37
1 ✝బసెలేల్ తుమ్మకర్రతో ఆ మందసాన్ని చేశాడు. దాని పొడవు రెండున్నర మూరలు, దాని వెడల్పు మూరెడున్నర, దాని ఎత్తు మూరెడున్నర. 2 దానికి లోపల వెలుపల మేలిమి బంగారు తొడుగు చేశాడు. దానిపై అంచుకు చుట్టూ బంగారు అలంకారం చేశాడు. 3 ఆ మందసానికి నాలుగు బంగారు ఉంగరాలను పోత పోసి, దాని నాలుగు కాళ్ళకు వాటిని అంటించాడు; ఆ ప్రక్కకు రెండూ, ఈ ప్రక్కకు రెండూ అంటించాడు. 4 తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటికి బంగారు తొడుగు చేశాడు. 5 మందసాన్ని మోయడానికి దాని ప్రక్కలకున్న ఉంగరాలలో ఆ కర్రలు ఉంచాడు. 6 మందసం కోసం మేలిమి బంగారంతో ప్రాయశ్చిత్తస్థానంగా ఉన్న మూతను చేశాడు. దాని పొడవు రెండున్నర మూరలు, దాని వెడల్పు మూరెడున్నర. 7 రెండు కెరూబు ఆకారాలు బంగారంతో చేశాడు. రేకుగా కొట్టిన బంగారంతో ఆ మూత రెండు కొనలకు చేశాడు. 8 ఈ కొనకు ఒక కెరూబు రూపం ఆ కొనకు ఒక కెరూబు రూపం చేశాడు. ఆ రెండు కొనలకు ఉండే కెరూబు రూపాలు ఆ మూతతో ఏకాండంగా చేశాడు. 9 ఆ కెరూబుల రెక్కలు పైకి విప్పి ఉన్నాయి. అవి ఆ మూతను మరుగు చేశాయి. కెరూబుల ముఖాలు మూతవైపుగా, ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి.10 ✝అతడు తుమ్మకర్రతో బల్లను చేశాడు. దాని పొడుగు రెండు మూరలు, దాని వెడల్పు ఒక మూర, దాని ఎత్తు మూరెడున్నర. 11 దానికి మేలిమి బంగారు తొడుగు చేశాడు. దానిపై అంచుకు చుట్టూ బంగారు అలంకారం చేశాడు. 12 దాని చుట్టూ బెత్తెడు ఓరను చేసి ఆ ఓరకు చుట్టూ బంగారు అలంకారం చేశాడు. 13 బల్లకోసం నాలుగు బంగారు ఉంగరాలను పోత పోసి దాని నాలుగు కాళ్ళకుండే నాలుగు మూలలకు ఆ ఉంగరాలు వేశాడు. 14 బల్లను మోయడానికి మోతకర్రలను పట్టే ఆ ఉంగరాలు దాని ఓరదగ్గరే ఉన్నాయి. 15 బల్లను మోషే కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు తొడుగు చేశాడు. 16 బల్లమీద ఉండవలసిన సామాను – దాని పళ్ళేలనూ ధూపార్తులనూ గిన్నెలనూ పానీయార్పణకు పాత్రలనూ – మేలిమి బంగారంతో చేశాడు.
17 ✝అతడు సప్తదీపస్తంభాన్ని మేలిమి బంగారంతో చేశాడు. దాన్నీ దాని అడుగుభాగాన్నీ నిలువుభాగాన్నీ రేకుగా కొట్టిన బంగారంతో చేశాడు. దాని కలశాలూ పుష్పకోశాలూ పుష్పదళాలూ దానితో ఏకాండంగా చేశాడు. 18 ఆ దీపస్తంభం ప్రక్కలనుంచి ఆరు కొమ్మలు నిగిడాయి – ఆ ప్రక్కనుంచి మూడు ఈ ప్రక్కనుంచి మూడు. 19 ఒక కొమ్మమీద మూడు కలశాలు, రెండో కొమ్మమీద మూడు కలశాలు – అలా సప్తదీపస్తంభంనుంచి నిగిడిన ఆరు కొమ్మలమీద ఉన్నాయి. ఆ కలశాలకు పుష్పకోశాలూ, పుష్పదళాలూ గల బాదం పువ్వుల రూపం ఉంది. 20 సప్తదీపస్తంభం నిలువుభాగానికి బాదం పువ్వుల్లాంటి నాలుగు కలశాలు, దాని పుష్పకోశాలతో, పుష్పదళాలతో ఉన్నాయి. 21 సప్తదీపస్తంభం నిలువు భాగంనుంచి నిగిడే ఆరు కొమ్మలకు రెండేసి కొమ్మలక్రింద ఒక్కొక్క పుష్పకోశం ఉంది. అవి ఆ కొమ్మలతో ఏకాండంగా ఉన్నాయి. 22 ఆ పుష్పకోశాలూ ఆ కొమ్మలూ సప్తదీపస్తంభంతో ఏకాండంగా ఉన్నాయి. అదంతా రేకుగా కొట్టిన మేలిమి బంగారంతో చేసిన ఏకాండమైన పని. 23 దానికి ఏడు దీపాలనూ దాని కత్తెరనూ కత్తెర చిప్పనూ మేలిమి బంగారంతో చేశాడు. 24 సప్తదీపస్తంభాన్ని, దాని సామాను చెయ్యడంలో ముప్ఫయి నాలుగు కిలోగ్రాముల మేలిమి బంగారం ఉపయోగించాడు.
25 ✝అతడు ధూపవేదికను తుమ్మకర్రతో చేశాడు. దాని పొడవు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర. అది చదరంగా ఉంది. దాని ఎత్తు రెండు మూరలు. దాని కొమ్ముల్లాంటి అలంకారం దానితో ఏకాండంగా ఉన్నాయి. 26 దాని పైభాగానికీ నాలుగు ప్రక్కలకూ, కొమ్ములకూ మేలిమి బంగారు తొడుగు చేశాడు. దాని పై అంచు చుట్టూ బంగారు అలంకారం చేశాడు. 27 ఆ అలంకారం క్రింద వేదికకు రెండు బంగారు ఉంగరాలను చేసి దాని ప్రక్కలకు ఇరువైపులా వాటిని ఉంచాడు. అవి ఆ వేదికను మోసే కర్రలకోసం. 28 ఆ కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు తొడుగు చేశాడు. 29 ✝పవిత్ర అభిషేక తైలాన్నీ స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యాన్నీ చేసేవారి నేర్పుతో చేశాడు.