38
1 అతడు తుమ్మకర్రతో బలిపీఠాన్ని చేశాడు. దాని పొడవు అయిదు మూరలు, దాని వెడల్పు అయిదు మూరలు. అది చదరంగా ఉంది. దాని ఎత్తు మూడు మూరలు. 2 దాని నాలుగు మూలలో దానితో ఏకాండంగా దాని నాలుగు కొమ్ములను చేశాడు. దానికి కంచు తొడుగు చేశాడు. 3 ఆ బలిపీఠం సామాను – దాని బిందెలనూ దాని పారలనూ పళ్ళేలనూ ముళ్ళనూ అగ్నిపాత్రలనూ – కంచుతో చేశాడు. 4 బలిపీఠానికి కంచు జల్లెడను దాని అంచు క్రింద నడిమికి చుట్టు చేశాడు. 5 ఆ కంచు జల్లెడ నాలుగు మూలలకోసం మోతకర్రలను పట్టే నాలుగు ఉంగరాలను పోత పోశాడు. 6 ఆ కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి కంచు తొడుగు చేశాడు. 7 బలిపీఠాన్ని మోయడానికి దాని ప్రక్కలకున్న ఆ ఉంగరాలలో ఆ కర్రలను ఉంచాడు. బలిపీఠాన్ని పలకలతో గుల్లగా చేశాడు.
8 గంగాళాన్నీ దాని పీఠాన్నీ కంచుతో చేశాడు. వాటిని చెయ్యడంలో సన్నిధిగుడారం ద్వారానికి ఆరాధించడానికి వచ్చిన స్త్రీల అద్దాలను ఉపయోగించాడు.
9 అప్పుడు అతడు ఆవరణం చేశాడు. దక్షిణ దిక్కున ఉన్న ప్రక్కకు పేనిన సన్నని నార తెరలు వేశాడు. ఆ ప్రక్క పొడవు నూరు మూరలు. 10 ఆ తెరల స్తంభాలు ఇరవై, వాటి కంచు గూళ్ళు ఇరవై. స్తంభాల కొక్కేలూ, పెండెబద్దలూ వెండివి. 11 ఉత్తర దిక్కున ఉన్న ప్రక్క పొడవు కూడా నూరు మూరలు. స్తంభాలు ఇరవై, వాటి కంచు గూళ్ళు ఇరవై. స్తంభాల కొక్కేలూ పెండెబద్దలూ వెండివి. 12 పడమటి ప్రక్క తెరల పొడుగు యాభై మూరలు. వాటి స్తంభాలు పది. స్తంభాల కొక్కేలూ పెండెబద్దలూ వెండివి. 13 ఉదయ దిక్కున, అంటే తూర్పువైపున యాభై మూరలు; 14 ద్వారానికి ఒక ప్రక్క తెరల పొడవు పదిహేను మూరలు. వాటి స్తంభాలు మూడు, వాటి గూళ్ళు మూడు. 15 ద్వారానికి రెండో ప్రక్క తెరల పొడవు కూడా అంతే; ఆవరణ ద్వారానికి ఇరుప్రక్కలా ఉన్న తెరల పొడవు పదిహేను మూరలు. వాటి స్తంభాలు మూడు; వాటి గూళ్ళు మూడు. 16 ఆవరణం చుట్టూ ఉన్న తెరలన్నీ పేనిన సన్నని నారవి. 17 స్తంభాల గూళ్ళు కంచువి. స్తంభాల కొక్కేలూ పెండెబద్దలూ వెండివి. వాటి పైభాగాలు వెండి తొడుగు చేసినవి. ఆవరణ స్తంభాలన్నీ వెండి పెండెబద్దలతో అతికించాడు.
18 ఆవరణ ద్వారం తెర నీలి ఊదా ఎర్ర రంగు దారాలతోను పేనిన సన్నని నార దారాలతోను చేసిన బుట్టా పని. దాని పొడవు ఇరవై మూరలు; దాని వెడల్పు ఆవరణ తెరలతో సరిగా అయిదు మూరలు ఎత్తుగా ఉండేది. 19 ద్వారం తెర స్తంభాలు నాలుగు, వాటి గూళ్ళూ నాలుగు. అవి కంచువి. వాటి కొక్కేలు వెండివి. వాటి పైభాగాలకు వెండి తొడుగు చేసి ఉంది; వాటి పెండెబద్దలు వెండివి. 20 దైవనివాసంకోసం దాని చుట్టూ ఉన్న ఆవరణంకోసం ఉపయోగించిన మేకులన్నీ కంచువి.
21 దైవనివాసం సామాను మొత్తం, ఆ శాసనాల గుడారం సామాను మొత్తం ఇదే. అహరోనుయాజి కొడుకైన ఈతామారు, లేవీ గోత్రికులచేత, మోషే ఆజ్ఞ ప్రకారం, ఆ వస్తువులను లెక్క పెట్టించాడు. 22 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టెల్లా ఊరీ కొడుకు బసెలేల్ చేశాడు. అతడు హూర్ మనుమడూ యూదా గోత్రంవాడు. 23 అహీసామాక్ కొడుకు అహోలీయాబు అతనితో కలిసి పని చేసేవాడు. అతడు దానుగోత్రంవాడు. అతడు చెక్కేవాడు, నేర్పుగల పనివాడు, నీలి ఊదా ఎర్ర రంగు దారాలతోను సన్నని నార దారాలతోను నేసేవాడు.
24 ఆ పని అంతటిలో – పవిత్ర స్థానం పూర్తిగా నిర్మించడంలో – ఉపయోగించిన అర్పణ బంగారమంతా పవిత్రస్థానం తులం తూనిక ప్రకారం వెయ్యి కిలోగ్రాములు. 25 జాబితాలో చేరిన ఇస్రాయేల్ సమాజంవారు ఇచ్చిన వెండి, పవిత్ర స్థానం తులం తూనిక ప్రకారం, మూడు వేల నాలుగు వందల ఇరవై అయిదు కిలోగ్రాములు. 26 ప్రజను లెక్కపెట్టినప్పుడు జాబితాలో చేరినవారిలో ఒక్కొక్కరూ, అంటే ఇరవై ఏళ్ళవారూ అంతకంటే ఎక్కువ వయస్సు గలవారూ, అర తులం వెండి ఇచ్చారు. వారి సంఖ్య ఆరు లక్షల మూడు వేల అయిదు వందల యాభై. 27 తెరలకోసం, ఆరాధన గుడారంకోసం గూళ్ళు పోత పోయడంలో మూడు వేల నాలుగు వందల కిలోగ్రాముల వెండి ఉపయోగించారు – ఒక్కొక్క గూడు కోసం ముప్ఫయి నాలుగు కిలోగ్రాముల వెండి. 28 ఇరవై అయిదు కిలోగ్రాముల వెండితో అతడు స్తంభాలకు కొక్కేలను చేసి స్తంభాల పైభాగాలకు తొడుగు చేసి వాటి పెండెబద్దలను చేశాడు. 29 అర్పణ కంచు దాదాపు రెండు వేల నాలుగు వందల పది కిలోగ్రాములు. 30 దానితో అతడు చేసినవి – సన్నిధి గుడారం ద్వారం కోసం గూళ్ళు, కంచు బలిపీఠం, దాని కంచు జల్లెడ, బలిపీఠం సామానంతా, 31 చుట్టు ఉన్న ఆవరణంకోసం ఉన్న గూళ్ళు, ఆవరణద్వారం కోసం గూళ్ళు, దైవనివాసం మేకులన్నీ, చుట్టూ ఉన్న ఆవరణ మేకులన్నీ.