34
1 యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “మొదటి పలకలవంటి మరి రెండు రాతిపలకలు చెక్కు. నీవు పగలగొట్టిన ఆ మొదటి పలకలమీద ఉన్న మాటలు ఈ పలకలమీద వ్రాస్తాను.
2 “ఉదయానికి నీవు సిద్ధంగా ఉండి ఉదయమే సీనాయి పర్వతమెక్కి దాని శిఖరంమీద నా సన్నిధానంలో నిలబడు. 3 నీతోపాటు ఎవ్వరూ రాకూడదు, ఈ పర్వతంమీద ఎవ్వరూ ఎక్కడా కనిపించకూడదు. పర్వతం ఎదుట గొర్రెలు గొడ్డు గోదలు మేయకూడదు.”
4 ఆ మొదటి పలకలవంటివి ఇంకా రెండు పలకలు మోషే చెక్కాడు. యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఉదయం కాగానే లేచి ఆ రెండు రాతిపలకలు చేతపట్టుకొని సీనాయి పర్వతమెక్కాడు. 5 యెహోవా ఆ మేఘంలో దిగివచ్చి, అక్కడ మోషే దగ్గర నిలబడి యెహోవా పేరును ప్రకటించాడు. 6 యెహోవా అతనికి ముందుగా అతని దగ్గర దాటివెళుతూ ఇలా ప్రకటించాడు:
“యెహోవా, దేవుడైన యెహోవా వాత్సల్యం, దయ గల దేవుడు. త్వరగా కోపపడేవాడు కాక అత్యంత కృప, సత్యం గలవాడు. 7 వేలాదివేల మందికి కృప చూపుతూ అపరాధం, అతిక్రమం, పాపాలను క్షమించేవాడు, అయితే దోషులను శిక్షించకుండా ఉండేవాడు కాక, మూడు నాలుగు తరాలకు తండ్రుల పాప ఫలితం వారి సంతానంమీదికి రప్పించేవాడు.”
8 మోషే త్వరపడి సాష్టాంగ నమస్కారాలు చేసి ఇలా అన్నాడు: 9 “ప్రభూ, నీవు నన్ను దయ చూస్తూ ఉంటే నా మనవి ఆలకించు. ప్రభూ, మా మధ్యలో ఉండి మాతోకూడా రావాలి. ఇది తలబిరుసుగా ఉన్న ప్రజ – నిజమే గానీ మా అపరాధం, మా పాపం క్షమించు. మమ్ములను నీ సొత్తుగా స్వీకరించు.”
10  అప్పుడు యెహోవా చెప్పినదేమిటంటే, “ఇప్పుడు నేను నీతో ఒడంబడిక చేస్తున్నాను. నీ ప్రజల ఎదుట నేను అద్భుత క్రియలు చేస్తాను. అలాంటి అద్భుతాలు ఏ ప్రజ మధ్య భూమిమీద ఎక్కడా జరగలేదు. నీవు ఏ ప్రజ మధ్య ఉన్నావో వారంతా యెహోవా చేసే క్రియ చూస్తారు. నేను నీతో చెయ్యబోయేది భయంకరమైనది. 11 ఈ రోజున నేను నీకు ఆజ్ఞాపించేదాన్ని నీవు పాటించాలి. నేను మీ ఎదుటనుంచి అమోరీ, కనాను, హిత్తి, పెరిజ్జి యోబూసి జాతులవారిని వెళ్ళగొట్టివేస్తాను. 12 మీరు వెళ్ళే దేశవాసులతో ఒడంబడిక చేసుకోకూడదు సుమా. చేసుకొంటే అది మీకు ఉరిగా ఉంటుంది. 13  మీరు వాళ్ళ బలిపీఠాలను పడగొట్టాలి. వాళ్ళ విగ్రహాలను పగులగొట్టాలి. వాళ్ళ అషేరాదేవి స్తంభాలను నరికివేయాలి. 14 మీరు వేరొక దేవునికి మొక్కకూడదు. యెహోవా అనే నేను రోషం గల దేవుణ్ణి, నా పేరు అదే. 15 ఆ దేశవాసులతో ఒడంబడిక చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రజలు వారి దేవుళ్ళ విషయం వ్యభిచారుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఆ దేవుళ్ళకు బలులు సమర్పించేటప్పుడు ఎవరైనా ఒకరు నిన్ను పిలవవచ్చు. మీరు వారి బలి మాంసం తినకూడదు సుమా. 16 మీరు మీ కొడుకులకు వారి కూతుళ్ళను పెళ్ళి చేయకూడదు. చేస్తే ఆ పిల్లలు తమ దేవుళ్ళను పూజించి మీ కొడుకులను ఆ దేవుళ్ళను పూజించేలా చేస్తారేమో జాగ్రత్త.
17 “పోత పోసిన దేవుళ్ళను చేసుకోకూడదు.
18 “మీరు పొంగని రొట్టెల పండుగ ఆచరించాలి. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం అబీబ్ నెలలో నియామక కాలంలో ఏడు రోజులు పొంగని రొట్టెలు తినాలి. అబీబ్ నెలలో మీరు ఈజిప్ట్‌నుంచి వచ్చారు గదా.
19 “ప్రతి తొలిచూలు పిల్ల నాది. మీ పశువులలో తొలిచూలు ప్రతి మగదీ, అది దూడ గానీ పొట్టేలు గానీ, నాది. 20 గొర్రెపిల్లను విడుదల వెలగా అర్పించి గాడిద తొలిపిల్లను విడిపించాలి. అలా చెయ్యడం మీకిష్టం లేకపోతే ఆ గాడిదపిల్ల మెడను విరగదీయాలి. మీ కొడుకులలో మొదట పుట్టినవాణ్ణి వెల ఇచ్చి విడిపించాలి.
“నా సన్నిధానంలోకి వట్టి చేతులతో ఎవ్వరూ రాకూడదు.
21 “ఆరు రోజులు మీరు పని చెయ్యాలి గాని, ఏడో రోజున విశ్రమించాలి. దున్నే కాలంలో, కోతకాలంలో కూడా ఏడో రోజున విశ్రమించాలి.
22 “మీరు ‘వారాల పండుగ’, అంటే మొదటి గోధుమ కోత పండుగ ఆచరించాలి. సంవత్సరాంతంలో పంట కూర్చే పండుగ కూడా ఆచరించాలి. 23 సంవత్సరానికి మూడు సార్లు పురుషులంతా ప్రభు సన్నిధానంలో అంటే ఇస్రాయేల్‌ప్రజల దేవుడైన యెహోవా సన్నిధిలో కనబడాలి. 24 సంవత్సరానికి మూడు సార్లు మీరు మీ దేవుడైన యెహోవా సన్నిధానంలో కనబడడానికి వెళ్ళేటప్పుడు మీ భూమిని ఎవ్వరూ ఆశించరు. ఎందుకంటే మీ ఎదుటనుంచి నేను జనాలను వెళ్ళగొట్టి మీ సరిహద్దులు విశాలం చేస్తాను.
25 “పొంగని రొట్టెతోపాటు నా బలి రక్తాన్ని అర్పించకూడదు. పస్కా పండుగలోని బలి మాంసం ఉదయంవరకు ఉంచకూడదు.
26 “పొలం పంటలోని ప్రథమ ఫలంలో శ్రేష్ఠమైనదాన్ని మీ దేవుడైన యెహోవా నివాసానికి తేవాలి.
“మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు.”
27  యెహోవా మోషేతో, “ఇప్పుడు చెప్పిన ఈ మాటలు వ్రాసుకో. ఎందుకంటే, ఈ మాటలప్రకారం నేను నీతోనూ ఇస్రాయేల్ ప్రజతోనూ ఒడంబడిక చేశాను” అన్నాడు.
28 మోషే నలభై రాత్రింబగళ్ళు యెహోవాతోకూడా అక్కడ ఉన్నాడు. అతడు భోజనం చెయ్యలేదు, నీళ్ళు త్రాగలేదు. అంతలో ఆ ఒడంబడిక వాక్కులు, అంటే పది ఆజ్ఞలు ఆ పలకలమీద వ్రాశాడు.
29 మోషే శాసనాలున్న ఆ రెండు పలకలు చేతపట్టుకొని సీనాయి పర్వతం దిగివచ్చాడు. యెహోవా అతనితో మాట్లాడడంవల్ల అతని ముఖ చర్మం ప్రకాశించింది గాని పర్వతం దిగివస్తూ ఉన్న మోషేకు అది తెలియలేదు. 30 అయితే అహరోను, ఇస్రాయేల్‌ప్రజలంతా మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మం ప్రకాశిస్తూ ఉంది. వారు అతనిదగ్గరికి రావడానికి భయపడ్డారు. 31 మోషే వారిని పిలిచినప్పుడు అహరోను, సమాజ ప్రముఖులందరూ అతని దగ్గరకు మళ్ళీ వచ్చారు. మోషే వారితో మాట్లాడాడు. 32 ఆ తరువాత ఇస్రాయేల్ ప్రజలంతా దగ్గరికి వచ్చారు. యెహోవా సీనాయి పర్వతంమీద తనతో చెప్పిన విషయాలన్నీ మోషే వారికి ఆజ్ఞాపించాడు. 33 మోషే వారితో మాట్లాడడం ముగించాక తన ముఖంమీద ముసుకు వేసుకొన్నాడు. 34 కానీ అతడు యెహోవాతో మాట్లాడడానికి ఆయన సన్నిధానంలోకి ప్రవేశించినప్పుడెల్లా ముసుకు తీసివేసి వెలుపలికి వచ్చేవరకు ముసుకు లేకుండా ఉన్నాడు. వెలుపలికి వచ్చినప్పుడు యెహోవా తనకు ఆజ్ఞాపించినదానిని అతడు ఇస్రాయేల్‌ప్రజలతో చెప్పేవాడు.
35 ఇస్రాయేల్‌ప్రజలు మోషే ముఖ చర్మాన్ని చూచినప్పుడు అది ప్రకాశిస్తూ ఉంది గనుక తాను యెహోవాతో మాట్లాడడానికి లోపలికి ప్రవేశించేవరకూ మోషే తన ముఖంమీద ఆ ముసుకు వేసుకొనేవాడు.