయితే అతడు గువ్వను గానీ, పావురం పిల్లను గానీ తేవాలి. 15 యాజి ఆ పిట్టను బలిపీఠం దగ్గరకి తీసుకువచ్చి దాని తలను తుంచివేసి బలిపీఠంమీద దాన్ని కాల్చివేయాలి. ఆ పిట్ట రక్తాన్ని బలిపీఠం ప్రక్కన పిండాలి. 16 దాని పొట్టనూ ఈకలనూ తీసివేసి బలిపీఠానికి తూర్పుదిక్కున బూడిద పోసే చోట పారవెయ్యాలి. 17 ✽అతడు దాని రెక్కల సందులో దాన్ని చీల్చాలి గాని దాన్ని ఏ భాగానికి ఆ భాగం విడదీయకూడదు. యాజి బలిపీఠం పై ఉన్న నిప్పుమీది కట్టెపైన దాన్ని కాల్చివేయాలి. అది మంటల్లో అర్పణ, హోమబలి. అది యెహోవాకు పరిమళంగా ఉంటుంది.