36
1 “పవిత్ర స్థానం సేవకోసం అన్ని రకాల పనులు తెలివితో చెయ్యడానికి బసెలేల్, అహోలీయాబు, నేర్పుగల వారందరూ యెహోవాచేత నేర్పూ జ్ఞానమూ పొంది, యెహోవా ఆజ్ఞాపించినట్టెల్లా చేస్తారు” అన్నాడు మోషే.
2 అప్పుడు మోషే బసెలేల్‌నూ అహోలీయాబునూ యెహోవాచేత నేర్పు పొందిన ప్రవీణులందరినీ – అంటే ఆ పని చెయ్యడానికి తమ హృదయాలు తమను పురికొల్పిన ప్రవీణులందరినీ – పిలిచాడు. 3 వారు వచ్చి పవిత్ర స్థానం సేవకోసం, ఆ పవిత్ర స్థానాన్ని కట్టడానికి ఇస్రాయేల్ ప్రజలు తెచ్చిన కానుకలన్నిటినీ మోషే దగ్గర తీసుకొన్నారు. అయితే ప్రజలు అతని దగ్గరకు ప్రతి రోజూ ప్రొద్దున ఇంకా స్వేచ్ఛార్పణలు తెస్తూ వచ్చారు. 4 పవిత్రస్థానంలో వేరు వేరు పనులు చేసే ఆ ప్రవీణులంతా తాము చేస్తూ ఉన్న పనులు విడిచి మోషే దగ్గరకు వచ్చి, 5  “చేయాలని యెహోవా ఆజ్ఞాపించిన ఈ పనికోసం కావలసినదానికంటే చాలా ఎక్కువ తెస్తున్నారు ప్రజలు” అన్నారు.
6 మోషే “పవిత్ర స్థానంకోసం ఏ స్త్రీ, పురుషుడూ ఇకనుంచి ఏ కానుకా తేకూడదు” అని ఆదేశించాడు. ఆ మాట శిబిరంలో అంతటా చాటించారు. అందుచేత ప్రజలు వస్తువులను తీసుకురావడం మానుకొన్నారు. 7 ఆ పని అంతా చేయడానికి వారు అంతకుముందు తెచ్చినది చాలినంతగా ఉంది; అసలు అది ఎక్కువైంది.
8 ఆ పని చేసేవారిలో ఎక్కువ నేర్పుగల ప్రతివాడూ దైవనివాసాన్ని పది తెరలతో చేశారు. ఒక వ్యక్తి ఆ తెరలను నీలి ఊదా ఎర్ర రంగు దారాలతోను పేనిన సన్నని నారతోను ప్రవీణుడు చేసిన ప్రకారమే కెరూబు రూపాలు గలవిగా చేశాడు. 9 ప్రతి తెర పొడవు ఇరవై ఎనిమిది మూరలు, వెడల్పు నాలుగు మూరలు. ప్రతి తెర కొలత అదే. 10 అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చాడు; మిగతా అయిదు ఒకదానితో ఒకటి కూర్చాడు. 11 ఒక తెరల వరుసలో చివరి తెర అంచున నీలి దారంతో ఉంగరాలు చేశాడు. అలాగే రెండో తెరల వరుసలో చివరి తెర అంచున ఉంగరాలు చేశాడు. 12 ఒక్కో తెరకు యాభై ఉంగరాలు చేశాడు; ఆ రెండో వరుసలోని తెర అంచున యాభై ఉంగరాలు చేశాడు; ఆ అల్లిక ఉంగరాలకు ఈ అల్లిక ఉంగరాలు ఎదురుగా ఉన్నాయి. 13 యాభై కొలుకులను కూడా చేసి ఆ తెరలను ఈ తెరలకు ఆ కొలుకులతో తగిలించాడు. ఆ విధంగా దైవనివాసం ఒకటే అయింది.
14 అతడు దైవనివాసం పైకప్పుగా మేక వెండ్రుకలతో తెరలను చేశాడు. అవి పదకొండు. 15 ప్రతి తెర పొడవు ముప్ఫయి మూరలు, వెడల్పు నాలుగు మూరలు. ఆ పదకొండు తెరల కొలత ఒక్కటే. 16 అయిదు తెరలను ఒకటిగా, మిగతా ఆరు తెరలను ఒకటిగా కూర్చాడు. 17 ఒక వరుస తెరలలో చివరి తెర అంచున యాభై అల్లిక ఉంగరాలనూ రెండో తెరల వరుసలో చివరి తెర అంచున యాభై ఉంగరాలనూ చేశాడు. 18 ఆ గుడారం ఒక్కటిగా ఉండేలా దాన్ని కూర్చడానికి యాభై కంచు కొలుకులను చేశాడు. 19 ఎర్ర రంగు వేసిన పొట్టేలు తోళ్ళతో గుడారానికి కప్పునూ, దానిమీద గండుచేప తోళ్ళతో పైకప్పునూ కూడా చేశాడు.
20 అతడు దైవనివాసం కోసం తుమ్మకర్రతో నిలువు పలకలు కూడా చేశాడు. 21 పలక పొడవు పది మూరలు, వెడల్పు మూరెడున్నర. 22 ప్రతి పలకకూ ఒకదానికొకటి సరైన రెండు కుసులు ఉన్నాయి. దైవనివాసం పలకలన్నిటికీ అలాగే చేశాడు. 23 దైవనివాసం దక్షిణదిక్కున ఉన్న ప్రక్కకోసం ఇరవై పలకలు చేశాడు. 24 ప్రతి పలకక్రిందా దాని కుసులకు రెండు గూళ్ళూ, ఆ ఇరవై పలకలక్రింద నలభై వెండి గూళ్ళూ చేశాడు. 25 దైవనివాసం రెండో ప్రక్కకోసం ఉత్తరదిక్కున కూడా ఇరవై పలకలు చేశాడు. 26 వాటికి నలభై వెండి గూళ్ళు, అంటే ప్రతి పలకక్రిందా రెండు గూళ్ళు చేశాడు. 27 పడమటి దిక్కున దైవనివాసం వెనుక ప్రక్కకోసం ఆరు పలకలు చేశాడు. 28 వెనుక ప్రక్కన దైవనివాసం మూలలకు రెండు పలకలు చేశాడు. 29 అవి అడుగున కూర్చి ఉన్నాయి, పై భాగాన మొదటి ఉంగరంవరకు ఒకదానితో ఒకటి అతికి ఉన్నాయి. రెండు మూలలకు ఉండవలసిన ఆ రెంటికీ అలా చేశాడు. 30 ఎనిమిది పలకలు ఉన్నాయి. వాటికి వెండి గూళ్ళు పదహారున్నాయి. ఒక్కొక్క పలకక్రింద రెండు గూళ్ళున్నాయి.
31 తుమ్మకర్రతో అడ్డకర్రలను కూడా చేశాడు. దైవనివాసం ఒక ప్రక్క పలకలకోసం అయిదు అడ్డకర్రలనూ, 32 రెండో ప్రక్క పలకల కోసం అయిదు అడ్డకర్రలనూ, పశ్చిమ దిక్కున దైవనివాసం వెనుక భాగంకోసం అయిదు అడ్డకర్రలనూ చేశాడు. 33 ఆ పలకలమధ్య ఉండే నడిమి అడ్డకర్ర ఈ కొననుంచి ఆ కొనవరకు ఉండేలా చేశాడు. 34 పలకలకు బంగారు తొడుగు చేశాడు. వాటి అడ్డకర్రలను పట్టే ఉంగరాలను బంగారంతో చేశాడు. అడ్డకర్రలకు బంగారు తొడుగు చేశాడు.
35 పేనిన సన్నని నారతోనూ నీలి ఊదా ఎర్ర రంగు దారాలతోనూ తెరను చేశాడు. కెరూబు రూపాలను బుట్టాయి వేసి నేర్పుగల పనితనంతో చేశాడు. 36 దానికోసం తుమ్మకర్రతో నాలుగు స్తంభాలు చేసి వాటికి బంగారు తొడుగు చేశాడు. వాటి కొక్కేలు బంగారువి. వాటికి నాలుగు వెండి గూళ్ళు పోత పోశాడు. 37 గుడారం ద్వారంకోసం నీలి ఊదా ఎర్ర రంగు దారాలతోను పేనిన సన్నని నారతోను నేత పని అయిన అడ్డతెరను చేశాడు. 38 దాని అయిదు స్తంభాలూ వాటి కొక్కేలు చేశాడు. ఆ స్తంభాల కొనలకూ వాటి పెండె బద్దలకూ బంగారు తొడుగు చేశాడు. అయితే వాటి అయిదు గూళ్ళు కంచువి.