40
1 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 2 “మొదటి నెల మొదటి రోజున నీవు సన్నిధిగుడారం అనే దైవనివాసం నిలబెట్టించాలి. 3 అందులో శాసనాల పెట్టెను ఉంచి దాన్ని తెరతో మరుగు చెయ్యాలి. 4 బల్లను లోపలికి తెచ్చి దానిమీద ఉండవలసిన వాటిని వరుసగా ఉంచాలి. సప్తదీపస్తంభాన్ని లోపలికి తెచ్చి దాని దీపాలను వెలిగించాలి. 5 బంగారు ధూప వేదికను ఆ శాసనాల మందసం ఎదుట ఉంచాలి. దైవనివాసానికి ద్వారం తెరను తగిలించాలి. 6 సన్నిధిగుడారం అనే దైవనివాసం ద్వారం ఎదుట హోమ పీఠాన్ని ఉంచాలి. 7 ఆ బలిపీఠానికీ సన్నిధిగుడారానికీ మధ్య గంగాళాన్ని ఉంచాలి. దానిలో నీళ్ళు నింపాలి. 8 వాటి చుట్టూ ఆవరణాన్ని నిలబెట్టాలి. ఆవరణ ద్వారాన తెరను వ్రేలాడదీయాలి. 9 అభిషేక తైలాన్ని చేతపట్టుకొని దైవనివాసాన్ని, అందులో ఉన్న ప్రతిదానినీ అభిషేకించాలి. దాన్ని, దాని సామానంతా ప్రతిష్ఠించాలి. అప్పుడు అది పవిత్రం అవుతుంది. 10 హోమ పీఠాన్నీ దాని సామానంతా అభిషేకించి పీఠాన్ని ప్రతిష్ఠించాలి. పీఠం అతి పవిత్రమవుతుంది. 11 గంగాళాన్నీ దాని పీఠాన్నీ అభిషేకించి ప్రతిష్ఠించాలి.
12 “తరువాత నీవు అహరోన్నూ అతని కొడుకులనూ సన్నిధిగుడారం ద్వారానికి తీసుకువచ్చి వారిని నీళ్ళతో స్నానం చేయించాలి. 13 అహరోను నాకు యాజిగా సేవ చేసేలా నీవు అతనికి ఆ పవిత్ర వస్త్రాలను తొడిగించి అతణ్ణి అభిషేకించి ప్రతిష్ఠించాలి. 14 అతని కొడుకులను తీసుకువచ్చి వారికి చొక్కాలను తొడిగించాలి. 15 వారు కూడా నాకు యాజులుగా సేవ చేసేలా వారి తండ్రిని అభిషేకించినట్టు వారినీ అభిషేకించాలి. వారి అభిషేకం తరతరాలకు వారికి నిత్యమైన యాజి ధర్మసూచనగా ఉంటుంది.”
16 మోషే అలా చేశాడు; యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లెల్లా చేశాడు.
17 రెండో ఏట మొదటి నెల మొదటి రోజున దైవనివాసం నిలబెట్టారు. 18 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే అతడు దైవనివాసాన్ని నిలబెట్టాడు. దాని గూళ్ళను వేసి దాని పలకలను నిలబెట్టి దాని అడ్డకర్రలను పెట్టి దాని స్తంభాలను నిలిపాడు. 19 దైవనివాసం మీద గుడారాన్ని పరిచాడు. గుడారం మీద దాని పైకప్పును ఉంచాడు. 20 అతడు శాసనాలను మందసంలో ఉంచి మందసానికి మోతకర్రలను పెట్టి దానిమీద ప్రాయశ్చిత్తస్థానంగా ఉన్న మూతను ఉంచాడు. 21 మందసాన్ని దైవనివాసంలోకి తెచ్చి అడ్డతెర వ్రేలాడదీసి శాసనాల పెట్టెను మరుగు చేశాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు. 22 సన్నిధిగుడారంలో, దైవనివాసం ఉత్తరదిక్కున, అడ్డతెరకు వెలుపల, బల్లను ఉంచి 23 యెహోవా సన్నిధానం ఎదుట దానిమీద రొట్టెలను వరుసగా పెట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు. 24 సన్నిధిగుడారంలో దైవనివాసం దక్షిణ దిక్కున బల్ల ఎదుట సప్తదీపస్తంభాన్ని ఉంచాడు. 25 యెహోవా సన్నిధానం ఎదుట దీపాలను వెలిగించాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టే మోషే అలా చేశాడు. 26 సన్నిధిగుడారంలో అడ్డతెర ఎదుట బంగారు వేదికను ఉంచాడు. 27 దానిమీద పరిమళ ధూప ద్రవ్యాన్ని కాల్చాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు. 28 దైవనివాసం ద్వారానికి తెరను వేశాడు. 29 సన్నిధిగుడారం అనే దైవనివాసంయొక్క ద్వారం దగ్గర హోమ పీఠాన్ని ఉంచి దానిమీద హోమాన్నీ నైవేద్యాన్నీ సమర్పించాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు. 30 సన్నిధిగుడారానికీ బలిపీఠానికీ మధ్య గంగాళాన్ని ఉంచి కడగడానికి దానిలో నీళ్ళు పోశాడు. 31  దాని దగ్గర మోషే, అహరోను, అహరోను కొడుకులు చేతులూ కాళ్ళూ కడుగుకొన్నారు. 32 సన్నిధిగుడారంలోకి వెళ్ళేముందు, బలిపీఠాన్ని సమీపించేముందు, కడుగుకొన్నారు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు. 33 దైవనివాసం చుట్టూ, బలిపీఠం చుట్టూ ఆవరణాన్ని చేసి ఆవరణ ద్వారం తెరను వేశాడు. ఈ విధంగా మోషే ఆ పని సంపూర్తి చేశాడు.
34 అప్పుడు ఆ మేఘం సన్నిధిగుడారాన్ని కమ్మింది; దైవనివాసం యెహోవా మహిమాప్రకాశంతో నిండిపోయింది. 35 ఆ మేఘం దైవనివాసం మీద నిలవడంచేత, సన్నిధిగుడారం యెహోవా మహిమాప్రకాశంతో నిండిపోవడంచేత మోషే సన్నిధిగుడారంలోకి వెళ్ళలేకపోయాడు. 36 ఇస్రాయేల్ ప్రజల ప్రయాణాలన్నిటిలోనూ మేఘం దైవనివాసం మీదనుంచి పైకి పోయేటప్పుడెల్లా వారు తరలి వెళ్ళేవారు. 37 మేఘం పైకి పోకుండా ఉంటే, అది పైకి పోయే రోజువరకు వారు ప్రయాణం చేసేవారు కారు. 38 ఇస్రాయేల్ ప్రజల కళ్ళెదుటే, పగటివేళ యెహోవా మేఘం దైవనివాసం మీద ఉండేది, రాత్రివేళ మేఘంలో మంటలు ఉండేవి. వారి ప్రయాణాలన్నిటిలో ఈ విధంగా జరిగేది.