35
1 మోషే ఇస్రాయేల్‌ప్రజల సమాజమంతటినీ సమకూర్చి వారితో ఇలా అన్నాడు: “మీరు చెయ్యాలని యెహోవా ఆజ్ఞాపించినవి ఇవి: 2 ✝ఆరు రోజులు పని చెయ్యాలి గానీ ఏడో రోజు పూర్తిగా మీరు విశ్రమించవలసిన విశ్రాంతి దినం. అది యెహోవాకు పవిత్ర దినం. ఆ రోజున పని చేసేవాడెవడైన మరణశిక్ష పొందాలి. 3 విశ్రాంతి దినంలో మీ ఇళ్ళలో దేనిలో కూడా పొయ్యి రాజబెట్టకూడదు.”4 మోషే ఇస్రాయేల్‌ప్రజల సమాజమంతటితో చెప్పినదేమిటంటే “యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు: 5 ✽ యెహోవాకు మీలో మీరు కానుక పోగు చెయ్యండి. అంటే ఇష్టమున్న వారెవరైనా యెహోవాకోసం కానుక తేవాలి. తేవలసినదేమంటే, బంగారం, వెండి, కంచు, 6 నీలి ఊదా ఎర్ర రంగు దారాలు, సన్నని నారబట్ట, మేక వెండ్రుకలు, 7 ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళ తోళ్ళు, గండుచేప తోళ్ళు, తుమ్మకర్ర, 8 దీపంకోసం ఆలీవ్ నూనె, అభిషేకతైలం కోసమూ పరిమళ ధూపద్రవ్యంకోసమూ సుగంధద్రవ్యాలు, 9 ఏఫోదు కోసమూ, వక్షపతకంకోసమూ మిశ్రిత వర్ణరత్నాలూ, చెక్కే రత్నాలూ.
10 ✝“మీలో నేర్పుగల ప్రతి ఒక్కరూ వచ్చి, చెయ్యమని యెహోవా ఆజ్ఞాపించిన వస్తువులను చెయ్యండి. 11 అవేవంటే, ఆయన నివాసం, దాని గుడారం, దాని పైకప్పు, దాని కొలుకులు, దాని పలకలు, దాని అడ్డ కర్రలు, దాని స్తంభాలు, దాని గూళ్ళు. 12 పెట్టె, దాని మోత కర్రలు, ప్రాయశ్చిత్తస్థానంగా ఉన్న మూత, దాన్ని మరుగు చేసే తెర, 13 బల్ల, దాని మోతకర్రలు, దాని సామానంతా, సన్నిధి రొట్టె, 14 వెలుగుకోసం సప్తదీపస్తంభం, దాని సామాను, దాని దీపాలు, దీపాలకోసం నూనె, 15 ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలం, పరిమళ ధూపద్రవ్యం, ద్వారంకోసం అంటే దైవనివాసం ద్వారం కోసం తెర, 16 హోమ బలిపీఠం, దాని కంచు జల్లెడ, దాని మోతకర్రలు, దాని సామానంతా, గంగాళం, దాని పీఠం, 17 ఆవరణకోసం తెరలు, దాని స్తంభాలు, వాటి గూళ్ళు, ఆవరణ ద్వారంకోసం తెర, 18 నివాసంకోసమూ ఆవరణకోసమూ మేకులు, వాటి త్రాళ్ళు, 19 పవిత్రస్థలంలో సేవ చెయ్యడానికి నేసిన వస్త్రాలు అంటే యాజులుగా సేవ చెయ్యడంకోసం అహరోనుయాజికి పవిత్ర వస్త్రాలూ అతని కొడుకులకు వస్త్రాలూ.”
20 ఇస్రాయేల్‌ప్రజల సమాజమంతా మోషే సముఖంనుంచి వెళ్ళిపోయింది. 21 తరువాత ఇద్దామని ఆంతర్యంలో ప్రోత్సాహం కలిగిన ప్రతి ఒక్కరూ సన్నిధిగుడారం కోసమూ దాని సేవ అంతటి కోసమూ పవిత్ర వస్త్రాల కోసమూ వస్తువులను తెచ్చి యెహోవాకు సమర్పించారు. 22 ఇష్టమున్న వారందరూ, స్త్రీలూ పురుషులూ, యెహోవాకు బంగారం సమర్పించిన ప్రతి ఒక్కరూ ఆభరణాలనూ పోగులనూ ఉంగరాలనూ కంఠమాలలనూ అన్ని రకాల బంగారు వస్తువులనూ యెహోవాకు కదలిక అర్పణగా తీసుకువచ్చారు. 23 ఎవరి దగ్గర నీలి ఊదా ఎర్ర రంగు దారాలు, సన్నని నార, మేక వెండ్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళ తోళ్ళు, గండుచేప తోళ్ళు ఉన్నాయో వారందరూ వాటిని తెచ్చారు. 24 వెండి గానీ కంచు గానీ ప్రత్యేకించిన ప్రతి ఒక్కరూ యెహోవాకు ఆ కానుక తెచ్చారు. ఆ సేవలో ఏ పనికైనా వచ్చే తుమ్మకర్ర ఎవరి దగ్గర ఉందో వారు దాన్ని తెచ్చారు. 25 నేర్పుగల స్త్రీలందరూ చేతులతో వడికారు. వడికిన ఆ నీలి ఊదా ఎర్ర రంగు దారాలనూ సన్నని నారనూ తెచ్చారు. 26 నేర్పు కలిగి ఇష్టమున్న స్త్రీలంతా మేక వెండ్రుకలను వడికారు. 27 ప్రముఖులు ఏఫోదు కోసం వక్షపతకం కోసం మిశ్రిత వర్ణరత్నాలనూ చెక్కే రత్నాలనూ 28 సుగంధ ద్రవ్యాలనూ దీపం కోసమూ అభిషేక తైలం కోసమూ పరిమళ ధూపద్రవ్యం కోసమూ ఆలీవ్ నూనెనూ తెచ్చారు. 29 ఇలా ఇస్రాయేల్‌ప్రజలు యెహోవాకు స్వేచ్ఛార్పణలు తెచ్చారు. తమ హృదయాలు తమను పురికొల్పిన ప్రతి స్త్రీ ప్రతి పురుషుడూ యెహోవా మోషేచేత ఆజ్ఞాపించిన పనంతటికీ తెచ్చారు.
30 ✝మోషే ఇస్రాయేల్‌ప్రజలతో ఇలా అన్నాడు: “ఇదిగో వినండి, యెహోవా ఊరీ కొడుకు బసెలేల్‌ను పేరుపెట్టి పిలిచాడు. అతడు హూర్ మనుమడూ యూదాగోత్రంవాడూ. 31 యెహోవా అతణ్ణి దేవుని ఆత్మతో నింపాడు. అతనికి జ్ఞానం, తెలివి, వివేకం ప్రసాదించాడు. 32 నేర్పుతో పనులను కల్పించడానికీ బంగారం, వెండి, కంచుతో పని చెయ్యడానికీ 33 పొదగడంకోసం రత్నాలను సాన బెట్టడానికీ మ్రాను చెక్కడానికీ అన్ని రకాల పనులను నేర్పుతో చెయ్యడానికీ అతణ్ణి ప్రవీణుణ్ణి చేశాడు. 34 అతడు, అతనితోకూడా దాను గోత్రంవాడూ అహీసామాక్ కొడుకూ అయిన అహోలీయాబు ఇతరులకు ఈ పనులు నేర్పడానికి దేవునివల్ల సామర్థ్యం కలిగినవారు. 35 వారు అలాంటి ఏ పని అయినా చెయ్యడానికి దేవుడు వారిని ప్రవీణతతో నింపాడు. చెక్కేవారి పని గానీ చిత్రకారుల పని గానీ నీలి ఊదా ఎర్ర రంగు దారాలతోనూ సన్నని నార దారాలతోనూ బుట్టాలు వేసేవారి పని గానీ నేతవారి పని గానీ వారికి బాగా తెలుసు. వారు ఆ పనులను కల్పించగలరు, చెయ్యగలరు.