39
1 యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అహరోను పవిత్ర స్థలంలో చేసే సేవకోసం అతనికి పవిత్ర వస్త్రాలను కుట్టారు. నీలి ఊదా ఎర్ర రంగుల దారాలతో నేసిన వస్త్రాలను చేశారు.
2 అతడు బంగారంతోను నీలి ఊదా ఎర్ర రంగుల దారాలతోను పేనిన సన్నని నారతోను ఏఫోదు చేశాడు. 3 నీలి ఊదా ఎర్ర రంగుల దారాలతోను సన్నని నారతోను నేర్పుగల పనివారు నేయడానికి బంగారాన్ని రేకులుగా కొట్టి దాన్ని తీగలుగా కత్తిరించాడు. 4 ఏఫోదుకు రెండు భుజఖండాలు చేసి దాని ముందు భాగం, వెనుక భాగం కూర్చారు. 5 దానిమీద నేసిన కట్టు దానిలాగే బంగారంతోను నీలి ఊదా ఎర్ర రంగుల దారాలతోను పేనిన సన్న నారతోను దానితో ఏకాండంగా కుట్టారు. ఇది యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే.
6 మిశ్రిత వర్ణ రత్నాలను తీసుకొని ముద్రమీద చెక్కినట్టు వాటిమీద ఇస్రాయేల్ కొడుకుల పేర్లు చెక్కారు. వాటిని బంగారు జవలలో పొదిగారు. 7 యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే అతడు ఆ రత్నాలను ఇస్రాయేల్ ప్రజలను గురించిన స్మృతి చిహ్నంగా ఏఫోదు భుజఖండాల మీద ఉంచాడు.
8 అతడు బంగారంతోను నీలి ఊదా ఎర్ర రంగు దారాలతోను పేనిన సన్నని నారతోను వక్షపతకం ఏఫోదులాగే చేశాడు. అది నేర్పుగల పనివాడి పని. 9 దాన్ని మడత పెట్టాక అది చదరంగా ఉంది – దాని పొడవు ఒక జేన, దాని వెడల్పు ఒక జేన. 10 దానిలో రత్నాలు నాలుగు పంక్తులుగా పెట్టారు. మొదటి పంక్తిలో మాణిక్యం, గోమేధికం, పచ్చ ఉన్నాయి. 11 రెండో పంక్తిలో పద్మరాగం, నీలం, వజ్రం ఉన్నాయి. 12 మూడో పంక్తిలో పుష్యరాగం, కెంపు, ఊదామణి ఉన్నాయి. 13 నాలుగో పంక్తిలో ఫిరోజా, మిశ్రితవర్ణ రత్నం, సూర్యకాంతం ఉన్నాయి. ఇవన్నీ బంగారు జవలలో పొదిగించబడ్డాయి. 14 ఇస్రాయేల్ కొడుకుల పన్నెండు పేర్ల ప్రకారం ఆ రత్నాలు పన్నెండు. ముద్రమీద చెక్కిన విధంగా వాటిమీద పన్నెండు గోత్రాల పేర్లు – ఒక్కొక్క రత్నంమీద ఒక్కొక్క పేరు – చెక్కారు. 15 వక్షపతకం కోసం దారాలను అల్లిన విధంగా మేలిమి బంగారంతో గొలుసులను అల్లారు. 16 వారు రెండు బంగారు జవలనూ రెండు బంగారు ఉంగరాలనూ చేసి ఉంగరాలను వక్షపతకం రెండు కొనలకు తగిలించారు. 17 అల్లిన ఆ రెండు బంగారు గొలుసులను ఆ రెండు కొనలకున్న ఆ రెండు ఉంగరాలలో తగిలించారు. 18 అల్లిన గొలుసుల ఇతర రెండు కొనలను ఆ రెండు జవలకు తగిలించి ఏఫోదు భుజఖండాల ముందుభాగాల మీద కట్టారు. 19 బంగారంతో ఇంకా రెండు ఉంగరాలను చేసి ఏఫోదు ఎదుట వక్షపతకం లోపలి అంచున దాని క్రింది రెండు కొనలకు తగిలించారు. 20 ఇంకా రెండు బంగారు ఉంగరాలను చేసి ఏఫోదు కట్టుపైగా దాని కూర్పుదగ్గరే దాని భుజఖండాల ముందుభాగాలక్రింద తగిలించారు. 21 వక్షపతకం ఏఫోదు కట్టుమీద ఉండేలా, ఏఫోదునుంచి వదలకుండా ఉండేలా దాన్ని దాని ఉంగరాలతో ఏఫోదు ఉంగరాలకు నీలిదారంతో కట్టారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే వారు చేశారు.
22 అతడు ఏఫోదు నిలువుటంగీని పూర్తిగా నీలిదారంతో అల్లిక పనిగా చేశాడు. 23 తలకోసం దాని నడుమ రంధ్రం చేశాడు. ఆ రంధ్రం చుట్టు అంగీ చినగకుండేలా కంఠకవచ రంధ్రంలాగా దానిచుట్టూ నేసిన గోటు ఉంది. 24 ఆ అంగీక్రింద అంచున చుట్టూ నీలి ఊదా ఎర్ర రంగుల దారాలతోను పేనిన నారతోను దానిమ్మపళ్ళవంటివాటిని చేసి తగిలించారు. 25 మేలిమి బంగారంతో గంటలను చేసి ఆ దానిమ్మపళ్ళ మధ్య – ఆ అంగీ అంచులమీద చుట్టు ఉన్న దానిమ్మ పళ్ళమధ్య – ఆ గంటలను పెట్టారు. 26 గంట, దానిమ్మపండు, గంట, దానిమ్మ పండు – ఇలా ఆ నిలువుటంగీ క్రింద అంచున చుట్టూ ఉంచారు. ఇది యాజుల సేవకోసం, యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞప్రకారమే వారు చేశారు.
27 వారు అహరోను కోసం, అతని కొడుకుల కోసం సన్ననినారతో చొక్కాలను నేశారు. 28 సన్ననినారతో పాగానూ అందమైన కుళ్ళాయిలనూ పేనిన సన్నని నారతో షరాయిలనూ కూడా చేశారు. 29 పేనిన సన్నని నారతోను నీలి ఊదా ఎర్ర రంగుల దారాలతోను నడికట్టును బుట్టాపనిగా చేశారు. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే ఇవన్నీ చేశారు.
30 వారు కిరీటంలాంటి మేలిమి బంగారు రేకును చేసి ముద్ర చెక్కే విధంగా దానిమీద ఈ మాటలు చెక్కారు: “యెహోవాకు పవిత్రం.” 31 పాగాకు అంటి ఉండేలా దాన్ని నీలి దారంతో కట్టారు. ఇదంతా యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే చేశారు.
32 ఇలా సన్నిధిగుడారం అనే దైవనివాసాన్ని నిర్మించే పని సంపూర్తి చేయడం జరిగింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లెల్లా ఇస్రాయేల్‌ప్రజలు చేశారు. 33 వారు దైవనివాసాన్ని – దాన్ని, దాని సామానంతా మోషేదగ్గరికి తెచ్చారు. దాని కొక్కేలనూ పలకలనూ అడ్డకర్రలనూ స్తంభాలనూ గూళ్ళనూ 34 ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళ తోళ్ళ కప్పునూ గండుచేప తోళ్ళ పైకప్పునూ కప్పు తెరనూ 35 శాసనాల పెట్టెనూ దాని మోత కర్రలనూ ప్రాయశ్చిత్తస్థానంగా ఉన్న దాని మూతనూ 36 బల్లనూ దాని సామానంతా, సన్నిధి రొట్టెనూ 37 పవిత్రమైన సప్తదీపస్తంభాన్నీ దాని దీపాలనూ – దాని దీపాల వరుసనూ – దాని సామానంతా, దీపాలకోసం నూనెనూ 38 బంగారు వేదికనూ అభిషేక తైలాన్నీ పరిమళ ధూప ద్రవ్యాన్నీ గుడారం ద్వారంకోసం తెరనూ 39 కంచు బలిపీఠాన్నీ దాని కంచు జల్లెడనూ దాని మోతకర్రలనూ దాని సామానంతా, గంగాళాన్నీ దాని పీఠాన్నీ 40 ఆవరణం కోసం తెరలనూ దాని స్తంభాలనూ గూళ్ళనూ ఆవరణద్వారం కోసం తెరనూ తాళ్ళనూ మేకులనూ సన్నిధిగుడారమైన దైవనివాసంలో జరగవలసిన సేవకోసం సామానంతా, 41 పవిత్రస్థలంలోని యాజుల సేవకోసం నేసిన వస్త్రాలనూ – అహరోనుయాజికోసం పవిత్ర వస్త్రాలనూ, అతని కొడుకులకోసం వస్త్రాలనూ – వీటన్నిటినీ వారు మోషే దగ్గరకు తీసుకువచ్చారు.
42 యెహోవా మోషేకు ఇచ్చిన అన్ని ఆజ్ఞలప్రకారమే ఇస్రాయేల్ ప్రజలు ఆ పనంతా చేశారు. 43 వారు చేసిన ఆ పని అంతా మోషే చూశాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టే వారు ఆ పని చేశారు, గనుక మోషే వారిని దీవించాడు.